ఆ నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గాలి.. లేదంటే.. | CM Revanth Reddy Accuses Central Government of Injustice to Telangana Over Padma Awards | Sakshi
Sakshi News home page

ఆ నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గాలి.. లేదంటే..

Published Sun, Jan 26 2025 12:59 PM | Last Updated on Sun, Jan 26 2025 1:24 PM

CM Revanth Reddy Accuses Central Government of Injustice to Telangana Over Padma Awards

సాక్షి,హైదరాబాద్‌ : పద్మ అవార్డుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసిందని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విగ్రహావిష్కరణ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘దేశంలో మళ్లీ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే చర్చ జరగడం దురదృష్టకరం. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కేవలం సర్టిఫికెట్ల కోసం మాత్రమే కాదు. సామాజిక బాధ్యతగా ఆనాడు పీవీ నరసింహారావు యూనివర్సిటీని ముందుకు తీసుకెళ్లారు.  

సమాజంలో సమస్యలకు ఇక్కడి నుంచే పరిష్కారం మొదలు కావాలి. విద్యా హక్కును దూరం చేసే హక్కు పాలకులకు ఎవరూ ఇవ్వలేదు. నిర్లక్ష్యానికి గురవుతున్న విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా యూనివర్సిటీలను బలోపేతం చేసేందుకు వీసీలను నియమించాం. వందేళ్ల తరువాత ఉస్మానియా యూనివర్సిటీకి దళిత సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్తను వీసీగా నియమించాం. యూనివర్సిటీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అవసరమైన చర్యలు చేపట్టాలని వీసీలను ఆదేశించాం. తెలంగాణ సమాజానికి చికిత్స అందించాల్సిన బాధ్యత యూనివర్సిటీ వీసీలపై ఉంది.

పదేళ్లకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయండి..అమలు చేసే బాధ్యత మేం తీసుకుంటాం. యూనివర్సిటీలను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన చేస్తే అది మంచిది కాదు. రాష్ట్రంలో యూనివర్సిటీల పునర్నిర్మాణం జరగాలి. దేశానికి పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డిలాంటి వారిని అందించిన ఘనత యూనివర్సిటీలదే. రంగుల గోడలు, అద్దాల మేడలు అభివృద్ధి కాదని బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పారు. చిట్టచివరి పేదల వరకు సంక్షేమ ఫలాలు అందాలన్న అంబేద్కర్ ఆశయంతో మా ప్రభుత్వం పనిచేస్తుంది.

యూజీసీ నిబంధనలు మార్చి రాష్ట్రాల పరిధి నుంచి యూనివర్సిటీలపై అధికారాలను తప్పించాలని కుట్రలు చేస్తున్నారు. విశ్వవిద్యాలయాలపై ఆధిపత్యం చెలాయించాలనే ఆలోచన వెనక ఒక పెద్ద కుట్ర ఉంది. యూనివర్సిటీలపై ఆధిపత్యం కేంద్రం చేతుల్లోకి వెళితే కొంతమంది చేసే విషప్రచారానికి యూనివర్సిటీలు వేదికలు కాబోతున్నాయి.

ప్రధాని మోదీకి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరు యూజీసీ నిబంధనలు మార్చాలనుకోవడం రాజ్యాంగంపై దాడి చేయడమే. ఇది రాష్ట్రాలపై సాంస్కృతిక దాడి చేయడమే. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వానికి మంచిది కాదు.



ఇది అనవసర వివాదాలకు దారితీస్తుంది. రాష్ట్రాల అధికారాన్ని కేంద్రం గుంజుకోవడం మాపై దాడిగానే భావిస్తాం మా హక్కులను వదులుకోవడానికి మేం సిద్ధంగా లేం. యూజీసీ నిబంధనల మార్పు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాల్సిందే. అలా చేయకపోతే అవసరమైతే నిరసనలకు వెనకాడం. రాష్ట్రాల అధికారాలను ఒక్కొక్కటిగా కేంద్రం తీసుకుంటూ వెళితే.. రాష్ట్రాలు కేవలం పన్నుల వసూలు చేసే సంస్థలుగా మిగలాల్సి వస్తుంది

రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలగకుండా మేధావులు ఆలోచన చేయాలి. పద్మ అవార్డుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. గద్దర్, చుక్కా రామయ్య, అందెశ్రీ, గోరటి వెంకన్న, జయధీర్ తిరుమల రావు లాంటి వారిని గుర్తించకపోవడం దారుణం. పద్మ అవార్డులపై ఈ వేదికగా మా అసంతృప్తిని కేంద్రానికి తెలియజేస్తున్నాం. త్వరలోనే ప్రధానికి ఈ విషయంపై లేఖ రాయబోతున్నాం’ అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement