
పెట్రోలింగ్ వాహనాలు
సాక్షి, అమరావతి: మహిళల రక్షణ ‘దిశ’గా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళలకు తక్షణ రక్షణ కల్పించేందుకు పెట్రోలింగ్ వాహనాలు, క్రైం సీన్ మేనేజ్‌మెంట్ వెహికల్స్, మహిళా హెల్ప్ డెస్క్‌లు, దిశ సైబర్ కవచ్ కియోస్క్‌లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా బాధితులకు నిమిషాల వ్యవధిలో సాయమందించనున్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పెట్రోలింగ్ వాహనాలపై ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ సకాలంలో ఘటనాస్థలికి చేరుకోవచ్చు. వీటికి జీపీఆర్‌ఎస్ అమర్చారు. దీని ద్వారా దిశ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు టచ్‌లో ఉండొచ్చు. సహాయాన్ని 6 నుంచి 10 నిమిషాల్లో అందించేలా సిబ్బంది విధులు నిర్వహిస్తారు. మహిళలు, బాలికలకు అన్యాయం జరిగితే వెంటనే దర్యాప్తు బృందం, క్లూస్ టీంతో పాటు ఘటనా స్థలికి దిశ బస్(క్రైమ్ సీన్ మేనేజ్‌మెంట్ వెహికల్) కూడా వస్తుంది.
ఫోరెన్సిక్ నిపుణులు, మెడికల్ అసిస్టెంట్, మహిళా పోలీసులు, వీడియో గ్రాఫర్, ఫొటోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్ సహా 8 మంది ప్రయాణించేలా ఈ వాహనాన్ని రూపొందించారు. నేర స్థలంలో ఆధారాల సేకరణ, బాధితురాలి ఫిర్యాదు, వైద్యం తదితర విషయాల్లో జాప్యం జరగకుండా సాయం అందిస్తారు.స్మార్ట్ ఫోన్లు వినియోగించే మహిళలు సైబర్ నేరాల బారిన పడకుండా 50 సైబర్ కవచ్ కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేయగానే అది స్కాన్ చేస్తుంది. హానికరమైన అప్లికేషన్లను గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అలాగే పోలీస్‌స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. సమస్యలు, సందేహాలతో వచ్చే మహిళలకు ఈ హెల్ప్ డెస్క్‌లు భరోసా ఇవ్వనున్నాయి. ‘మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం’ అని హోం మంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment