డిన్నర్‌ పే ‘చర్చ’ | Intelligence report to state govt on Congress MLAs hold secret meeting | Sakshi
Sakshi News home page

డిన్నర్‌ పే ‘చర్చ’

Published Sun, Feb 2 2025 4:14 AM | Last Updated on Sun, Feb 2 2025 4:14 AM

Intelligence report to state govt on Congress MLAs hold secret meeting

హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఇటీవల కలిసిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 

డిన్నర్‌ చేద్దామంటూ సన్నిహిత ఎమ్మెల్యేలకు ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యే ఆహ్వానం  

డిన్నర్‌లో భాగంగా పిచ్చాపాటి కబుర్లు..మంత్రులకు నిధులెక్కువ ఎలా వెళతాయంటూ చర్చ  

ఓ మంత్రి తన వ్యవహార శైలితో పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారన్న పాలమూరు ఎమ్మెల్యే 

ఎమ్మెల్యేల డిన్నర్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్‌ నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో ఇప్పుడు ‘డిన్నర్‌ పే చర్చ’హాట్‌టాపిక్‌గా మారింది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఓ యువ ఎమ్మెల్యే తన సన్నిహిత ఎమ్మెల్యేలకు డిన్నర్‌ ఇవ్వడం, ఆ డిన్నర్‌కు వెళ్లిన ఎమ్మెల్యేలు పలు వివాదాస్పద అంశాలపై చర్చించడంతో కాంగ్రెస్‌ పార్టీలో ఏదో జరిగిపోతుందనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. ఈ ఎమ్మెల్యేల డిన్నర్‌పై ఇంటెలిజెన్స్‌ నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో నిర్వహించిన సుదీర్ఘ భేటీలో ఈ అంశం కూడా చర్చకు వచ్చిందని సమాచారం.  

మనం లేకపోతే.. వాళ్లున్నారా ? 
ఆ ఎమ్మెల్యే ఆహ్వనం మేరకు హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదారుగురు ఎమ్మెల్యేలు ఇటీవల డిన్నర్‌కు వెళ్లారు. ఈ డిన్నర్‌కు వెళ్లిన ఓ ఎమ్మెల్యే కథనం ప్రకారం.. డిన్నర్‌లో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రుల గురించి చర్చించుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిపాలన, మంత్రుల పనితీరు, ఎమ్మెల్యేలకు ఇస్తున్న నిధులు, మంత్రులతో సఖ్యత, ఓ కీలకశాఖకు చెందిన మంత్రి వ్యవహారశైలి తదితర అంశాలపై వారు మాట్లాడుకున్నారు.

మంత్రులు తమ నియోజకవర్గాలకు వేల కోట్ల రూపాయల నిధు లు తీసుకెళుతున్నారని, ఎమ్మెల్యేలకు మాత్రం నిధుల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఓ ఎమ్మెల్యే ఈ సందర్భంగా ప్రస్తావించారు. అసలు ఎమ్మెల్యేలు లేనిదే మంత్రులు ఎక్కడి నుంచి వస్తారని, ఎమ్మెల్యేలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యా నించినట్టు తెలిసింది. పాలమూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ప్రభుత్వంలోని కీలకశాఖకు చెందిన మంత్రి గురించిన అంశాన్ని లేవనెత్తారు.

విచ్చలవిడిగా ఆయన తన వ్యవహార శైలితో పార్టీకి చెడ్డపేరు తెస్తున్నారని, ఆయనపై తన పోరాటాన్ని ఆపేది లేదని, ఈ విషయంలో ఎంతవరకైనా వెళతానని ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యానించినట్టు తెలిసింది. కాంగ్రెస్‌ ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని, ఈ తరుణంలో పార్టీని, ప్రభుత్వాన్ని క్రమశిక్షణగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని వారు మాట్లాడుకున్నారు.  

విభేదాలు రానివ్వొద్దన్న సీఎం ! 
కాగా, ఎమ్మెల్యేల డిన్నర్‌ వ్యవహారం నిఘా వర్గా ల ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. శనివారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో జరిగిన మంత్రులతో భేటీలో ఈ అంశాన్ని ప్రస్తా వించినట్టు సమాచారం. ఎమ్మెల్యేలతో విభేదాలు రానివ్వొద్దని, వారితో గ్యాప్‌ రావడం ద్వారా పార్టీకి, ప్రభుత్వానికి నష్టం జరుగుతుందని, ఇన్‌చార్జ్‌ మంత్రులు ఆయా జిల్లాల ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటే బాగుంటుందని సూచించినట్టు సమాచారం. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య కూడా సమన్వయం అవసరమని సీఎం రేవంత్‌ మంత్రులకు దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement