protection of women
-
చట్టాలు చేస్తే చాలా?
దేశాన్ని కదిలించిన ‘అభయ’ ఉదంతం దెబ్బతో బెంగాల్ కొత్త కఠిన చట్టంతో ముందుకొచ్చింది. అత్యాచార దోషులకు ఏకంగా మరణశిక్ష వేయాలంటూ మమతా బెనర్జీ సర్కార్ అత్యాచార నిరోధక బిల్లు ‘అపరాజిత’ను తీసుకొచ్చింది. కోల్‌కతాలో రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రైనీ మహిళా డాక్టర్ ఒకరిని గత నెలలో దారుణంగా రేప్ చేసి, చంపేసిన ఘటనతో రెండు రోజులు ప్రత్యేకంగా సమావేశమైన బెంగాల్ అసెంబ్లీ మంగళవారం ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించింది. దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వరమే న్యాయాన్ని అందించి, దోషులకు కఠిన శిక్షలు విధించడానికే ఈ కొత్త బిల్లు తెచ్చామని సర్కార్ చెబుతోంది. బాధిత మహిళల బిల్లు గనక ప్రతిపక్షాలన్నీ కాదనే ధైర్యం చేయలేక తలూపుతూనే, మమత రాజీనామా డిమాండ్‌ను విడవకుండా వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి ఆమోదం పొందితే కానీ బిల్లు చట్టం కాదు గనక, బాధ్యత కేంద్రం మీదకు నెట్టేసి రాజకీయంగా మార్కులు సంపాదించే పనిలో మమత ముందడుగు వేస్తున్నారు. అత్యాచారాలు, లైంగిక నేరాల నుంచి మహిళలు, పిల్లలకు మరింత రక్షణ కల్పించే విధంగా చేపట్టిన ‘అపరాజిత మహిళా, శిశు రక్షణ బిల్లు–2024’లో మమత సర్కార్ పలు కొత్త అంశాలను పొందుపరిచింది. 21 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసేందుకు వీలుగా అపరాజిత టాస్క్‌ఫోర్స్ పేరిట ప్రత్యేక పోలీసు బలగాన్ని ఏర్పాటు చేస్తుందీ బిల్లు. కేంద్రం ఇటీవల తెచ్చిన కొత్త న్యాయచట్టాలు భారతీయ న్యాయసంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), అలాగే పోక్సో చట్టంలోని అంశాలను మించినవి కొన్ని ‘అపరాజిత’లో ఉన్నాయి. పోక్సో కింద 3 నుంచి 5 ఏళ్ళ జైలుశిక్ష, జరిమానా విధించేందుకే వీలుండగా, ఈ సరికొత్త బెంగాల్ అత్యాచార నిరోధక బిల్లు కింద 7 నుంచి పదేళ్ళ శిక్ష తప్పదు. పోక్సో కింద బాధిత చిన్నారి సాక్ష్యాన్ని 30 రోజులలోగా రికార్డ్ చేసి, ఏడాది లోగా విచారణ పూర్తి చేయవచ్చు. అపరాజిత మాత్రం వారం రోజుల్లోనే సాక్ష్యం రికార్డు చేయడం, నెల రోజుల్లో ప్రత్యేక కోర్ట్ విచారణ పూర్తి తప్పనిసరి చేసింది. బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందించేందుకు ఈ బిల్లు ఉపయుక్తమే. అలాగే, అత్యాచార దోషులకు పెరోల్ సైతం లేని యావజ్జీవ కారాగారవాస శిక్ష తప్పదు. రేప్, లేదా గ్యాంగ్‌రేప్ ద్వారా బాధితుల మరణానికో, జీవచ్ఛవంగా మారడానికో కారణమైన దోషులకు ఉరిశిక్ష విధింపు కూడా కోపోద్రిక్త ప్రజానీకానికి కొంత ఊరట. అలా బీఎన్ఎస్, బీఎన్ఎస్ఎస్లకు మించి కఠినంగా ఈ కొత్త బిల్లును తీర్చిదిద్దడం నేరగాళ్ళకు సింహస్వప్నమే. అందుకే, అపరాజిత బిల్లును కనీవినీ ఎరుగని ప్రయత్నంగా పేర్కొంటూ, ‘‘దేశానికి మార్గదర్శి బెంగాల్’’ అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికల్లో ట్రెండ్ అవుతోంది. మహిళలపై నేరాలను ఏ మాత్రం సహించని వ్యక్తిగా, నాయకురాలిగా దీదీని చూపించే ప్రయత్నమూ జరుగుతోంది. కానీ, అదే సమయంలో దిగజారు తున్న ప్రతిష్ఠను నిలబెట్టుకొనేందుకే ఆమె ఈ బిల్లు తెచ్చారనే విమర్శలూ వినిపిస్తున్నాయి. అభిప్రా యాలు, అనివార్యతలు ఏమైనా... స్త్రీలు, పిల్లల రక్షణకంటూ చేసే ఏ సర్కారీ కొత్త ప్రయత్నాన్ని తీసిపారేయాల్సిన పని లేదు. ప్రతి చర్యనూ స్వాగతించాల్సిందే. నిజానికి, మహిళల రక్షణ నిమిత్తం 2019లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్రాత్మకమైన ‘దిశ’ చట్టాన్ని తీసుకొచ్చింది. 2020లో మహారాష్ట్ర సైతం అత్యాచార బాధిత స్త్రీల పక్షాన నిలుస్తూ, దోషులకు కఠినశిక్షలతో ‘శక్తి’ బిల్లు పాస్ చేసింది. శాంతిభద్రతలే కాదు... సాధారణ ప్రజాపరిరక్షణ రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతే గనక స్థానికంగా ఇలాంటి కట్టుదిట్టమైన శాసన నిర్మాణాన్ని తప్పు పట్టలేం. కానీ, ఈ చట్టాలన్నీ గవర్నర్ వద్దో, లేదంటే ఆపైన రాష్ట్రపతి వద్దో ఆఖరి ఆమోదముద్ర కోసం నేటికీ ఎదురుచూస్తూనే ఉండడం విషాదం. తాజా అపరాజితకూ ఆ గతి తప్పకపోవచ్చు. రాష్ట్రస్థాయిలో చేస్తున్న ఈ తరహా చట్టాలకు ఆమోదం తెలపడానికి ఢిల్లీ గద్దె మీది పెద్దలకు అభ్యంతరం ఎందుకో అర్థం కాదు. మహిళా పరిరక్షకులమనే ఘనత తమకే దక్కాలన్న రాజకీయాలే తప్ప, ఇతరేతర కారణాలూ కనబడడం లేదు. దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మహిళా రెజ్లర్లు సైతం తమపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ వీధికెక్కి పోరాడినా, చీమ కుట్టినట్టయినా లేని పాలకుల నుంచి ఇంకేం ఆశించగలం? ఆ మాటకొస్తే స్త్రీలకు అండగా తామున్నామని ఢిల్లీ పెద్దలు ఆచరణలో నమ్మకం కలిగించలేకపోవడం కూడా రాష్ట్రాల్లో కొత్త చట్టాలకు కారణమని విస్మరించలేం. కఠిన చట్టాలు చేయడం మంచిదే కానీ, కేవలం చట్టాల రూపకల్పనతో లక్ష్యం నెరవేరుతుందా అన్నది బేతాళప్రశ్న. కొన్ని లోటుపాట్లున్నా పాత చట్టాల మొదలు పుష్కరకాలం క్రితపు ‘నిర్భయ’ చట్టం దాకా మన దగ్గర చట్టాలకు కొదవ లేదు. అమలులో చిత్తశుద్ధి లోపమే సమస్య. అపరిచితు లొచ్చి అత్యాచారం జరిపేలా అభద్ర వాతావరణం, అసమర్థ గస్తీ, అధ్వాన్న దర్యాప్తు నెలకొన్నాయంటే ఆ తప్పు పాలకులదేగా! అదే సమయంలో సామాజికంగా, సాంస్కృతికంగా మనుషుల మానసిక కాలుష్యానికి కారణమై, నేరాలకు ప్రేరేపిస్తున్న అంశాలను అరికట్టేందుకు నిజాయతీగా మనందరం చేస్తున్నదేమిటో ఆలోచించుకోవాలి. ఆత్మపరిశీలనా చేసుకోవాలి. ప్రతిపక్ష పాలిత కోల్ కతాలో ‘అభయ’ జరిగిందని బీజేపీ, అధికార బీజేపీ పాలిత హాథ్రస్, ఉన్నావ్‌లలో జరిగిందేమిటని విపక్షాలు పరస్పర దూషణలు చేసుకోవడం వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదు. రాజకీయంగా పైచేయికై పోరాడే కన్నా సురక్షితమైన పాఠశాలలు, పనిప్రదేశాలు, సత్వరం స్పందించే రక్షక వ్యవస్థ లాంటి ప్రాథమిక అంశాలపై దృష్టి పెడితే అందరికీ మంచిది. అది లేకపోవడమే అసలు సమస్య. -
ఉమెనిఫెస్టో ప్లీజ్!
హక్కులు, అవకాశాల్లో మహిళలకు సమాన భాగస్వామ్యం ఎండమావిగానే మిగిలింది. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో రాజకీయపార్టీలు హామీల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు వస్తున్నాయి..పోతున్నాయ్. కానీ మహిళల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, సామాజిక భద్రత ఇప్పటికీ నినాదాలకే పరిమితమవుతున్నాయి. ఇల్లు, బడి, కార్యాలయంతో పాటు రోడ్డు ఇతర బహిరంగ ప్రదేశాల్లో.. ఎప్పుడూ ఏదో ఒక చోట ఏదో రకమైన వివక్ష, వేధింపులు, అణచివేత నిత్యకృత్యంగానే ఉంటున్నాయి. మహిళల రక్షణ కోసం గృహహింస చట్టం, నిర్భయ చట్టం వంటివి ఎన్ని వచ్చినా, షీటీమ్స్, భరోసా కేంద్రాలు, సఖి వంటి ప్రత్యేక రక్షణ బృందాలు ఎన్ని ఉన్నా లైంగిక దాడులు, హింస కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కోటి దాటిన గ్రేటర్ హైదరాబాద్ జనాభాలో సగం మంది మహిళలే. కాగా ప్రస్తుత ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీలు ఏ మేరకు మహిళల ఆకాంక్షలకు, మహిళా సంబంధిత అంశాలకు పెద్ద పీట వేస్తున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. పలు మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, వివిధ విభాగాల్లో మహిళల సంక్షేమం కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థలు ‘మహిళా మేనిఫెస్టో’పై దృష్టి సారించాయి. మహిళల సంక్షేమం లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు మహిళా మేనిఫెస్టోను రూపొందించాలని డిమాండ్ చేస్తున్నాయి. సమాన అవకాశాలు లభించాలి.... స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల హింసను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతం అవకాశాలు లభించాల్సిందేనని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ‘అన్నిచోట్లా స్త్రీల ప్రాతినిధ్యం పెరగాలి. విద్య, ఆరోగ్యం, జీవితబీమా, బ్యాంకింగ్, పోలీసు, రవాణా, న్యాయ, వైద్య, ఎయిర్‌ఫోర్స్, నావిక, తదితర అన్ని రంగాల్లో మహిళలు రాణించే విధంగా సమాన అవకాశాలను కల్పించి ప్రోత్సహించాలి. సమాజంలో మహిళలపై హింసకు మద్యపానం కూడా ఒక కారణమే. మద్యాన్ని ఆదాయ వనరుగా భావించే ప్రభుత్వాల దృక్పథం పూర్తిగా మారాలి. మద్యం దుకాణాలను తగ్గించాలి. కచ్చితమైన నియంత్రణ పాటించాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపే మద్యం షాపులు తెరిచి ఉంచాలి. ప్రధాన హైవేలు, బస్టాపులు, ఆలయాలు, బడులు, ప్రార్ధనాస్థలాలకు సమీపంలో ఉన్నవాటిని తొలగించాలి..’ అని డిమాండ్ చేస్తున్నాయి. నిర్భయ సెల్ ఏర్పాటు చేయాలి ‘ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలలు, తదితర అన్ని విద్యాసంస్థల్లో బాలికలు, యువతులు నిశ్చింతగా చదువుకొనేందుకు అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించాలి. అన్ని విద్యాసంస్థల్లో ఇందుకోసం ప్రత్యేంగా 2013 నిర్భయ చట్టానికి అనుగుణంగా నిర్భయ సెల్ ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అమ్మాయిల అవసరాలకు అనుగుణమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. టాయిలెట్లు, రక్షిత మంచినీళ్లు, పౌష్టికాహారం అందజేయాలి. చాలామంది పిల్లలు ముఖ్యంగా బాలికలు తీవ్రమైన పోషకాహార లేమితో బాధపడుతున్నారు. అమ్మా యిల్లో రక్తహీనత ఒక సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్కూళ్లలో తృణ ధాన్యా లతో కూడిన పోషకాహారాన్ని అందజేయాలి. స్కూళ్లలో తప్పనిసరిగా చైల్డ్ హెల్త్ కేర్ రికార్డులను అమలు చేయాలి. ఇందులో ఉపాధ్యాయులు, ఆరోగ్యకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు భాగస్వాములు కావాలి. యుక్త వయస్సు బాలికలకు చక్కటి ఆరోగ్య విద్య అందజేయాలి. శానిటరీ ప్యాడ్స్, న్యాప్కిన్స్ అందుబాటులో ఉంచాలి. యుక్త వయస్సులో వచ్చే మార్పుల గురించి అమ్మాయిలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధంగా జెండర్ సెన్సిటైజేషన్ వర్క్‌షాపులను ఏర్పాటు చేయాలి. వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ ఇప్పించి అమ్మాయిలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకొనేలా చర్యలు తీసుకోవాలి. స్వీయ రక్షణ కు నిరంతర శిక్షణ ఉండాలి. ఈ మేరకు మేనిఫెస్టోలో పొందుపరచాలి..’ అని పలు సంఘాలు, సంస్థలు సూచిస్తున్నాయి. మెరుగైన ప్రజా రవాణా అవసరం ‘ప్రస్తుతం గ్రేటర్లో వివిధ రకాల రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మెట్రోతో సహా అన్ని సేవలు రాత్రి 11కే ముగుస్తాయి. దీంతో రాత్రివేళల్లో విధులు నిర్వహించే సాఫ్ట్వేర్ ఉద్యోగినులు, కాల్సెంటర్లలో పని చేసే అమ్మాయిలు, రాత్రి పూట ఆలస్యంగా ఇళ్లకు చేరవలసిన సమయాల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆటోలు, క్యాబ్‌లలో మహిళల భద్రత ప్రశ్నార్ధకంగానే ఉంది. రాత్రి 9 దాటితే ఇలాంటి వాహనాల్లో ప్రయాణం చేయడం దుస్సాహసమే. ఈ పరిస్థితుల్లో సిటీ బస్సులు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి..’ అని మహిళా సంఘాలు డిమాండ్ చేసు ్తన్నాయి. రాజకీయ పార్టీలు ఈ అంశాలు దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాయి. అవకాశం ఇస్తే.. అమలు చేసి చూపిస్తాం ‘అమ్మాయిలకు ఉచిత విద్య. వైద్యం కేటాయిస్తే చాలు సాధికారత అనేది దానంతట అదే వస్తుందని మేము నమ్ముతున్నాం. విద్యాపరంగా బలోపేతమైతే..కెరీర్ పరంగా నిర్ణయాలు తీసుకొని జీవితంలో స్థిరపడగలుగుతారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్కసారి అవకాశం లభిస్తే దీనిని అమలు చేయడం ద్వారా చేసి చూపేందుకు సిద్ధంగా ఉన్నాం. జాతీయస్థాయిలో బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోను ఒకసారి పరిశీలిస్తే...అనేక కీలకమైన అంశాలు పూర్తిస్థాయిలో అమలుచేసే ప్రయత్నాలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగానే మహిళా సాధికారతను సంబంధించిన గతంలో ఇచ్చిన హామీని అమలుచేసేందుకు పూనుకున్నాము. – గీతామూర్తి, బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మహిళలకు పెద్దపీట వేసేది కాంగ్రెస్ పార్టీనే.. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మహిళల హక్కులకు భంగం కలుగుతోంది. దిశ లాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర కేబినెట్సహా ఏ అంశంలోనూ మహిళలకు బీఆర్ఎస్ తగిన ప్రాధాన్యత కల్పించలేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే మహిళలకు పెద్దపీట వేసేది తామేనని అర్థమవుతుంది. మహిళలను ప్రధానిగా, రాష్ట్రపతిగా చేసింది కాంగ్రెస్ పార్టీనే. జాతీయ పార్టీ అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు అప్పగించింది కూడా మేమే. రాబోయే ఎన్నికల్లో ప్రజలకు మేమిచ్చిన ఆరు గ్యారంటీల్లో కూడా మహిళాసాధికారత కోసం పథకాలు ప్రకటించాం. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 నగదు, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆసరా పింఛన్ల పెంపు, చదువుకునే విద్యారి్థనులకు మోటారు సైకిళ్లు లాంటి పథకాలతో రాష్ట్రంలో మహిళాభ్యున్నతికి పాటుపడతాం’ – మచ్చా వరలక్ష్మి, గ్రేటర్ హైదరాబాద్ మహిళాకాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు -
మానవ అక్రమ రవాణా తగ్గడం శుభపరిణామం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మానవ అక్రమ రవాణా తగ్గుముఖం పట్టడం శుభపరిణామం అని, గతేడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని అనేందుకు ఇదే సంకేతమని హెల్ప్ స్వచ్ఛంద సంస్థ రాష్ట్ర కార్యదర్శి రామమోహన్ నిమ్మరాజు స్పష్టం చేశారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్నేళ్లుగా కృషి చేస్తున్న రామమోహన్ జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ)–2021 నివేదికపై ఆదివారం స్పందించారు. ఇందుకు సంబంధించిన సమీక్షను ‘సాక్షి’కి వెల్లడించారు. ప్రభుత్వం దిశ బిల్లుతో, ఇతర చర్యలతో రాష్ట్రంలో మహిళలు, బాలికల రక్షణకు భరోసా ఇచ్చినట్లు అయిందన్నారు. గతేడాది ప్రతి జిల్లాకు ఒక మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్ (ఏహెచ్‌టీయూ) ఏర్పాటు చేసి అక్రమ రవాణా నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవడం మంచి ఫలితాలు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా మానవ అక్రమ రవాణా కేసుల్లో 2020లో మూడో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ 2021లో ఐదో స్థానానికి తగ్గిందన్నారు. ఎన్సీఆర్బీ రిపోర్టు ప్రకారం మానవ అక్రమ రవాణాలో మొదటి స్థానంలో తెలంగాణ, రెండు, మూడు, నాలుగు స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, అస్సాం, కేరళ ఉన్నాయన్నారు. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో 99.3 శాతం కేసుల్లో పోలీసులు చార్జిషీట్ వేయడం, 757 మందిని అరెస్టు చేయడం ఒక రికార్డు అని రామమోహన్ వివరించారు. -
విశాఖలో ఒక్క రోజులో 1.26 లక్షల డౌన్లోడ్స్
పెదవాల్తేరు (విశాఖతూర్పు): రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ విషయంలో అమలు చేస్తున్న దిశ యాప్ డౌన్లోడ్ల విషయంలో సరికొత్త ఘనత సాధించింది. నగరంలో బుధవారం ఒక్కరోజే 1.26 లక్షల మంది మొబైల్ ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని పోలీసులు చెప్పారు. ఈ విధంగా డౌన్లోడ్ల విషయంలో విశాఖ నగరం రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. దిశ పోలీసులు, వార్డు వలంటీర్లు, మహిళా పోలీసులు వారి పరిధిలోని మహిళలు, విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ వారి మొబైల్ ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, దిశ పోలీసులను నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ అభినందించారు. -
అవినీతి నిర్మూలన కోసం సీఎం జగన్ కీలక నిర్ణయం
-
అలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తాం
సాక్షి, అమరావతి: బాలికలపై కన్నతండ్రే అఘాయిత్యాలకు పాల్పడుతుండటం ఘోరమని, ఇటువంటి దారుణాలను తీవ్రంగా పరిగణిస్తామని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. పోషకాహార మాసోత్సవాల సందర్భంగా బుధవారం విజయవాడలోని జిల్లా జైలును సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బాలికలు, మహిళలకు సొంతింట్లోనూ భద్రత లేని పరిస్థితులను తీవ్రంగానే పరిగణించాల్సి వస్తుందన్నారు. ఈ విషయంలో పోక్సోకు మించిన ప్రత్యేక కఠిన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల మహిళా సమస్యలను కొందరు రాజకీయాలకు వాడుకోవాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా భద్రత బాగుందన్నారు. -
‘సామాజిక’ అనర్థాలపై ‘ఈ నారీ’ అవగాహన
మంగళగిరి: సామాజిక మాధ్యమాల్లో పరిచయాల పట్ల యువతులు, మహిళలు అప్రమత్తంగా ఉండాలని హోం మంత్రి మేకతోటి సుచరిత సూచించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో ఉన్న రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో గురువారం ఆ కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మతో కలిసి హోంమంత్రి ఈ నారీ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి సుచరిత విలేకరులతో మాట్లాడుతూ మహిళల రక్షణకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తోందని చెప్పారు. అందులో భాగంగా యూనివర్సిటీలు, కళాశాలల్లోని యువతులకు సామాజిక మాధ్యమ పరిచయాలు–అనర్థాలపై రోజుకు పదివేల మందికి అవగాహన కల్పించేందుకు మహిళా కమిషన్ ఈ నారీ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. రమ్య హత్యను కొందరు రాజకీయాలకు వాడుకోవడం బాధాకరమన్నారు. జాతీయ కమిషన్ ప్రభుత్వ పనితీరుకు 200 మార్కులు ఇచ్చిందని, ప్రతిపక్షపార్టీలకు అది కనిపించలేదా అని ప్రశ్నించారు. మహిళకు ఓ పోలీసును కాపలా పెట్టాలా అని ప్రశ్నించిన చంద్రబాబుకు నేడు మహిళల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. ఎంత ఉపయోగమో.. అంత అనర్థం సామాజిక మాధ్యమాల ద్వారా ఓ యువకుడు 200 మంది మహిళల ఫొటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్‌కు దిగిన విషయాన్ని గుర్తుచేస్తూ సామాజిక మాధ్యమాల వల్ల ఎంత ఉపయోగమో అంత అనర్థం కూడా ఉందని గ్రహించాలని కోరారు. ఇప్పటికే దిశ యాప్, దిశ చట్టంతో రాష్ట్రంలో ఎక్కడ మహిళకు అన్యాయం జరిగినా పోలీసులు సత్వరమే స్పందిస్తున్నారన్నారు. ప్రతి యువతి, మహిళ తన ఫోన్లో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. సమాజంలో సామాజిక బాధ్యత కొరవడిందని, నడిరోడ్డులో రమ్యపై దాడి జరుగుతుంటే ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించకపోవడం బాధాకరమని చెప్పారు. ప్రజలలో సామాజిక బాధ్యత పెరిగి మహిళలపై దాడులు జరిగినప్పుడు వెంటనే స్పందిస్తే కొంతవరకు నేరాలను అరికట్టవచ్చని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ ఈ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం (నేడు) నుంచి వచ్చే నెల 27వ తేదీ వరకు నెలరోజుల పాటు నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళలు, యువతులపై దాడుల విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరిగేందుకు వివిధ రంగాల ప్రముఖులతో అన్ని జిల్లా కేంద్రాల్లో చర్చాగోష్ఠులు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ పద్మావతి, డైరెక్టర్ సియాజ్, కార్యదర్శి నిర్మల తదితరులు పాల్గొన్నారు. -
మహిళా రక్షణ ‘దిశ’గా మరో ముందడుగు
సాక్షి, అమరావతి: మహిళల రక్షణ ‘దిశ’గా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. మహిళలకు తక్షణ రక్షణ కల్పించేందుకు పెట్రోలింగ్ వాహనాలు, క్రైం సీన్ మేనేజ్మెంట్ వెహికల్స్, మహిళా హెల్ప్ డెస్క్‌లు, దిశ సైబర్ కవచ్ కియోస్క్‌లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా బాధితులకు నిమిషాల వ్యవధిలో సాయమందించనున్నారు. మహిళలు, బాలికల రక్షణ కోసం ఏర్పాటు చేసిన పెట్రోలింగ్ వాహనాలపై ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ సకాలంలో ఘటనాస్థలికి చేరుకోవచ్చు. వీటికి జీపీఆర్ఎస్ అమర్చారు. దీని ద్వారా దిశ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు టచ్‌లో ఉండొచ్చు. సహాయాన్ని 6 నుంచి 10 నిమిషాల్లో అందించేలా సిబ్బంది విధులు నిర్వహిస్తారు. మహిళలు, బాలికలకు అన్యాయం జరిగితే వెంటనే దర్యాప్తు బృందం, క్లూస్ టీంతో పాటు ఘటనా స్థలికి దిశ బస్(క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వెహికల్) కూడా వస్తుంది. ఫోరెన్సిక్ నిపుణులు, మెడికల్ అసిస్టెంట్, మహిళా పోలీసులు, వీడియో గ్రాఫర్, ఫొటోగ్రాఫర్, కంప్యూటర్ ఆపరేటర్ సహా 8 మంది ప్రయాణించేలా ఈ వాహనాన్ని రూపొందించారు. నేర స్థలంలో ఆధారాల సేకరణ, బాధితురాలి ఫిర్యాదు, వైద్యం తదితర విషయాల్లో జాప్యం జరగకుండా సాయం అందిస్తారు.స్మార్ట్ ఫోన్లు వినియోగించే మహిళలు సైబర్ నేరాల బారిన పడకుండా 50 సైబర్ కవచ్ కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. స్మార్ట్ ఫోన్ కనెక్ట్ చేయగానే అది స్కాన్ చేస్తుంది. హానికరమైన అప్లికేషన్లను గుర్తించి అప్రమత్తం చేస్తుంది. అలాగే పోలీస్స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారు. సమస్యలు, సందేహాలతో వచ్చే మహిళలకు ఈ హెల్ప్ డెస్క్‌లు భరోసా ఇవ్వనున్నాయి. ‘మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం’ అని హోం మంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్ చెప్పారు. -
మహిళల రక్షణలో 'దిశ' మారదు
సాక్షి, అమరావతి: మహిళలు, బాలికలకు రక్షణ కవచంలా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ‘దిశ’ నిర్దేశంలో మార్పులేదని మరోసారి రుజువైంది. హైదరాబాద్‌లో దిశ ఘటన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో అటువంటి ఘోరాలకు అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం 2019 డిసెంబర్ 13న అసెంబ్లీలో, డిసెంబర్ 16న మండలిలో దిశ బిల్లును ఆమోదించి 2020 జనవరి 2న చట్ట రూపం కోసం రాష్ట్రపతికి పంపిన సంగతి తెలిసిందే. అయితే ఆ బిల్లుపై కేంద్రం చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇప్పటికే దిశ చట్టాన్ని తెచ్చేందుకు రాజీలేని వైఖరితో ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దిశ చట్టం–2019 (పాత బిల్లు)ని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం–2020 (కొత్త బిల్లు)ని శాసనసభ, శాసనమండలిలో ప్రవేశపెట్టి ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ దిశ (మహిళలు, బాలలపై జరిగే నేరాలపై విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలు)చట్టం–2020కి ప్రభుత్వం మరింత పదును పెట్టింది. అసెంబ్లీ, మండలి ఆమోద ప్రక్రియ పూర్తి కావడంతో ఈ బిల్లును రాజ్యాంగంలోని ఆర్టికల్ 254(2) ప్రకారం గవర్నర్ పరిశీలన అనంతరం వీలైనంత త్వరగా రాష్ట్రపతి ఆమోదానికి పంపనున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ► దాదాపు ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలు, చిన్నారుల రక్షణ కోసం అనేక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. జీరో ఎఫ్ఐఆర్ కచ్చితంగా అమలు చేయాలంటూ ఇటీవల కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేయడానికి ముందు నుంచే ఏపీలో ఈ విధానం అమల్లో ఉండటం విశేషం. చట్టం ప్రకారం బాధితులు తమ సమీపంలోని ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. ► రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 18 దిశ పోలీస్ స్టేషన్లలో 18 కస్టమైజ్డ్ బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సుల్లోని ప్రత్యేక పరికరాలతో సాంకేతిక సిబ్బంది నేర స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తున్నారు. ► ఆపదలో ఉన్న మహిళలు, చిన్నారులకు సత్వర సహాయం అందించేలా ఆవిష్కరించిన దిశ యాప్‌ను ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. గత 8 నెలల్లో 98,380 మంది ఎస్ఓఎస్ ద్వారా పోలీసుల సహాయం కోరారు. ► దిశ యాప్ ద్వారా వచ్చిన కేసుల్లో 390 కేసులకు 7 రోజుల్లోపే చార్జిషీట్ దాఖలు చేశారు. దిశ బిల్లు ప్రవేశపెట్టిన అనంతరం ముగ్గురు దోషులకు ఉరి శిక్ష, 25 మందికి జీవిత ఖైదు పడింది. ► దిశ కేసుల దర్యాప్తునకు అవసరమైన సాంకేతిక ఆధారాల కోసం తిరుపతి, విశాఖపట్నం, మంగళగిరిలో ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశారు. ► రాష్ట్రంలో 11 ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే 700 పోలీస్స్టేషన్లలో ఉమెన్ స్పెషల్ డెస్క్ ఏర్పాటు చేశారు. దిశ బిల్లులో ప్రస్తావించిన అనేక విషయాలను సమర్థవంతంగా అమలు చేయడంతో ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 4 అవార్డులు వచ్చాయి. దిశ బిల్లులో ప్రధానాంశాలు.. ► మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులకు పాల్పడితే ప్రత్యేక నేరాలుగా పరిగణించి నిర్భయ చట్టం–2012, పోక్సో చట్టం ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ)–1860, క్రిమినల్ ప్రొసిజర్ కోడ్(సీపీసీ)–1973లను ఉపయోగిస్తారు. ► ఐపీసీ సెక్షన్ 326ఎ, 326బి, 354, 354ఎ, 354బి, 354సి, 354డి, 376, 376ఎ, 376బి, 376ఎబి, 376సి, 376డి, 376డిఎ, 376డిబి,376ఈ, 509లతో పాటు పోక్సో యాక్ట్, కేంద్ర చట్టాల్లోని పలు సెక్షన్లపై కేసు నమోదు చేస్తారు. ► 18 ఏళ్ల లోపు బాల బాలికలపై లైంగిక దాడులు, అత్యాచారాలు నిరోధించేందుకు 2012 నవంబర్ 14న కేంద్రం పోక్సో యాక్ట్ (ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫ్‌న్సెస్ యాక్ట్ – పీఓసీఎస్ఓ)ను ప్రయోగించడం వల్ల తీవ్రమైన శిక్షలు తప్పవు. పోక్సో చట్టం అమలులోకి వచ్చిన ఏడేళ్ల తర్వాత బీజేపీ ప్రభుత్వం గతేడాది ఆ చట్టానికి సవరణలు చేసింది. చట్టం పరిధిలో ఉన్న శిక్షలను కొనసాగిస్తూనే చిన్నారులపై అత్యాచారానికి పాల్పడిన నిందితులకు జీవిత ఖైదుకు బదులు మరణ శిక్షను విధించాలని సవరణ చేసింది. ► జీవిత ఖైదును 20 ఏళ్లుగాని, మరణించే వరకు గానీ జైలులోనే ఉండాలనే మరో సవరణ చేసింది. మహిళలపై తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారికి కూడా ఐపీసీ సెక్షన్ల ప్రకారం తీవ్రమైన శిక్షలు విధించే అవకాశం ఉంది. ► కేసుల నమోదుకు ఆన్లైన్ విధానం అమలు చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. మహిళలు, బాలలపై నేరాలకు పాల్పడే వారి వివరాలు అపరాధుల రిజిష్టర్ (ఆన్లైన్ విధానం)లో నమోదు చేస్తారు. ► వేగంగా దర్యాప్తు పూర్తి చేసేలా ప్రతి జిల్లా స్థాయిలో ఒక డీఎస్పీ నేతృత్వంలో పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తారు. ► బాధిత మహిళకు సత్వర న్యాయం జరిగేలా, దోషులకు వేగంగా శిక్షలు అమలు చేసేలా ఈ కేసుల కోసం ప్రతి జిల్లాలో ఒకటి, అంతకంటే ఎక్కువగా ప్రత్యేక కోర్టులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వీటిలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ)ను కూడా నియమించనున్నారు. -
మహిళలకు రక్షణ కల్పిస్తాం
గుణదల(విజయవాడ తూర్పు): మహిళలకు రక్షణ కల్పించే దిశగా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని హోం శాఖా మంత్రి మేకతోటి సుచరిత స్పష్టం చేశారు. విజయవాడ నగరంలోని క్రీస్తురాజపురంలో ప్రేమోన్మాది చేతిలో దారుణహత్యకు గురయిన దివ్య తేజస్విని కుటుంబసభ్యులను శనివారం పరామర్శించారు. అనంతరం మంత్రి సుచరిత మాట్లాడుతూ.. దివ్య కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం దిశ పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేసిందని చెప్పారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ, 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో వేధింపులు, హత్యలు గణనీయంగా తగ్గాయన్నారు. టీడీపీ హయాంలో మహిళలపై అత్యాచారాలు అధికంగా ఉండేవని సుచరిత తెలిపారు. దివ్య తల్లిదండ్రుల లేఖ ఆడపిల్లలకు జరుగుతున్న అఘాయిత్యాలను ప్రస్తావిస్తూ మంత్రి సుచరితకు దివ్య తల్లిదండ్రులు లేఖ అందజేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొంతమంది యువకులు మాదకద్రవ్యాలకు బానిసలై ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఆడపడుచులకు ఆపదలో అస్త్రాలివే
సాక్షి, అమరావతి : అమ్మాయిలకు చదువెందుకన్న రోజులు మారాయి. అన్నింటా అతివలు సగమని ఆకాశానికెత్తే రోజులు వచ్చాయి. అయితే ఏం లాభం.. అర్థరాత్రి ఆడది నిర్భయంగా తిరగగలిగే రోజు రావాలని గాంధీజీ కోరుకున్న స్వాతంత్య్రాన్ని మాత్రం సాధించలేకపోయాం. దేశంలో అడుగడుగునా ఆడవాళ్లపై అకృత్యాలే.. నిర్భయలాంటి చట్టాలెన్ని వచ్చినా రోజుకో అత్యాచారం, హత్య వార్తలు కలచివేస్తున్నాయి. ఆడదంటే కోరిక తీర్చుకునే వస్తువని.. తమ పశువాంఛకు బలయ్యే అబల అని సమాజంలోని కొందరు మృగాళ్లు భావించినంత కాలం ఈ ఘోరాలకు అడ్డుకట్ట పడుతుందా? అందుకే మాటువేసి కాటేసే ఇలాంటి కామాంధులు పొంచిఉన్న సమాజంలో.. మగువలకు అప్రమత్తతే ఆయుధం. ఆపద సమయాల్లో మహిళలు ఏమరుపాటుగా ఉండకుండా జ్రాగత్త పడాల్సిన అవసరాన్ని దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్యోదంతం తేటతెల్లం చేస్తోంది. ఆపత్కాలంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లే సమయం లేనప్పుడు, ఏంచేయాలో కూడా అర్థం కాని స్థితిలో టోల్‌ఫ్రీ నెంబర్లు, లొకేషన్ షేర్ యాప్‌లు మహిళలకు కొండంత అండగా ఉంటాయి. 100, 112, 1091, 181 టోల్‌ఫ్రీ నంబర్లు, సైబర్ మిత్ర సెల్లు ఇలా ఎన్నో 24 గంటలూ ఆడవాళ్ల కోసం పనిచేస్తున్నాయి. మహిళలతోనే ఏర్పాటైన శక్తి బృందాలున్నాయి. ప్రమాదంలో ఉన్నామని భావిస్తే టోల్‌ఫ్రీ నంబరు 100కి కాల్ చేయండి. కాల్ సెంటర్లోని సిబ్బంది ఫిర్యాదు నమోదు చేసుకుని వెంటనే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇస్తారు. ఈ నంబరు ద్వారా తక్షణం పోలీసు సాయం పొందవచ్చు. 1091 టోల్ ఫ్రీ నంబరు ప్రత్యేకంగా మహిళలు, చిన్నారుల కోసం పనిచేస్తోంది. ఆపద సమయాల్లో దీనికి కాల్ చేస్తే వెంటనే పోలీసు యంత్రాంగం అప్రమత్తమ వుతుంది. రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 181 టోల్ ఫ్రీ నంబర్ పనిచేస్తుంది. గుంటూరులోని ఆ శాఖ డైరెక్టరేట్‌లో కాల్ సెంటర్ ఉంది. మహిళలు ఎదుర్కొంటున్న ర్యాగింగ్, ఈవ్‌టీజింగ్, గృహ హింస తదితర సమస్యలను చెబితే పరిష్కారం ఎలాగో చెప్పి సంబంధిత విభాగాలకు పంపుతారు. పోలీసు సాయం అవసరమైతే తక్షణం వారిని అప్రమత్తం చేస్తారు. ఫోన్ చేయగానే లొకేషన్ షేర్ దేశ వ్యాప్తంగా పనిచేసే 112 టోల్ ఫ్రీ నంబరుకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆయా రాష్ట్రాల పోలీసు హెడ్ క్వార్టర్లకు ఈ నెంబరు అనుసంధానమై ఉంటుంది. ఈ కాల్ సెంటర్లలో లొకేషన్ ఆధారిత సర్వర్లుంటాయి. కాల్ రాగానే నంబరు, లొకేషన్, కాల్ ఎక్కడ నుంచి వస్తుందో చిరునామా కూడా తెలుస్తుంది. 112కి ప్రత్యేకంగా వాహనాలుంటాయి. వాటి ద్వారా రక్షణ పొందవచ్చు. సైబర్ మహిళా మిత్ర 9121211100 వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మహిళల రక్షణకు సైబర్–మహిళా మిత్ర పేరుతో రాష్ట్ర పోలీసు యంత్రాంగం వాట్సప్ గ్రూపు ఏర్పాటుచేసింది. సైబర్ నేరాలే కాకుండా ఎలాంటి నేరాల గురించైనా ఈ నంబరుకు ఫిర్యాదు చేయొచ్చు. డీజీపీ, అన్ని జిల్లాల ఎస్పీలు కింది స్థాయి పోలీసు అధికారులు ఉన్న ఈ గ్రూపులో వచ్చే ఫిర్యాదులపై వెంటనే సంబంధిత అధికారులు లేదా సిబ్బంది స్పందించాలి. బాధితులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తారు. ఫిర్యాదుపై ఈ గ్రూపులోనే ఎప్పటికప్పుడు స్టేటస్ ఇవ్వాలి. ఇవి కాకుండా ప్రతి జిల్లాలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ (సింగిల్ విండో సెంటర్) ద్వారా మహిళలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను పరిష్కరిస్తారు. సీఐడీ వెబ్ పోర్టల్‌లో ( www. cid. appolice. gov. in) మహిళలు, చిన్నారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఉన్న ప్రత్యేక వ్యవస్థను ఉపయోగించుకోవచ్చు. అప్రమత్తతతో అపాయాన్ని తప్పించుకుందాం అత్యవసర సమయాల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు, ఆపదల నుంచి బయటపడవేసేందుకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం నిరంతరం పనిచేస్తోంది. టోల్ ఫ్రీ నంబర్లను ఫోన్లలో ఫీడ్ చేసుకుంటే ఇబ్బంది వచ్చినప్పుడు ఉపయోగపడతాయి. మహిళలు అకస్మాత్తుగా ఇబ్బందుల్లో పడినా, అపరిచితుల వల్ల ప్రమాదం అని భావించినా భయపడకుండా కొంచెం అప్రమత్తంగా వ్యవహరిస్తే వాటి నుంచి తప్పించుకోవచ్చు. క్లిష్ట సమయాల్లో భయపడకుండా ఏదో ఒక టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలి. – కేజీవి సరిత, ఏఎస్పీ, ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ మహిళలకు అండగా మరిన్ని యాప్‌లు మహిళలు, పిల్లల రక్షణ కోసం కొన్ని యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. VithU, Circle of 6, Life 360, I' m Shakti, Family Locater , Nirbhaya Be fearless, Watch over me వంటి యాప్‌ల ద్వారా తామున్న లొకేషన్‌ను రెండు నిమిషాలకోసారి షేర్ చేయవచ్చు. కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఎప్పటికప్పుడు అలెర్ట్ మెసేజ్‌లు వెళ్తాయి. -
మహిళలు ముందుకు సాగాలి!
పేరు.. మేనక గురుస్వామి వృత్తి... సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, యేల్ లా స్కూల్, న్యూయార్క్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కూల్ ఆఫ్ ‘లా’లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నారు. ప్రత్యేకత... ఎల్జీబీటీ హక్కులకు సంబంధించిన ఆర్టికల్ 377ను సడలించడానికి న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. తల్లిదండ్రులు... మీరా గురుస్వామి, మోహన్ గురుస్వామి (ఆర్థిక శాఖ మాజీ సలహాదారు) వివరం... హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మేనక ప్రాథమిక విద్యను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, హైస్కూల్ విద్యను న్యూఢిల్లీలోని సర్దార్ పటేల్ విద్యాలయలో పూర్తిచేశారు. నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, హార్వర్డ్ లా స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్‌లో న్యాయశాస్త్రాన్ని చదివారు. సందర్భం... మంథన్ సంవాద్‌లో వక్తగా పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చారు. ‘‘మై కాన్స్టిట్యూషన్స్ కంట్రీ’ అనే విషయం మీద మాట్లాడారు. ఆర్టికల్ 377ను సడలించేందుకు ఆమె చేసిన న్యాయ పోరాటం గురించి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి అడిగే ప్రయత్నం చేస్తే.. ‘‘పోరాటం విజయవంతం అయింది.. దాని గురించి వార్తలు, వార్తా కథనాలూ వెలువడ్డాయి. ఇంకా దాని గురించే ఎందుకు? దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి మాట్లాడుకుందాం అన్నారు. ‘‘దేశంలోని రెండు ప్రధాన పార్టీలు బీజేపి, కాంగ్రెస్‌ను కాదని ఆంధ్రప్రదేశ్‌కు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి యంగ్‌స్టర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇది సమాఖ్య స్ఫూర్తిని, ప్రాంతీయ ఆకాంక్షను చాటుతోంది. వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయం.. దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తించిన అంశం. అంతేకాదు దక్షిణ భారతదేశ ఓటర్ల నాడిని తెలుపుతోంది. ప్రాంతీయ పార్టీల పట్ల వాళ్లకున్న ఆదరణకు చిహ్నం. దీన్ని ఒకరకంగా ఫెడరల్ మూవ్‌మెంట్‌గా చెప్పొచ్చు. అంతేకాదు ప్రస్తుతం దేశంలో మహిళా ఓటర్ల శాతమూ పెరిగింది. అయితే మహిళా సమస్యలను రాజకీయ పార్టీలు ఎంతవరకు ప్రాముఖ్యం ఇస్తాయన్నదే ఇక్కడ ప్రశ్న. ఆ మాటకొస్తే మన దగ్గర ఎంతోమంది మహిళా నేతలున్నారు. మహిళా ప్రతినిధుల సంఖ్యా తక్కువేం కాదు. ప్రధానమంత్రి దగ్గర్నుంచి ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా మహిళలు పనిచేశారు. కానీ వీళ్లెవరూ మహిళా సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో స్పందించిన దాఖలాల్లేవు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.. మహిళా సమస్యల పట్ల వాళ్లెందుకు మాట్లాడరు? అని. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని చెప్పుకుంటాం.. దేశ రాజధాని నగరం ఢిల్లీలో మహిళలకు రక్షణ ఉండదు. సాయంకాలం అయిందంటే బయట ఎవరూ కనిపించరు’’ అని అంటూ... ‘‘కాలం మారింది. మహిళలు ముందుకు సాగాలి. రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉండాలి. సమస్యల పట్ల నిలదీయాలి. పరిష్కారాల కోసం పోరాడాలి’’ అని చెప్పారు మేనక గురుస్వామి. – ఫొటో: ఎన్.రాజేష్ రెడ్డి -
కష్టమేనా ఉత్సవం!
ఆ పూటకు కూలి దొరికితే ఉత్సవం! క్షేమంగా ఇంటికి తిరిగి రాగలిగితే ఉత్సవం! బయట వేధింపులు లేకపోతే ఉత్సవం! ఇంట్లో సాధింపులు లేకపోతే ఉత్సవం!‘మహిళా దినోత్సవం అంటే మీకు తెలుసా?’ అనిసాక్షి ‘ఫ్యామిలీ’ అడిగినప్పుడు దాదాపుగా మహిళలంతా..ఇదిగో... ఈ ఉత్సవాల గురించే మాట్లాడారు!!అవి కాదు ఉత్సవాలు... అసలివి ఉత్సవాలే కాదు... అని చెప్పడానికి‘సాక్షి’ వారిని కదిలించింది. వారి మనోభావాలకు కదిలిపోయింది.ఆడబిడ్డ పుట్టడమే ఒక ఉత్సవంలా...ఆమె స్వేచ్ఛగా ఎదగడమే ఒక మహోత్సవంలా..ప్రతి ఇల్లూ కళకళలాడే రోజులు రావాలని సాక్షి మనసారా ఆకాంక్షిస్తోంది. ఏడ్వని రోజు లేదు! మరో జన్మంటూ ఉంటే మగవాడిగా పుట్టాలని కోరుకుంటున్నాను. నేను పుట్టినప్పుడే తండ్రిని, తల్లిని కోల్పోయా! అవ్వ అష్టకష్టాలు పడి పెళ్లి చేస్తే కొద్ది రోజులకు భర్త విడాకులు ఇచ్చాడు. ఇప్పుడు కూలీనాలీ చేసుకుని జీవితం వెళ్లదీయాల్సి వస్తోంది. ఆడదానిగా పుట్టినందుకు చాలాసార్లు బాధపడ్డాను. ఎందుకు ఆడదానిగా పుట్టానని ఏడవని రోజు లేదు. మగవాడిగా పుడితే బాగుండునని చాలాసార్లు అనుకున్నాను. మహిళా దినోత్సవం గురించి తెలియదు.. దాని గురించి ఎప్పుడూ వినలేదు. చెప్పేవారు కూడా లేరు. – తోట శ్రీదేవి, ఓడెడ్, ముత్తారం గొప్పగా అనిపిస్తోంది! ఆడదానిగా పుట్టడం నిజంగా గొప్ప జన్మే. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఇంటి బాధ్యతలు తప్పవు. ఒళ్లు బాగాలేకపోయినా ఇంటి పని తప్పనప్పుడు మాత్రం అబ్బాయిగా పుట్టి ఉంటే ఈ కష్టం ఉండేది కాదు కదా అనిపిస్తుంటుంది. మహిళలూ, మగవాళ్లూ సమానమే అంటుంటారు. వింటుంటాం. కానీ మాకిచ్చే కూలీ మాత్రం తక్కువే. రోజంతా మగాళ్లకంటే ఏ మాత్రం తక్కువ కాకుండా కాయకష్టం చేసి తక్కువ కూలి తీసుకునేటప్పుడు బాధనిపిస్తుంది. మహిళాదినోత్సం ఏంటో తెలియనే తెలియదు. – బాడు మంగమ్మ, కమ్మరి, సైదాపురం, నెల్లూరు జిల్లా స్త్రీగా జన్మించినందుకు గర్విస్తున్నా! కొన్నేళ్లుగా ఊళ్లోనే కుట్టుమిషతో కుటుంబాన్ని నడుపుతున్నాను. నాతోపాటు మరో ఐదుగురు మహిళలకు కుట్టు మిష నేర్చుకునేందుకు శిక్షణ ఇస్తున్నారు. ఇద్దరు పిల్లల చదువుకుంటున్నారు. ఏదో పని నేర్చుకొని సంపాదనలో పడితే మనకే ఎంతో భరోసాగా అనిపిస్తది. అదే మహిళావిజయం అంటే! – ఫర్జానాబేగం, మదనాపురం, వనపర్తి జిల్లా కష్టంలనే ధైర్యం వస్తది పెళ్లయ్యాక ఇంటిపట్టునే ఉండేదాన్ని. మా ఆయన కొబ్బరి బోండాల వ్యాపారం చేసేవాడు. మాకు ఇద్దరు పిల్లలు. ఆయన... లారీ యాక్సిడెంట్ అయ్యి చనిపోయుండు. వెనకా ముందు ఆదుకునేవారు లేరు. తెలియని వ్యాపారమే అయినా ధైర్యం చేసిన. పిల్లలు నేను బతకాలంటే తప్పదు కదా! ఈ వ్యాపారం జేయబట్టి ఎనిమిదేళ్లు. ఇప్పుడు పిల్లలు మంచిగ చదువుకుంటున్నరు. ఆడదాన్ని అయితే ఏం. కష్టంల నుంచే «ధైర్యం పుట్టుకవస్తంది. మహిళాదినోత్సవం అంటే ఏం జేస్తరు? – దుర్గ, కొబ్బరి బొండాల వ్యాపారి, హైదరాబాద్ అడవిల మానై పుట్టినా మంచిగుండేది... ఆడదానిగ పుట్టేకన్నా అడవిల మానై పుట్టుడు మంచిదని మా అమ్మోళ్లు అనడం నా చిన్నప్పటి నుంచి ఇనేదాన్ని. అది నిజమని ఇప్పుడు నాకూ అనిపిస్తుంది. పొద్దున ఎనిమిది గంటలకు వచ్చి ఈ ఫుట్‌పాత్ మీద బొమ్మలు పెట్టుకుని కూసుంట. మళ్ళీ రాత్రి ఎనిమిదింటికే ఇంటికి పోత. బొమ్మలమ్మితే ఒకనాడు వంద రూపాయలొస్తయి. ఒక రోజు రూపాయి కూడా రాదు. అప్పుడప్పుడు నాకు ఫిట్స్ వస్తవి. దావఖానల చుట్టు తిరిగిన ఏం ప్రయోజనం లే! నా సావుతోనే ఆ రోగం కూడా పోతదేమో. మా అమ్మనాన్నకు నేను, మా అన్న సంతానం. మా అందరిదీ బొమ్మలు అమ్ముకుని పొట్టపోసుకునే పని. మా ఇద్దరికీ పెళ్ళిళ్లు అయ్యాయి. మా ఆయన యాక్సిడెంట్ అయ్యి సచ్చిపోయుండు. అప్పుడు నా బిడ్డకు 3 నెలల వయసు. ఇప్పుడు పదో తరగతి చదువుతోంది. బొమ్మలు అమ్ముకుంటూ, కూతురును చదివించుకుంటూ వయసు మీద పడిన అమ్మనాయనను చూసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న. మా అన్న కూడా అనారోగ్యం చేసి సచ్చిపోయుండు. సమాజంల ఆడోల్ల పరిస్థితి అంత బాగలేదు. అందుకే నా బిడ్డకు ఈ యేడు పెండ్లి జేయాలనుకుంటున్న. నా బాధ్యత కూడా తీరిపోద్ది కదా! ఉన్నోళ్లకు మహిళాదినోత్సవాలు, మాకేం ఉంటాయి. – రమణ, బొమ్మల వ్యాపారి, సికింద్రాబాద్ కష్టాలు తప్పవు ఆడదాన్ని కాబట్టి కష్టాలు తప్పవు. భర్త మీద ఆధారపడితే జీవితం సాగదు. ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆడదైనా, మగాడైనా కష్టపడాల్సిందే. ఇద్దరం బాధ్యత తీసుకుంటేనే సంసారం సాఫీగా సాగుతుంది. ఆడదానికి బయటపనితోపాటు ఇంటి పని తప్పకపోవడంతో కుదేలవుతోంది. ఇక మహిళా దినోత్సవం గురించి నాకు తెలీదు. ఎప్పుడూ వినలేదు. – నాగమణి, కుండల వ్యాపారి, అనంతపురం గర్వంగా ఉంది! మహిళగా పుట్టినందుకు గర్వంగా ఉంది. అన్నింటికి ఆడదే ఆధారం. ఆడది లేకుంటే ఈ సృష్టిలో ఏదీ లేదు. అబ్బాయిగా పుట్టాలని ఎప్పుడూ అనుకోలేదు. అయితే... మహిళగా పుట్టాక కుటుంబంలో కొన్ని కష్టాలు ఎదుర్కోవాలి. ఇవన్నీ మామూలే కదా? ఇన్నేళ్లలో నేనెప్పుడూ మహిళాదినోత్సవం అనేది ఒకటుందని వినలేదు. దానిని మార్చి 8న నిర్వహిస్తారని కూడా తెలియదు. – బి. శివపార్వతి స్కూలు ఆయా, గుడివాడ ... తెలుసు... కానీ! మహిళగా పుట్టినందుకు సంతోషంగా ఉంది. అబ్బాయిగా పుట్టి ఉంటే బావుండేదనే తలంపు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా కలగలేదు. మహిళ అయినందు వల్ల ఎదుర్కొన్న సమస్యలు నాకెప్పుడూ ఎదురవనే లేదు. మహిళా దినోత్సవం గురించి పేపర్లలో చదివాను, టీవీలో చూశాను. ఈ కార్యక్రమం మార్చి ఎనిమిదవ తేదీనే ఎందుకు నిర్వహిస్తున్నారో తెలియదు. రుద్ర మహాలక్ష్మి రాజమండ్రి శ్రమను నమ్ముకున్న ఆడదానిగా పుట్టినందుకు గర్వంగా ఉంది. ఆడ మగ అనే భేదం ఉండకుండా సమానంగా చూడాలి. కానీ ఇప్పుడు అలా ఎక్కడా లేదు. నేను ఎంచుకున్న వ్యవసాయ రంగం లో మగాళ్లకు దీటుగా పనిచేస్తున్న. మహిళల ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మగవారే. తలపెట్టిన అన్ని కార్యాల్లో అడ్డుతగులుతుంటారు. ఆడది ఆడదానిలా ఉండక మగరాయుడిలా పనిచేస్తది అని అంటరు. కాని నేను ఇవేమీ పట్టించుకోను. గెలిచి సత్తాచాటలన్నదే లక్ష్యం. నేను బతుకుతూ నలుగురికి ఉపాధి కల్పిస్తాను. – నక్క అమ్మాయమ్మ, రైతు కష్టాల కడలి ఈదుతున్నాను మహిళా పుట్టినందుకు పుట్టెడు కష్టాలు అనుభవిస్తూ కష్టాల కడలి ఈదుతున్నాను. తాగుడుకు బానిసైన నా భర్త సంపాదనంతా అతడి తాగుడుకే సరిపోతుంది. కుటుంబాన్ని నేనే పోషించాలి. తెల్లారి 4 నుంచి రాత్రి 10 గంటల వరకు కష్టపడితే కాని కుటుంబ పోషణకు సరిపడా డబ్బు రాదు. స్త్రీగా పుట్టి నేనేం సుఖపడుతున్నాను. నా భర్తను చూసినప్పుడల్లా మగాడిగా పుట్టి ఉంటే బావుణ్ననిపిస్తుంటుంది. బరువు, బాధ్యత లేకుండా పొద్దస్తమాను తాగుతూ తిరుగుతుంటాడు. అమ్మగా బిడ్డలకు జన్మనిచ్చినందుకు వారిని పోషించుకోవాల్సిన బాధ్యత నా మీద పడింది. అదే మొగాడిగా పుడితే బరువు, బాధ్యలుండవు కదా. నా వంటి పేద కుటుంబంలో పుట్టిన ప్రతి స్త్రీ కష్టాలు అనుభవిస్తుంది. భర్త కొట్టినా తిట్టినా వాడితోనే ఉండాలి. విడిపోయే అవకాశం పెద్దకుటుంబాల్లో ఉన్నట్టు మాకు ఉండదు. కుల కట్టుబాట్లు తప్పక పాటించాలి. స్త్రీగా పుట్టడం వల్ల సుఖాల కన్నా కష్టాలే ఎక్కువ. మహిళా దినోత్సవం అన్నదాన్ని ఇంతవరకు వినలేదు. ఇవన్నీ గొప్పోళ్లు చేసుకునే పండగలు, నాలాంటి పేదదానికి కుటుంబమే కైలాసం. ఇటువంటి దినాలు ఎప్పుడు వినలేదు. ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు. – కల్లేపల్లి లక్ష్మి, చేపల వ్యాపారి, విశాఖపట్టణం నా చిన్నప్పుడు అనుకున్నా... నేను రోజూ కూలీకి వెళ్ళాల్సిందే. ఒకరోజు పనికెళ్లకపోతే ఇల్లు గడువదు. మా అమ్మనాన్న మా తమ్ముడునీ గరాబంగా పెంచారు. నన్ను బడికి కూడ పంపలేదు. అప్పుడనిపించేది అబ్బాయిలా పుడితే బాగుండేదని. నా భర్త ఒక్కడు పని చేస్తే వచ్చే డబ్బులు కుటుంబ పొషణకు సరిపోవడం లేదు. నాకు కష్టమైనప్పటికి తట్టలెత్తడం తప్పడం లేదు. ఈ పని చేయాలంటే ఆరోగ్యం ఉండాలి. వయసు మీద పడిన కొద్ది ఈ పని చేయలేకపోతున్నా. – మిరియాల సరోజన, భవన నిర్మాణ కార్మికురాలు, భూపాలపల్లి రాళ్లు కొడుతున్నాం.. మోస్తున్నాం! స్త్రీగా పుట్టినందుకు సంతోషంగా ఉంది. కానీ అప్పుడప్పుడూ అబ్బాయిగా పుట్టి ఉంటే బావుండని కూడా అనిపిస్తుంటుంది. మహిళ అయినందువల్ల ఎదుర్కొంటున్న కష్టం మమ్మల్ని చులకనగా చూడడమే. రాళ్లు కొడతాం, ఆ తర్వాత లారీలో నింపుతాం. ఇంత కష్టం పడడం మాకేమీ భయంగా లేదు, ధైర్యంగానే ఉంది. ఆడోళ్లం మా కష్టం మేము చేసుకుంటాం. మా పొట్ట మేము నింపుకుంటాం. ఎవరి దయాదాక్షిణ్యాలూ మాకక్కరలేదు. చులకన చూపులు, తక్కువ చేయడం మానుకుంటే చాలు. మహిళాదినోత్సవం అంటే ఏంటో మాకస్సలే తెలియదు. – రమణమ్మ, పేర్నమిట్ట చదువుకోవాలని ఉండేది! మహిళగా పుట్టడం అదృష్టం. చదువుకోవాలని ఉన్నా నన్ను చదివించలేదు. ‘బయటకు వెళ్లకు, అక్కడికివెళ్లకు’ అనే ఆంక్షలు పెట్టినపుడు అబ్బాయిగా పుట్టి ఉంటే బాగుండనిపించేది. నేను ఆ రోజుల్లోనే మా కాఫీ హోటల్ కౌంటర్లో కూర్చునేదాన్ని. మగరాయుడల్లే చేస్తోందనే వాళ్లు. మహిళా దినోత్సవం అని పేపర్లో చదవడమే, కానీ పెద్దగా అవగాహన లేదు. మహిళలకు రక్షణ కవురువైందనేది మాత్రం ఎవ్వరూ కాదనలేని పరిస్థితి. – గుమ్మలూరి రుక్మిణి, గృహిణి, శ్రీకాకుళం రెక్కల కష్టం తప్పదుగా! రెక్కల కష్టం మీద బతకడం సంతోషంగా ఉంటుంది. వంటింటి కుందేలుగా ఉంటే ఏమీ సాధించలేదని బాధ ఉంటుంది. భర్తకు చేదోడుగా ఉన్నాను. అబ్బాయిగా పుడితే బావుండని ఎప్పుడూ అనిపించలేదు. ఎలా పుట్టినా బాధలు తప్పవు. కష్టపడనిదే జీవితం సాఫీగా సాగదు. మహిళాదినోత్సం అంటే ఏమిటో తెలియదు. టీవీల్లో అప్పుడప్పుడూ వింటుంటాను. పేపర్లలో ఫొటోలు చూస్తుంటానంతే. – మానుకొండ ఝాన్సీరాణి, కూరగాయల వ్యాపారి, తెనాలి మగాళ్లకు ఇన్ని బాధలుండవు నలుగురు పిల్లలని పోషించేందుకు జీవితం అంతా సరిపోయింది. ఇంటాబయటా అన్ని సమస్యలే. మగాళ్లకు ఇన్ని బాధలెందుకు ఉంటాయి..? ఆడపిల్ల సమస్యలను అలవాటు చేసుకుని బతికేయాల్సిందే. నేతకార్మికుడిగా ఆయన, బీడీ కార్మికురాలిగా నేను కష్టపడితే తప్ప పిల్లలని చదివించుకోలేకపోయాను. ఇపుడు కొంచెం ఫర్వాలేదు. మహిళలకు ఓ రోజు ఉందని తెలియదు. – అంబాల దేవలక్ష్మి, గృహిణి, సిరిసిల్ల పైసల కాడ తేడా! ఇదీ కష్టం అని ఒకటంటే చెప్పుకుంటం. ఎన్నని చెప్పుకుంటం. ఆడదానిగా పుట్టినందుకన్నా ఆడ పని, మగ పని అని విడదీసి జీతంలో తేడా చూపిస్తరు. ఇలాంటప్పుడే బాదనిపిస్తది. ఆడదానిగా కష్టాలోచ్చినప్పుడల్లా మగవాడిగా పుడితే బాగుండేది కదానిపిస్తది. ఆడోళ్లకు ఓ రోజు ఉందని తెలియదు. రోడ్లు ఊడ్చి బతికేటోళ్లం మాకేం తెలుసు. – బరిగెల దేవేంద్ర, కార్మికురాలు, మామూనూరు -
వనితకు వేదనే..!
సాక్షి, హైదరాబాద్: స్త్రీని దైవంగా కొలిచే మన దేశంలో మహిళలకు రక్షణ కరువైపోయింది. ఐటీ కార్యాల యాలు మొదలుకుని ఆస్పత్రుల దాకా.. కళాశా లలు, వర్సిటీల నుంచి కంపెనీల వరకూ అన్నిం టా మగువలకు వేధింపులే. పనిప్రదేశాల్లో 38 శాతం మంది వనితలు లైంగిక వేధింపులకు గుర వుతున్నారట. వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు 69 శాతం మంది మహిళలు అసలు ముందుకే రావడం లేదట. ఇలాంటి పెడధోరణి పెరగడం సభ్యసమాజాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. దేశం లోని పలు ప్రధాన నగరాల్లో ఇటీవల ఇండియన్ నేషనల్ బార్ అసోసియేషన్ చేపట్టిన సర్వేలో తేలిన వాస్తవాలివీ. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్, ముంబై, బెంగళూరు, జలంధర్, కోల్‌కతా, అహ్మదాబాద్, లక్నో, పుణే నగరాల్లో విభిన్న రంగాల్లో పనిచేస్తున్న 6,047 మంది తమ మనోగతాన్ని వెల్లడించారు. సర్వేలో 78 శాతం మంది మహిళలు, 22 శాతం మంది పురుషులతో పాటు 45 శాతం మంది బాధిత మహిళలు కూడా పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు. సర్వేలో 38 శాతం మంది మహిళలు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు గురవుతు న్నట్టు చెప్పగా.. మరో 22 శాతం మంది పాఠశాలలు, కళాశాలల్లో వేధింపుల బారిన పడుతున్నట్టు వెల్లడించారు. మరో 40 శాతం మంది ఇతర ప్రదేశాల్లో వేధింపులకు గురవుతున్నట్లు తెలిపారు. ఫిర్యాదు చేయాలంటే భయమే.. తమపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేసే విషయంలో 68.9 శాతం మంది మహిళలు భయపడుతున్నట్లు సర్వేలో తేలింది. ప్రధానంగా బాస్‌లపై ఫిర్యాదు చేసేందుకు భయపడడం, పరువు పోతుందనే ఆందోళన, ఆత్మవిశ్వాసం లేకపోవడం, పలు కార్యాలయాల్లో ఫిర్యాదుల స్వీకరణ విభాగం లేకపోవడం దీనికి ప్రధాన కారణం. పనిప్రదేశాల్లో సహోద్యోగులు, బాస్‌లే మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నట్లు ఈ సర్వేలో స్పష్టమైంది. సర్వేలో పాల్గొన్న 53 శాతం మంది తాము స్వయంగా వేధింపులకు గురైనట్లు తెలిపారు. మరో 47 శాతం మంది సామాజిక సైట్ల ద్వారా కూడా తాము వేధింపులకు గురవుతున్నట్లు స్పష్టంచేశారు. చట్టంపై అవగాహన శూన్యం.. కేంద్ర ప్రభుత్వం 2013లో తీసుకువచ్చిన ‘పనిప్రదేశాల్లో మహిళలపై వేధింపుల నిరోధక చట్టం–2013’పై పలు సంస్థలకు అసలు అవగాహనే లేదని ఈ సర్వేలో తేటతెల్లమైంది. 65.2 శాతం కంపెనీలకు ఈ చట్టంపై అవగాహన లేదని, ఆయా కార్యాలయాల్లో ఫిర్యాదుల స్వీకరణ విభాగం లేదని తేలింది. ఎవరైనా ధైర్యంగా ముందుకొచ్చి తమపై జరిగిన లైంగిక దాడులపై ఫిర్యాదు చేసినా విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని చాలా మంది తెలిపారు. పనిప్రదేశాల్లో 38% మంది మహిళలపై లైంగిక వేధింపులు ► ఫిర్యాదు చేసేందుకు 69% మంది మహిళల వెనుకంజ ► ఇండియన్ నేషనల్ బార్ అసోసియేషన్ సర్వేలో వెల్లడి ► ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సహా పలు నగరాల్లో సర్వే చట్టం అమలయ్యేలా చూడాలి పని ప్రదేశాల్లో మహిళలపై వేధింపులను నిరోధించేందుకు కేంద్రం చేసిన చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలి. అన్ని సంస్థలకు చట్టంపై అవగాహన కల్పించాలి. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయంలో ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార విభాగం ఉండాలి. – ఉషానందిని, ప్రభుత్వ ఉద్యోగిని ఫిర్యాదు చేసేవారికి మద్దతునివ్వాలి వేధింపులపై ఫిర్యాదు చేసే మహిళలకు సమాజంలో అన్ని వర్గాలు మద్దతివ్వాలి. సంఘ విద్రోహ శక్తులు, సమాజంలోని చీడపురుగులకు శిక్షలు పడేలా చూడాలి. వేధింపులకు పాల్పడేవారికి సామాజిక బహిష్కారం విధించాలి. – కల్యాణి, పీహెచ్డీ స్కాలర్,జేఎన్ టీయూ వివిధ రంగాల్లో మహిళలపై వేధింపులిలా.. 45% ఐటీ, బీపీవో, కేపీవో సంస్థలు విద్యా రంగం 21.4% 11.9% వ్యవసాయం, ఆహార రంగాలు ఆస్పత్రులు, వైద్య రంగం 9.5% 7.1% న్యాయ విభాగం, ప్రభుత్వ విభాగాలు 5.1% ఉత్పత్తి, కంపెనీల రంగం వేధింపుల తీరిది.. 12.5% లైంగిక దాడులు అసభ్యమైన కామెంట్స్ 25% 25% అసభ్యంగా తాకడం లైంగిక వాంఛ తీర్చమనడం 12.5% 25% శారీరక వేధింపులు -
దాడి చేస్తే ..షాక్ కొడుతుంది
రాజస్థాన్ మహిళపై అత్యాచారం నేపథ్యంలో తెరపైకి రక్షణ పరికరాలు చిన్న చిన్న పరికరాలతో మహిళలకు రక్షణ సాక్షి, బెంగళూరు: కాలేజ్, ఆఫీస్, మెట్రోరైలు, చివరికి ఇంట్లో కూడా మహిళలకు భద్రత కొరవడింది. ఒంటరిగా కనిపిస్తే దాడులు, అత్యాచారాలకు తెగబడుతున్నారు. బెంగళూరులో రాజస్థానీ మహిళపై బుధవారం జరిగిన లైంగిక దాడి ఘటనతో రాష్ట్రం మొత్తం మరోసారి ఉలిక్కిపడింది. మహిళల భద్రత విషయమై చర్చకు తెరతీసింది. ఇలాంటి ఆపత్కర పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ ఉండడం కన్నా మన రక్షణ బాధ్యతను మనమే చూసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం బ్యాగుల్లో అమరిపోయే చిన్నపాటి రక్షణా పరికరాలు అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ పరికరాల గురించిన వివరాలను పరిశీలిస్తే... ఎలక్ట్రిక్ జాకెట్... మామూలు రెయిన్కోట్లా కనిపిస్తూనే మనకు రక్షణ కవచంలా పనిచేసేది ఈ ఎలక్ట్రిక్ జాకెట్. ఈ జాకెట్‌ను మూడు పొరలతో తయారుచేస్తారు. పైకి కనిపించే పొరలో 9వోల్టుల బ్యాటరీని ఏర్పాటుచేస్తారు. పైపొరలో ఏర్పాటైన బ్యాటరీని అనుసంధానం చేస్తూ జాకెట్ చేతుల వద్ద ఒక బటన్‌ను ఏర్పాటుచేస్తారు. ఈ జాకెట్‌ను వేసుకున్న సమయంలో ఎవరైనా మన మీదకు దాడికి వస్తే చేతుల వద్ద ఏర్పాటుచేసిన బటన్‌ను నొక్కితే పైపొరలో కరెంటు పాస్ అవుతుంది. ఆ సమయంలో మనల్ని పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తి విద్యుదాఘాతంతో కిందపడిపోతాడు. ఆ సమయంలో మనం దాడి నుండి తప్పించుకునేందుకు వీలుంటుంది. ఈ జాకెట్ ధర రూ.2,500 నుంచి ప్రారంభమవుతుంది. మహిళల రక్షణ కోసం ప్రత్యేక రింగ్... దాడులు, అత్యాచారాలనుంచి మహిళలు తమను తాము రక్షించుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిన ఉంగరమే ‘స్ట్రింగ్ రింగ్’. వేలికి ధరించగలిగే ఈ చిన్నపాటి ఉంగరంలో మైక్రోట్యాంక్, మైక్రోనీడిల్, మైక్రోపంప్లను డ్యూయల్లాక్ మెకానిజంలో ఉపయోగించారు. ఇందులోని మైక్రోట్యాంక్ క్యాపై ్ససిస్ అనే ద్రవాన్ని(క్యాపై ్ససిన్-నాగా చిల్లీ అనే అత్యంత ఘాటైన మిరపకాయలతో తయారైన ద్రవం) కలిగిఉంటుంది. రింగ్ ధరించిన వారిపైకి ఎవరైనా దాడికి వస్తే రింగ్ కింది భాగంలో ఉన్న లాక్‌ని తాకితే అది తెరచుకొని మైక్రో పంప్ మైక్రో నీడిల్లోకి ఈ ద్రవాన్ని పంపుతుంది. అనంతరం దాడికి దిగిన మనిషికి ఈ రింగ్‌ని తాకిస్తే ఆ ద్రవం వారి శరీరంలోకి వె ళుతుంది. తక్షణమే వారు భరించలేని నొప్పితో కిందపడిపోతారు. ఆ సమయంలో బాధితులు సులువుగా తప్పించుకోవచ్చు. దీని ధర రూ.2000 వేల నుంచి ప్రారంభమవుతుంది. కీ చెయిన్ పర్సనల్ అలారం... ఒంటరిగా వెళ్లే మహిళలు స్వీయ రక్షణ కోసం బ్యాగులో తీసుకెళ్లగల చిన్నపాటి పరికరమే కీచెయిన్ పర్సనల్ అలారం. ఈ కీ చెయిన్ అలారం లోపల 120 వోల్టుల బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. కీ చెయిన్‌కు చిన్నపాటి పిన్కూడా అమర్చబడి ఉంటుంది. ఆపద సమయంలో ఈ పిన్ను నొక్కితే కీచెయిన్లో అమర్చిన బ్యాటరీ నుంచి 130డెసిబెల్స్ శబ్దం వెలువడుతుంది. దీంతో దాడి చేయడానికి వచ్చిన వారు కంగారుపడి పారిపోవడమే కాకుండా దగ్గరలో ఉన్న వారికి కూడా మీరు ఆపదలో ఉన్న విషయాన్ని తెలియజేయవచ్చు. తద్వారా దాడి నుండి తప్పించుకునేందుకు అవకాశం ఉంది. ఈ కీచెయిన్ను రాత్రి వేళల్లో కూడా ఉపయోగించేందుకు వీలుగా స్పాట్లైట్ను కూడా కలిగి ఉంటుంది. ఈ పరికరం ధర రూ.620 నుంచి ప్రారంభమవుతుంది. పెప్పర్ స్ప్రే.. మహిళలు తమపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు ఎంతగానో ఉపకరించే పరికరాల్లో పెప్పర్ స్ప్రే ముఖ్యమైనది. చిన్నపాటి డబ్బాల్లో మిరియాల ద్రావణం, లేదా కారం పొడితో కలిపి చేయబడిన ఈ స్ప్రేను హ్యాండ్‌బాగుల్లో ఎంచక్కా తీసుకెళ్లవచ్చు. ఎవరైనా దాడి చేసే సమయంలో వారి కళ్లలోకి ఈ స్ప్రేను చల్లితే సరిపోతుంది. స్ప్రే ఘాటుకు దుండగుడు విలవిల్లాడుతూ పడిపోవాల్సిందే. ఈ పెప్పర్ స్ప్రే ధర రూ.200 నుంచి ప్రారంభమవుతుంది. -
అబ్బాయిలను సరిగ్గా పెంచమని విన్నవించుకుంటున్నా!
‘‘ఆడవాళ్లు అర్ధరాత్రి కూడా క్షేమంగా తిరగగలిగినప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు అని గాంధీజీ అన్నారు. అది నిజమే. అయితే అర్ధరాత్రి కాదు కదా.. రాత్రి తొమ్మిదీ, పది గంటలకు కూడా తిరగలేని పరిస్థితులు ఉన్నాయి. పగలు మాత్రమే కాదు.. రాత్రి కూడా నిర్భయంగా తిరగగల మార్పుని చూడాలని కోరుకుంటున్నా’’ అని శ్రుతీహాసన్ అన్నారు. ఆడవాళ్ల రక్షణ గురించి ఆమె ఓ ట్వీట్ చేశారు. ‘‘సేఫ్టీగా, స్వేచ్ఛగా జీవించడం నా హక్కు. నేను ఎవరి కూతుర్ని అన్నది ముఖ్యం కాదు. నేను ఒంటరి ఆడపిల్లను. ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లానుకుంటాను. నచ్చిన ప్లేసెస్‌కి వెళ్లి, ఎంజాయ్ చేయాలనుకుంటాను. ఎక్కడికి వెళ్లినా సేఫ్టీ ముఖ్యం’’ అని శ్రుతి పేర్కొన్నారు. ఆడవాళ్ల రక్షణ గురించి ఇంకా ఆమె మాట్లాడుతూ - ‘‘తమ కుటుంబానికి చెందిన ఆడవాళ్లు సేఫ్‌గా ఉండాలని మగాళ్లందరూ కోరుకుంటారు. బయటి మగవాళ్లు తన అమ్మ, అక్కచెల్లెళ్లను గౌరవించాలని అనుకుంటారు. అదే విధంగా బయటి ఆడవాళ్లను కూడా తాము గౌరవించాలని వాళ్లు అనుకుంటే బాగుంటుంది. ఆడపిల్లలకు ఆంక్షలు పెట్టి, పెంచే తల్లిదండ్రులు మగపిల్లలను కూడా అలానే పెంచాలి. స్త్రీ విలువ చెప్పి పెంచితే పరాయి స్త్రీతో అసభ్యంగా ప్రవర్తించరు. అందుకే ఆడవాళ్లందరూ తమ కొడుకులను సరిగ్గా పెంచాలని విన్నవించుకుంటున్నా... బతిమాలుకుంటున్నా’’ అని శ్రుతీహాసన్ అన్నారు. పాయింటే కదా.. ఏ వ్యక్తి స్వభావం అయినా కొంతవరకూ తల్లిదండ్రుల పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే శ్రుతి చెప్పినట్లు ఆడపిల్లలను మాత్రమే కాదు.. మగపిల్లలను కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా పెంచాలి. -
మెరుగైన సేవల కోసమే కమిషనరేట్
మహిళలకు రక్షణ, భద్రత కల్పిస్తాం షీ టీంలు బలోపేతం చేస్తాం రౌడీలపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం రూరల్ కార్యాలయం ఏర్పాటుపై చర్చలు రాజకీయ పెత్తనంపై పరిశీలన ఫ్రెండ్లీ, కమ్యూనిటీ పోలీసింగ్‌ను ప్రోత్సహిస్తాం : సుధీర్‌బాబు వరంగల్ క్రైం : వరంగల్ నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి కమిషనరేట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజల రక్షణే లక్ష్యంగా తాను విధులు నిర్వహిస్తానని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు. వరంగల్ నగర తొలి పోలీస్ కమిషనర్‌గా జి.సుధీర్‌బాబు శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్, సైబరాబా ద్ కమిషనరేట్‌తోపాటు వరంగల్ నగరాన్ని కమిషనరేటుగా ప్రకటిస్తూ ఈ ఏడాది జనవరి నెల 25న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుధీర్‌బాబుకి డీఐజీగా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ నగర పోలీసు కమిషనర్‌గా బదిలీ చేసింది. శుక్రవారం ఉదయం పోలీసు కమిషనరేటు కార్యాలయూనికి చేరుకున్న ఆయన పోలీసు సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం తన కార్యాలయంలో వరంగల్ అర్బన్ ఇన్చార్జి ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అంబర్ కిషోర్‌ఝా నుంచి వరంగల్ నగర కమిషనర్‌గా సుధీర్‌బాబు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా, వరంగల్ నగర కమిషనరేట్ అడిషనల్ డీసీపీ యాదయ్య, ఓ ఎస్డీ సన్ప్రీత్సింగ్తోపాటు వరంగల్ కమిషనరేట్‌కు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐ, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఎస్ఐ, పోలీసు అధికారుల సంఘం, పరిపాలన సిబ్బంది నూతన కమిషనర్‌కు పుష్పగుచ్ఛాలు అందించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ప్రోత్సహిస్తాం.. రాణిరుద్రమదేవి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుధీర్‌బాబు మాట్లాడారు. రాబోయే రోజుల్లో కమిషనరేట్ స్థాయిలో పోలీసులు తమ విధులు నిర్వహిం చడం జరుగుతుందన్నారు. ఇందుకోసం వరంగల్ పట్టణ ప్రజల సహకారం అవసరమని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌తోపాటు కమ్యూనిటీ పోలీసింగ్ విధానాన్ని ప్రోత్సహించ డం జరుగుతుందని తెలిపారు. మహిళల భద్రత కోసం ‘షీ’ టీంలను బలోపేతం చేస్తామన్నారు. ఏసీపీ, డీసీపీలను పెంచుతాం.. దేశవ్యాప్తంగా పోలీసు పరంగా చేపడుతున్న కార్యక్రమాలపై సమీక్ష జరిపి వరంగల్ కమిషనరేట్‌కు స్వీకరిస్తామని పేర్కొన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమం కోసం కృషి చేయడంతోపాటు విధుల్లో రాణిస్తున్న వారిని ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. కమిషనరేట్ పరిధిలో డీసీపీ, ఏసీపీలను నియమించడంతోపాటు ఠాణాల సంఖ్యను పెంచి.. అందుకు తగ్గట్టుగా సిబ్బందిని ఏర్పాటు చేసి విధులు నిర్వహిస్తారని తెలిపారు. వరంగల్ నగర పోలీసు కమిషనర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం కమిషనర్ వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఇరువురు పోలీసు అధికారులు కమిషనరేట్ పరిధిలోని శాంతిభద్రతలపై విషయాలపై చర్చించారు. రాజకీయ జోక్యంపై పరిశీలన పోలీసుల విషయాల్లో రాజకీయ జోక్యంపై పరి శీలిస్తామని కమిషనర్ అన్నారు. ఇటీవల పోలీ సు విషయాల్లో రాజకీయ జోక్యం అతిగా ఉం దని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా... అతిగా రాజకీయ జోక్యం ఉంటే అలాంటి ఇబ్బంది ఉంటుందన్నారు. రౌడీలపై ఉక్కుపాదం నగర పరిధిలోని రౌడీలపై ఉక్కుపాదం మోపుతామని, కరడు కట్టిన రౌడీలపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఆయా స్టేషన్లవారీగా రౌడీలతోపాటు అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడేవారిపై నిఘా ఉంటుందన్నారు. గుడుంబాను అణచివేయడానికి అన్ని రకాల చర్యలు చేపడతామన్నారు. నగర పరిధిలో రూరల్ కార్యాలయంపై పరిశీలన తాను ఇప్పుడే విధుల్లో జాయిన్ అయ్యాయని రూరల్ కార్యాలయం నగర పరిధిలో ఏర్పాటు చేయడానికి అధికారులతో మాట్లాడతాననన్నా రు. రూరల్ కార్యాలయ ఏర్పాటుపై ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు కమిషనర్‌పై విధంగా స్పందిం చారు. అదేవిధంగా కానిసేబుళ్ల బదిలీలపై నిర్ణయం తీసుకుంటామని, పోలీసు సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉంటానని అన్నారు. -
మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు
సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకొస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అవసరమైతే ప్రస్తుత చట్టాలను సవరించేందుకూ వెనకాడమని చెప్పారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేట పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో మంత్రి మాట్లాడారు. మహిళల రక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ఆ దిశగా ప్రణాళిక రూపకల్పన చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళా చట్టాలను కఠినతరం చేసేందుకు ప్రభుత్వం సమాలోచన చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో బాలికల గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ‘షీ టీం’ బృందాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని మంత్రి పేర్కొన్నారు. మెదక్ జిల్లాలో ఎస్పీ నేతృత్వంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక హెల్ప్‌లైన్ 24గంటలు పని చేయనుందన్నారు. వాట్సప్ నంబర్ 94906 17555, కాల్ సెంటర్ 94409 01835 నంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అనంతరం పలువురు మహిళలను సన్మానించారు. -
లోకల్ రైళ్లలో పైలట్ ప్రాజెక్టుగా సీసీ కెమెరాలు
ఫలితాలను బట్టిసబర్బన్ రైళ్లలోనూ ఏర్పాటు బోగీకి ఆరు కెమెరాలు...? ముంబై: మహిళల రక్షణ కోసం సబర్బన్, దూరప్రాంత రైళ్లలో సీసీ టీవీలను ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించడంతో పైలట్ ప్రాజెక్టుగా లోకల్ రైళ్లలో సీసీ టీవీలు ఏర్పాటు చేయనున్నారు. లోకల్‌రైళ్లలో సీసీ టీవీలను పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసి, వాటి ఫలితాల ఆధారంగా అన్ని సబర్బన్ రైళ్లలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా ఎంచుకున్న బోగీలలో మాత్రమే వాటిని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. అయితే రైలు కదిలే సమయంలో సీసీ టీవీల్లో దృశ్యాలు సక్రమంగా నమోదు కావడం ప్రధాన సమస్యగా మారిందని, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఓ సీనియర్ అధికారి తెలిపారు. లోకల్ రైళ్లలోని మహిళా బోగీల్లో కనీసం ఆరు కెమెరాలను అమర్చాలని ప్రతిపాదించామని, అయితే ఎన్ని అవసరమవుతాయో బోగీ పొడవుపై ఆధారపడి ఉంటుందని ఆయన తెలిపారు. ఒక్క బోగీలో కెమెరా అమర్చేందుకు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని, ఏజెన్సీ నిర్ణయం తర్వాత టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని ఆయన చెప్పారు. వాటిని ఎక్కడ, ఏ దిశలో అమర్చాలి అనే అంశాలపై ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని చెప్పారు. మెట్రో రైళ్లలో సీసీటీవీలను ఏర్పాటు చేయనున్న ఏజన్సీనే సబర్బన్ రైళ్లలో కూడా సర్వే నిర్వహించనుందని ఆయన వెల్లడించారు. సెంట్రల్, వెస్టర్న్ రైల్వేల్లో నడుస్తున్న 215 రైళ్లను పర్యవేక్షించడం కష్టంగా మారనుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ముంబై-ఢిల్లీ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పెలైట్ ప్రాజెక్టుగా వీటిని ఏర్పాటు చేశారు. ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాల చెరో సీసీ కెమెరాను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. -
నారీ గర్జనతో నిర్భయకు నివాళి
రెండేళ్ల క్రితం దేశరాజధానిలో నిర్భయపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన మన జాతి మూలాలను కదిలించింది. తమ ఉనికితో, జీవన సర్వస్వంతో ఆడుకుంటున్న మృగాళ్లపై మహిళలు గొంతు విప్పేందుకు ఇది ప్రేరేపించింది. అయితే బహిరంగ స్థలాల్లో స్త్రీల రక్షణకు ఇది నాంది మాత్రమే. జాతి అంతశ్చేతనను కది లించివేసిన నిర్భయ ఉదం తానికి రెండేళ్లు కావస్తోంది. ఢిల్లీలో 2012 డిసెం బర్ 16 కాళరాత్రి మానవ రూప మృగాల కాటు కు పారామెడికల్ విద్యార్థిని గురై రెండువారాలు జీవితం కోసం పోరాడి ఓడిపోయిన ఘటన యావత్ప్రపంచాన్ని మూగబోయేలా చేసింది. ఈ దారుణ అత్యాచారానికి వ్యతిరేకంగా ప్రపంచం ఏక గొంతుకతో నినదించడం ఒక పురాజ్ఞాపకమై నిలిచింది కానీ రెండేళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నేటికీ బహిరంగ స్థలాలు మహిళ లకు సురక్షితం కావని అనునిత్యం రుజువవుతూ నే ఉంది. అయితే నాటి నిర్భయ జీవన్మరణ పో రాటం వృథా కాలేదు. తమ శరీరంతో, మనస్సు తో, ఉనికితో మృగాళ్లు ఆడుకుంటుంటే నిస్సహా యంగా తలదించుకుని అణిగిపోయిన వారు ఈ రెండేళ్లలో తమ గొంతెత్తడం మొదలెట్టారు. దీని ఫలితంగా అత్యాచారాల పాలైనప్పటికీ ధై ర్యంగా ముందుకొచ్చి ప్రకటిస్తున్న, పోలీసు స్టేష న్లలో ఫిర్యాదు చేస్తున్న బాధిత మహిళల సంఖ్య స్వాతంత్య్రానంతరం తొలిసారిగా పెరిగింది. ఒక చిన్న ఉదాహరణ. గత ఏడాది నవంబ ర్లో ముంబైలో 14 ఏళ్ల బాలిక సోషల్ మీడియా లో 16 ఏళ్ల అబ్బాయి చేసిన వేధింపుకు తట్టుకో లేక ఆత్మహత్యకు పాల్పడింది. ఆ ఘటనను త మ రాత అనీ, ఖర్మ అనీ భరించి ఊరుకోకుండా ఆ అమ్మాయి కుటుంబం జరిగినదాన్ని మీడియా కు చెప్పేసింది. జీవితం పొడవునా బాధిస్తూ ఉం డే ఇలాంటి దారుణ ఘటనకు గురయ్యాక భారతీయ మహిళ న్యాయం కోసం వీధులకెక్క డం, తన వంటి మరొక బాధితురాలికి మద్దతు గా నిలబడటం మన దేశంలో చాలా అరుదు. నిర్భయ ఉదంతం తర్వాతి పరిణామాలే ఈ మార్పుకు కారణమయ్యాయి. ఢిల్లీ బస్సు ఘటనలో జ్యోతిసింగ్ సామూ హిక అత్యాచారానికి గురై తీవ్రగాయాలతో సింగ పూర్ ఆసుపత్రిలో మరణించిన తర్వాత ప్రతి డిసెంబర్ 16న ప్రపంచం ఆమెను నిర్భయగా, బ్రేవ్హార్ట్గా స్మరించుకుంటూ వస్తోంది. ఆసు పత్రిలో నరకయాతన అనుభవిస్తూనే తనపై అత్యాచార దాడికి పాల్పడిన వారి గురించి జ్యోతి సింగ్ నిర్భయంగా చాటి చెప్పింది. దాంతో జాతి మొత్తం స్పందించి అత్యాచారాలకు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చింది. జ్యోతి విషాద మరణం నేపథ్యంలో ఇండియా ఎగెనైస్ట్ రేప్ వంటి ఆన్లై న్ వేదికలు ఏర్పడ్డాయి. 2013లో నేర చట్టానికి సవరణ కూడా చేశారు. రేపిస్టులకు యావజ్జీవ కారాగారం, కొన్ని సందర్భాల్లో మరణ శిక్షకు కూడా చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. అయితే ఈ స్పందనలు, చట్ట సవరణలు బహిరంగ స్థలాలను మహిళలకు సురక్షిత మైనవిగా మార్చాయా? 2012తో పోలిస్తే మహి ళలపై అత్యాచారాలు 2013లో 35.2 శాతం పెరి గాయని, వారిపై నేరాలు 26.7 శాతం పెరిగాయ ని అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి. ఈ సంవత్సరం మొదట్లో పశ్చిమబెంగాల్లోని ఒక గ్రామ పంచాయతీ తీర్పుతో ఒక గిరిజన బాలి కపై సామూహిక అత్యాచారం చేశారు. తన తెగ కు చెందని వ్యక్తితో సంబంధం పెట్టుకున్నందుకు ఆమెకు పడిన శిక్ష ఇది. తర్వాత ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు అక్కాచెల్లెళ్లపై అత్యాచారం జరిపి, చంపి చెట్టుకు ఉరితీసిన ఘటన ప్రస్తుతం వివాదా స్పదమైంది. తర్వాత బెంగళూరులోని ఒక పాఠ శాలలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. నిర్భయ ఘటనకు రెండేళ్లు పూర్తి కావస్తుండగా ఒక ఐటీ ప్రొఫెషనల్‌పై ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఘాతుక చర్య వెలుగులోకి వచ్చింది. గ్రామాల్లో, పట్టణాల్లో, ఇళ్లలో, వీధుల్లో, వాహనాల్లో, పాఠశాలల్లో, హాస్టళ్లలో పార్కుల్లో, ఎక్కడా భారతీయ యువతులకు రక్షణ లేదన్నది నేటికీ నిజమే. ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్లపై కాకుండా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోనిదే వాహ నాల్లో ఘాతుక చర్యలకు అడ్డుకట్ట పడదని మహి ళా సంఘాలు ఘోషిస్తున్నాయి. అయితే ఏ చర్యలు తీసుకున్నా కంటితుడుపు చర్యలే అవుతు న్నాయి. ప్రజారవాణా వ్యవస్థలన్నింటినీ జీపీ ఎస్ పరిధిలోకి తీసుకురావాలని, 24 గంటలూ వాటి కదలికలపై నిఘా పెట్టాలని, 50 శాతం వాహనాల్లో మహిళా డ్రైవర్లను నియమించాలని, మహిళలకు ప్రత్యేకంగా సీట్లు, కంపార్టుమెంట్లు కేటాయించాలని ప్రతిపాదనలొస్తున్నాయి. నిర్భయ ఘటన తరువాత నేర చట్టంలో మార్పులను ప్రభుత్వం తీసుకొచ్చినా నేరస్థులకు సంబంధించిన డేటా బేస్‌ను రూపొందించడం లో ఘోర వైఫల్యం చెందింది. ఉబర్క్యాబ్ డ్రైవర్ గతంలో డజనుసార్లు అత్యాచారాలకు పాల్పడి నా, జైలుపాలైనా, ఇప్పటికీ కేసులు నడుస్తూనే ఉన్నా అతడి వివరాలు నిఘా సంస్థల ద్వారా వాహన నిర్వాహకులకు అందకపోవడం మరో ఘోరానికి దారి తీసింది. అతి చిన్న అంశాలలో ప్రభుత్వ వ్యవస్థల వైఫల్యం పదే పదే దారుణాల పునరావృత్తికి కారణమవుతోంది. మరోవైపు ఈ ప్రపంచాన్ని తమకు సురక్షిత స్థలంగా మార్చడానికి వ్యవస్థ ప్రయత్నాలు ప్రా రంభించేంత వరకు మహిళలు వేచి ఉండదల్చు కోవడం లేదు. తమపై నేర చర్యలకు పాల్పడిన ఘటనలను వారు నిర్భయంగా నివేదించడమే కాదు, దుండుగలను పట్టుకోవడంలో వారు పో లీసులకు సహకరిస్తున్నారు కూడా. ఉబర్ క్యాబ్ డ్రైవర్ ఫొటో తీయడం ద్వారా బాధితురాలు పోలీసులు అతడిని గుర్తించే పనిని సులువు చేశారు. తమను మాటల రూపంలో, శారీరకంగా కూడా వేధించడానికి ప్రయత్నించిన వారిని యువతులు చితకబాదుతున్న ఘటనలు కూడా వార్తలవుతున్నాయి. హరియాణాలోని రోహతక్ కు చెందిన అక్కాచెల్లెళ్లు బస్సులో తమ పట్ల అస భ్యంగా ప్రవర్తించిన వారిని బెల్టుతో బాదిన ఘటన వెనుక ఉద్దేశాలను ఇప్పుడు ప్రశ్నిస్తున్నా రు కానీ, ఆ అమ్మాయిల సాహసాన్ని చాలా మంది ఆరాధనగా చూస్తున్నారు. పురుషుల కం టే తాము బలహీనులమనే భావాన్ని మన సమా జంలో యువతులకు, మహిళలకు నూరిపోస్తూ వస్తున్నారు. తాము బలహీనులమని, బాధితుల మని భావించకూడదు. మహిళలందరికీ స్వీయ రక్షణ తరగతులను సుదీర్ఘ కాలంపాటు ఐచ్ఛికం చేయడం ద్వారానే అబలలం అనే భావాన్ని పో గొట్టగలం. దానికి తోడు అవమానం, శిక్ష అనేవి నేరస్తుడికే కాని బాధితులకు విధించకూడదని సమాజం ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా మహిళా భద్రత వాస్తవ రూపం దాలుస్తుంది. (నిర్భయ ఉదంతానికి రేపటితో రెండేళ్లు) - కె.రాజశేఖరరాజు -
మహిళలకు రక్షణ కల్పించాలి
కర్నూలు(న్యూసిటీ): మహిళలకు రక్షణ కల్పించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పి.నిర్మలమ్మ డిమాండ్ చేశారు. కర్నూలు నగర శివారులో శుక్రవారం శ్రావణి అనే యువతిని అతి దారుణంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ శనివారం కలెక్టరేట్ ఎదుట ఐద్వా ఆధ్వర్యంలో మహిళలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మహిళలపై హత్యాచారాలు, వేధింపులు అధికమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై నిర్భయ చట్టాన్ని అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై జరిగే అఘాయిత్యాలను విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి, నగర సహాయ కార్యదర్శి ఉమాదేవి, అరుణ, రషీద, షెహెనాజ్, తదితరులు పాల్గొన్నారు. నిందితుడిని ఉరి తీయాలి.. శ్రావణి హత్యకు కారకుడైన నిందితుడిని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక కలెక్టరేట్ వద్ద గల మహాత్మాగాంధీ విగ్రహం ఎదుట ఆ సంఘం ఆధ్వరం్యలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. కార్యక్రమంలో ఆ సంఘం నగర కార్యదర్శి వి.మల్లికార్జున, నాయకులు రవి, శశి, ఇమామ్, వీరాంజనేయులు, విద్యార్థినులు పాల్గొన్నారు. సోషల్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో.. శ్రావణిని హతమార్చిన నిందితుడని శిక్షించాలని కోరుతూ జిల్లా సోషల్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు మద్దమ్మ మాట్లాడుతూ కర్నూలు నగరంలో మహిళలకు రక్షణ కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ, ఐకేపీ డీపీఎం వసంతకుమారి, జయంతి, రాములమ్మ, తదితరులు పాల్గొన్నారు.