అరచేతిలో ఎన్నికల సమస్త సమాచారం
యాప్స్, వెబ్‌సైట్లను అందుబాటులోకి తెచ్చిన ఈసీ
అందుబాటులో కేవైసీ, సీ విజిల్, సువిధ, సక్షం, ఓటర్ టర్నౌట్ తదితరాలు
ఓటరు నమోదు నుంచి పోలింగ్ వరకు అప్‌డేట్స్
పారదర్శకంగా, సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం సాంకేతికతకు పెద్దపీట వేస్తోంది. ఎన్నికల ప్రక్రియలో పౌరులకు అవసరమైన ప్రతి సమాచారాన్నీ, అవసరమైతే స్పందించే సౌకర్యాన్నీ అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్ ద్వారా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం కల్పించింది.
అభ్యర్థుల గుణగణాలు తెలుసుకునేందుకు ‘కేవైసీ’, ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు ‘సీ విజిల్’, బరిలో నిలిచే అభ్యర్థులు నామినేషన్లు, ప్రచార అనుమతుల కోసం ‘సువిధ’.. ఇలా ఎన్నో యాప్‌లు, వైబ్‌సైట్లు. వీటి ద్వారా ఓటరు నమోదు నుంచి మొదలుపెడితే ఫిర్యాదులు, నామినేషన్లు, ప్రచార అనుమతులు, కౌంటింగ్, ఫలితాల వరకూ ప్రతీదీ ఇంట్లోనే కూర్చుని తెలుసుకునే వీలుండటం గమనార్హం.
ఓటు నమోదు చేసుకోండి
కొత్త ఓటు నమోదు, ఓటు బదిలీ, తప్పులు సరి చేసుకునేందుకు ‘ఓటర్ హెల్ప్‌లైన్’ఉపయోగపడుతుంది. ఓటరు గుర్తింపు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నియోజకవర్గాల వారీగా ఓటరు జాబితాలను పొందవచ్చు.
అభ్యర్థులెవరో తెలుసుకోండి
నో యువర్ క్యాండిడేట్ (కేవైసీ) ద్వారా ఏ నియోజకవర్గంలో ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారో తెలుసుకోవచ్చు. అభ్యర్థుల పూర్తి వివరాలతో పాటు నామినేషన్ల సమయంలో అభ్యర్థులు దాఖలు చేసే అఫిడఫిట్లు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని రూపొందించింది. ఇందులో అభ్యర్థి విద్యార్హతలు, నేర చరిత్ర, స్థిరచరాస్తులు వంటి సమాచారం ఉంటుంది.
‘సువిధ’తో సులభం
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ వేయడం, ప్రచార అనుమతులు పొందడం ‘సువిధ’తో సులభతరం అవుతుంది. అభ్యర్థులు ఇంట్లో కూర్చొని తొలుత ఆన్‌లైన్‌లోనే నామినేషన్ పత్రాలను దాఖలు చేయవచ్చు. ఎన్నికల కమిషన్ సూచించిన పత్రాలు ఆన్‌లైన్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. ఆస్తుల ఆఫిడవిట్ పత్రాలు, నామినేషన్‌ను బలపరిచేందుకు పది మంది ఇతరుల వివరాలను నమోదు చేయాలి. కావాల్సిన పత్రాలు సమర్పించిన తర్వాత నామినేషన్ దాఖలు చేసేందుకు నిర్ణీత సమయంలో స్లాట్ బుక్ చేసుకోవాలి.
‘సక్షం’తో చేయూత
పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేయలేని వారు ‘సక్షం’యాప్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆయా ఓటర్ల వివరాలను అధికారులు పరిశీలించి పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చేందుకు రవాణా సదుపాయం కల్పిస్తారు. వారికి ప్రత్యేకంగా ఒక స్వచ్చంధ సహాయకుడిని కూడా అందుబాటులో ఉంచుతారు. దివ్యాంగులకు మూడు చక్రాల కుర్చీ వంటి సదుపాయాలను సమకూరుస్తారు. అబ్జర్వర్, ఈఎస్‌ఎంఎస్ పోలీసులు, వ్యయ పరిశీలకుల కోసం అభివృద్ధి చేసిన యాప్ ‘అబ్జర్వర్’.
ఎన్నికల పరిశీలకులు నివేదికలు సమర్పించడానికి, నియోజకవర్గానికి సంబంధించిన సమాచారాన్ని యాక్సెస్ చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. సీ విజిల్ కేసులను రిపోర్ట్ చేయడానికి అనుమతిస్తుంది. ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈఎస్‌ఎంఎస్) యాప్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన కేసుల వివరాలు, సీజ్ చేసిన నగదు, మద్యం, ఇతరత్రా వస్తువుల డేటాను డిజిటల్ రూపంలో పొందవచ్చు.
ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయండి
ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కండాక్ట్) ఉల్లంఘనలపై ఫిర్యాదు చేసేందుకు సీ విజిల్ ఉపయోగపడుంది. పార్టీలకు అతీతంగా ఎవరు అవినీతికి పాల్పడినా ఈ యాప్‌లో ఫిర్యాదు చేయవచ్చు. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి భిన్నంగా ఉన్న దేనిపైనైనా ఫిర్యాదు చేయవచ్చు.
డబ్బు పంపకాలు, ఉచితాలు, బహుమతుల అందజేత, రెచ్చగొట్టే ప్రకటనలు, మద్యం, మత్తు పదార్థాల పంపిణీ, ఓటర్లను ప్రభావితం చేయడం, ఎన్నికల రోజున ఓటర్లను వాహనాలలో తరలించడం లాంటివి ఫొటో, వీడియో లేదా ఆడియో రూపంలో రికార్డ్ చేసి అప్‌లోడ్ చేయాలి. ఫిర్యాదు చేసిన 5 నిమిషాల్లో ఎన్నికల అధికారులు రంగంలోకి దిగుతారు. దీనిపై విచారణ చేపట్టి 100 నిమిషాల్లో సదరు ఫిర్యాదులపై కచ్చితమైన చర్యలు తీసుకుంటారు.
ఎప్పటికప్పుడు ‘ఓటర్ టర్నౌట్’
కేంద్ర ఎన్నికల సంఘం అభివృద్ధి చేసిన యాప్‌లలో ఈ ‘ఓటర్ టర్నౌట్’కీలకమైంది. రియల్ టైం డేటా ఆధారంగా రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం వారీగా సుమారు ఓటింగ్ శాతాన్ని అంచనా వేస్తారు. ఈ డేటాను సోషల్ మీడియాలో పంచుకోవడానికి వినియోగదారులకు అనుమతి ఉంది. నిర్దిష్టమైన ప్రాంతంలో ఓటింగ్ శాతాన్ని అంచనా వేసే వీలుండటంతో ఇది అభ్యర్థులకు, మీడియా సంస్థలకు ఉపయుక్తకర సాధనం. అయితే ఇది కేవలం శాసనసభ, లోకసభ, ఉప ఎన్నికల సమయాలలో మాత్రమే యాక్టివేట్ అవుతుంది.
‘నోడల్’ మేడ్ ఈజీ
ఎన్నికల సమయంలో నోడల్ అధికారులు అనుమతుల ప్రక్రియను సులభతరంగా, సమర్థవంతంగా నిర్వహించడానికి ‘ఎన్‌కోర్ నోడల్’యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ ద్వారా అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రచారానికి సంబంధించి వివిధ కార్యకలాపాలను, ర్యాలీలు, బహిరంగ సభలు వంటి వాటికి సంబంధించిన అనుమతులు జారీ చేయవచ్చు. అభ్యంతరాలు తెలపొచ్చు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితిగతులు, సమర్పించాల్సిన పత్రాలకు సంబంధించి అభ్యర్థులకు నోటిఫికేషన్ పంపవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment