కేంద్రం సాయం చేసేలా సహకరించండి: సీఎం రేవంత్‌ | CM Revanth Meeting with Kishan Reddy and Other Central Ministers | Sakshi
Sakshi News home page

కేంద్రం సాయం చేసేలా సహకరించండి: సీఎం రేవంత్‌

Published Fri, Dec 13 2024 4:57 AM | Last Updated on Fri, Dec 13 2024 4:57 AM

CM Revanth Meeting with Kishan Reddy and Other Central Ministers

గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సత్కరిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

రూ.1.63 లక్షల కోట్ల ప్రాజెక్టులపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో సీఎం రేవంత్‌

రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులపై చర్చ

ఆర్‌ఆర్‌ఆర్, మెట్రో ఫేజ్‌–2 తదితరాల ప్రస్తావన 

కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్‌లతోనూ భేటీ

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం సహకరించేలా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించి మొత్తం రూ.1,63,559.31 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి కావల్సిన చేయూతపై కిషన్‌రెడ్డితో చర్చించారు. ట్రిపుల్‌ ఆర్, హైదరాబాద్‌ మెట్రో ఫేజ్‌ 2తో పాటు హైదరాబాద్, వరంగల్‌లో సీవరేజీ, భూగర్భ డ్రైనేజీ, సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలను ప్రస్తావించారు. 

రాజస్తాన్‌లోని జైపూర్‌లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై ఢిల్లీ వచ్చిన సీఎం..గురువారం సాయంత్రం కిషన్‌రెడ్డితో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. ఈ భేటీల్లో ముఖ్యమంత్రితో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీలు మల్లురవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘువీర్‌రెడ్డి, బలరాం నాయక్, కడియం కావ్య, గడ్డం వంశీ, సురేశ్‌ షెట్కార్, అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. 

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనుమతులు ఇప్పించండి 
‘ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.34,367.62 కోట్లు. ఆర్‌ఆర్‌ఆర్‌తో పాటు రేడియల్‌ రోడ్లు పూర్తయితే ఫార్మా పరిశ్రమలు, ఇండ్రస్టియల్‌ హబ్‌లు, లాజిస్టిక్‌ పార్కులు, రిక్రియేషన్‌ పార్కులు వంటివి అభివృద్ధి అవుతాయి. ఆర్‌ఆర్‌ఆర్‌కు సంబంధించి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అనుమతులన్నీ ఇప్పించేందుకు కృషి చేయండి.  

మెట్రో ఫేజ్‌–2 సంయుక్తంగా చేపట్టేలా చూడండి 
మెట్రో ఫేజ్‌–2లో భాగంగా నాగోల్‌ నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రాయదుర్గం నుంచి కోకాపేట్‌ నియోపొలిస్, ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట, మియాపూర్‌–పటాన్‌చెరు, ఎల్‌బీ నగర్‌–హయత్‌నగర్‌ మధ్య మొత్తం 76.4 కి.మీ మేర నిర్మించనున్న మెట్రో రైలు నిర్మాణానికి రూ.24,269 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేశాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 50: 50 వాటాతో దీనిని చేప్టటేందుకు సహకరించాలి. 

‘మూసీ’కి అనుమతులు, నిధులు కావాలి 
మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టులో భాగంగా చేపట్టనున్న గాంధీ సరోవర్‌ ప్రాజెక్టుకు రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరాం. దీనితో పాటు గాంధీ సరోవర్‌ నిర్మాణం, మూసీ సీవరేజీ ప్రాజెక్టులు, 11 హెరిటేజ్‌ వంతెనల నిర్మాణం ఇతర పనులకు రూ.14,100 కోట్లు వ్యయమవుతాయని అంచనా వేశాం. ఈ మేరకు అనుమతులు, నిధుల మంజూరుకు సహకరించాలి.· 

మూసీ పునరుజ్జీవంలో భాగంగా గోదావరి నీటిని మూసీకి తరలించేందుకు, గోదావరి నుంచి నగరానికి 15 టీఎంసీలను హైదరాబాద్‌ తాగునీటి అవసరాలకు తరలించేందుకు రూ.7,440 కోట్లతో ప్రణాళికలు రూపొందించాం. ఆ మొత్తం విడుదలకు సహకరించాలి. తెలంగాణలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌లో భూగర్భ డ్రైనేజీకి ప్రణాళిక రూపొందించాం. రూ.4,170 కోట్ల వ్యయమయ్యే ఈ ప్రణాళికను అమృత్‌–2 లేదా ప్రత్యేక పథకం కింద చేపట్టేలా చూడండి. సింగరేణి సంస్థ దీర్ఘకాలం పాటు మనుగడ కొనసాగించేందుకు గాను గోదావరి లోయ పరిధిలోని బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి కేటాయించండి..’ అని కిషన్‌రెడ్డిని సీఎం కోరారు. 

