women and politics
-
Maharashtra Assembly Elections 2024 : రేసులో 360 మంది మహిళా అభ్యర్థులు
సాక్షి ముంబై: గత ఎన్నికల్లో పోలిస్తే ఈ ఏడాది నవంబరు 20వ తేదీన జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా అభ్యర్థుల సంఖ్య పెరిగింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 360 మహిళా అభ్యర్ధులు బరిలో ఉన్నారని 2019లో ఈ సంఖ్య 236 మాత్రమేనని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. వీరిలో ఎంతమంది అసెంబ్లీ హాల్లో అడుగుపెట్టనున్నారనేది 23వ తేదీన వెల్లడయ్యే ఫలితాల్లో తేటతెల్లం కానుంది. 2019 ఎన్నికల్లో అధిక శాతం మహిళా అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు వేశారు. ఈసారి ఈ సంఖ్య 360కి పెరిగింది. వీరిలో కూడా ఇండిపెండెంట్లే అధికం కావడం ఆసక్తికరం. గత, ప్రస్తుత ఎన్నికల్లోనూ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులకన్నా ఇండిపెండెంట్లే పోటీకి ఎక్కువ ఆసక్తి కనబరుస్తుండటం విశేషం. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ నియోజక వర్గాలున్నాయి. ఒకప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడానికి మహిళలు వెనకడుగు వేసేవారు. ఏదైన నియోజక వర్గం మహిళలకు రిజర్వేషన్ అయితే అభ్యర్ధుల కోసం తీవ్రంగా గాలించాల్సి వచ్చేది. ఇప్పుడు కాలం మారింది. పురుషులతో సమానంగా మహిళలు కూడా చట్టసభల్లో అడుగు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల తరఫున టికెట్ లభించని మహిళలు ఇండిపెండెంట్లుగా నామినేషన్ వేస్తున్నారు. మహిళ అభ్యర్ధుల సంఖ్య పెరగడానికి ఇది కూడా ఒక కారణం. పార్టీల వారీగా పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో మహిళా అభ్యర్థులు అత్యధికంగా బీజేపీ నుంచే పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మొత్తం 17 మంది బరిలో ఉన్నారు. ఆ తర్వాత ఎన్సీపీ (ఎస్పీ)నుంచి 11 మంది బరిలోకి దిగుతుండగా శివసేన (యూబీటీ)10 మంది మహిళలను బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ ఎనిమిది మంది మహిళలకు టికెట్ ఇవ్వగా శివసేన (శిందే) పార్టీ ఏడుగురు, ఎన్సీపీ (ఏపీ) అయిదుమంది మహిళలకు అవకాశం కల్పించింది.మహిళా అభ్యర్థులు పెరిగారు -
‘నాన్న కూచి’లు గెలిచేనా..!
సాక్షి, హైదరాబాద్ : ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురూ నాన్న కుట్టిలే. నాన్నతో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నవారే. ఇపుడు నాన్నలు లేరు. వారి ఆశయాలను తాము నిజం చేస్తామంటూ ఆ ముగ్గురు అమ్మాయిలు ఎన్నికల బరిలో ఉన్నారు. తమని గెలిపిస్తే తమ తండ్రులు చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని అంటున్నారు. ఎన్నికల ప్రచాంరలో ముగ్గురూ దూసుకుపోతున్నారు. పైగా ముగ్గురు అమ్మాయిల నాన్నలకు సమాజంలో వారి వారి నియోజక వర్గాల్లో చాలా మంచి పేరే ఉంది. అందుకే తమ విజయాలపై ముగ్గురూ ధీమాగా ఉన్నారు. డిసెంబరు మూడున తాము ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమంటున్నారు. ఈ సారి తెలంగాణ ఎన్నికల బరిలో ముగ్గురు అమ్మాయిలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ ముగ్గురూ కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఎన్నికల బరిలో ఉన్నారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఒకే నియోజకవర్గంలో ప్రత్యర్ధులుగా తలపడుతున్నారు. మరో అమ్మాయి తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన కీలక నియోజక వర్గం నుంచి ఎన్నికల బరిలోఉన్నారు. ఈ ముగ్గురు అమ్మాయిల తండ్రులూ కాలం చేశారు. జీవించి ఉన్న సమయంలో ఈ అమ్మాయిలు తమ తండ్రులతో చాలా సన్నిహితంగా ఉండేవారు. నాన్న నడవడిక.. ఆయన వ్యవహారశైలిని దగ్గరగా గమనించారు. ఇపుడు వారి వారసులుగా పోటీ చేసి ఎన్నికల్లో గెలిచాక వారి ఆశాయాలకు అనుగుణంగా ప్రజాసేవ చేయాలని భావిస్తున్నారు. కంటోన్మెంట్ నియోజక వర్గ దివంగత ఎమ్మెల్యే సాయన్న 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో తెలుగుదేశం పార్టీ తరపున కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి గెలిచిన సాయన్న ఆ తర్వాత 1999,2004 ఎన్నికల్లో కూడా కంటోన్మెంట్ నుంచి వరుస విజయాలు సాధించారు. 2009 ఎన్నికల్లో నాలుగోసారి గెలిచారు. 2014 లోనూ టీడీపీ తరపున బరిలో దిగి నాలుగోసారి గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్వగా విజయం సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీవ్ర ఆనారోగ్యంతో ఆయన మృతి చెందారు. ఆయన కూతురు లాస్య నందితను సాయన్న జీవించి ఉండగానే రాజకీయాల్లో యాక్టివ్ చేశారు. ఇపుడు ఆమె బీఆర్ఎస్ అభ్యర్ధిగా తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తోన్న కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచే బరిలో ఉన్నారు. తన తండ్రి మిగిల్చి పోయిన అభివృద్ధి పనులు తాను పూర్తి చేస్తానని.. పేదలకు ఎప్పుడూ అండగా ఉండాలన్న తన తండ్రి ఆశయాకు అనుగుణంగా పనిచేస్తానని ఆమె అంటున్నారు. కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా డాక్టర్ గుమ్మడి వెన్నెల పోటీ చేస్తున్నారు. ఈమె పరిచయం అవసరంలేని ప్రజాగాయకుడు గద్దర్ కూతురు. తన పాటతో మావోయిస్టు ఉద్యమానికి ఊపు తెచ్చిన గద్దర్ దశాబ్ధాల పాటు విప్లవ ఉద్యమంలో ఉన్నారు. జననాట్యమండలి సభ్యుడిగా ఉంటూ జానపదాలతో జనాన్ని కదిలించారు. ఉద్యమం వైపు ఉరికించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా గద్దర్‌కు వీరాభిమానులు ఉన్నారు. సాయుధ పోరాట నినాదంతో ఉద్యమంలో అడుగు పెట్టిన గద్దర్ చివరకు బులెట్ కాదు బ్యాలెటే బెటరని నిర్ణయించుకుని సొంత పార్టీ కూడా పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఆయన మరణించారు. ఆయన కూతురు వెన్నెల తన తండ్రి కలలు కన్న ప్రజాసంక్షేమం కోసం పాటు పడాలని భావిస్తున్నారు. ఆమెను గుర్తించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక రేసులో ఉన్న మూడో అమ్మాయి పి.విజయారెడ్డి. ఖైరతాబాద్ దివంగత ఎమ్మెల్యే పి.జనార్ధన రెడ్డి గారాల పట్టి విజయారెడ్డి. ఖైరతాబాద్ నియోజక వర్గంలోనే కాదు గ్రేటర్ పరిధిలో కార్మిక సంఘాల్లో పీజేఆర్‌కు చాలా పట్టుంది. జననేతగా పేరు గడించారు. 1985లో మొదటి సారి ఖైరతాబాద్ నియోజక వర్గం నుంచి గెలిచిన పీజేఆర్ ఆ తర్వాత వరుసగా 1989,1994 ఎన్నికల్లోనూ విజయభేరి మోగించారు. 1994లో కాంగ్రెస్ పార్టీ తరపున కేవలం 26 మంది మాత్రమే గెలిస్తే అందులో పీజేఆర్ ఒకరు కావడం విశేషం. అప్పుడు అసెంబ్లీలో సీఎల్పీ నేతగా ఆయనే వ్యవహరించారు. 1999లో ఓటమి చెందిన పీజేఆర్ తిరిగి 2004లో మరోసారి గెలిచారు. నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఆయన కూతురు పి. విజయారెడ్డి ప్రస్తుతం ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు. కంటోన్మెంట్ నుంచి బరిలో ఉన్న లాస్య నందిత- వెన్నెల లో ఎవరో ఒకరు గెలిచే అవకాశం మాత్రమే ఉంది. ఖైరతాబాద్‌లో విజయారెడ్డి గెలిచే అవకాశాలు బానే ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. అదే విధంగా కంటోన్మెంట్లో సాయన్న వారసురాలిగా లాస్య నందిత కూడా గట్టి పోటీ ఇస్తారని అంటున్నారు . మొత్తానికి నాన్నల వారసత్వాన్ని అంది పుచ్చుకున్న ఈ ముగ్గురు అమ్మాయిల భవితవ్యం ఎలా ఉంటుందో డిసెంబరు మూడున తేలిపోతుంది. -
'ఏడు దశాబ్దాల్లో ఎనిమిది మందే..' మహిళా ఎమ్మెల్యేలు!
మహబూబ్‌నగర్: చట్టసభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ రూపొందించిన బిల్లును కేంద్రమంత్రి వర్గం ఆమోదం తర్వాత లోక్‌సభలో ప్రభుత్వం ప్రవేశపెట్టగా.. బుధవారం రాత్రి బిల్లు ఆమోదం పలికింది. ఈ నేపథ్యంలో రాజకీయంగా చోటుచేసుకోనున్న పరిణామాలపై సర్వత్రా చర్చ సాగుతోంది. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2027 తర్వాతే మహిళలకు రిజర్వేషన్లు అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 14 నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 7 నియోజకవర్గాల్లో మాత్రమే మహిళలకు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం దక్కింది. మిగతా ఏడు నియోజకవర్గాల్లోనూ ఒక్కరికి అవకాశం రాలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం ఎనిమిది మంది మాత్రమే మహిళలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో ఒక్కసారి కూడా మహిళా అభ్యర్థి గెలుపొందలేదు. పార్లమెంట్ ఉభయసభలతో పాటు మెజార్టీ రాష్ట్రాల ఆమోదం పొందితే మహిళా బిల్లు అమలులోకి వస్తుంది. 2027 తర్వాత జరిగే ఎన్నికల్లో మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. -
మా వాటా మాకిచ్చారా?
భారత జాతీయోద్యమంలో స్త్రీల ఉనికి, వారి భాగస్వామ్యం, దక్కిన ఫలితాలను గమనిస్తే మహిళల క్రియాశీలతకు జోహార్లు. కానీ, భారత రాజకీయాల్లో వారికి దక్కిన వాటా, గుర్తింపు... అప్పుడూ, ఏడున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడూ... అంతంత మాత్రమే. స్వాతంత్య్రానంతరం పాలనా రాజకీయాలలో మహిళలకు దక్కినదానికీ, జాతీయోద్యమంలో వారి భాగస్వామ్యానికీ పోలికే లేదు. రాజ్యాంగ రచనలో దుర్గాబాయమ్మ, దాక్షాయణీ వేలాయుధన్లు చేసిన కృషి ఎంత ఉన్నా రాజకీయాధికారంలో సమభాగస్వామ్యాన్ని స్త్రీలు పొందలేకపోయారు. స్వతంత్ర భారతంలో పితృస్వామ్యం కొత్త రూపాలతో స్త్రీలను మళ్ళీ ఇళ్ళలోకి నెట్టివేసింది. 33 శాతం రిజర్వేషన్‌ను పొందగలమనే ఆశ క్షీణిస్తుండడం విచారకరం. ► ఇవాళ స్వాతంత్య్రోద్యమ పునర్మూల్యాంక నంలో స్త్రీల పాత్ర గురించి ఆలోచించడమంటే ఉద్యమ అజెండాలో స్త్రీలను ఏ విధంగా వాడుకోవాలనుకున్నారు, స్త్రీలు ఆ పరిధులలోనే ఉన్నారా, వాటిని ఛేదించుకొని మార్పు కోసం తమ స్వతంత్రం కోసం ఏమైనా ప్రయత్నాలు చేశారా? స్వాతంత్య్రో ద్యమ నాయకత్వం ఏ మేరకు ఆమోదించింది? ఏ పరిమితులు విధించింది? మొత్తంగా జాతి సాంస్కృతిక అస్తిత్వంగా భావించిన దానిలో తమ ఉనికి, స్థానాలలో మార్పును స్త్రీలు సాధించుకో గలిగారా? ఈ ప్రశ్నలకు 75 ఏళ్ళ తర్వాతనైనా మనం సమాధానాలు చెప్పుకోలేకపోతే, కనీసం వాటి కోసం అన్వేషించకపోతే స్త్రీల స్థితి గతులలో గుణాత్మకమైన మార్పులు రాలేదని అర్థం. ► ఒక దేశంగా, జాతిగా భారతదేశం, భారతీయులు వెనుకబడి ఉన్నారనీ, తమను తాము పరిశీలించుకునే అర్హత లేని అనాగరి కులుగా ఉన్నారనీ బ్రిటిష్ పాలకులు చేసిన వాదనలకు వారు చూపించిన ఉదాహరణ– స్త్రీలు. సతీసహగమనం, బాల్యవివాహాలు, వితంతు పునర్వివాహ నిషేధం, విద్యాలేమి, విడాకుల అవకాశం లేకపోవడం, పరదా పద్ధతి... ఇలాంటివి చూసి వలస పాలకులు భారతీయులను అనాగరికులంటూ ముద్ర వేశారు. అప్పుడు భారతీయుల ముందున్న కర్తవ్యం– ఆ ముద్రను తొలగించుకోవడం! దానికి రెండు దారులున్నాయి. ఒకటి– ఆ అనాగరికత నుంచి స్త్రీలను తప్పించడం. రెండు– ‘అది అనాగరికత కాదు, అదే మా నాగరికత వైభవం’ అని సమర్థించుకోవడం! ఆ వాదన మీద జాతి నిర్మాణాన్ని చేయడం! స్వాతంత్య్రోద్యమ నాయకత్వం ఆనాటి ఉద్యమ అవసరా లకు అనుగుణంగా రెండు దారులలోనూ ప్రయాణించింది. స్త్రీలూ వారి వెంబడి నడిచారు. నడుస్తూ, నడుస్తూ తమ స్వతంత్ర మార్గాన్ని తాము వేసుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. కొన్ని మార్పులను తీసుకురాగలిగారు. ► వలస పాలకులు ‘భారతీయ స్త్రీలు, స్త్రీత్వము’ అంటూ ప్రవేశ పెట్టిన భావనలను సవాలు చేయవలసిన అవసరం ముఖ్యంగా మధ్యతరగతి స్త్రీల మీద పడింది. దానివల్ల కింది వర్గపు స్త్రీల నుండి వేరుపడి కొత్త ఆదర్శాలతో, కొత్త బాధ్యతలతో కొత్త మధ్యతరగతి మహిళ రూపొందింది. పాశ్చాత్య వలస పాలకులు ఆధునికతకు ఇచ్చిన నిర్వచనాలకు అనుగుణంగా దేశాన్ని ఆధునికీకరించడం జాతీయోద్యమానికి కీలక సమస్యగా ముందుకు వచ్చింది. ఆధ్యాత్మిక – భౌతిక విషయాలను వేరుచేయగలగడం, లోపలి ప్రాంతాన్నీ – వెలుపలి ప్రాంతాన్నీ వేరు చేయడం అనే పనిని వారు తప్పనిసరిగా చేయవలసి వచ్చింది. ఆధ్యాత్మిక ప్రపంచానికీ, లోపలి ప్రైవేట్ ప్రపంచానికీ స్త్రీలను ప్రతినిధులుగా చేసి, భౌతిక, బాహ్యప్రపంచం లోకి పురుష నాయకులు ప్రతినిధులుగా నిలబడడంలో వింత లేదు. అది పితృస్వామ్యబద్ధ ప్రణాళిక ప్రకారం జరిగింది. అందువల్ల మనకు స్త్రీల నాయకత్వం అతి తక్కువగా కనిపిస్తుంది. ► తొలి తరంలో స్త్రీవిద్య, వితంతు వివాహాల వంటి సంస్కరణలకు కూడా ఇదే పరిస్థితి. స్త్రీవిద్య గురించి స్త్రీలు కన్న కలలేమిటి? తమ జీవితాలలో వారు కోరుకున్న మార్పులేమిటి అనేది మనకంతగా తెలియదు. వీరేశలింగం పంతులుగారి కంఠస్వరమే వినిపించి, రాజ్యలక్ష్మి చాలాకాలం పాటు ఇంటికే పరిమితమైంది. వీరేశలింగం గారు తన ఆత్మకథలో ఆమె క్రియాశీలక పాత్ర గురించి రాస్తేనే, అది చదివినవారికే ఆమె నాయకత్వ పటిమ తెలిసింది. సంస్కరణోద్య మాల పరిస్థితే ఇలా ఉంటే ఇక ప్రత్యక్ష రాజకీయ ఉద్యమాలలో స్త్రీల పరిస్థితి మనం తేలికగానే అర్థం చేసుకోవచ్చు. అయితే, స్త్రీలు తమ కార్యాచరణతో చరిత్రను తమ చేతులలోకి తీసుకోవాలని ప్రయత్నిం చడం స్వాతంత్య్రోద్యమ కాలమంతా కనిపిస్తుంది. స్వేచ్ఛ, సమానత్వ భావనలు స్త్రీల జీవితాలలోకి అనివార్యంగా ప్రవేశించి, వారిని ముందుకు నడిపించాయి. ► 1917లో మార్గరెట్ కజిన్సు, సరోజినీ నాయుడుల నాయకత్వంలో పట్టభద్రులైన మహిళలు మాంటేగ్‌ను కలిసి తమకు ఓటుహక్కు కావాలని అడగడంతో మొదటిసారి స్త్రీలు తమ రాజకీయ అవసరాలను గుర్తించారు. 1917లో జరిగిన కలకత్తా కాంగ్రెస్ మహాసభలలో మహిళా చైతన్యం పెరిగింది. 1921లో ఆంధ్రదేశంలో సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా జరిగిన ‘చీరాల – పేరాల సత్యాగ్రహం’లో రావూరి అలివేలు మంగతాయా రమ్మ అరెస్టయింది. రాజకీయ నేరస్థురాలిగా జైలుకు వెళ్ళిన మొదటి స్త్రీ ఆమె. నాలుగు నెలలపాటు జరిగిన ‘చీరాల–పేరాల’ ఉద్యమంలో గ్రామాలనూ, ఇళ్ళనూ వదిలి నాలుగు నెలలపాటు వేరేచోట ఉండ వలసిన పరిస్థితుల్లో స్త్రీలు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు, వారి జీవితాలలో వచ్చిన మార్పులేమిటి అని రికార్డు చేసినవారు లేరు. అప్పటి స్త్రీల అనుభవాలు చరిత్రకెక్కి ఉంటే భవిష్యత్తు మరొక విధంగా ఉండేది. పల్నాడులో పుల్లరి ఉద్యమంలో పోలీసుల లాఠీలకు ఎదురు నిల్చి తీవ్ర గాయాలపాలైన గంగమ్మ, అచ్చమ్మల నాయకత్వ పటిమ ఎలాంటిది? ఆ నాయకత్వ స్ఫూర్తిని తర్వాత తరాలకు ఎందుకు అందనివ్వలేదనే ప్రశ్నలు కూడా రాలేదు చాలాకాలం పాటు! ► 1923లో కాకినాడలో కాంగ్రెస్ మహాసభ జరిగింది. ఆ మహాసభకు దేశమంతటి నుంచీ స్త్రీలు వచ్చారు. వాలంటీర్లుగా వందలమంది స్త్రీలు పనిచేశారు. స్త్రీలు ఇళ్ళను వదిలి, తమ ఊళ్ళను వదిలి కొత్త వాతావరణంలో తమపై కుటుంబ పెత్తనం లేకుండా జీవించడం, అతి కొద్దికాలమైనా సరే వారిపై గొప్ప ప్రభావాన్ని చూపింది. వారిలో అనేక విధాలైన స్వేచ్ఛాకాంక్షలను మేల్కొలిపింది. అయితే ఆ స్త్రీలను నియంత్రించే విధానం కూడా ఇంకోపక్క తయారై పోతూనే ఉంది. స్వేచ్ఛాకాంక్షకూ, నియంత్రణకూ మధ్య నలిగి పోయిన స్త్రీల జీవిత పోరాటాలను గుర్తించినవారు లేరు. ఆ సమయం లోనే దువ్వూరి సుబ్బమ్మ, పొణకా కనకమ్మ, ఉన్నవ లక్ష్మీబాయమ్మ అశేష ప్రజానీకాన్ని తమ ఉపన్యాసాలతో ఆకర్షించి జాతీయో ద్యమాన్ని ప్రచారం చేశారు. 1922లో ఏర్పడిన మహిళా కాంగ్రెస్ మహిళల నాయకత్వాన్ని అభివృద్ధి చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేసినా, వారికి ఖద్దరు ప్రచారోద్యమ బాధ్యతలు తప్ప మరే కీలక రాజకీయ బాధ్యతలూ దక్కలేదు. ఆ స్త్రీల ప్రవర్తన గురించి అటు వలస పాలకులూ, ఇటు స్వదేశీయులు విమర్శలు గుప్పించారు. స్వదేశీయులు వెలి వంటి వాటిని ఉపయోగిస్తే, వలస పాలకులు జైలుశిక్షలు విధించారు. ► ఉప్పు సత్యాగ్రహ సమయంలో గాంధీ ఆ సత్యాగ్రహానికి స్త్రీలు దూరంగా ఉండాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్త్రీలు పట్టించుకోలేదు. దండి యాత్ర మార్గమధ్యంలోనే గాంధీని కలిసిన సరోజినీ నాయుడు దండిలో గాంధీతో పాటు ఉప్పు తయారు చేశారు. దుర్గాబాయమ్మ, కొండా పార్వతమ్మ మరెంతమందో వేలాదిగా స్త్రీలు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, ఇంట్లోని పాలకులనూ, బయటి వలస పాలకులనూ ఎదిరించి స్వేచ్ఛగా జైలు జీవితాన్ని కోరుకున్నారు. అఖిల భారత మహాసభను నిర్వహించుకొని కొనసాగారు. తెలంగా ణాలో నవజీవన మహిళా మండలితో మొదలై బ్రిజ్‌రాణి గౌడ్, ప్రేమాతాయి, సర్జూబెన్ వంటివారు వామపక్ష ఉద్యమాలలోకి నడిచారు. గిరిజన పోరాటాలలో కొమురం సోంబాయి నాయకురాలై నిలబడింది. చిట్యాల ఐలమ్మ తన భూమి సాగు చేసుకోవడానికి చేసిన పోరాటంతో తెలంగాణలో జాతీయోద్యమం, రైతాంగ విముక్తి ఉద్యమం – రెండింటికీ రెండు మార్గాలేర్పడ్డాయి. రైతాంగ ఉద్య మంలో మల్లు స్వరాజ్యం వంటి ఎందరో నాయకులు తయార య్యారు. స్త్రీల పోరాట వ్యూహాలు కొత్తగా రూపొందాయి. స్త్రీలు చేసిన త్యాగాలతో సరిసమానమైనవి లేవన్నంతగా స్త్రీలు ఆ ఉద్యమంలో మమేకమయ్యారు. ► ఎంతగా స్త్రీలను ఇంటికి పరిమితం చేయాలనుకున్నా, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతినిధులుగా నిలబెట్టాలన్నా... జాతీయోద్య మంలో అది కుదరలేదు. పోరాటయోధులుగా వారు తమను తాము నిర్వచించుకోగలిగారు. రూపుదిద్దుకోగలిగారు. కానీ స్వాతంత్య్రానం తరం పాలనా రాజకీయాలలో వారికి దక్కినదానికీ, జాతీయోద్య మంలో వారి భాగస్వామ్యానికీ పోలికే లేదు. రాజ్యాంగ రచనలో దుర్గాబాయమ్మ, దాక్షాయణీ వేలాయుధన్లు చేసిన కృషి ఎంత ఉన్నా రాజకీయాధికారంలో సమభాగస్వామ్యాన్ని స్త్రీలు పొందలేక పోయారు. పితృస్వామ్యం స్వతంత్ర భారతదేశంలో కొత్త రూపాలతో స్త్రీలను మళ్ళీ ఇళ్ళలోకి నెట్టివేసింది. ఇప్పటికీ ఈ 75 ఏళ్ళ ఉత్సవాల సందర్భంలో కూడా స్త్రీలకు దక్కవలసిన రాజకీయ భాగస్వామ్యం సాధించుకోవలసిన విషయంగానే మిగిలింది. ► 33 శాతం రిజర్వేషన్‌ను పొందగలమనే ఆశ రోజురోజుకీ క్షీణించిపోతోంది. ఇక స్త్రీలపై హింస పెరగడం, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతినిధులుగా స్త్రీలను తీర్చి దిద్దే ప్రయత్నాలు ఒకవైపు, మార్కెట్ అవసరాలకు తగిన కొనుగోలు దారులుగా చేసే ప్రయత్నాలు మరొకవైపు వారిని గందరగోళంలోకి నెడుతున్నాయి. కొత్త కొత్త రూపాలలో స్త్రీల స్వేచ్ఛను హరిస్తున్నాయి. ఇప్పుడు స్త్రీలు తమ అస్తిత్వాన్ని కొత్తగా నిర్వచించుకుని, కుల, మత, జాతి వివక్షలను దాటి, రాజ్యాంగ ఆశయాలను మరింత విస్తృత పరుచుకుంటూ కొనసాగే మార్గంలో ఉన్నారు. ప్రస్తుతం ఆ మార్గం చిన్నదిగా, ఆటంకాలతో కూడినదిగా ఉన్నప్పటికీ, రాబోయే కాలంలో స్త్రీల మార్గమే స్వతంత్ర పోరాట, ఉద్యమ ఆశయాలను సామాన్య ప్రజల జీవితాల్లో సాకారం చేయగలుగుతుంది. ఆ ఆలోచనలకు ఈ స్వతంత్ర భారత 75 వసంతాల సందర్భం ఒక ప్రారంభమైతే బాగుంటుంది! ఓల్గా, వ్యాసకర్త ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత -
‘వ్యవస్థ వల్ల బాధింపబడిన వారి కోసమే ఈ పార్టీ’
న్యూఢిల్లీ : జనాభాలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నాం. దాదాపు 120 కోట్ల పైచిలుకు జనాభాలో అతివలది అర్థభాగం. కానీ దేశ రాజకీయాల్లో వారి స్థానం అంటే కేవలం వేళ్ల మీద లెక్కపెట్టగలిగేంత. ప్రస్తుతం దేశంలో ఒకే ఒక్క మహిళా ముఖ్యమంత్రి ఉన్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఎన్ని ప్రభుత్వాలు మారినా మహిళల భవితవ్యం మాత్రం మారడం లేదు. రాజకీయాల్లో మరింత మంది మహిళలకు అవకాశం కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లును ఏ పార్టీలు పట్టించుకోవు. కారణం ఈ బిల్లు పాస్ అయితే మగవాళ్ల ఆధిక్యం తగ్గుతుందనే భావన. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న కొద్ది మంది మహిళల్లో కూడా వారసత్వంగా వచ్చిన వారే అధికంగా ఉన్నారు. ఈ పరిస్థితులను మార్చాలనే ఉద్దేశంతో ఓ రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. ఆ వివరాలు.. న్యూఢిల్లీకి చెందిన శ్వేతా శెట్టి(36) అనే వైద్యురాలు, సామాజిక కార్యకర్త ‘నేషనల్ ఉమెన్స్ పార్టీ’(ఎన్‌డబ్ల్యూపీ) అనే రాజకీయ పార్టీని స్థాపించారు. అమెరికాలో దశబ్దాల క్రితం ఏర్పాటు చేసిన నేషనల్ ఉమెన్స్ పార్టీ స్ఫూర్తిగా తీసుకుని దీన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్వేతా శెట్టి మాట్లాడుతూ.. ‘వ్యవస్థ చేతిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న వారి కోసం.. సాయం కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగే వారి కోసం.. సామాజిక వివక్షతను ఎదుర్కొంటున్న వారి కోసం.. గృహ హింసను ఎదుర్కొంటున్న వారి కోసం ఈ పార్టీని స్థాపించాము’ అని చెప్పారు. పార్టీ స్థాపన కోసం 2012 నుంచే ప్రయత్నాలు ప్రారంభించామన్నారు. 2018లో కూడా మహిళల పట్ల చాలా నేరాలు జరిగాయి.. వారి హక్కులను కాల రాశారు. మహిళా సాధికారత అసలే లేదు. వీటన్నింటిని పరిష్కరించాలంటే రాజకీయాల్లో మహిళల సంఖ్య పెరగాలన్నారు. దానికోసం తమ పార్టీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మహిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తుందని ప్రకటించారు. ఒక ఎన్జీవో ద్వారా తెలంగాణలో కూడా పని చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. మహిళా సంక్షేమానికి సంబంధించిన బిల్లులు చట్టం రూపం దాల్చాలంటే పార్లమెంట్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలని శ్వేత కోరుకున్నారు. -
అక్కడ 56 ఏళ్లలో.. ఆడవాళ్ళకు రెండుసార్లే అవకాశం వచ్చింది
ఖమ్మంరూరల్: పాలేరు నియోజకవర్గం ఏర్పడిన 1962 నుంచి 2016 ఉప ఎన్నికల వరకు మొత్తం 14సార్లు ఎన్నికలు జరిగాయి. 2014 వరకు కూడా మహిళలకు పోటీ చేసే అవకాశం ఏ పార్టీ కూడా కల్పించలేదు. పాలేరులో ప్రస్తుతం 2,04,530 మంది ఓటర్లు ఉండగా అందులో మహిళలు 1,04,222 మంది ఉంటే పురుషులు 1,00, 293 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 3,929మంది అధికంగా ఉన్నారు. ఆయా పార్టీలు ఎన్నికల సమయంలో అన్నిరంగాల్లో సముచిత స్థానం కల్పిస్తున్నామని చెప్పినప్పటికీ ఆచరణలో మాత్రం మహిళలకు అవకాశాలు ఇవ్వడంలేదు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ నుంచి తిరుమలాయపాలేనికి చెందిన మద్దినేని స్వర్ణకుమారికి అవకాశం ఇవ్వడంతో ఆమె అప్పటి ఎన్నికల్లో పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి వెంకటరెడ్డి చేతిలో స్వర్ణకుమారి 25వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2016లో రాంరెడ్డి సుచరితారెడ్డికి.. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రాంరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన 2016లో మృతి చెందడంతో తిరిగి పాలేరులో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికల్లో వెంకటరెడ్డి సతీమణ రాంరెడ్డి సుచరితారెడ్డిని కాంగ్రెస్ బరిలో నిలిపింది. ఆమె ఆ ఉప ఎన్నికల్లో 50వేలు ఓట్లు సాధించారు. అనంతరం ఆమె రాజకీయాల్లో కనిపించలేదు. ప్రస్తుతం ఈ ఎన్నికల్లో ఆమె కూడా పోటీచేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే 14సార్లు జరిగిన ఎన్నికల్లో కేవలం రెండు సార్లు మాత్రమే మహిళలకు పోటీ చేసే అవకాశం కల్పించడం గమనార్హం. 1999లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న స్వర్ణకుమారి 1999లో రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఉమ్మడి ఏపీలో తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవీబాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం టీటీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు. ఉద్యోగం వదులుకుని వచ్చినా ఆమెను ప్రజాప్రతినిధిగా పదవీ వరించలేదు. -
ముగ్గురమ్మల కూతురు
‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లు గుర్తేమిటంటే.. స్త్రీలు స్వేచ్ఛగా బయట కూడా మసలగలగడం’ అని గాంధీజీ అన్నారు. కొంచెం కొంచెం పరిస్థితి మారుతోంది. సీసీ కెమెరాలు పెడుతున్నారు కదా! కానీ భార్యల్ని భర్తలు పెట్టే చిత్రహింసల్ని ఏ కెమెరాలు కనిపెడతాయి? కన్నవాళ్లకు, ఉన్న ఊరికి, ఆఖరికి దేశానికి కూడా దూరమై భర్తతో పాటు పరాయి తీరాలకు చేరిన బాధిత మహిళలను కనిపెట్టుకుని ఉండేదెవరు? భర్తే దగా చేస్తే, భర్తే దూరం చేస్తే, భర్తే మోసం చేస్తే.. ఆ స్త్రీకి దిక్కెవరు? ఇవాళ ఎన్నారై డే. ప్రవాసీ భారతీయ దివస్. 2003 నుంచి యేటా జరుపుకుంటున్నాం. జనవరి 9నే ఎందుకు? దక్షిణాఫ్రికాలో ఎన్నారైగా ఉన్న గాంధీజీ 1915లో ఇదే రోజున ఇండియాకు తిరిగొచ్చారు. అందుకు. ఈ సందర్భంగా మాట్లాడుకోవలసిన మంచి విషయాలు చాలా ఉన్నాయి. అన్నిటికన్నా మంచి విషయం.. ఎన్నారై బాధిత భార్యల కోసం మన దేశం ఓ వెబ్‌సైట్‌ను రెడీ చేస్తోంది. అది మొదలైతే.. మన సిస్టర్స్ విదేశాల్లోనూ స్వేచ్ఛగా, నిర్భయంగా ఉండగలరు. ఎన్నారై వధువుల సంక్షేమం, సంరక్షణల కోసం భారత ప్రభుత్వం ఒక వెబ్సైట్ ప్రారంభించబోతోంది. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ దీనిని నిర్వహిస్తుంది. భార్యను వెళ్లగొట్టినవారిని ఈ సైట్ గుర్తిస్తుంది. భార్యను మోసం చేసి పరారైనవారిని పట్టితెస్తుంది. భార్యపై గృహహింసకు పాల్పడుతున్నవారిని చట్టానికి పట్టిస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నారై పెళ్లి జరిగినా అక్కడి రిజిస్ట్రార్ వరుడి పూర్తి వివరాలను ఈ వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేస్తే తప్ప మ్యారేజ్ సర్టిఫికెట్ బయటికి వచ్చేందుకు వీలు లేకుండా ఇప్పటికే ఒక సాఫ్ట్వేర్ కూడా సిద్ధం అయింది! పూర్తి వివరాలు.. అంటే.. వరుడి వృత్తి, ఉద్యోగం, చిరునామాలు, ఆ ఫోన్ నెంబర్లు, కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు, బ్యాంక్ అకౌంట్లు, ఇతర సోషల్ మీడియా అకౌంట్లు.. ఇలా కీలకమైనవన్నీ.బాధితురాలు ఈ సైట్లో ఫిర్యాదు ఇవ్వగానే ఆ వివరాల ఆధారంగా నిందితుడు ఎక్కడున్నా ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకుంటాయి. ఇందుకోసం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ సమన్వయంతో పనిచేస్తాయి. ఆ శాఖకు (మేనకా గాంధీ), ఈ శాఖకు (సుష్మా స్వరాజ్) ఇద్దరూ మహిళా మంత్రులే కాబట్టి బాధితురాలికి న్యాయం జరిగే విషయంలో అలసత్వానికి, జాప్యానికి అవకాశమే ఉండదు. ఈ రెండు శాఖలకు న్యాయ శాఖ సహకారం ఉంటుంది. ఎవిడెన్స్ యాక్టులో మార్పులు! ఎన్నారై బాధిత భార్యల కోసం అందుబాటులోకి తెస్తున్న వెబ్సైట్లో.. భర్తలకు ఇచ్చే కోర్టు సమన్ల కాపీలను కూడా అప్లోడ్ చెయ్యాలని సుష్మా స్వరాజ్ ఆలోచిస్తున్నారు. అందుకు వీలుగా ‘ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు’లో సవరణలు చేయాలని సుష్మ నేతృత్వంలోని నిపుణుల బృందం న్యాయ శాఖను కూడా సంప్రదించింది.సవరణకు న్యాయ శాఖ ఒప్పుకుంటే.. ఫారిన్లో ఉన్న ఎన్నారై భర్తలను లీగల్‌గా డీల్ చెయ్యడం మన అధికారులకు మరింత సులభం అవుతుంది. (రెండు దేశాలు న్యాయ సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి కనుక). దీంతో న్యాయశాఖకు ఇంకో ఆలోచన వచ్చింది. ‘మేమెలాగూ దేశంలోని ప్రతి పెళ్లినీ తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని చట్టాన్ని తెచ్చే యోచనలో ఉన్నాం కనుక, పనిలో పనిగా ప్రతి ఎన్నారై మ్యారేజీని కచ్చితంగా వారం లోపు రిజిస్టర్ చేయాలన్న నిబంధనను చేరిస్తే బాగుంటుందన్న ప్రతిపాదనను మీరు మాకు పంపవచ్చు కదా’ అని స్త్రీ,శిశు సంక్షేమ శాఖకు సలహా ఇచ్చింది. అదొకటి డిస్కషన్లో ఉంది. ►3,328 (2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలకు అందిన ఎన్నారై భార్యల ఫిర్యాదులు మొత్తం. వీటిల్లో భార్యలపై భర్తలు ఇచ్చినవీ ఒకటీ అరా ఉన్నాయి.) ►మూడు ముళ్ల బంధానికి మూడు శాఖల కాపలా! ►3,268 (పరిష్కారం అయిన ఫిర్యాదుల సంఖ్య) పరిష్కార విధానాలు ►కౌన్సెలింగ్ ► గైడెన్స్ ►న్యాయపరమైన సలహాలు ►ఎన్నారై భర్తలకు సమన్లు (విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.కె.సింగ్ పార్లమెంటుకు ఇచ్చిన సమాచారం అధారంగా) ►ఎన్నారై భార్యల నుంచి తరచూ వచ్చే ఫిర్యాదులు ►ఇండియాలో పెళ్లి జరిగిన వెంటనే వరుడు అదృశ్యమైపోవడం ►పెళ్లి చేసుకుని తీసుకెళ్లాక, భార్యను ఇండియా రానివ్వకపోవడం. ►భార్య పాస్‌పోర్ట్‌ను ఆమెకు అందుబాటులో లేకుండా చేయడం. ►భార్యను ఆ పరాయి దేశంలోనే వదిలేసి భర్త వెళ్లిపోవడం. ►భార్యను ఇండియా పంపించి, పిల్లల్ని తనతోనే ఉంచేసుకోవడం. (ఇవి కాక.. లైంగిక చిత్రహింసలు, అదనపు కట్నం కోసం వేధింపులు) -
మహిళలు, రాజకీయాల గురించి కలాం ఏమన్నారు?
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం.. మహిళలు సాధికారత సాధించాలని కలలు గనేవారు. భారత రాష్ట్రపతిగా విశేష సేవలందించిన ఆయన తుదివరకూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మహిళా సాధికారతే స్థిరమైన సమాజానికి మూలమని కలాం గట్టిగా నమ్మేవారు. చివరకు తనకిష్టమైన విద్యార్థుల సమక్షంలో ఉండగానే తీవ్రమైన గుండెనొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆకస్మిక మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు సాధికారత రాజకీయాలు, సాధికారత గురించి ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. 2006, డిసెంబర్లో తమిళనాడు కోయంబత్తూరులోని అవినాశిలింగం యూనివర్శిటీలో విద్యార్థులతో ముచ్చటిస్తూ అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నమాటలు మహిళా సాధికారతపై ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. జీవితంలో ఒక ఆశయాన్ని నిర్ణయించుకొని, ఆ ఆశయ సాధన కోసం కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిని కావాలంటే మీరేం సలహా యిస్తారని అక్కడున్న ఓ అంథ విద్యార్థిని అడిగింది. అపుడు అబ్దుల్ కలాం ఇలా సమాధానమిచ్చారు. 'ముందు మనం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సాధించాలి. అప్పుడు దేశానికి ప్రెసిడెంట్ అవుతావు' అన్నారు. దీంతోపాటుగా ఎక్కువ సంఖ్యలో మహిళలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ప్రస్తుతం చలామణిలో ఉన్న రాజకీయాలకు బదులు నిజమైన రాజకీయాలను మనం చూడొచ్చని వ్యాఖ్యానించారు. మహిళలు క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కలాం కోరుకునేవారు. దీనికోసం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సాధించాలని ఆయన బలంగా వాదించేవారు. మహిళలు చట్ట సభల్లో స్థానం సంపాదించినపుడు మాత్రమే మరింత ఉన్నతస్థాయికి ఎదుగుతారని చెప్పేవారు. ఆదర్శప్రాయమైన కుటుంబం ద్వారా మాత్రమే నీతివంతమైన సమాజాన్ని నిర్మించుకోగలమని, విలువలున్న సమాజంలోనే మహిళల సాధికారత సాధ్యమవుతుందని బోధించేవారు.