సాక్షి,పరిగి: కేసీఆర్ కొడితే ఎలా ఉంటుందో రేవంత్ పాత గురువు, కొత్త బాస్‌లు రాహుల్,సోనియాగాంధీలకు తెలుసని, వారిని అడిగితే కేసీఆర్ దెబ్బ ఎలా ఉంటుందో చెబుతారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శనివారం(ఫిబ్రవరి1) పరిగిలో జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడారు.
‘కేసీఆర్ కర్ర లేకుండా నిలబడతారు. ముందు రేవంత్‌రెడ్డి కమీషన్ లేకుండా పాలించాలి. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు. నా సవాల్‌కు రేవేంత్‌రెడ్డి స్పందించడం లేదు. 71 సంవత్సరాల పెద్ద మనిషి నాయకుడిని పట్టుకొని కట్టె పట్టుకొని నిలబడమంటూ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి నిలబెట్టినవాడు కేసీఆర్ అనే విషయం గుర్తుంచుకో.
రేవంత్‌రెడ్డి హనీమూన్ పిరియడ్ ముగిసింది, రేవంత్‌కు ఇక పైన సినిమా చూపిస్తాం. కేసీఆర్ అసెంబ్లీకి రావడం కాదు రేవంత్ రెడ్డికి దమ్ముంటే లగచర్ల కి రావాలి. రేవంత్‌రెడ్డి వచ్చినా రాకున్నా కొడంగల్‌కి మాత్రం త్వరలో నేను వస్తున్నా..నీకు దమ్ముంటే ఆపు. రేవంత్ తన పోలీసు బలగంతో నన్ను ఎక్కడికక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నాడు.
కచ్చితంగా కొడంగల్ పోతాం నీ సంగతి చూస్తా. రేవంత్ గతంలో ప్రతిపక్ష నేతగా సిరిసిల్లతోపాటు మంత్రుల నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరగలేదా.. అప్పుడు ఇదే పోలీసులను పెట్టి సమావేశాలకు రక్షణ కల్పించిన విషయం రేవంత్ మర్చిపోయాడు. టికెట్ కొనకుండా లాటరీ గెలిచిన వ్యక్తి రేవంత్‌రెడ్డి. ఆయన కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రులు పనిచేసిన విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలి. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా బూతు పురాణం మానేసి పరిపాలన పైన దృష్టి సారించాలి’అని కేటీఆర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment