అక్క చెల్లెమ్మలకు అన్న కానుక.. మహిళా బడ్జెట్‌ | CM Jagan Participated In Womens Day Celebrations | Sakshi
Sakshi News home page

అక్క చెల్లెమ్మలకు అన్న కానుక.. మహిళా బడ్జెట్‌

Published Tue, Mar 9 2021 2:17 AM | Last Updated on Tue, Mar 9 2021 8:29 AM

CM Jagan Participating In Womens Day Celebrations - Sakshi

మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రులు తానేటి వనిత, సుచరితతో కేక్‌ కట్‌ చేయిస్తున్న సీఎం జగన్‌. చిత్రంలో ఉన్నతాధికారులు, మహిళా నేతలు

దాదాపు 44.50 లక్షల మంది తల్లులకు, తద్వారా 85 లక్షల మంది పిల్లలకు ఏటా అమ్మఒడి ద్వారా రూ.6,500 కోట్లు చొప్పున రెండేళ్లలో ఇప్పటికే రూ.13,022 కోట్లు దేవుడి దయతో ఇవ్వగలిగాం. కేవలం ఈ ఒక్క పథకం ద్వారానే ఐదేళ్లలో రూ.32,500 కోట్లు నేరుగా తల్లుల చేతికే అందచేస్తాం. వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా 87.75 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,792 కోట్లు ఇచ్చాం. ఈ ఒక్క పథకం ద్వారానే నాలుగేళ్లలో రూ.27 వేల కోట్లకుపైగా ఇవ్వబోతున్నాం. వైఎస్సార్‌ చేయూత ద్వారా 45 నుంచి 60 సంవత్సరాలున్న 24.56 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు రూ.4,604 కోట్లు ఇప్పటికే ఇచ్చాం.  నాలుగేళ్లలో రూ.18 వేల కోట్లకుపైగా ఇవ్వబోతున్నాం. అమ్మ ఒడి, వైఎస్సార్‌ ఆసరా, చేయూత ఈ మూడు పథకాల ద్వారా అక్కచెల్లెమ్మల స్వావలంబన కోసం ఐదేళ్లలో రూ.78 వేల కోట్లకుపైగా నేరుగా వారికి అందిస్తాం. మధ్యవర్తులు, లంచాలు, అవినీతి, పక్షపాతం లేకుండా, పాత అప్పులకు జమ చేయకుండా వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తున్నాం.

‘‘మనం అమలు చేస్తున్న ప్రతి కార్యక్రమంలోనూ అక్కచెల్లెమ్మలకు అండగా నిలుస్తున్నాం. మారుతున్న సమాజాన్ని, రాబోయే రోజుల్లో పరిస్థితుల్ని, మహిళలకు ఎదురవుతున్న సవాళ్లను అర్థం చేసుకుని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సాధికారత సాధించే దిశగా 21 నెలలుగా ఎన్నో అడుగులు ముందుకు వేస్తూ వచ్చాం. 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ మన రాష్ట్రం నుంచే ఆవిర్భవించాలనే దృఢ సంకల్పంతో రేపటితరం చిన్నారులకు అన్ని పథకాల్లోనూ సింహభాగం ఇచ్చామని సగర్వంగా తెలియజేస్తున్నాం’’

‘‘ఇంటిని అన్ని రకాలుగా బాగుపర్చాలనే తపన, తాపత్రయం అక్కచెల్లెమ్మల్లోనే కనిపిస్తుంది. తమకు గుర్తింపు రాకపోయినా, ఉన్నత పదవుల్లో లేకున్నా ప్రతి ఇంట్లోనూ వారంతా మనల్ని ఉన్నతంగా చూసుకుంటారు, అందుకనే మనం ఇవాళ ఈ స్థానంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి’’
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి: మహిళల కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నట్లు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మహిళా బడ్జెట్‌ కాన్సెప్ట్‌ తెస్తున్నామని, అక్కచెల్లెమ్మలకు ఎంత ఖర్చు చేయబోతున్నామో అందులో తెలియచేస్తామని చెప్పారు. తొలిసారిగా ‘జెండర్‌’ బడ్జెట్‌ను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడుతున్నామని, దేశంలో ఇంతవరకు ఇది ఎక్కడా జరగలేదని తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై వేధింపులు నిరోధించడానికి కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. పని ప్రదేశాల్లో మహిళల మీద వేధింపులు నిరోధించేందుకు కమిటీలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని చట్టం చెబుతున్నా సక్రమంగా అమలు కావడం లేదన్నారు. రాష్ట్రమంతా కమిటీలు ఏర్పాటయ్యేలా పర్యవేక్షించాలని, సచివాలయం నుంచే ఈ పని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు.

ఈ కమిటీల ఏర్పాటు  విప్లవాత్మక అడుగు కాబోతుందన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు, బాలికలకు అండగా నిలిచే పలు కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్‌ క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. అన్ని పోలీస్‌ స్టేషన్లలో మహిళా హెల్ప్‌డెస్క్‌లను వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. సైబర్‌  కియోస్క్‌లను ఆవిష్కరించడంతో పాటు 18 దిశ క్రైం సీన్‌ మేనేజ్‌మెంట్‌ వెహికల్స్, 900 దిశ పెట్రోలింగ్‌ వెహికల్స్‌ను సీఎం ప్రారంభించారు. బాలికలకు ఉచిత న్యాప్‌కిన్స్‌ అందించే స్వేచ్ఛ కార్యక్రమాన్ని లాంఛనంగా  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, ఎమ్మెల్యేలు, అధికారులు  పాల్గొన్నారు. సీఎం జగన్‌ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ..
సీఎం క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వర్తించే మహిళా సిబ్బందితో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

ఆ సేవలకు కొలమానాలు లేవు..
అక్క చెల్లెమ్మలకు, చిన్నారులకు, అవ్వలకు, అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అంటే ఆకాశంలో సగభాగం, సృష్టిలో కూడా సగ భాగమంటారు. మరి వాళ్ల హక్కుల్లో సగభాగాలు ఇస్తున్నామా?  భూదేవి అంత సహనం, మానవత్వపు మమతలతో కుటుంబానికి చుక్కానిలా, కష్టాలూ నష్టాలూ దిగమింగుకుంటూ ఇంటింటా మహిళామూర్తులందించే సేవలకు కొలమానాలు లేవు. రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో 60 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. ఇప్పటికీ 40 శాతం మందికి చదువు అందడం లేదు. ఆహారం మొదలు అధికారం వరకు అన్ని అంశాల్లోనూ గర్భస్థ శిశువు నుంచి జీవన సంధ్యలో ఉన్న అవ్వ వరకూ స్త్రీల పట్ల సమాజంలో ఉన్న వివక్షను ఇలాగే వదిలేస్తే సమాజం ఎటుపోతుందో ఒక్కసారి ఆలోచన చేయాలి.  
సైబర్‌ కవచ్‌ కియోస్క్‌ను ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్, చిత్రంలో మంత్రులు, అధికారులు 

నాకు బాగా గుర్తుంది.. 
నాకు బాగా గుర్తుంది. అప్పట్లో నేను ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు నాడు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడిన మాటలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. కోడలు మగపిల్లాడ్ని కంటానంటే అత్త వద్దంటుందా? అని నాడు ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో స్పీకర్‌ స్థానంలో ఉన్నవారు.. కారు షెడ్డులో ఉండాలి, ఆడవాళ్లు ఇంట్లో ఉండాలి.. అని అన్నారు. ఇటువంటి దారుణమైన పరిస్థితులను మార్చాలని అక్క చెల్లెమ్మలకు అండగా నిలిచాం.  

21 నెలల్లోనే అక్క చెల్లెమ్మలకు 80 వేల కోట్లు
ఈ 21 నెలల్లోనే అక్కచెల్లెమ్మల చేతిలో నేరుగా రూ.80 వేల కోట్లు పెట్టామని గర్వంగా చెబుతున్నాం. వైఎస్సార్‌ అమ్మఒడి పథకంతో  రూ.13,022 కోట్లు, వైఎస్సార్‌ కాపునేస్తంతో రూ.491 కోట్లు, వైఎస్సార్‌ చేయూతతో రూ.4,604 కోట్లు ఇప్పటికే ఇచ్చాం.వైఎస్సార్‌ సున్నావడ్డీ కింద రూ.1,400 కోట్లు ఇవ్వగలిగాం. వైఎస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా 2 దఫాలుగా రూ.383 కోట్లు అందచేశాం. వైఎస్సార్‌ ఆసరాతో రూ.6,792 కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ పింఛన్‌ కానుక కింద అక్కచెల్లెమ్మలకు  రూ.15,613 కోట్లిచ్చాం. వైఎస్సార్‌ రైతు భరోసా కింద అక్కచెల్లెమ్మలను మాత్రమే లెక్కలోకి తీసుకుంటే రూ.3,567 కోట్లు, మత్స్యకార భరోసా కింద రూ.4.58 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.1,220 కోట్లు, జగనన్న విద్యాదీవెనతో రూ.1,806 కోట్లు, వైఎస్సార్‌ వాహనమిత్రతో రూ.45.69 కోట్లు, లా నేస్తంలో రూ.3.24 కోట్లు, జగనన్న తోడుతో రూ.136 కోట్లు, వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాతో రూ.50 కోట్లు, జగనన్న గోరుముద్దలో చిట్టి చెల్లెమ్మలను తీసుకుంటే రూ.415 కోట్లు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ కింద రూ.1863 కోట్లు ఇవ్వడం జరిగింది. ఇళ్ల పట్టాల కింద 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకి రూ.27 వేల కోట్లు ఇచ్చాం. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.824 కోట్లు ఇవ్వగలిగాం. జగనన్న విద్యా కానుక ద్వారా చిట్టి చెల్లెమ్మలను లెక్కవేసుకుంటే రూ.334 కోట్లు ఇచ్చాం. మొత్తం రూ.80 వేల కోట్లు  అక్కచెల్లెమ్మలకు అందచేశామని గర్వంగా చెబుతున్నాం. ఇక వైఎస్సార్‌  జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పూర్తైతే వీటి విలువ కనీసం రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చేరుకుని ప్రతి అక్కచెల్లెమ్మకు నేరుగా ఆస్తి ఇచ్చినట్లవుతుంది. 

► రాజకీయంగా అక్కచెల్లెమ్మలు సాధికారిత సాధించి దేశానికి దారి చూపే స్థాయికి ఎదగాలని నామినేటెడ్‌ పదవులు, పనుల్లో 50 శాతం వారికే  దక్కేలా చట్టం కూడా చేశాం.
► 13 జిల్లాల్లో 18 దిశ పోలీస్‌ స్టేషన్లు తెచ్చి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను నియమించాం. ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసే అంశం హైకోర్టు పరిశీలనలో ఉంది. మహిళలపై నేరాలు 7.5 శాతం తగ్గించగలిగాం. మహిళల మీద నేరాలకు పాల్పడ్డ కేసుల్లో దర్యాప్తునకు గతంలో వంద రోజులు పడితే ఇప్పుడు 53 రోజులకు అంటే దాదాపు సగానికి తగ్గించగలిగాం. లైంగిక దాడులకు సంబంధించి 1,194 కేసుల్లో చార్జిషీట్‌ నమోదు చేశాం. దిశ యాప్‌ బటన్‌ నొక్కిన 20 నిమిషాల్లోపే పోలీసులు చేరుకుని తోడుగా నిలిచే వ్యవస్థను తీసుకురాగలిగాం. 
► కేసులను దర్యాప్తు చేయడానికి దిశ దర్యాప్తు వాహనాలను ప్రారంభిస్తున్నాం. 18 దిశ స్టేషన్లకు వీటిని అందచేస్తాం. వేగంగా కేసు దర్యాప్తు చేసేందుకు అన్నిరకాల సదుపాయాలు ఉంటాయి. దిశ పెట్రోలింగ్‌ పేరిట 900 స్కూటీలను ప్రారంభిస్తున్నాం. మహిళలు ధైర్యంగా తమ సమస్యలను చెప్పుకునేందుకు పోలీస్‌ స్టేషన్లలో మహిళా సహాయక డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నాం. సైబర్‌ కవచ్‌ కియోస్క్‌లను ఏర్పాటుచేసి సైబర్‌ నేరాలను అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే 50 కియోస్క్‌లు పెట్టాం.

సీఎం క్యాంపు కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం
సీఎం క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మహిళా మంత్రులతో సీఎం జగన్‌ కేక్‌ కట్‌ చేయించారు. మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ రూపొందించిన దేశానికి దిశ పుస్తకాన్ని ఆవిష్కరించారు. 58 ఫోరెన్సిక్‌ ల్యాబ్స్‌లో సైంటిఫిక్‌ ల్యాబ్‌ అసిస్టెంట్‌ల ఫలితాలను విడుదల చేశారు. ఏఎన్‌ఎం  శాంతి, పారిశుధ్య కార్మికురాలు మాబున్ని, మహిళా కానిస్టేబుల్‌ సరస్వతి, వలంటీర్‌ కళ్యాణిలను సీఎం జగన్‌ సత్కరించారు.  సీఎంతో ఒంగోలు వన్‌టౌన్‌ పీఎస్‌ నుంచి మహిళా హెల్ప్‌ డెస్క్‌ కానిస్టేబుల్‌ అలేఖ్య, కర్నూలు నుంచి కానిస్టేబుల్‌ దుర్గ  వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.

మహిళలకు క్యాజువల్‌ లీవ్స్‌ పెంపు
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళలకు అదనంగా 5 క్యాజువల్‌ లీవ్స్‌ ప్రకటిస్తున్నాం. గతంలో ఉన్న వాటిని 15 రోజుల నుంచి 20 రోజులకు పెంచుతున్నాం. 
విద్యార్థ్ధినులకు శానిటరీ న్యాప్‌కిన్స్ ‌ప్రభుత్వ స్కూళ్లలో 7 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థినులకు శానిటరీ న్యాప్‌కిన్స్‌ ఉచితంగా అందించే స్వేచ్ఛ కార్యక్రమానికి జూలై 1 నుంచి శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రముఖ కంపెనీల న్యాప్‌కిన్స్‌ అందచేస్తాం. చేయూత కిరాణా దుకాణాల్లో తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement