రాష్ట్రం పెట్టిన ప్రతిపాదనలు, బడ్జెట్ కేటాయింపులపై ఆర్థికశాఖ అధికారులతో సమీక్ష
సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు
బడ్జెట్‌లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై లేఖ రాసే యోచన
రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ రూపకల్పనపైనా చర్చ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల సీఎం రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర మంత్రులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. శనివారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో భాగంగా రాష్ట్రం నుంచి కేంద్రానికి చేసిన ప్రతిపాదనలు, బడ్జెట్‌లో కేంద్రం చేసిన కేటాయింపులపై ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సీఎంతో పాటు మంత్రులకు వివరించారు. రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఏమీ లేవని, కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్లు, సీఎస్‌ఎస్ పథకాల ద్వారా నిధులు, అన్ని రాష్ట్రాలతోపాటు మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా వచ్చే నిధులు మాత్రమే కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వస్తాయని ఆయన వివరించినట్టు తెలిసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసే అంశాన్ని పరిశీలించాలని సీఎం కోరినట్టు సమాచారం. రాష్ట్రానికి ఏ ఒక్క పథకానికి నిధులు ప్రత్యేకంగా లేని అంశంపై పార్లమెంట్ సభ్యులు లోక్‌సభలో గట్టిగా నిలదీసే అంశాన్ని కూడా చర్చించినట్టు తెలిసింది. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్న ఏ ఒక్క ప్రాజెక్టుకు నిధులు సమకూరేలా చర్యలు తీసుకోకపోవడంపై సీఎం రేవంత్‌రెడ్డి తన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు.
సమావేశాలు ముగిసేలోగా రాష్ట్రానికి న్యాయం జరిగేలా లోక్‌సభలో ఎంపీలు పోరాటం సాగించాలన్న అభిప్రాయాన్ని సీఎం వ్యక్తం చేశారంటున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై కేంద్రానికి లేఖ రాసే అంశాన్ని కూడా పరిశీలించినట్టు తెలిసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలు, ఆర్థిక సంవత్సరంలో జరిగిన ఖర్చుల వివరాలను కూడా సీఎం, మంత్రులు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర బడ్జెట్‌ను వాస్తవానికి అనుగుణంగా తయారు చేయాలని, సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా తయారు చేయాలని సీఎం ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment