Microfinance institution
-
కుటుంబాలకు మరిన్ని రుణాలు!
కోల్‌కతా: కుటుంబాల రుణ అవసరాల పరంగా మరింత విస్తరించి, తమ పంపిణీల పోర్ట్‌ఫోలియోను వృద్ధి చేసుకోడానికి సూక్ష్మ ఆర్థిక సంస్థలు (ఎంఎఫ్ఐలు) దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ నెట్వర్క్ (ఎంఎఫ్ఐఎన్) సీఈఓ, డైరెక్టర్ అలోక్ మిశ్రా ఈ విషయాన్ని వెల్లడించారు. దేశంలో ప్రస్తుతం 7.3 కోట్ల తక్కువ ఆదాయ రుణగ్రహీతలు ఉన్నారని, వీరు నాలుగు లక్షల కోట్ల రూపాయల బకాయి ఉన్నారని ఆయన వెల్లడించారు. ఎంఎఫ్ఐ రంగానికి రూ. 13 లక్షల కోట్ల పోర్ట్‌ఫోలియో విస్తరణ సామర్థ్యం ఉందని ఆయన పేర్కొంటూ, ఈ నేపథ్యంలో వృద్ధికి భారీ అవకాశం ఉందని అన్నారు. ఒక్క పశి్చమ బెంగాల్లో 65 లక్షల మంది రుణగ్రహీతలకు సంబంధించి మొత్తం రూ. 35,000 కోట్ల రుణ బకాయిలు ఉన్నాయని అన్నారు. మొత్తం పోర్ట్‌ఫోలియోలో తొమ్మిది శాతం పశ్చిమ బెంగాల్‌కు చెందినవేనని చెప్పారు. లఘు ఎంఎఫ్ఐలకు రీఫైనాన్సింగ్ కోసం మాత్రమే ఉద్దేశించిన ఒక ప్రత్యేక ఆర్థిక సంస్థ ఏర్పాటును ఈ రంగం కోరుతున్నట్లు ఆయన వెల్లడించారు. అసోసియేషన్ ఆఫ్ మైక్రోఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఏఎంఎఫ్ఐ)పశి్చమ బెంగాల్ విభాగం ఈ నెల 22వ నిర్వహించనున్న 8వ ఈస్టర్న్ ఇండియా మైక్రోఫైనాన్స్ సమ్మిట్ సందర్భంగా అలోక్ మిశ్రా ఎంఎఫ్ఐ రంగానికి సంబంధించి ఈ కీలక అంశాలను వెల్లడించారు. ఈ రంగానికి చెందిన మరికొందరు చెబుతున్న అంశాలు ఇవీ... ► ప్రస్తుతం దేశంలో ఎంఎఫ్ఐ కవరేజీ తక్కువగా ఉందని ఆరోహన్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఎండీ మనోజ్ నంబియార్ తెలిపారు.ఈ రంగం మరింత విస్తరించాల్సి ఉందని పేర్కొన్నారు. ► చారిత్రాత్మకంగా ఎంఎఫ్ఐ రంగంలో మొండిబకాయిల (ఎన్పీఏ) సగటు స్థాయిలు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నాయని వీఎఫ్ఎస్ క్యాపిటల్ ఎండీ కులదీప్ మైథీ తెలిపారు. ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధిలో ఎంఎఫ్ఐలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని మైథీ చెప్పారు. -
సూక్ష్మ రుణాల్లో 19 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: సూక్ష్మ రుణ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) డిసెంబర్ త్రైమాసికంలో మంచి పనితీరు చూపించాయి. రుణ వితరణ 19 శాతం వృద్ధితో రూ.77,877 కోట్లుగా నమోదైంది. ఈ వివరాలను మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఎఫ్ఐ) నెట్వర్క్ (ఎంఫిన్) విడుదల చేసిన మైక్రోమీటర్ నివేదిక తెలిపింది. సూక్ష్మ రుణ సంస్థల మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో 2022 డిసెంబర్ చివరికి రూ.3.21 లక్షల కోట్లకు చేరుకుంది. 