సాక్షి, హైదరాబాద్: తమ వద్ద అప్పు తీసుకుని సకాలంలో తీర్చలేకపోయిన డిఫాల్టర్స్‌ను వేధించడానికి అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ వేర్వేరు స్టేజ్‌ల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన స్టేజ్–1 కాల్ సెంటర్లలోని ఉద్యోగులు కేవలం రిమైండర్స్ మాత్రమే పంపిస్తుంటారు. గుర్గావ్‌లో ఉండే స్టేజ్–2 కాల్ సెంటర్లలోని వారు వేధింపు కాల్స్ చేయడం, సందేశాలు పంపడం చేస్తుంటాయి. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్) కేంద్రంగా పనిచేసే స్టేజ్–3 సెంటర్ల నుంచి డిఫాల్టర్లతో పాటు వారి సంబంధీకులకు నకిలీ లీగల్ నోటీసులు, అభ్యంతరకర, అసభ్య సందేశాలు వెళ్తుంటాయి. ఈ యాప్స్ కేసులకు సంబంధించి సిటీ సైబ ర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్, గుర్గావ్‌ల్లోని కాల్ సెంటర్లపై దాడులు చేసి 11 మందిని అరెస్టు చేశారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు.
ఉద్యోగులనే డైరెక్టర్లుగా..
కలర్ ప్రిడెక్షన్ తరహా మరికొన్ని గేమింగ్స్ యాప్స్ నిర్వహించిన చైనా కంపెనీలు వాటిలో డైరెక్టర్లుగా తమ దేశీయుల్ని నియమించుకున్నాయి. అయితే ఈ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ దగ్గరకు వచ్చేసరికి వీటికి సంబంధించిన కాల్ సెంటర్లలో ఉద్యోగుల్నే డైరెక్టర్లుగా ఉంచుతున్నాయి. ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి వాట్సాప్ ద్వారా ఆదేశాలు పంపుతూ వీటిని రన్ చేస్తున్నాయి. గుర్గావ్‌లోని ఉద్యోగ్ విహార్‌లో ఉన్న 2, హైదరాబాద్‌లోని బేగంపేట, పంజగుట్టల్లోని 3 కాల్ సెంటర్లు 30 యాప్స్ కోసం పనిచేస్తున్నాయి. ఇవన్నీ లియోఫంగ్ టె క్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, హాట్‌ఫుల్ టెక్నాలజీస్ ప్రై.లి., పిన్ ప్రింట్ టెక్నాలజీస్ ప్రై.లి., నబ్లూమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో బెంగళూరులో రిజిస్టరైన సంస్థల అధీనంలో నడుస్తున్నాయి. పంజగుట్టలోని కాల్ సెంటర్‌లో హెచ్‌ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న జీవన జ్యోతితో పాటు సెల్వరాజ్ సింగిలు లియోఫంగ్, హాట్‌ఫుల్‌లకు, రవికుమార్ మంగల, వెంకట్‌లు పిన్ ప్రింట్, నబ్లూమ్‌లకు డైరెక్టర్లుగా ఉన్నారు. (చదవండి: లోన్‌యాప్స్ కేసులో ఆసక్తికర విషయాలు)
బెదిరింపులు.. బూతులతో..
అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తూ, డిఫాల్టర్లను అడ్డంగా వేధిస్తున్న అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ నిర్వాహకులు కాల్ సెంటర్ల ఉద్యోగుల ద్వారా వేస్తున్న వేషాలు అన్నీఇన్నీ కావు. బాధితుల్ని బెదిరించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఇటీవల నగరానికి చెందిన ఓ బాధితుడు వీరి వేధింపులు తట్టుకోలేక ఫిర్యాదు చేసేందుకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణా వద్దకు వచ్చాడు. అదే సమయంలో సదరు యాప్‌కు చెందిన కాల్ సెంటర్ నుంచి డబ్బు కట్టాలని, లేదంటే ‘తీవ్ర పరిణామాలు’ ఉంటాయని వాట్సాప్‌లో సందేశం వచ్చింది. దీనికి సమాధానంగా బాధితుడు తాను సైబర్ క్రైమ్ ఠాణా వద్ద ఉన్నాననే దానికి సూచికంగా ఆ స్టేషన్ బోర్డును ఫొటో తీసి షేర్ చేశాడు. ఇది చూసిన కాల్ సెంటర్ ఉద్యోగి అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. (చదవండి: ఆపరేషన్ ఫ్రం ‘చైనా’..!)
వెనకున్నది చైనీయులే..!
దాదాపు నాలుగైదు నెలల క్రితం ఏర్పాటైన ఈ కాల్ సెంటర్ల వెనుక చైనీయులే ఉన్నారు. అప్పట్లో హైదరాబాద్‌కు వచ్చిన చైనా జాతీయురాలు కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి వెళ్లింది. అలాగే గుర్గావ్‌లోని సెంటర్లకు నేతృత్వం వహించిన మరో చైనీయుడి పాస్‌పోర్టు జిరాక్స్ కాపీ అధికారుల తనిఖీల్లో లభ్యమైంది. ఈ రెండింటితో పాటు ఇతర ఆధారాల నేపథ్యంలోనూ ఈ అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ వెనుక చైనా జాతీయుల ప్రమేయమున్నట్లు అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్‌లోని కాల్ సెంటర్లలో 600 మంది, గుర్గావ్‌లోని వాటిల్లో 500 మంది టెలికాలర్స్‌గా ఉన్నారు. వీళ్లు కార్పొరేట్ ఆఫీసుల మాదిరిగా షిఫ్ట్‌ల వారీగా, 24 గంటలూ విధులు నిర్వర్తిస్తూ జకార్తా నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారు. ఈ సంస్థల్లోని ఉద్యోగులు ప్రతి 2–3 నెలలకు మారిపోతుండటం వెనుక ఏమైనా కారణముందా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు.
రకరకాల ఖాతాల నుంచి లావాదేవీలు..
మైక్రో ఫైనాన్స్ యాప్స్ నిర్వాహకులు తమ ఆర్థిక లావాదేవీలూ తేలిగ్గా బయటపడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ కాల్ సెంటర్లలో పనిచేసే వారికి నేరుగా జీతాలు చెల్లించట్లేదు. దీనికోసం ఓ ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేశాయి. వారికి మరో థర్డ్ పార్టీ నుంచి యూఐపీ, నగదు రూపంలో డబ్బు పంపిస్తున్నారు. రకరకాల ఖాతాల నుంచి జరుగుతున్న ఈ లావాదేవీలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమికంగా 30 యాప్స్‌కు సంబంధించిన 10 బ్యాంక్ ఖాతాలు, 80 వ్యాలెట్స్ గుర్తించారు. వీటిలోకి నగదు రాకపోకల్ని అధ్యయనం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా కార్యకలాపాలు నడుపుతున్న ఈ సంస్థలు 20 నుంచి 50 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి హోస్ట్ అవుతున్నాయి. గూగుల్ నిబంధనల ప్రకారం రీ పేమెంట్ పీరియడ్ 60 రోజులు. అయితే ఈ యాప్స్ మాత్రం వారం నుంచి పక్షం రోజుల్నే గడువుగా నిర్దేశించాయి.
అందరూ నిందితులు కాదు..
ఈ యాప్స్ వేధింపులకు సంబంధించి సిటీలో 16 కేసులు నమోదు చేశారు. వీటికి సంబంధించి మంగళవారం గుర్గావ్, సిటీల్లోని కాల్ సెంటర్ల నుంచి బిందురాణి, జ్యోతి మాలిక్, అమిత్, రమణ్‌దీప్ సింగ్, ప్రభాకర్ ధంగ్వాల్, మధుబాబు సింగి, మనోజ్‌కుమార్ సింగి, మహేశ్ కుమార్ సింగి, తరుణ్, పవన్‌కుమార్, జీవన్ జ్యోతిలను అరెస్టు చేశారు. దాదాపు 700 ల్యాప్‌టాప్స్‌ను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు.ఈ యాప్స్‌తో పాటు వాటి లావాదేవీలకు సంబంధించిన వ్యాలెట్స్ హోస్టింగ్‌కు సంబంధించి గూగుల్ సేవలు అందించే ఆల్ఫాబెట్ ఇంక్ సంస్థకు ఈ–మెయిల్ ద్వారా లేఖ రాశారు. వారిచ్చే సమాధానం ఆధారంగా ఈ వ్యవహారాల్లో సూత్రధారులపై స్పష్టత వచ్చే అవకాశముంది. మరోపక్క ఈ కాల్‌సెంటర్లలో పనిచేస్తున్న అందరూ నిందితులు కాదని.. ఎవరైతే అసభ్య సందేశాలు పంపి ఉంటారో వారినే అరెస్టు చేస్తామని సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ నుంచి వేధింపులు ఎదురైతే ‘100’కు లేదా సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌లో లేదా స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కొత్వాల్ అంజనీకుమార్ కోరారు. ఈ తరహా కేసులు దేశంలోనే తొలిసారని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమ దందాలో ఎవరూ చిక్కవద్దని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment