patrolling vehicle
-
అక్కచెల్లెమ్మలకు మరింత భద్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడైనాసరే అక్క చెల్లెమ్మలకు అన్యాయం జరిగినా, వారిపై అఘాయిత్యానికి పాల్పడినా ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ప్రభుత్వం ఊరుకోదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వం గట్టి సంకేతాలను పంపిస్తోందని తెలిపారు. బుధవారం ఆయన సచివాలయం ప్రధాన గేటు వద్ద 163 దిశ పోలీస్ పెట్రోలింగ్ ఫోర్ వీల్ వాహనాలను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. బందోబస్తులో ఉండే మహిళా పోలీసుల కోసం వాష్ రూమ్, డ్రెస్సింగ్ రూమ్‌లు ఉండే 18 కార్ వ్యాన్స్‌ను కూడా సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ‘దిశ’ యాప్ రికార్డు స్థాయిలో కోటి 16 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లోని ఫోన్లలో ఉందని చెప్పారు. దాదాపు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాల్లో అంటే దాదాపు ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్ అందుబాటులో ఉన్నారని తెలిపారు. వీటన్నింటితో ఒక గొప్ప విప్లవానికి, మార్పునకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. మహిళా పోలీసులకు రెస్ట్ రూమ్ ► సామాన్య అక్కచెల్లెమ్మలే కాదు.. పోలీసు వృత్తిలో ఉన్న అక్కచెల్లెమ్మలకూ మంచి చేసే దిశగా అడుగులు పడ్డాయి. పోలీస్ స్టేషన్లలో ఇంతకు ముందు అక్కచెల్లెమ్మలకు ప్రత్యేకంగా రెస్ట్రూమ్ ఉండేది కాదు. ఈ రోజు ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళలకు ప్రత్యేకంగా వాష్‌రూమ్‌లు ఉండటంతో పాటు బందోబస్తుకు వెళ్లినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా వాష్‌రూమ్స్, డ్రెస్సింగ్ రూములు ఉండే విధంగా 18 కార్ వ్యాన్స్‌ను ప్రారంభిస్తున్నాం. ► మొత్తం 30 కార్వ్యాన్స్ (రూ.5.5 కోట్లు కేటాయించారు) ప్రారంభించే కార్యక్రమంలో భాగంగా ఇవాళ 18 వచ్చాయి. రాబోయే రోజుల్లో మరో 12 వస్తాయి. 163 దిశ పోలీస్ ఫోర్ వీల్ వాహనాలను (రూ.13.85 కోట్లతో కొనుగోలు చేశారు) కూడా ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే 900 దిశ ద్విచక్ర వాహనాలు వివిధ పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉన్నాయి. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించిన ‘దిశ’ పోలీస్ పెట్రోలింగ్ ఫోర్ వీల్ వాహనాలు మూడు వేల వాహనాలకు జీపీఎస్ ► ఇవి కాక ప్రతి పోలీస్ స్టేషన్లో ఉన్న ప్రతి వాహనాన్ని అంటే దాదాపు మూడు వేల వాహనాలకు జీపీఎస్ ట్యాగింగ్‌తో దిశకు అనుసంధానం చేసి, వాటన్నింటినీ కూడా అందుబాటులోకి తెచ్చాం. ఏదైనా ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మలు వారి ఫోన్‌ను ఐదుసార్లు అటూ, ఇటూ ఊపితే చాలు.. 10 నిమిషాల్లో వారి వద్దకు పోలీస్ సోదరుడు వెళ్లి సమస్య పరిష్కరించేలా మార్పునకు శ్రీకారం చుట్టాం. ► ఏదైనా ఘటన జరిగిన 10 నిమిషాల్లోపే పోలీసులు కచ్చితంగా అక్కడకు రావాలని నేను గట్టిగా చెప్పాను. డీఐజీ పాలరాజు, డీజీపీ రాజేంధ్రనాథ్ రెడ్డి, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఈ విషయంలో బాగా కృషి చేశారు. అందరూ కలసికట్టుగా ఆ రెస్పాన్స్ టైంను ఇంకా కుదించేందుకు ఈ వాహనాలను ప్రారంభిస్తున్నాం. ► దిశ యాప్ కోసం, పనితీరును మెరుగు పరిచేందుకు ప్రభుత్వం తరఫు నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మరిన్ని చేసే అవకాశం ఇవ్వాలని దేవుడిని మనసారా కోరుకుంటున్నా. ► ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ కె మోషేన్ రాజు, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీఐజీ పాలరాజు, దిశ స్పెషల్ ఆఫీసర్ కృతికా శుక్లా, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
దిశ పెట్రోలింగ్ వాహనాలు.. ప్రారంభించిన సీఎం జగన్ (ఫోటోలు)
-
భద్రతకు భరోసా
-
దిశ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
-
మహిళలకు అన్యాయం జరిగితే ప్రభుత్వం సహించదు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ కోసం మరో 163 దిశ పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం వాటిని అసెంబ్లీ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. 1.16 కోట్ల మంది అక్కాచెల్లెమ్మలు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. మహిళలపై అన్యాయం జరిగితే ప్రభుత్వం ఊరుకోదు. ఇప్పటికే దిశ పోలీస్స్టేషన్లలో 900 ద్విచక్రవాహనాలున్నాయి. వీటితో పాటు 3 వేలకు పైగా ఎమర్జెన్సీ వాహనాలను ప్రారంభిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. కాగా, ఈ దిశ పెట్రోలింగ్ వాహనాలు జీపీఎస్ ద్వారా కంట్రోల్ రూమ్‌కి అనుసంధానమై ఉంటాయి. ఇప్పటికే దిశ పోలీస్ స్టేషన్ల పరిధిలో 900 ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉంచారు. ఏదైనా ప్రమాదం జరిగితే పట్టణాల్లో 4-5 నిమిషాల్లో, గ్రామాల్లో 8-10 నిమిషాల్లో దిశ సిబ్బంది స్పందించనున్నారు. మహిళా సిబ్బందికి ప్రత్యేకంగా విశ్రాంతి గదులు ఏర్పాటు చేశారు. దిశ పెట్రోలింగ్ వాహనాలకు రూ. 13.85 కోట్లు, రెస్ట్ రూమ్స్‌కి రూ. 5.5 కోట్లు ఖర్చు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించడం, మహిళలకు పటిష్టమైన భద్రత, క్షేత్ర స్థాయిలో నేరాలను అరికట్టడం, ప్రజలకు మరింత చేరువ కావడం, విజిబుల్ పోలీసింగ్‌ను మెరుగుపరచడం కోసం రాష్ట్ర పోలీస్ శాఖ దిశ పెట్రోలింగ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. చదవండి: (2023 ఖరీఫ్‌కు పోలవరం) -
తెలంగాణ కానిస్టేబుల్ 'అక్రమ రూట్'
దాచేపల్లి(గురజాల): పెట్రోలింగ్ వాహనంతో అక్రమంగా మద్యాన్ని సరిహద్దులు దాటిస్తున్న తెలంగాణ కానిస్టేబుల్‌ను దాచేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వివరాలను ఎస్ఐ షేక్ రహ్మతుల్లా గురువారం విలేకరులకు వెల్లడించారు. శ్రావణ్‌కుమార్ తెలంగాణలోని వాడపల్లి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. 14వ తేదీ రాత్రి 650 మద్యం సీసాలతో పోలీస్ పెట్రోలింగ్ వాహనంలో తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చాడు. పోలీస్ వాహనం కావడంతో రాష్ట్ర సరిహద్దులో సిబ్బంది తనిఖీ చేయకుండా వదిలిపెట్టారు. శ్రావణ్ ఆ మద్యం సీసాలను రామాపురం అడ్డరోడ్డు సమీపంలోని పొదల్లో దాచిపెట్టాడు. అనంతరం పెట్రోలింగ్ వాహనాన్ని తాను పనిచేస్తున్న పోలీస్‌స్టేషన్‌లో వదిలేసి.. మద్యం సీసాలు దాచిన ప్రదేశానికి తిరిగి చేరుకున్నాడు. వాటిని తీసుకెళ్లేందుకు నరసరావుపేటకు చెందిన కోటేశ్వరరావు కూడా అప్పటికే అక్కడకు వచ్చాడు. దీనిపై సమాచారం అందుకున్న దాచేపల్లి పోలీసులు దాడిచేసి వారిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. మద్యాన్ని, కోటేశ్వరరావు కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
మహిళా రక్షణ ‘దిశ’గా మరో ముందడుగు
సాక్షి, అమరావతి: మహిళల రక్షణ ‘దిశ’గా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళలకు తక్షణ రక్షణ కల్పించేందుకు పెట్రోలింగ్ వాహనాలు, క్రైం సీన్ మేనేజ్మెంట్ వెహికల్స్, మహిళా హెల్ప్ డెస్క్‌లు, దిశ సైబర్ కవచ్ కియోస్క్‌లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా బాధితులకు నిమిషాల వ్యవధిలో సాయమందించనున్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పెట్రోలింగ్ వాహనాలపై ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ సకాలంలో ఘటనాస్థలికి చేరుకోవచ్చు. వీటికి జీపీఆర్ఎస్ అమర్చారు. దీని ద్వారా దిశ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు టచ్‌లో ఉండొచ్చు. సహాయాన్ని 6 నుంచి 10 నిమిషాల్లో అందించేలా సిబ్బంది విధులు నిర్వహిస్తారు. మహిళలు, బాలికలకు అన్యాయం జరిగితే వెంటనే దర్యాప్తు బృందం, క్లూస్ టీంతో పాటు ఘటనా స్థలికి దిశ బస్(క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వెహికల్) కూడా వస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు, మెడికల్ అసిస్టెంట్, మహిళా పోలీసులు, వీడియో గ్రాఫర్, ఫొటోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్ సహా 8 మంది ప్రయాణించేలా ఈ వాహనాన్ని రూపొందించారు. నేర స్థలంలో ఆధారాల సేకరణ, బాధితురాలి ఫిర్యాదు, వైద్యం తదితర విషయాల్లో జాప్యం జరగకుండా సాయం అందిస్తారు.స్మార్ట్ ఫోన్లు వినియోగించే మహిళలు సైబర్ నేరాల బారిన పడకుండా 50 సైబర్ కవచ్ కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేయగానే అది స్కాన్ చేస్తుంది. హానికరమైన అప్లికేషన్లను గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అలాగే పోలీస్స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. సమస్యలు, సందేహాలతో వచ్చే మహిళలకు ఈ హెల్ప్ డెస్క్‌లు భరోసా ఇవ్వనున్నాయి. ‘మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం’ అని హోం మంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్ చెప్పారు. -
పోలీస్ వాహనం ఢీకొని బాలుడి మృతి
హైదరాబాద్: ప్రమాదవశాత్తు పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఆరేళ్ల బాలుడు దుర్మరణం చెందాడు. ఈ వి షాద ఘటన హైదరాబాద్ మంగళహాట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. మంగళహాట్ గుఫ్పా నగర్ ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ వృత్తిరీత్యా మెకానిక్. ఆయన భార్య రేణుక. వీరికి ముగ్గురు కుమారులు సంతానం. రెండో కుమారుడు హర్షవర్ధన్ బుధవారం మధ్యాహ్నం షాపు వద్ద భోజనం తిని ప్లేటు కడుగుతున్నాడు. అదే సమయంలో పోలీసు పెట్రోలింగ్ వాహనం టైర్లల్లో గాలి నింపించేందుకు వచ్చింది. అందులో డ్రైవర్ భగవంత్‌రెడ్డితోపాటు మరో కానిస్టేబుల్ ఉన్నాడు. వాహనాన్ని వెనక్కు తీసే క్రమంలో డ్రైవర్ బాలుడిపైకి ఎక్కించేశాడు. అక్కడి వారు కేకలు వేయడంతో డ్రైవర్ వాహనాన్ని నిలిపేశాడు. స్థానికుల సాయంతో వాహనాన్ని పైకి ఎత్తి బాలుడిని తీసి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
విధి నిర్వహణలో ఎస్ఐ దుర్మరణం
బులంద్‌షహర్: ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో పోలీసు పెట్రోలింగ్ కారులోని ఓ ఎస్సై దుర్మరణం చెందగా, మరో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జాతీయ రహదారి 91పై మామన్ గ్రామం వద్ద బుధవారం ఉదయం పెట్రోలింగ్‌లో భాగంగా జాతీయ రహదారి లింక్ రోడ్డుపై కారు ఆగి ఉన్న సమయంలో వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎస్సై రాజేందర్ సింగ్ అక్కడికక్కడే మృతిచెందగా, వాహనం డ్రైవర్ వికాస్, మరో పోలీసు కానిస్టేబుల్ రఫీక్‌లు గాయపడ్డరని సిటీ ఎస్పీ ప్రవీణ్‌రంజన్ తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మీరట్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్టీసీ బస్సు డ్రైవర్ పరారయ్యారని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసులు వివరించారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పోలీసులకు గాయాలు
తాడేపల్లి: పోలీస్ గస్తీ వాహనం ప్రమాదానికి గురవడంతో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ బైపాస్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం వెళ్తుండగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంగా దూసుకొచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో గాయపడ్డ ముగ్గురు పోలీసులను చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.