
ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసి రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
ఐదు అంశాలపై ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వినతులు
తెలంగాణ పురోభివృద్ధికి కేంద్రం తరఫున తగిన సహకారం అందించండి
రూ.24,269 కోట్ల వ్యయమయ్యే హైదరాబాద్ మెట్రో ఫేజ్–2కు అనుమతి ఇవ్వండి
ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం, రీజనల్ రింగ్ రైల్, డ్రైపోర్ట్ మంజూరు చేయండి
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్‌కు రూ.20 వేల కోట్ల నిధులు ఇవ్వండి.. సెమీ కండక్టర్ మిషన్‌కు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి
తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని విన్నపం
గంటన్నర పాటు ప్రధానితో భేటీ.. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం అంశం ప్రస్తావన
చర్చకు రాని కులగణన, ఎస్సీ వర్గీకరణ!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తమ సహకారాన్ని, ఆర్ధిక చేయూతను అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో మెట్రోరైలు ఫేజ్–2కు అనుమతులు, రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులకు నిధుల మంజూరు, సెమీ కండక్టర్ మిషన్‌కు అనుమతి విషయంలో సానుకూలంగా స్పందించాలని కోరారు.
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించేందుకు మంగళవారం రాత్రి ఢిల్లీకి వచ్చిన సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు బుధవారం ఉదయం మోదీని ఆయన అధికారిక నివాసంలో కలిశారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ భేటీలో.. రాష్ట్ర ప్రాజెక్టులకు రావాల్సిన అనుమతులు, నిధుల విషయమై వినతులు సమరి్పంచారు. వీటిపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్టు భేటీ అనంతరం ముఖ్యమంత్రి తెలిపారు.
టన్నెల్ ప్రమాదంపై ప్రధాని ఆరా..
సీఎంతో భేటీ సందర్భంగా ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం, సహాయక చర్యలపై ప్రధాని మోదీ ఆరా తీశారు. టన్నెల్‌లో ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. గత పదేళ్లుగా టన్నెల్ పనులు నిలిచిపోవడంతో.. నీటì ఊటలు పెరిగి, మట్టి వదులు కావడంతో ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమికంగా అంచనా వేశామని సీఎం వివరించారు. ప్రమాదంలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు అన్ని చర్యలు చేపట్టామని.. నిత్యం ఇద్దరు, ముగ్గురు మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12శాఖల అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని వివరించారు. చిక్కుకున్న వారిని బయటికి తెచ్చేందుకు కేంద్రం తరఫున అవసరమైన అన్ని రకాల సహాయం అందిస్తామని ప్రధాని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కాగా ఈ భేటీలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలు చర్చకు రాలేదు. వీటిపై పూర్తిస్థాయి నివేదికలు అందాకే ప్రధానితో చర్చించాలనే ఉద్దేశంతోనే ఈ అంశాలను ప్రస్తావించనట్టు తెలిసింది.
ప్రధానికి సీఎం చేసిన వినతులు ఇవీ..
– హైదరాబాద్ మహా నగరంలో మెట్రో రైలు సౌకర్యాన్ని అన్ని ప్రాంతాలకు అందుబాటులోకి తేవడానికి ఉద్దేశించిన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–2కు అనుమతులివ్వాలి. గత ప్రభుత్వం పదేళ్లుగా హైదరాబాద్‌లో మెట్రో విస్తరణపై దృష్టి సారించలేదు. నగరంలో ఫేజ్–2 కింద రూ.24,269 కోట్ల అంచనా వ్యయంతో 76.4 కిలోమీటర్ల పొడవైన ఐదు కారిడార్లను ప్రతిపాదించాం. ఈ ప్రాజెక్టును వెంటనే అనుమతించాలి.
– రీజనల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగంలో ఇప్పటికే 90శాతం భూసేకరణ పూర్తయినందున.. ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగాన్ని కూడా వెంటనే మంజూరు చేయాలి. ఉత్తర భాగంతో పాటే దక్షిణ భాగం పూర్తయితే ఆర్‌ఆర్‌ఆర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకోగలం. దక్షిణ భాగం భూసేకరణకు అయ్యే వ్యయంలో 50శాతం భరించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉంది. ఆర్‌ఆర్‌ఆర్‌కు సమాంతరంగా రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టు ప్రతిపాదన ఉంది.
ఈ రైలు పూర్తయితే తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోని రైలు మార్గాలతో అనుసంధానం సులభం అవుతుంది. ఈ మేరకు రీజనల్ రింగ్ రైలుకు అనుమతి ఇవ్వాలి. సముద్ర మార్గం లేని తెలంగాణకు వస్తువుల ఎగుమతులు, దిగుమతులు సులువుగా చేసేందుకు రీజనల్ రింగు రోడ్డు సమీపంలో డ్రైపోర్ట్ అవసరం. ఆ డ్రైపోర్ట్ నుంచి ఏపీలోని సముద్ర పోర్టులను కలిపేందుకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు, దానికి ఆనుకొని రైలు మార్గం మంజూరు చేయాలి.
– తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మీకత మూసీ నదితో ముడిపడి ఉంది. రాజధాని హైదరాబాద్ నగరం మధ్యలో ప్రవహిస్తున్న దృష్ట్యా.. మూసీ పునరుజ్జీవనానికి సహకరించాలి. ఈసా, మూసా నదుల సంగమంలో ఉన్న బాపూఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళనకు 27 ఎస్టీపీల నిర్మాణం, మూసీ రిటైనింగ్ వాల్స్, కరకట్టల నిర్మాణం, మూసీ–గోదావరి నదుల అనుసంధానంతో కలిపి మొత్తంగా ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లు ఆర్థిక సాయం అందజేయాలి. బాపూఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం 222.7 ఎకరాల రక్షణ భూములను బదిలీ చేసేందుకు సహకరించాలి.
– రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు 61 ఐపీఎస్ కేడర్ పోస్టులు రాగా.. 2015లో రివ్యూ తర్వాత మరో 15 పోస్టులు అదనంగా వచ్చాయి. సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు పెరగడం, రాష్ట్రంలో పెరిగిన పట్టణాలు, ఇతర అవసరాల దృష్ట్యా తెలంగాణకు అదనంగా 29 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయండి
– సెమీ కండక్టర్ల పరిశ్రమ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు తెలంగాణలో ఉన్నందున ఇండియా సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు అనుమతించాలి.
Comments
Please login to add a commentAdd a comment