ఆర్‌ఆర్‌ఆర్‌ అనుమతులు వెంటనే ఇవ్వండి 
‘ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి (159 కి.మీ) అవసరమైన సాంకేతిక, ఆర్థికపరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలి. ఈ రహదారి నిర్మాణానికి అవసరమయ్యే భూమిలో 94 శాతం ఇప్పటికే రాష్ట్ర  ప్రభుత్వం సేకరించింది. దక్షిణ కాశీగా గుర్తింపు పొందిన శ్రీశైలంను హైదరాబాద్‌తో అనుసంధానించే ఎన్‌హెచ్‌–765లో 125 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారుల ప్రమాణాలతో ఉంది. అయితే మిగిలిన 62 కిలోమీటర్లు అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో ఉంది. 

అటవీ, పర్యావరణ శాఖల నిబంధనల ఫలితంగా ఆ మేరకు రహదారి అభివృద్ధికి ఆటంకం ఎదురవుతోంది. దీనివల్ల కేవలం పగటి వేళలో మాత్రమే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. కాబట్టి అమ్రాబాద్‌ అటవీ ప్రాంతంలో నాలుగు వరుసల ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించేందుకు బడ్జెట్లో నిధులు మంజూరు చేయండి. ఇది నిర్మిస్తే హైదరాబాద్,  ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాల మధ్య 45 కిలోమీటర్ల మేర దూరం తగ్గుతుంది.  

హైదరాబాద్‌–విజయవాడ డీపీఆర్‌ త్వరగా పూర్తి చేయండి 
హైదరాబాద్‌–విజయవాడ (ఎన్‌హెచ్‌–65) రహదారిని 6 వరుసలుగా విస్తరించే పనుల డీపీఆర్‌ను త్వరగా పూర్తి చేయండి. వరంగల్‌ దక్షిణ భాగం బైపాస్‌ నిర్మాణానికి అనుమతులు ఇవ్వండి. పర్వత్‌మాల ప్రాజెక్టులో భాగంగా యాదాద్రి దేవాలయం, నల్లగొండ పట్టణంలోని హనుమాన్‌ కొండ, నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ వద్ద రోప్‌ వేలను ఏర్పాటు చేయండి. గోదావరి, కృష్ణా నదులపై గిరిజనులు అత్యధికంగా నివసిస్తున్న ప్రాంతాల్లో.. ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉన్న 10 చోట్ల పాంటూన్‌ బ్రిడ్జిలు మంజూరు చేయండి. నల్లగొండ జిల్లాలో ఎన్‌హెచ్‌–65 పక్కన 67 ఎకరాల ప్రభుత్వ భూమిలో ట్రాన్స్‌పోర్ట్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఏర్పాటు చేయండి..’ అని నితిన్‌ గడ్కరీతో భేటీలో రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

కేంద్రీయ విద్యాలయాలు కేటాయించండి 
‘ఇటీవల రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కృతజ్ఞతలు. కానీ రాష్ట్రానికి ఒక్క కేంద్రీయ విద్యాలయం కూడా కేటాయించలేదు. కేంద్రీయ విద్యాలయాలతో పాటు నవోదయ పాఠశాలలు లేని జిల్లాలకు వాటిని కేటాయించండి. డీమ్డ్‌ యూనివర్సిటీల ప్రకటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి అయినప్పటికీ.. ఇటీవల కేవలం కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే డీమ్డ్‌ యూనివర్సిటీలను గుర్తిస్తున్నారు. డీమ్డ్‌ యూనివర్సిటీ గుర్తింపునకు రాష్ట్ర ప్రభుత్వ ఎన్‌ఓసీ కూడా తప్పకుండా తీసుకునేలా చూడండి..’ అని ధర్మేంద్ర ప్రధాన్‌ను ముఖ్యమంత్రి కోరారు. 
 
నేడు ఏఐసీసీ నేతలతో సీఎం భేటీ! 
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఏఐసీసీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల ¿భర్తీ వంటి అంశాలపై చర్చించవచ్చని సమాచారం.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement