దాడి చేస్తే ..షాక్ కొడుతుంది
రాజస్థాన్ మహిళపై అత్యాచారం నేపథ్యంలో తెరపైకి రక్షణ పరికరాలు
చిన్న చిన్న పరికరాలతో మహిళలకు రక్షణ
సాక్షి, బెంగళూరు: కాలేజ్, ఆఫీస్, మెట్రోరైలు, చివరికి ఇంట్లో కూడా మహిళలకు భద్రత కొరవడింది. ఒంటరిగా కనిపిస్తే దాడులు, అత్యాచారాలకు తెగబడుతున్నారు. బెంగళూరులో రాజస్థానీ మహిళపై బుధవారం జరిగిన లైంగిక దాడి ఘటనతో రాష్ట్రం మొత్తం మరోసారి ఉలిక్కిపడింది. మహిళల భద్రత విషయమై చర్చకు తెరతీసింది. ఇలాంటి ఆపత్కర పరిస్థితుల్లో బిక్కుబిక్కుమంటూ ఉండడం కన్నా మన రక్షణ బాధ్యతను మనమే చూసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం బ్యాగుల్లో అమరిపోయే చిన్నపాటి రక్షణా పరికరాలు అందుబాటులో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఆ పరికరాల గురించిన వివరాలను పరిశీలిస్తే...
ఎలక్ట్రిక్ జాకెట్...
మామూలు రెయిన్‌కోట్‌లా కనిపిస్తూనే మనకు రక్షణ కవచంలా పనిచేసేది ఈ ఎలక్ట్రిక్ జాకెట్. ఈ జాకెట్‌ను మూడు పొరలతో తయారుచేస్తారు. పైకి కనిపించే పొరలో 9వోల్టుల బ్యాటరీని ఏర్పాటుచేస్తారు. పైపొరలో ఏర్పాటైన బ్యాటరీని అనుసంధానం చేస్తూ జాకెట్ చేతుల వద్ద ఒక బటన్‌ను ఏర్పాటుచేస్తారు. ఈ జాకెట్‌ను వేసుకున్న సమయంలో ఎవరైనా మన మీదకు దాడికి వస్తే చేతుల వద్ద ఏర్పాటుచేసిన బటన్‌ను నొక్కితే పైపొరలో కరెంటు పాస్ అవుతుంది. ఆ సమయంలో మనల్ని పట్టుకోవడానికి వచ్చిన వ్యక్తి విద్యుదాఘాతంతో కిందపడిపోతాడు. ఆ సమయంలో మనం దాడి నుండి తప్పించుకునేందుకు వీలుంటుంది. ఈ జాకెట్ ధర రూ.2,500 నుంచి ప్రారంభమవుతుంది.
మహిళల రక్షణ కోసం ప్రత్యేక రింగ్...
దాడులు, అత్యాచారాలనుంచి మహిళలు తమను తాము రక్షించుకునేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిన ఉంగరమే ‘స్ట్రింగ్ రింగ్’. వేలికి ధరించగలిగే ఈ చిన్నపాటి ఉంగరంలో మైక్రోట్యాంక్, మైక్రోనీడిల్, మైక్రోపంప్‌లను డ్యూయల్‌లాక్ మెకానిజంలో ఉపయోగించారు. ఇందులోని మైక్రోట్యాంక్ క్యాపై ్ససిస్ అనే ద్రవాన్ని(క్యాపై ్ససిన్-నాగా చిల్లీ అనే అత్యంత ఘాటైన మిరపకాయలతో తయారైన ద్రవం) కలిగిఉంటుంది. రింగ్ ధరించిన వారిపైకి ఎవరైనా దాడికి వస్తే రింగ్ కింది భాగంలో ఉన్న లాక్‌ని తాకితే అది తెరచుకొని మైక్రో పంప్ మైక్రో నీడిల్‌లోకి ఈ ద్రవాన్ని పంపుతుంది. అనంతరం దాడికి దిగిన మనిషికి ఈ రింగ్‌ని తాకిస్తే ఆ ద్రవం వారి శరీరంలోకి వె ళుతుంది. తక్షణమే వారు భరించలేని నొప్పితో కిందపడిపోతారు. ఆ సమయంలో బాధితులు సులువుగా తప్పించుకోవచ్చు. దీని ధర రూ.2000 వేల నుంచి ప్రారంభమవుతుంది.
కీ చెయిన్ పర్సనల్ అలారం...
ఒంటరిగా వెళ్లే మహిళలు స్వీయ రక్షణ కోసం బ్యాగులో తీసుకెళ్లగల చిన్నపాటి పరికరమే కీచెయిన్ పర్సనల్ అలారం. ఈ కీ చెయిన్ అలారం లోపల 120 వోల్టుల బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. కీ చెయిన్‌కు చిన్నపాటి పిన్‌కూడా అమర్చబడి ఉంటుంది. ఆపద సమయంలో ఈ పిన్‌ను నొక్కితే కీచెయిన్‌లో అమర్చిన బ్యాటరీ నుంచి 130డెసిబెల్స్ శబ్దం వెలువడుతుంది. దీంతో దాడి చేయడానికి వచ్చిన వారు కంగారుపడి పారిపోవడమే కాకుండా దగ్గరలో ఉన్న వారికి కూడా మీరు ఆపదలో ఉన్న విషయాన్ని తెలియజేయవచ్చు. తద్వారా దాడి నుండి తప్పించుకునేందుకు అవకాశం ఉంది. ఈ కీచెయిన్‌ను రాత్రి వేళల్లో కూడా ఉపయోగించేందుకు వీలుగా స్పాట్‌లైట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ పరికరం ధర రూ.620 నుంచి ప్రారంభమవుతుంది.
పెప్పర్ స్ప్రే..
మహిళలు తమపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు ఎంతగానో ఉపకరించే పరికరాల్లో పెప్పర్ స్ప్రే ముఖ్యమైనది. చిన్నపాటి డబ్బాల్లో మిరియాల ద్రావణం, లేదా కారం పొడితో కలిపి చేయబడిన ఈ స్ప్రేను హ్యాండ్‌బాగుల్లో ఎంచక్కా తీసుకెళ్లవచ్చు. ఎవరైనా దాడి చేసే సమయంలో వారి కళ్లలోకి ఈ స్ప్రేను చల్లితే సరిపోతుంది. స్ప్రే ఘాటుకు దుండగుడు విలవిల్లాడుతూ పడిపోవాల్సిందే. ఈ పెప్పర్ స్ప్రే ధర రూ.200 నుంచి ప్రారంభమవుతుంది.