
సాక్షి, అమరావతి: బాలికలపై కన్నతండ్రే అఘాయిత్యాలకు పాల్పడుతుండటం ఘోరమని, ఇటువంటి దారుణాలను తీవ్రంగా పరిగణిస్తామని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. పోషకాహార మాసోత్సవాల సందర్భంగా బుధవారం విజయవాడలోని జిల్లా జైలును సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బాలికలు, మహిళలకు సొంతింట్లోనూ భద్రత లేని పరిస్థితులను తీవ్రంగానే పరిగణించాల్సి వస్తుందన్నారు.
ఈ విషయంలో పోక్సోకు మించిన ప్రత్యేక కఠిన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల మహిళా సమస్యలను కొందరు రాజకీయాలకు వాడుకోవాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా భద్రత బాగుందన్నారు.