‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లు గుర్తేమిటంటే.. స్త్రీలు స్వేచ్ఛగా బయట కూడా మసలగలగడం’ అని గాంధీజీ అన్నారు. కొంచెం కొంచెం పరిస్థితి మారుతోంది. సీసీ కెమెరాలు పెడుతున్నారు కదా! కానీ భార్యల్ని భర్తలు పెట్టే చిత్రహింసల్ని ఏ కెమెరాలు కనిపెడతాయి? కన్నవాళ్లకు, ఉన్న ఊరికి, ఆఖరికి దేశానికి కూడా దూరమై భర్తతో పాటు పరాయి తీరాలకు చేరిన బాధిత మహిళలను కనిపెట్టుకుని ఉండేదెవరు? భర్తే దగా చేస్తే, భర్తే దూరం చేస్తే, భర్తే మోసం చేస్తే.. ఆ స్త్రీకి దిక్కెవరు? ఇవాళ ఎన్నారై డే. ప్రవాసీ భారతీయ దివస్. 2003 నుంచి యేటా జరుపుకుంటున్నాం. జనవరి 9నే ఎందుకు? దక్షిణాఫ్రికాలో ఎన్నారైగా ఉన్న గాంధీజీ 1915లో ఇదే రోజున ఇండియాకు తిరిగొచ్చారు. అందుకు. ఈ సందర్భంగా మాట్లాడుకోవలసిన మంచి విషయాలు చాలా ఉన్నాయి. అన్నిటికన్నా మంచి విషయం.. ఎన్నారై బాధిత భార్యల కోసం మన దేశం ఓ వెబ్‌సైట్‌ను రెడీ చేస్తోంది. అది మొదలైతే.. మన సిస్టర్స్ విదేశాల్లోనూ స్వేచ్ఛగా, నిర్భయంగా ఉండగలరు.
ఎన్నారై వధువుల సంక్షేమం, సంరక్షణల కోసం భారత ప్రభుత్వం ఒక వెబ్‌సైట్ ప్రారంభించబోతోంది. కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ దీనిని నిర్వహిస్తుంది. భార్యను వెళ్లగొట్టినవారిని ఈ సైట్ గుర్తిస్తుంది. భార్యను మోసం చేసి పరారైనవారిని పట్టితెస్తుంది. భార్యపై గృహహింసకు పాల్పడుతున్నవారిని చట్టానికి పట్టిస్తుంది. దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నారై పెళ్లి జరిగినా అక్కడి రిజిస్ట్రార్ వరుడి పూర్తి వివరాలను ఈ వెబ్‌సైట్‌కు అప్‌లోడ్ చేస్తే తప్ప మ్యారేజ్ సర్టిఫికెట్ బయటికి వచ్చేందుకు వీలు లేకుండా ఇప్పటికే ఒక సాఫ్ట్‌వేర్ కూడా సిద్ధం అయింది! పూర్తి వివరాలు.. అంటే.. వరుడి వృత్తి, ఉద్యోగం, చిరునామాలు, ఆ ఫోన్ నెంబర్లు, కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఫోన్ నెంబర్లు, మెయిల్ ఐడీలు, బ్యాంక్ అకౌంట్‌లు, ఇతర సోషల్ మీడియా అకౌంట్‌లు.. ఇలా కీలకమైనవన్నీ.బాధితురాలు ఈ సైట్‌లో ఫిర్యాదు ఇవ్వగానే ఆ వివరాల ఆధారంగా నిందితుడు ఎక్కడున్నా ప్రత్యేక బృందాలు గాలించి పట్టుకుంటాయి. ఇందుకోసం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖ సమన్వయంతో పనిచేస్తాయి. ఆ శాఖకు (మేనకా గాంధీ), ఈ శాఖకు (సుష్మా స్వరాజ్) ఇద్దరూ మహిళా మంత్రులే కాబట్టి బాధితురాలికి న్యాయం జరిగే విషయంలో అలసత్వానికి, జాప్యానికి అవకాశమే ఉండదు. ఈ రెండు శాఖలకు న్యాయ శాఖ సహకారం ఉంటుంది.
ఎవిడెన్స్ యాక్టులో మార్పులు!
ఎన్నారై బాధిత భార్యల కోసం అందుబాటులోకి తెస్తున్న వెబ్‌సైట్‌లో.. భర్తలకు ఇచ్చే కోర్టు సమన్ల కాపీలను కూడా అప్‌లోడ్ చెయ్యాలని సుష్మా స్వరాజ్ ఆలోచిస్తున్నారు. అందుకు వీలుగా ‘ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు’లో సవరణలు చేయాలని సుష్మ నేతృత్వంలోని నిపుణుల బృందం న్యాయ శాఖను కూడా సంప్రదించింది.సవరణకు న్యాయ శాఖ ఒప్పుకుంటే.. ఫారిన్‌లో ఉన్న ఎన్నారై భర్తలను లీగల్‌గా డీల్ చెయ్యడం మన అధికారులకు మరింత సులభం అవుతుంది. (రెండు దేశాలు న్యాయ సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటాయి కనుక). దీంతో న్యాయశాఖకు ఇంకో ఆలోచన వచ్చింది. ‘మేమెలాగూ దేశంలోని ప్రతి పెళ్లినీ తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలని చట్టాన్ని తెచ్చే యోచనలో ఉన్నాం కనుక, పనిలో పనిగా ప్రతి ఎన్నారై మ్యారేజీని కచ్చితంగా వారం లోపు రిజిస్టర్ చేయాలన్న నిబంధనను చేరిస్తే బాగుంటుందన్న ప్రతిపాదనను మీరు మాకు పంపవచ్చు కదా’ అని స్త్రీ,శిశు సంక్షేమ శాఖకు సలహా ఇచ్చింది. అదొకటి డిస్కషన్‌లో ఉంది.
►3,328 (2015 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వివిధ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలకు అందిన ఎన్నారై భార్యల ఫిర్యాదులు మొత్తం. వీటిల్లో భార్యలపై భర్తలు ఇచ్చినవీ ఒకటీ అరా ఉన్నాయి.)
►మూడు ముళ్ల బంధానికి మూడు శాఖల కాపలా!
►3,268 (పరిష్కారం అయిన ఫిర్యాదుల సంఖ్య)
పరిష్కార విధానాలు
►కౌన్సెలింగ్
► గైడెన్స్
►న్యాయపరమైన సలహాలు
►ఎన్నారై భర్తలకు సమన్లు (విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వి.కె.సింగ్ పార్లమెంటుకు ఇచ్చిన సమాచారం అధారంగా)
►ఎన్నారై భార్యల నుంచి తరచూ వచ్చే ఫిర్యాదులు
►ఇండియాలో పెళ్లి జరిగిన వెంటనే వరుడు అదృశ్యమైపోవడం
►పెళ్లి చేసుకుని తీసుకెళ్లాక, భార్యను ఇండియా రానివ్వకపోవడం.
►భార్య పాస్‌పోర్ట్‌ను ఆమెకు అందుబాటులో లేకుండా చేయడం.
►భార్యను ఆ పరాయి దేశంలోనే వదిలేసి భర్త వెళ్లిపోవడం.
►భార్యను ఇండియా పంపించి, పిల్లల్ని తనతోనే ఉంచేసుకోవడం.
(ఇవి కాక.. లైంగిక చిత్రహింసలు, అదనపు కట్నం కోసం వేధింపులు)
Comments
Please login to add a commentAdd a comment