హక్కులు, అవకాశాల్లో మహిళలకు సమాన భాగస్వామ్యం ఎండమావిగానే మిగిలింది. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో రాజకీయపార్టీలు హామీల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు వస్తున్నాయి..పోతున్నాయ్. కానీ మహిళల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, సామాజిక భద్రత ఇప్పటికీ నినాదాలకే పరిమితమవుతున్నాయి. ఇల్లు, బడి, కార్యాలయంతో పాటు రోడ్డు ఇతర బహిరంగ ప్రదేశాల్లో.. ఎప్పుడూ ఏదో ఒక చోట ఏదో రకమైన వివక్ష, వేధింపులు, అణచివేత నిత్యకృత్యంగానే ఉంటున్నాయి.
మహిళల రక్షణ కోసం గృహహింస చట్టం, నిర్భయ చట్టం వంటివి ఎన్ని వచ్చినా, షీటీమ్స్, భరోసా కేంద్రాలు, సఖి వంటి ప్రత్యేక రక్షణ బృందాలు ఎన్ని ఉన్నా లైంగిక దాడులు, హింస కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కోటి దాటిన గ్రేటర్ హైదరాబాద్ జనాభాలో సగం మంది మహిళలే. కాగా ప్రస్తుత ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీలు ఏ మేరకు మహిళల ఆకాంక్షలకు, మహిళా సంబంధిత అంశాలకు పెద్ద పీట వేస్తున్నాయనేది చర్చనీయాంశంగా మారింది.
పలు మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, వివిధ విభాగాల్లో మహిళల సంక్షేమం కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థలు ‘మహిళా మేనిఫెస్టో’పై దృష్టి సారించాయి. మహిళల సంక్షేమం లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు మహిళా మేనిఫెస్టోను రూపొందించాలని డిమాండ్ చేస్తున్నాయి.
సమాన అవకాశాలు లభించాలి....
స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల హింసను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతం అవకాశాలు లభించాల్సిందేనని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ‘అన్నిచోట్లా స్త్రీల ప్రాతినిధ్యం పెరగాలి. విద్య, ఆరోగ్యం, జీవితబీమా, బ్యాంకింగ్, పోలీసు, రవాణా, న్యాయ, వైద్య, ఎయిర్‌ఫోర్స్, నావిక, తదితర అన్ని రంగాల్లో మహిళలు రాణించే విధంగా సమాన అవకాశాలను కల్పించి ప్రోత్సహించాలి.
సమాజంలో మహిళలపై హింసకు మద్యపానం కూడా ఒక కారణమే. మద్యాన్ని ఆదాయ వనరుగా భావించే ప్రభుత్వాల దృక్పథం పూర్తిగా మారాలి. మద్యం దుకాణాలను తగ్గించాలి. కచ్చితమైన నియంత్రణ పాటించాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపే మద్యం షాపులు తెరిచి ఉంచాలి. ప్రధాన హైవేలు, బస్టాపులు, ఆలయాలు, బడులు, ప్రార్ధనాస్థలాలకు సమీపంలో ఉన్నవాటిని తొలగించాలి..’ అని డిమాండ్ చేస్తున్నాయి.
నిర్భయ సెల్ ఏర్పాటు చేయాలి
‘ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలలు, తదితర అన్ని విద్యాసంస్థల్లో బాలికలు, యువతులు నిశ్చింతగా చదువుకొనేందుకు అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించాలి. అన్ని విద్యాసంస్థల్లో ఇందుకోసం ప్రత్యేంగా 2013 నిర్భయ చట్టానికి అనుగుణంగా నిర్భయ సెల్ ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అమ్మాయిల అవసరాలకు అనుగుణమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. టాయిలెట్‌లు, రక్షిత మంచినీళ్లు, పౌష్టికాహారం అందజేయాలి.
చాలామంది పిల్లలు ముఖ్యంగా బాలికలు తీవ్రమైన పోషకాహార లేమితో బాధపడుతున్నారు. అమ్మా యిల్లో రక్తహీనత ఒక సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్కూళ్లలో తృణ ధాన్యా లతో కూడిన పోషకాహారాన్ని అందజేయాలి. స్కూళ్లలో తప్పనిసరిగా చైల్డ్ హెల్త్ కేర్ రికార్డులను అమలు చేయాలి. ఇందులో ఉపాధ్యాయులు, ఆరోగ్యకార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు భాగస్వాములు కావాలి. యుక్త వయస్సు బాలికలకు చక్కటి ఆరోగ్య విద్య అందజేయాలి.
శానిటరీ ప్యాడ్స్, న్యాప్‌కిన్స్ అందుబాటులో ఉంచాలి. యుక్త వయస్సులో వచ్చే మార్పుల గురించి అమ్మాయిలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధంగా జెండర్ సెన్సిటైజేషన్ వర్క్‌షాపులను ఏర్పాటు చేయాలి. వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ ఇప్పించి అమ్మాయిలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకొనేలా చర్యలు తీసుకోవాలి. స్వీయ రక్షణ కు నిరంతర శిక్షణ ఉండాలి. ఈ మేరకు మేనిఫెస్టోలో పొందుపరచాలి..’ అని పలు సంఘాలు, సంస్థలు సూచిస్తున్నాయి.
మెరుగైన ప్రజా రవాణా అవసరం
‘ప్రస్తుతం గ్రేటర్‌లో వివిధ రకాల రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మెట్రోతో సహా అన్ని సేవలు రాత్రి 11కే ముగుస్తాయి. దీంతో రాత్రివేళల్లో విధులు నిర్వహించే సాఫ్ట్‌వేర్ ఉద్యోగినులు, కాల్‌సెంటర్లలో పని చేసే అమ్మాయిలు, రాత్రి పూట ఆలస్యంగా ఇళ్లకు చేరవలసిన సమయాల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఆటోలు, క్యాబ్‌లలో మహిళల భద్రత ప్రశ్నార్ధకంగానే ఉంది. రాత్రి 9 దాటితే ఇలాంటి వాహనాల్లో ప్రయాణం చేయడం దుస్సాహసమే. ఈ పరిస్థితుల్లో సిటీ బస్సులు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి..’ అని మహిళా సంఘాలు డిమాండ్ చేసు ్తన్నాయి. రాజకీయ పార్టీలు ఈ అంశాలు దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాయి.
అవకాశం ఇస్తే.. అమలు చేసి చూపిస్తాం
‘అమ్మాయిలకు ఉచిత విద్య. వైద్యం కేటాయిస్తే చాలు సాధికారత అనేది దానంతట అదే వస్తుందని మేము నమ్ముతున్నాం. విద్యాపరంగా బలోపేతమైతే..కెరీర్ పరంగా నిర్ణయాలు తీసుకొని జీవితంలో స్థిరపడగలుగుతారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్కసారి అవకాశం లభిస్తే దీనిని అమలు చేయడం ద్వారా చేసి చూపేందుకు సిద్ధంగా ఉన్నాం. జాతీయస్థాయిలో బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోను ఒకసారి పరిశీలిస్తే...అనేక కీలకమైన అంశాలు పూర్తిస్థాయిలో అమలుచేసే ప్రయత్నాలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగానే మహిళా సాధికారతను సంబంధించిన గతంలో ఇచ్చిన హామీని అమలుచేసేందుకు పూనుకున్నాము. – గీతామూర్తి, బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు
మహిళలకు పెద్దపీట వేసేది కాంగ్రెస్ పార్టీనే..
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మహిళల హక్కులకు భంగం కలుగుతోంది. దిశ లాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర కేబినెట్‌సహా ఏ అంశంలోనూ మహిళలకు బీఆర్‌ఎస్ తగిన ప్రాధాన్యత కల్పించలేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే మహిళలకు పెద్దపీట వేసేది తామేనని అర్థమవుతుంది. మహిళలను ప్రధానిగా, రాష్ట్రపతిగా చేసింది కాంగ్రెస్ పార్టీనే. జాతీయ పార్టీ అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు అప్పగించింది కూడా మేమే.
రాబోయే ఎన్నికల్లో ప్రజలకు మేమిచ్చిన ఆరు గ్యారంటీల్లో కూడా మహిళాసాధికారత కోసం పథకాలు ప్రకటించాం. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 నగదు, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆసరా పింఛన్ల పెంపు, చదువుకునే విద్యారి్థనులకు మోటారు సైకిళ్లు లాంటి పథకాలతో రాష్ట్రంలో మహిళాభ్యున్నతికి పాటుపడతాం’ – మచ్చా వరలక్ష్మి, గ్రేటర్ హైదరాబాద్ మహిళాకాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment