అసెంబ్లీ ఎన్నికలబరిలో ఈసారి 360 మంది మహిళలు
గత ఎన్నికలతో పోలిస్తే ఈసంఖ్య అధికమని సీఈసీ ప్రకటన
సాక్షి ముంబై: గత ఎన్నికల్లో పోలిస్తే ఈ ఏడాది నవంబరు 20వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 360 మహిళా అభ్యర్ధులు బరిలో ఉన్నారని 2019లో ఈ సంఖ్య 236 మాత్రమేనని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వీరిలో ఎంతమంది అసెంబ్లీ హాల్లో అడుగుపెట్టనున్నారనేది 23వ తేదీన వెల్లడయ్యే ఫలితాల్లో తేటతెల్లం కానుంది. 2019 ఎన్నికల్లో అధిక శాతం మహిళా అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు. ఈసారి ఈ సంఖ్య 360కి పెరిగింది. వీరిలో కూడా ఇండిపెండెంట్లే అధికం కావడం ఆసక్తికరం. గత, ప్రస్తుత ఎన్నికల్లోనూ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకన్నా ఇండిపెండెంట్లే పోటీకి ఎక్కువ ఆసక్తి కనబరుస్తుండటం విశేషం.
రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. ఒకప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి మహిళలు వెనకడుగు వేసేవారు. ఏదైన నియోజక వర్గం మహిళలకు రిజర్వేషన్ అయితే అభ్యర్ధుల కోసం తీవ్రంగా గాలించాల్సి వచ్చేది. ఇప్పుడు కాలం మారింది. పురుషులతో సమానంగా మహిళలు కూడా చట్టసభల్లో అడుగు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల తరఫున టికెట్ లభించని మహిళలు ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేస్తున్నారు.
మహిళ అభ్యర్ధుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణం. పార్టీల వారీగా పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు అత్యధికంగా బీజేపీ నుంచే పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మొత్తం 17 మంది బరిలో ఉన్నారు. ఆ తర్వాత ఎన్సీపీ (ఎస్పీ)నుంచి 11 మంది బరిలోకి దిగుతుండగా శివసేన (యూబీటీ)10 మంది మహిళలను బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ ఎనిమిది మంది మహిళలకు టికెట్ ఇవ్వగా శివసేన (శిందే) పార్టీ ఏడుగురు, ఎన్సీపీ (ఏపీ) అయిదుమంది మహిళలకు అవకాశం కల్పించింది.మహిళా అభ్యర్థులు పెరిగారు
Comments
Please login to add a commentAdd a comment