మంచిర్యాల: లోన్‌ యాప్‌ కీచక పర్వం.. వివాహిత ఆత్మహత్య | Mancherial Loan App Harassment Married Woman Commits Suicide | Sakshi
Sakshi News home page

మంచిర్యాల: లోన్‌ యాప్‌లో కీచకుడు.. మార్ఫింగ్‌ ఫొటోలతో వివాహిత ఆత్మహత్య

Published Wed, May 18 2022 6:36 PM | Last Updated on Thu, May 19 2022 2:10 AM

Mancherial Loan App Harassment Married Woman Commits Suicide - Sakshi

సాక్షి, మంచిర్యాల/ మంచిర్యాల క్రైం: మొబైల్‌ లోన్‌ యాప్‌ సంస్థ వేధింపులకు ఓ వివాహిత బలైంది. ఆమె చనిపోయిన తరవాత కూడా పదేపదే కాల్స్‌ చేస్తూ, ఆమె మృతదేహం ఫొటోలు చూపించాలని యాప్‌ నిర్వాహకులు ఒత్తిడి చేయడం గమనార్హం. ఈ దారుణం మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. మంచిర్యాల పట్టణంలోని గోపాల్‌వాడకు చెందిన వివాహిత బొల్లు కళ్యాణి(30) ‘హలో రూపీ లోన్‌’యాప్‌ ద్వారా రూ.5 వేల రుణం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపూర్‌కు చెందిన ఆమె భర్త బెంగళూరులోని ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. అక్కడి నుంచే 20 రోజుల క్రితం ఆమె మంచిర్యాలకు వచ్చింది. అప్పటి నుంచి లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు ఎక్కువకావడంతో ఇటీవల రెండు దఫాలుగా రూ.20 వేలు చెల్లించింది. అయినా ఆ చెల్లింపు వివరాలు అప్‌డేట్‌ కాలేదంటూ పదేపదే ఆమెను వేధించసాగారు. వేర్వేరు నంబర్లతో రోజుకు వందల సార్లు ఆమెకు కాల్స్‌చేస్తూ అసభ్య పదజాలంతో దూషించేవారు.  

ఫోన్‌కాల్‌ వస్తోందంటే వణికిపోయి.. 
కాల్స్‌ మాట్లాడాలంటే భయంతో వణికిపోయిన కళ్యాణి కొన్నిసార్లు ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. దీంతో వాట్సాప్‌లో ఆమె ముఖాన్ని న్యూడ్‌ ఫొటోలతో మార్ఫింగ్‌ చేసి ఆమెకే పంపి, వీటిని అందరికీ షేర్‌ చేస్తామని బెదిరించేవారు. దీంతో భయాందోళన చెందిన కళ్యాణి ఈ నెల 16న హెయిర్‌ డై తాగి ఆత్మహత్యకు యత్నించింది. రెండ్రోజులు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొంది 17న సాయంత్రం డిశ్చార్జి అయింది. మళ్లీ అదే తీరుగా యాప్‌ నిర్వాహకుల వేధించడం మొదలుపెట్టారు. తన ఆరోగ్యం బాగాలేదని, ఇబ్బంది పెట్టొదని బతిమిలాడినా వారు వినిపించుకోలేదు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కళ్యాణి బుధవారం ఇంట్లోని బాత్‌రూమ్‌లోని షవర్‌కు శాలువాతో ఉరేసుకుంది. మరోవైపు ఆమె చనిపోయిందనే విషయాన్ని నమ్మకుండా యాప్‌ నిర్వాహకులు పదేపదే కాల్స్‌ చేశారు. కనికరం లేకుండా ఆమె మృతదేహం ఫొటోలు పంపాలంటూ కుటుంబసభ్యులను ఒత్తిడి చేశారు. అయితే భర్త, అత్తింటివారు తమ కూతురిని డబ్బుల కోసం వేధించడంతోనే యాప్‌ లోన్‌ తీసుకోవాల్సి వచ్చిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాగా, హలో రూపీ లోన్‌ యాప్‌తో పాటు మరో ఐదారు యాప్‌ల నుంచి కూడా ఆమె రుణాలు తీసుకున్నట్టు తెలుస్తోందని పోలీసులు అంటున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement