అబద్ధాలు చెప్పడం, బూతులు మాట్లాడటం తప్ప సీఎంకు ఏమీ చేతకాదు
అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కుల్కచర్ల: ‘కేసీఆర్ అంటే హిస్టరీ.. రేవంత్ లాటరీ’అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం దాస్యానాయక్‌తండాలో ఏర్పాటు చేసిన అంబేడ్కర్ విగ్రహాన్ని శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఒక కులానికి, మతానికి చెందిన వారు కాదని, అన్ని వర్గాల వారికి మార్గదర్శకంగా నిలిచే మహోన్నతమైన వ్యక్తి అని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి లాటరీలో సీఎం అయ్యాడని, ఆయనకు అబ ద్ధాలు చెప్పడం, బూతులు మాట్లాడటం తప్ప మరేమీ చేతకాదని విమర్శించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పట్నం నరేందర్‌రెడ్డి ఆయన్ను మరో సారి ఓడించి తీరుతారని ధీమా వ్యక్తం చేశారు. ఓట్లు వేసి గెలిపించిన అమాయక గిరిజన రైతులు భూములను లాక్కునే ప్రయత్నం చేయడమే కాకుండా వారిని జైలులో పెట్టించిన నీచమైన చరిత్ర కలిగిన వ్యక్తి రేవంత్ అని మండిపడ్డారు.
నిరూపిస్తే రాజకీయ సన్యాసం
ఎప్పుడూ అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి తన స్వగ్రామంలోనైనా వందశాతం రుణమాఫీ చేశాడని నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ అన్నారు. ఇందుకోసం ఎక్కడికి రమ్మన్నా వస్తామని సవాల్ విసిరారు. దమ్ముంటే కొడంగల్‌లోని లగచర్లకు రా నేను వస్తా అక్కడే తేల్చుకుందాం ఎంతమందికి రుణమాఫీ అయ్యిందో చర్చ పెడదాం అన్నారు.
అంబేడ్కర్ కల్పించిన రాజ్యాంగబద్ధమైన హక్కులతో త్వరలోనే తామంతా లగచర్లలో పర్యటిస్తామని, ఎవరు అడ్డుకుంటారో చూస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, మాజీ మంత్రులు పి.సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, ఆనంద్, రోహిత్‌రెడ్డి, బాల్క సుమన్, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment