‘నాన్న కూచి’లు గెలిచేనా..! | Is Three Women Continue Their Fathers Legacy In Telangana Elections | Sakshi
Sakshi News home page

‘నాన్న కూచి’లు గెలిచేనా..!

Published Sat, Nov 25 2023 6:12 PM | Last Updated on Sat, Nov 25 2023 6:27 PM

Is Three Women Continue Their Fathers Legacy In Telangana Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముగ్గురు అమ్మాయిలు. ముగ్గురూ నాన్న కుట్టిలే. నాన్నతో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నవారే. ఇపుడు నాన్నలు లేరు. వారి ఆశయాలను తాము నిజం చేస్తామంటూ ఆ ముగ్గురు అమ్మాయిలు ఎన్నికల బరిలో ఉన్నారు. తమని గెలిపిస్తే తమ తండ్రులు చేసిన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తామని అంటున్నారు. ఎన్నికల ప్రచాంరలో ముగ్గురూ దూసుకుపోతున్నారు. పైగా ముగ్గురు అమ్మాయిల నాన్నలకు సమాజంలో వారి వారి నియోజక వర్గాల్లో చాలా మంచి పేరే ఉంది. అందుకే తమ విజయాలపై ముగ్గురూ ధీమాగా ఉన్నారు. డిసెంబరు మూడున తాము ఎమ్మెల్యేగా  గెలవడం ఖాయమంటున్నారు.

 ఈ సారి తెలంగాణ ఎన్నికల బరిలో  ముగ్గురు అమ్మాయిలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈ ముగ్గురూ కూడా గ్రేటర్ హైదరాబాద్  పరిధిలోనే ఎన్నికల బరిలో ఉన్నారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఒకే నియోజకవర్గంలో  ప్రత్యర్ధులుగా తలపడుతున్నారు. మరో అమ్మాయి  తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన కీలక నియోజక వర్గం నుంచి ఎన్నికల బరిలోఉన్నారు. ఈ ముగ్గురు అమ్మాయిల తండ్రులూ  కాలం చేశారు. జీవించి ఉన్న సమయంలో ఈ అమ్మాయిలు తమ తండ్రులతో చాలా సన్నిహితంగా ఉండేవారు. నాన్న నడవడిక.. ఆయన వ్యవహారశైలిని దగ్గరగా గమనించారు. ఇపుడు వారి వారసులుగా పోటీ చేసి ఎన్నికల్లో గెలిచాక  వారి ఆశాయాలకు అనుగుణంగా ప్రజాసేవ చేయాలని భావిస్తున్నారు.

కంటోన్మెంట్  నియోజక వర్గ దివంగత  ఎమ్మెల్యే  సాయన్న  5 సార్లు  ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో తెలుగుదేశం పార్టీ తరపున కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి గెలిచిన సాయన్న  ఆ తర్వాత 1999,2004 ఎన్నికల్లో కూడా కంటోన్మెంట్ నుంచి  వరుస విజయాలు సాధించారు. 2009 ఎన్నికల్లో  నాలుగోసారి గెలిచారు. 2014 లోనూ టీడీపీ తరపున బరిలో దిగి నాలుగోసారి గెలిచారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్వగా విజయం సాధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తీవ్ర ఆనారోగ్యంతో ఆయన మృతి చెందారు. ఆయన కూతురు లాస్య నందితను సాయన్న జీవించి ఉండగానే రాజకీయాల్లో యాక్టివ్ చేశారు. ఇపుడు ఆమె బీఆర్‌ఎస్‌ అభ్యర్ధిగా  తన తండ్రి ప్రాతినిథ్యం వహిస్తోన్న కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచే  బరిలో ఉన్నారు.  తన తండ్రి మిగిల్చి పోయిన అభివృద్ధి పనులు తాను పూర్తి చేస్తానని.. పేదలకు ఎప్పుడూ అండగా ఉండాలన్న తన తండ్రి ఆశయాకు అనుగుణంగా పనిచేస్తానని ఆమె అంటున్నారు.

కంటోన్మెంట్ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా  డాక్టర్ గుమ్మడి  వెన్నెల  పోటీ చేస్తున్నారు. ఈమె   పరిచయం అవసరంలేని ప్రజాగాయకుడు గద్దర్ కూతురు. తన పాటతో  మావోయిస్టు ఉద్యమానికి ఊపు తెచ్చిన గద్దర్ దశాబ్ధాల పాటు విప్లవ ఉద్యమంలో ఉన్నారు. జననాట్యమండలి సభ్యుడిగా ఉంటూ జానపదాలతో జనాన్ని కదిలించారు. ఉద్యమం వైపు ఉరికించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశ వ్యాప్తంగా గద్దర్‌కు  వీరాభిమానులు ఉన్నారు.  సాయుధ పోరాట నినాదంతో ఉద్యమంలో అడుగు పెట్టిన గద్దర్ చివరకు బులెట్  కాదు బ్యాలెటే బెటరని నిర్ణయించుకుని   సొంత పార్టీ కూడా పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నారు. అయితే దురదృష్టవశాత్తూ ఆయన మరణించారు. ఆయన కూతురు వెన్నెల తన తండ్రి  కలలు కన్న ప్రజాసంక్షేమం కోసం పాటు పడాలని భావిస్తున్నారు.  ఆమెను గుర్తించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది.

ఇక రేసులో ఉన్న మూడో అమ్మాయి  పి.విజయారెడ్డి. ఖైరతాబాద్ దివంగత ఎమ్మెల్యే పి.జనార్ధన రెడ్డి  గారాల పట్టి విజయారెడ్డి. ఖైరతాబాద్ నియోజక వర్గంలోనే కాదు గ్రేటర్ పరిధిలో కార్మిక సంఘాల్లో  పీజేఆర్‌కు చాలా పట్టుంది. జననేతగా  పేరు గడించారు. 1985లో మొదటి సారి ఖైరతాబాద్ నియోజక వర్గం నుంచి గెలిచిన పీజేఆర్‌ ఆ తర్వాత వరుసగా 1989,1994 ఎన్నికల్లోనూ విజయభేరి మోగించారు. 1994లో  కాంగ్రెస్ పార్టీ తరపున కేవలం 26 మంది మాత్రమే గెలిస్తే అందులో పీజేఆర్‌ ఒకరు కావడం విశేషం. అప్పుడు అసెంబ్లీలో  సీఎల్పీ నేతగా ఆయనే వ్యవహరించారు. 1999లో  ఓటమి చెందిన పీజేఆర్‌ తిరిగి 2004లో మరోసారి గెలిచారు. నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. ఆయన  కూతురు పి. విజయారెడ్డి  ప్రస్తుతం ఖైరతాబాద్  నుంచి కాంగ్రెస్ తరపున బరిలో ఉన్నారు.

కంటోన్మెంట్ నుంచి బరిలో ఉన్న  లాస్య నందిత- వెన్నెల లో ఎవరో ఒకరు గెలిచే అవకాశం మాత్రమే ఉంది. ఖైరతాబాద్‌లో విజయారెడ్డి గెలిచే అవకాశాలు బానే ఉన్నాయంటున్నారు రాజకీయ పండితులు. అదే విధంగా కంటోన్మెంట్‌లో సాయన్న వారసురాలిగా లాస్య నందిత కూడా గట్టి పోటీ ఇస్తారని అంటున్నారు . మొత్తానికి నాన్నల వారసత్వాన్ని అంది పుచ్చుకున్న ఈ ముగ్గురు అమ్మాయిల భవితవ్యం ఎలా ఉంటుందో డిసెంబరు మూడున తేలిపోతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement