సాక్షి, హైదరాబాద్: ఇన్‌స్టంట్ రుణాల పేరుతో పలువురిని ఆకర్షించి, వడ్డీ, పెనాల్టీగా అధిక మొత్తం వసూలు చేస్తూ, చెల్లించలేకపోయిన వారి పరువు, ప్రాణాలు తీస్తున్న మైక్రో ఫైనాన్స్ యాప్స్ కేసుల దర్యాప్తును హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సాంకేతిక ఆధారాలను బట్టి హైదరాబాద్‌లో మూడు, గుర్గావ్‌లో ఒక కాల్ సెంటర్ ఆచూకీ కనిపెట్టారు. సోమవారం వీటిపై దాడి చేసిన ప్రత్యేక బృందాలు.. మొత్తం 1,100 మంది ఉద్యోగులుగా ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ యాప్స్ వెనుక చైనా కంపెనీలే ఉన్నట్లు భావిస్తున్నారు. దీన్ని నిర్థారించడం కోసం సాంకేతిక సమాచారం ఇవ్వాల్సిందిగా ఆల్ఫాబెట్ ఐఎన్సీ. సంస్థకు ఈ–మెయిల్ పంపారు. విదేశాల్లో ఉన్న సూత్రధారులే తెర వెనుక ఉండి ఈ యాప్స్ నడిపిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.
డైరెక్టర్లు అంతా డమ్మీలే...
వివిధ రకాల ఆన్‌లైన్ వ్యాపారాల పేర్లతో భారత్‌లో కంపెనీలు రిజిస్టర్ చేయిస్తున్న చైనీయులు ఎలాంటి అనుమానం రాకుండా వాటిలో భారతీయుల్నే డైరెక్టర్లుగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ డైరెక్టర్లలో చిన్నచిన్న వ్యాపారులు, నిరుపేదలు కూడా ఉన్నారు. రూ.10 వేల నుంచి రూ.15 వేల జీతాలకు ఆశపడుతున్న వారిని ఎంపిక చేసుకుని సాంకేతికంగా డైరెక్టర్లుగా చేస్తున్నారు. వీరందరినీ డమ్మీలుగా ఉంచుతున్న చైనీయులు ఆయా యాప్స్ నిర్వహణ, పర్యవేక్షణకు తమ దేశీయుల్నే నియమించుకుంటున్నారు. (లోన్‌యాప్: తల్లి ఫొటోలు మార్ఫింగ్)
ఇండోనేసియా నుంచి వస్తున్న ఆదేశాలు...
ఈ పాత్రధారులకు లోన్ యాప్స్ నిర్వహణ, విధివిధానాల్లో మార్పులు, అమలుకు సంబంధించి విదేశాల్లోని సూత్రధారుల నుంచే ఆదేశాలు అందుతున్నాయి. దీనికోసం వాట్సాప్ సహా వివిధ రకాల యాప్స్‌ను వాడుతున్నారు. అయితే వీటి ద్వారా చైనా నుంచి నేరుగా ఆదేశాలిచ్చే ఆస్కారం లేకపోవడంతో ఇండోనేసియా, మలేసియా తదితర దేశాల్లో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడ ఉండే చైనీయులిచ్చే ఆదేశాల ప్రకారం.. దేశంలో ఉంటున్న పాత్రధారులు పనిచేస్తున్నారని పోలీసులు గుర్తించారు.
‘వేధింపుల’కోసం కాల్‌సెంటర్లు...
తమ యాప్స్ నుంచి లోన్లు తీసుకుని, తిరిగి చెల్లించడంలో విఫలమైన వారిని ‘వేధించడానికి’ సూత్రధారులు కాల్‌సెంటర్లను ఎంచుకుంటున్నారు. ఇక్కడి పాత్రధారులకు ఆదేశాలు జారీ చేస్తూ కొన్ని కాల్‌సెంటర్లతో ఒప్పందాలు చేసుకునే బాధ్యతల్ని అప్పగిస్తున్నారు. ఇలా దాదాపు 30 వరకు యాప్స్ నిర్వాహకులు హైదరాబాద్‌లో 3, గుర్గావ్‌లో ఒక కాల్ సెంటర్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీళ్లకు పాత్రధారుల నుంచి ‘డిఫాల్టర్స్ జాబితాలు’అందుతాయి. వాటి ఆధారంగా వారితో పాటు కుటుంబీకులు, స్నేహితులు పరిచయస్తులకు కాల్స్ చేయడం... వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ ద్వారా సందేశాలు పంపడం, ప్రత్యేకంగా గ్రూప్‌లు క్రియేట్ చేసి వేధించడం ఈ కాల్‌సెంటర్స్‌లోని ఉద్యోగుల పని. (చదవండి: ఈ దోపిడీ మరో ‘దృశ్యం’ )
రెండు ప్రాంతాల్లో వరుస దాడులు...
ఈ లోన్ యాప్స్ వేధింపులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో 12 కేసులు నమోదయ్యాయి. బాధితులకు వచ్చిన వేధింపు కాల్స్, సందేశాలకు సంబంధించిన ఫోన్ నంబర్లను దర్యాప్తు అధికారులు సేకరించారు. ఈ నంబర్లు రిజిస్టర్ అయి ఉన్న చిరునామాలు, అవి యాక్టివేట్ అయి ఉన్న లొకేషన్స్‌ను సేకరించారు. హైదరాబాద్ బేగంపేటలో రెండు ప్రాంతాల్లో ఉన్న కాల్‌సెంటర్లతో పాటు పంజగుట్టలో ఒక చోట, గుర్గావ్‌లో రెండు చోట్ల ఉన్న కాల్ సెంటర్లపై సోమవారం దాడులు చేశారు. వీటిలో పని చేస్తున్న 1,100 మంది ఉద్యోగులతో పాటు నిర్వాహకుల్ని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి తమకు వివిధ యాప్స్ ద్వారా అందుతున్న ఆదేశాలు, జాబితాల ఆధారంగా వీళ్లు పని చేస్తున్నట్లు తేల్చారు.
హోస్టింగ్స్ వివరాలు తెలిస్తే కొలిక్కి...
ఈ తరహా లోన్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్స్‌లో 250 ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వీటి నగదు లావాదేవీలన్నీ బ్యాంకు ఖాతాలతో పాటు గూగుల్ పే తదితర వ్యాలెట్స్ ద్వారా జరుగుతున్నట్లు తేలింది. గూగుల్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆల్ఫాబెట్ ఐఎన్సీ. అధీనంలో ఉన్నట్లు గుర్తించారు. వీరి నుంచి సమాచారం సేకరిస్తే ఆయా యాప్స్‌ను ఎవరు? ఎక్కడ నుంచి హోస్ట్ చేస్తున్నారు? ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు ఎవరి పేరుతో ఉన్నాయి? తదితర వివరాలు తెలుస్తాయి. ఈ నేపథ్యంలో వాటిని అందించాల్సిందిగా కోరుతూ ఆల్ఫాబెట్ సంస్థలకు ఈ–మెయిల్ పంపారు. అక్కడ నుంచి సమాధానం వస్తే ఈ కేసుల్లో అనేక విషయాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు.
పోలీసుల అదుపులో ఇద్దరు యూపీవాసులు
రాజేంద్రనగర్: ఇన్‌స్టంట్ లోన్ యాప్ ఊబిలో చిక్కి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సునీల్ కేసులో సైబరాబాద్ క్రైమ్, రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్య చేసుకున్న సునీల్ సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్ డేటాతో పాటు యాప్‌లను గుర్తించారు. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. రెండు టీమ్‌లు బెంగళూర్‌తో పాటు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు కాల్ సెంటర్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో వీటిపై పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ కేసులో కొంత పురోగతి సాధించినట్లు సమాచారం. పూర్తి సాంకేతికత ఆధారాలను సేకరించి ఆ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరినీ సైబర్‌క్రైమ్ పోలీసులు రాజేంద్రనగర్ పీఎస్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ కేసులో ప్రమేయం ఉన్న మిగతా వారిని అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment