మహిళలు, రాజకీయాల గురించి కలాం ఏమన్నారు?
న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం.. మహిళలు సాధికారత సాధించాలని కలలు గనేవారు. భారత రాష్ట్రపతిగా విశేష సేవలందించిన ఆయన తుదివరకూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. మహిళా సాధికారతే స్థిరమైన సమాజానికి మూలమని కలాం గట్టిగా నమ్మేవారు.
చివరకు తనకిష్టమైన విద్యార్థుల సమక్షంలో ఉండగానే తీవ్రమైన గుండెనొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన ఆకస్మిక మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తమైంది. ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా మహిళలు సాధికారత రాజకీయాలు, సాధికారత గురించి ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం.
2006, డిసెంబర్లో తమిళనాడు కోయంబత్తూరులోని అవినాశిలింగం యూనివర్శిటీలో విద్యార్థులతో ముచ్చటిస్తూ అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నమాటలు మహిళా సాధికారతపై ఆయనకున్న నిబద్ధతకు నిదర్శనం. జీవితంలో ఒక ఆశయాన్ని నిర్ణయించుకొని, ఆ ఆశయ సాధన కోసం కృషి చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా దేశానికి తొలి మహిళా అధ్యక్షురాలిని కావాలంటే మీరేం సలహా యిస్తారని అక్కడున్న ఓ అంథ విద్యార్థిని అడిగింది. అపుడు అబ్దుల్ కలాం ఇలా సమాధానమిచ్చారు. 'ముందు మనం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సాధించాలి. అప్పుడు దేశానికి ప్రెసిడెంట్ అవుతావు' అన్నారు. దీంతోపాటుగా ఎక్కువ సంఖ్యలో మహిళలు రాజకీయాల్లోకి వచ్చినప్పుడే ప్రస్తుతం చలామణిలో ఉన్న రాజకీయాలకు బదులు నిజమైన రాజకీయాలను మనం చూడొచ్చని వ్యాఖ్యానించారు.
మహిళలు క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని కలాం కోరుకునేవారు. దీనికోసం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ సాధించాలని ఆయన బలంగా వాదించేవారు. మహిళలు చట్ట సభల్లో స్థానం సంపాదించినపుడు మాత్రమే మరింత ఉన్నతస్థాయికి ఎదుగుతారని చెప్పేవారు. ఆదర్శప్రాయమైన కుటుంబం ద్వారా మాత్రమే నీతివంతమైన సమాజాన్ని నిర్మించుకోగలమని, విలువలున్న సమాజంలోనే మహిళల సాధికారత సాధ్యమవుతుందని బోధించేవారు.