2021 డిసెంబర్ చివరికి ఉన్న రూ.2.56 లక్షల కోట్లతో పోలిస్తే 25 శాతం పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో 189 లక్షల రుణాలను మంజూరు చేశాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 165 లక్షల రుణాలుగానే ఉంది. 2022 డిసెంబర్ నాటికి మొత్తం 6.4 కోట్ల ఖాతాదారులకు సంబంధించి 12.6 కోట్ల రుణ ఖాతాలకు సేవలు అందించాయి. 83 ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు అత్యదికంగా 38.5 శాతం వాటాతో రూ.1,23,386 కోట్ల రుణ పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఎన్బీఎఫ్సీ–ఎంఫిన్‌లు రూ.15,951 కోట్ల నిధులు సమకూర్చుకున్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22.5 శాతం ఎక్కువ. సూక్ష్మ రుణాల విషయంలో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలకు అధిక వాటా ఉండగా, ఆ తర్వాత బ్యాంకులు సూక్ష్మ రుణాల పరంగా ఎక్కువ మార్కెట్‌ను కలిగి ఉన్నట్టు ఎంఎఫిన్ సీఈవో, డైరెక్టర్ అలోక్ మిశ్రా తెలిపారు. నియంత్రణల పరిధిలోని అన్ని సంస్థలు సూక్ష్మ రుణాల పరంగా మంచి వృద్ధిని నమోదు చేయడం ఆశావహమని ఎంఫిన్ నెట్వర్క్ తెలిపింది. బీహార్ అతిపెద్ద సూక్ష్మ రుణ మార్కెట్‌గా అవతరించింది. ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమబెంగాల్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. -
కోటక్ మహీంద్రా బ్యాంక్ చేతికి సొనాటా, ఎన్ని కోట్ల డీల్ అంటే!
ముంబై: సూక్ష్మ రుణాల సంస్థ సొనాటా ఫైనాన్స్‌ను రూ. 537 కోట్లకు కొనుగోలు చేసినట్లు కోటక్ మహీంద్ర బ్యాంక్ (కేఎంబీ) వెల్లడించింది. ఇది పూర్తి నగదు రూపంలోనే జరిగిందని సంస్థ వివరించింది. 2017లో బీఎస్ఎస్ మైక్రోఫైనాన్స్‌ను దక్కించుకున్న తర్వాత ఈ తరహా డీల్స్‌లో కేఎంబీకి ఇది రెండోది. దీనితో 9 లక్షల మంది పైచిలుకు మహిళా కస్టమర్లు, 10 రాష్ట్రాల్లో 502 శాఖలు లభిస్తాయని సంస్థ తెలిపింది. రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటైన సొనాటా .. నాన్ బ్యాంక్ ఫైనాన్స్ కంపెనీ-మైక్రోఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ-ఎంఎఫ్ఐ)గా కార్యకలాపాలు సాగిస్తోంది. 2022 డిసెంబర్ 31 నాటికి సంస్థ నిర్వహణలో రూ. 1,903 కోట్ల ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లోని గ్రామీణ, సెమీ-అర్బన్ మార్కెట్లలో కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని కేఎంబీ కమర్షియల్ బ్యాంకింగ్ ప్రెసిడెంట్ మనీష్ కొఠారీ చెప్పారు. -
సూక్ష్మ రుణ సంస్థల రుణాలు రూ.3.25 లక్షల కోట్లు
కోల్‌కతా: సూక్ష్మ రుణ సంస్థలకు (ఎంఎఫ్ఐ) సంబంధించి వసూలు కావాల్సిన రుణాల పోర్ట్‌ఫోలియో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ నాటికి రూ.3.25 లక్షల కోట్లకు పెరిగింది. 2022 మార్చి నాటికి ఇది రూ.2.7 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 20 శాతం పెరిగినట్టు సూక్ష్మ రుణ సంస్థల నెట్వర్క్ (ఎంఫిన్) ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఈ రంగం 1.32 లక్షల మందికి ఉపాధి కల్పించినట్టు ఎంఫిన్ సీఈవో అలోక్ మిశ్రా తెలిపారు. సూక్ష్మ రుణ రంగానికి స్వీయ నియంత్రణ మండలిగా ఎంఫిన్‌కు ఆర్బీఐ గుర్తింపు ఉంది. కరోనా కారణంగా 2021, 2022లో రుణ వసూళ్ల సామర్థ్యంపై ప్రభావం పడిందని, ప్రస్తుతం వసూళ్లు 97 శాతానికి మెరుగుపడ్డాయని మిశ్రా చెప్పారు. ఇది కరోనా సమయంలో 70 శాతంగా ఉందన్నారు. ఎంఎఫ్ఐ సంస్థల పరిధిలో మొత్తం 6.2 కోట్ల మంది రుణ లబ్ధిదారులుగా ఉన్నారని.. దేశ జీడీపీకి ఎంఎఫ్ఐ రంగం 2.7 శాతం సమకూరుస్తున్నట్టు చెప్పారు. ఎంఎఫ్‌ఐల మొత్తం రుణాల్లో రూ.38,000 కోట్లు (17 శాతం) పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి ఉన్నట్టు తెలిపారు. 2022 మార్చిలో ఆర్బీఐ ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐ రంగానికి ప్రకటించిన మార్గదర్శకాలపై మిశ్రా స్పందిస్తూ.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ–ఎంఫిన్‌లు, ఎన్బీఎఫ్సీ మధ్య తగిన పోటీకి అవకాశాలు కల్పించినట్టు చెప్పారు. ఎన్బీఎఫ్సీ–ఎంఫిన్ సంస్థలు వసూలు చేసే సగటు వడ్డీ రేటు రుణంపై ప్రస్తుతం 24 శాతంగా ఉంటుందని తెలిపారు. గతంలో ఇది 22.5 శాతమే ఉండేదంటూ, ఆర్బీఐ రెపో రేటు పెంచినందున ఎంఫిన్‌లు వసూలు చేసే వడ్డీ రేటు కూడా పెరిగినట్టు వివరించారు. ఎంఫిన్ పరిధిలో 47 సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. (క్లిక్ చేయండి: కొత్త సంవత్సరంలో దిమ్మతిరిగే షాకిచ్చిన అమెజాన్) -
మైక్రోఫైనాన్స్‌కు మహర్దశ!
ముంబై: సూక్ష్మ రుణ విభాగం దేశంలో మరింత విస్తరించేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) ప్రణాళికలు రూపొందిస్తోంది. వేర్వేరు రుణ రేట్లు.. అంటే ఇప్పటి వరకు అనుసరిస్తున్న రుణ రేట్లను మరింత పెంచుకునే స్వేచ్ఛ.. నూతన ఉత్పత్తుల అభివృద్ధి ఇలా ఎన్నో ప్రణాళికలు ఆర్బీఐ అమ్ముల పొదిలో ఉన్నాయి. రుణ రేట్ల విషయంలో నియంత్రణలు తొలగించి అన్ని రకాల రుణ సంస్థలకూ ఓపెన్ ఆర్కిటెక్చర్ (కస్టమర్ల అవసరాలకు తగినట్టు ఉత్పత్తులను ఆఫర్ చేయడం)ను ఏర్పాటు చేయడంపై ఆర్బీఐ దృష్టి పెట్టింది. దీంతో రుణ సంస్థలు కస్టమర్ల రిస్క్ ప్రొఫైల్ (తిరిగి చెల్లింపుల్లో సమస్య) ఆధారంగా అధిక రుణ రేట్లను వసూలు చేసుకునే వెసులుబాటు రానుంది. ‘‘రుణగ్రహీతల క్రెడిట్ రిస్క్ ఆధారంగా రేట్లలో మార్పులు చోటుచేసుకోవచ్చు. ఇప్పటివరకు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్బీఎఫ్సీలు)– సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐలు) రుణగ్రహీతల క్రెడిట్ రిస్క్ ఆధారంగా రేట్లను నిర్ణయించుకునే స్వేచ్ఛ లేదు. ఇప్పుడిది సాధ్యం కానుంది’’ అని క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ ఎండీ ఉదయ్‌కుమార్ హెబ్బార్ తెలిపారు. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ సంస్థ దేశంలో అతిపెద్ద ఎంఎఫ్ఐ కావడం గమనార్హం. మరింత మందికి చేరువ.. సూక్ష్మ రుణ సంస్థల నియంత్రణకు సంబంధించి సంప్రదింపుల పత్రాన్ని ఇటీవలే ఆర్బీఐ విడుదల చేసింది. ఇందులో వినూత్నమైన ప్రతిపాదనలున్నాయి. రుణ రేట్లపై నియంత్రణలను తొలగించడం వల్ల దిగువ స్థాయిల్లోని రుణ గ్రహీతలకు సంబంధించి రుణ సంస్థలు వడ్డీ రేట్లను తగ్గిస్తాయని ఆర్బీఐ అంచనా వేస్తోంది. ఇలా దిగువ వర్గంలోని రుణ గ్రహీతలు ప్రస్తుతం వార్షికంగా 20 శాతానికిపైనే వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తోంది. నిధులపై వ్యయాలు చాలా తక్కువగా ఉండే పెద్ద బ్యాంకులు సైతం చిన్న రుణ గ్రహీతల నుంచి 24 శాతం వరకు వడ్డీని రాబడుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రుణ రేట్ల విషయంలో స్వేచ్ఛను కల్పించడం వల్ల రిస్క్ ఉండే చోట అధిక రేట్లు, రిస్క్ తక్కువ ఉండే చోట తక్కువ రేట్లను సూక్ష్మ రుణాల్లోనూ అమలు చేసేందుకు వీలు పడుతుందని భావిస్తున్నాయి. ‘‘ప్రతిపాదిత ఆర్బీఐ కార్యాచరణతో సూక్ష్మరుణ మార్కెట్ వ్యాపార నిర్వహణ పరంగా మార్పును చూడనుంది. రిస్క్ ఆధారంగా.. భిన్న భౌగోళిక ప్రాంతాల్లో భిన్నమైన రుణ రేట్లను అమలు చేయవచ్చు. ఉదాహరణకు రుణ ఎగవేతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధిక రేట్లు ఉండొచ్చు. అదే విధంగా అప్పటివరకు ఎటువంటి రుణ చరిత్ర లేని నూతన రుణ గ్రహీతల నుంచి ఎక్కువ రేటును వసూలు చేసుకోవడానికి ఉంటుంది. ఒక్కసారి వారికంటూ రుణ చరిత్ర ఏర్పాటైన తర్వాత ఆకర్షణీయమైన రేట్లకు రుణాలను ఆఫర్ చేయవచ్చు’’ అని అరోహణ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎండీ మనోజ్‌కుమార్ చెప్పారు. మార్కెట్ విస్తరిస్తే మంచిది.. 60% పైగా మార్కెట్ వాటా కలిగి ఉన్న బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచబోవని ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు ఎండీ నితిన్చుగ్ చెప్పారు. ‘‘రేట్లన్నవి మార్కెట్ ఆధారితమే. ఆర్బీఐ ప్రతిపాదనలకు తగ్గట్టు మార్కెట్ విస్తరించినట్టయితే నిర్ణీత కాలానికి వడ్డీ రేట్లు దిగిరావడానికి అవకాశం ఉంటుంది’’ అని చుగ్ వివరించారు. ప్రస్తుతం ఆర్బీఐ నిబంధనల మేరకు.. ఒక రుణ గ్రహీతకు ఏవేనీ రెండు ఎన్బీఎఫ్సీ, ఎంఎఫ్ఐలకు మించి రుణాలు ఇవ్వకూడదు. అదే బ్యాంకులకు ఇలాంటి నిర్బంధాలు లేవు. ఆర్బీఐ తాజా ప్రతిపాదనలతో రుణ సంస్థలు మరిన్ని కొత్త ఉత్పత్తులను తెచ్చే అవకాశం ఉంటుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
అసభ్య, బూతు సందేశాలు పంపేది ఢిల్లీలోని సెంటర్లు
సాక్షి, హైదరాబాద్: తమ వద్ద అప్పు తీసుకుని సకాలంలో తీర్చలేకపోయిన డిఫాల్టర్స్‌ను వేధించడానికి అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ వేర్వేరు స్టేజ్ల్లో కాల్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేసిన స్టేజ్–1 కాల్ సెంటర్లలోని ఉద్యోగులు కేవలం రిమైండర్స్ మాత్రమే పంపిస్తుంటారు. గుర్గావ్లో ఉండే స్టేజ్–2 కాల్ సెంటర్లలోని వారు వేధింపు కాల్స్ చేయడం, సందేశాలు పంపడం చేస్తుంటాయి. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్) కేంద్రంగా పనిచేసే స్టేజ్–3 సెంటర్ల నుంచి డిఫాల్టర్లతో పాటు వారి సంబంధీకులకు నకిలీ లీగల్ నోటీసులు, అభ్యంతరకర, అసభ్య సందేశాలు వెళ్తుంటాయి. ఈ యాప్స్ కేసులకు సంబంధించి సిటీ సైబ ర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్, గుర్గావ్ల్లోని కాల్ సెంటర్లపై దాడులు చేసి 11 మందిని అరెస్టు చేశారని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ మంగళవారం తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఉద్యోగులనే డైరెక్టర్లుగా.. కలర్ ప్రిడెక్షన్ తరహా మరికొన్ని గేమింగ్స్ యాప్స్ నిర్వహించిన చైనా కంపెనీలు వాటిలో డైరెక్టర్లుగా తమ దేశీయుల్ని నియమించుకున్నాయి. అయితే ఈ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ దగ్గరకు వచ్చేసరికి వీటికి సంబంధించిన కాల్ సెంటర్లలో ఉద్యోగుల్నే డైరెక్టర్లుగా ఉంచుతున్నాయి. ఇండోనేసియా రాజధాని జకార్తా నుంచి వాట్సాప్ ద్వారా ఆదేశాలు పంపుతూ వీటిని రన్ చేస్తున్నాయి. గుర్గావ్లోని ఉద్యోగ్ విహార్‌లో ఉన్న 2, హైదరాబాద్‌లోని బేగంపేట, పంజగుట్టల్లోని 3 కాల్ సెంటర్లు 30 యాప్స్ కోసం పనిచేస్తున్నాయి. ఇవన్నీ లియోఫంగ్ టె క్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, హాట్‌ఫుల్ టెక్నాలజీస్ ప్రై.లి., పిన్ ప్రింట్ టెక్నాలజీస్ ప్రై.లి., నబ్లూమ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో బెంగళూరులో రిజిస్టరైన సంస్థల అధీనంలో నడుస్తున్నాయి. పంజగుట్టలోని కాల్ సెంటర్లో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్న జీవన జ్యోతితో పాటు సెల్వరాజ్ సింగిలు లియోఫంగ్, హాట్ఫుల్లకు, రవికుమార్ మంగల, వెంకట్లు పిన్ ప్రింట్, నబ్లూమ్లకు డైరెక్టర్లుగా ఉన్నారు. (చదవండి: లోన్‌యాప్స్ కేసులో ఆసక్తికర విషయాలు) బెదిరింపులు.. బూతులతో.. అడ్డగోలు వడ్డీలు వసూలు చేస్తూ, డిఫాల్టర్లను అడ్డంగా వేధిస్తున్న అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ నిర్వాహకులు కాల్ సెంటర్ల ఉద్యోగుల ద్వారా వేస్తున్న వేషాలు అన్నీఇన్నీ కావు. బాధితుల్ని బెదిరించడానికి అన్ని ప్రయత్నాలు చేశారు. ఇటీవల నగరానికి చెందిన ఓ బాధితుడు వీరి వేధింపులు తట్టుకోలేక ఫిర్యాదు చేసేందుకు సిటీ సైబర్ క్రైమ్ ఠాణా వద్దకు వచ్చాడు. అదే సమయంలో సదరు యాప్‌కు చెందిన కాల్ సెంటర్ నుంచి డబ్బు కట్టాలని, లేదంటే ‘తీవ్ర పరిణామాలు’ ఉంటాయని వాట్సాప్‌లో సందేశం వచ్చింది. దీనికి సమాధానంగా బాధితుడు తాను సైబర్ క్రైమ్ ఠాణా వద్ద ఉన్నాననే దానికి సూచికంగా ఆ స్టేషన్ బోర్డును ఫొటో తీసి షేర్ చేశాడు. ఇది చూసిన కాల్ సెంటర్ ఉద్యోగి అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ రెచ్చిపోయాడు. (చదవండి: ఆపరేషన్ ఫ్రం ‘చైనా’..!) వెనకున్నది చైనీయులే..! దాదాపు నాలుగైదు నెలల క్రితం ఏర్పాటైన ఈ కాల్ సెంటర్ల వెనుక చైనీయులే ఉన్నారు. అప్పట్లో హైదరాబాద్‌కు వచ్చిన చైనా జాతీయురాలు కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి వెళ్లింది. అలాగే గుర్గావ్లోని సెంటర్లకు నేతృత్వం వహించిన మరో చైనీయుడి పాస్‌పోర్టు జిరాక్స్ కాపీ అధికారుల తనిఖీల్లో లభ్యమైంది. ఈ రెండింటితో పాటు ఇతర ఆధారాల నేపథ్యంలోనూ ఈ అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ వెనుక చైనా జాతీయుల ప్రమేయమున్నట్లు అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్‌లోని కాల్ సెంటర్లలో 600 మంది, గుర్గావ్లోని వాటిల్లో 500 మంది టెలికాలర్స్‌గా ఉన్నారు. వీళ్లు కార్పొరేట్ ఆఫీసుల మాదిరిగా షిఫ్ట్‌ల వారీగా, 24 గంటలూ విధులు నిర్వర్తిస్తూ జకార్తా నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారం నడుచుకుంటున్నారు. ఈ సంస్థల్లోని ఉద్యోగులు ప్రతి 2–3 నెలలకు మారిపోతుండటం వెనుక ఏమైనా కారణముందా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు. రకరకాల ఖాతాల నుంచి లావాదేవీలు.. మైక్రో ఫైనాన్స్ యాప్స్ నిర్వాహకులు తమ ఆర్థిక లావాదేవీలూ తేలిగ్గా బయటపడకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ కాల్ సెంటర్లలో పనిచేసే వారికి నేరుగా జీతాలు చెల్లించట్లేదు. దీనికోసం ఓ ఔట్సోర్సింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేశాయి. వారికి మరో థర్డ్ పార్టీ నుంచి యూఐపీ, నగదు రూపంలో డబ్బు పంపిస్తున్నారు. రకరకాల ఖాతాల నుంచి జరుగుతున్న ఈ లావాదేవీలను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ప్రాథమికంగా 30 యాప్స్‌కు సంబంధించిన 10 బ్యాంక్ ఖాతాలు, 80 వ్యాలెట్స్ గుర్తించారు. వీటిలోకి నగదు రాకపోకల్ని అధ్యయనం చేస్తున్నారు. రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా కార్యకలాపాలు నడుపుతున్న ఈ సంస్థలు 20 నుంచి 50 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఇవన్నీ గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి హోస్ట్ అవుతున్నాయి. గూగుల్ నిబంధనల ప్రకారం రీ పేమెంట్ పీరియడ్ 60 రోజులు. అయితే ఈ యాప్స్ మాత్రం వారం నుంచి పక్షం రోజుల్నే గడువుగా నిర్దేశించాయి. అందరూ నిందితులు కాదు.. ఈ యాప్స్ వేధింపులకు సంబంధించి సిటీలో 16 కేసులు నమోదు చేశారు. వీటికి సంబంధించి మంగళవారం గుర్గావ్, సిటీల్లోని కాల్ సెంటర్ల నుంచి బిందురాణి, జ్యోతి మాలిక్, అమిత్, రమణ్‌దీప్ సింగ్, ప్రభాకర్ ధంగ్వాల్, మధుబాబు సింగి, మనోజ్‌కుమార్ సింగి, మహేశ్ కుమార్ సింగి, తరుణ్, పవన్‌కుమార్, జీవన్ జ్యోతిలను అరెస్టు చేశారు. దాదాపు 700 ల్యాప్‌టాప్స్‌ను స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు.ఈ యాప్స్‌తో పాటు వాటి లావాదేవీలకు సంబంధించిన వ్యాలెట్స్ హోస్టింగ్‌కు సంబంధించి గూగుల్ సేవలు అందించే ఆల్ఫాబెట్ ఇంక్ సంస్థకు ఈ–మెయిల్ ద్వారా లేఖ రాశారు. వారిచ్చే సమాధానం ఆధారంగా ఈ వ్యవహారాల్లో సూత్రధారులపై స్పష్టత వచ్చే అవకాశముంది. మరోపక్క ఈ కాల్సెంటర్లలో పనిచేస్తున్న అందరూ నిందితులు కాదని.. ఎవరైతే అసభ్య సందేశాలు పంపి ఉంటారో వారినే అరెస్టు చేస్తామని సీసీఎస్ సంయుక్త పోలీసు కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. అక్రమ మైక్రో ఫైనాన్సింగ్ యాప్స్ నుంచి వేధింపులు ఎదురైతే ‘100’కు లేదా సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో లేదా స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయాలని కొత్వాల్ అంజనీకుమార్ కోరారు. ఈ తరహా కేసులు దేశంలోనే తొలిసారని ఆయన పేర్కొన్నారు. ఈ అక్రమ దందాలో ఎవరూ చిక్కవద్దని సూచించారు. -
మీడియాతో డీజీపీ గౌతం సవాంగ్ చిట్‌చాట్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డీజీపీ గౌతం సవాంగ్ మంగళవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. పలు అంశాల గురించి మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ‘గత సంవత్సరంలో కష్టపడి పనిచేసిన ఏపీఎస్పీ సిబ్బందిని ప్రోత్సహించేందుకు అవార్డులు ఇచ్చాము. డీజీపీ డిస్క్ అనేది కొత్త అవార్డు. విధుల నిర్వహణలో అద్భుతమైన ప్రతిభ కనపరిచిన వారికి ఈ అవార్డు. ఏపీఎస్పీ అనేది ఒక పారామిలటరీ ఫోర్స్‌లాగా ఏర్పాటయ్యింది. ఈ ఫోర్స్ స్వాతంత్ర్యం ముందు నుంచీ ఉన్నది. ఏపీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఏపీఎస్పీ పనిచేస్తోంది. ఈశాన్య రాష్ట్రాలలో కూడా సేవలందించిన చరిత్ర ఏపీఎస్పీకి ఉంది. పోలీసులకు, సెక్యూరిటీలకు ఏపీఎస్పీ ఒక వెన్నెముక. ఏపీఎస్పీ సేవలు ఉన్నచోట పరిస్ధితులు త్వరగా అదుపులోకి వస్తాయి. గ్రేహౌండ్స్, ఆక్టోపస్, సెక్యూరిటీ వింగ్స్‌కు ఏపీఎస్పీ ఒక వెన్నెముక. ఏపీ సెక్యూరిటి వింగ్ దేశానికే ప్రామాణికం. ఎస్డీఆర్ఎఫ్ కూడా ఏపీఎస్పీలో ఒక భాగమే. ఏపీ పోలీస్ దేశంలోనే ఒక అత్యుత్తమ పోలీస్ ఫోర్స్‌గా గుర్తించబడింది. అవసరమైన అన్ని వనరులు లేకపోయినా ఏపీ పోలీస్ పనిచేస్తోంది. బాధ్యత, పారదర్శకత, ప్రతిభ ప్రదర్శిస్తూ ఏపీ పోలీస్ ప్రతి నిత్యం పనిచేస్తున్నారు’ అని తెలిపారు. (చదవండి: సవాంగ్ స్ఫూర్తితోనే అవార్డు) ‘ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీస్ సర్వీసులను ఉత్తమంగా తయారు చేయడానికి అవసరమైన వనరులు ఇస్తున్నారు. పోలీసు వ్యవస్ధలో వచ్చిన మార్పులతో సామాన్య ప్రజలకు సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయి. సామాన్య మానవుడికి పోలీసుల ప్రాధాన్యత తెలియాలి. స్పందన ద్వారా ప్రజలు పోలీసులకు నేరుగా పిటిషన్లు పెట్టుకోవచ్చు.. వీటికి సీఎం కార్యాలయం వరకూ పర్యవేక్షణ ఉంటుంది. స్పందనలో వచ్చే పిటిషన్లలో 52 శాతం మహిళలు ఉన్నారు.. వారి భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. దిశ పోలీసులు చాలా బాధ్యతగా పని చేస్తున్నారు. దిశా ఎస్ ఓ ఎస్ యాప్‌ని ప్రతి మహిళా డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఆన్‌లో ఉంచి మూడుసార్లు ఫోన్ షేక్ చేస్తే వీడియోతో సహా దగ్గరలోని పోలీస్ స్టేషనుకు వెళుతుంది. పోలీస్ సేవా యాప్ ద్వారా ఇప్పటి వరకు 1.05లక్షలకు పైగా ఎఫ్ఐఆర్లు డౌన్లోడ్ చేశారు. ఏపీ పోలీసులకు గత సంవత్సర కాలంలో 108 అవార్డులు వచ్చాయి. ఐసీజేఎస్‌లో దేశంలోనే రెండవ స్ధానం ఏపీ పోలీస్ సాధించింది. రాబోయే రోజుల్లో పోలీసులు మేం ఉన్నాం, మీకోసమే ఉన్నాం అనే నమ్మకం బలహీనవర్గాలకు ఇవ్వాలి. వ్యక్తిగతంగా, అందరం దేశానికే గర్వకారణం అయ్యేలా పనిచేయాలి’ అన్నారు. (34 ఏళ్ల సర్వీసులో ఇదే ప్రథమం: ఏపీ డీజీపీ ) మైక్రోఫైనాన్స్ పై ప్రత్యేక దృష్టి పెడతాం అన్నారు డీజీపీ గౌతం సవాంగ్. మొబైల్ లోన్ యాప్‌లు మహిళల్నే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నాయి. మొబైల్ లోన్ యాప్‌లపై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తాం. బాధితులు ధైర్యంగా పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేయాలి. నోయిడా, ఢిల్లీ, గురుగావ్‌ల నుంచి ఎక్కువగా ఈ యాప్‌లనిర్వహణ జరుగుతున్నట్టు గుర్తించాం. మొబైల్ లోన్‌యాప్‌ల మూలాలను కనిపెట్టి కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు. -
ఆపరేషన్ ఫ్రం ‘చైనా’..!
సాక్షి, హైదరాబాద్: ఇన్స్టంట్ రుణాల పేరుతో పలువురిని ఆకర్షించి, వడ్డీ, పెనాల్టీగా అధిక మొత్తం వసూలు చేస్తూ, చెల్లించలేకపోయిన వారి పరువు, ప్రాణాలు తీస్తున్న మైక్రో ఫైనాన్స్ యాప్స్ కేసుల దర్యాప్తును హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా సాంకేతిక ఆధారాలను బట్టి హైదరాబాద్‌లో మూడు, గుర్గావ్లో ఒక కాల్ సెంటర్ ఆచూకీ కనిపెట్టారు. సోమవారం వీటిపై దాడి చేసిన ప్రత్యేక బృందాలు.. మొత్తం 1,100 మంది ఉద్యోగులుగా ఉన్నట్లు గుర్తించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి ఈ యాప్స్ వెనుక చైనా కంపెనీలే ఉన్నట్లు భావిస్తున్నారు. దీన్ని నిర్థారించడం కోసం సాంకేతిక సమాచారం ఇవ్వాల్సిందిగా ఆల్ఫాబెట్ ఐఎన్‌సీ. సంస్థకు ఈ–మెయిల్ పంపారు. విదేశాల్లో ఉన్న సూత్రధారులే తెర వెనుక ఉండి ఈ యాప్స్ నడిపిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. డైరెక్టర్లు అంతా డమ్మీలే... వివిధ రకాల ఆన్లైన్ వ్యాపారాల పేర్లతో భారత్‌లో కంపెనీలు రిజిస్టర్ చేయిస్తున్న చైనీయులు ఎలాంటి అనుమానం రాకుండా వాటిలో భారతీయుల్నే డైరెక్టర్లుగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ డైరెక్టర్లలో చిన్నచిన్న వ్యాపారులు, నిరుపేదలు కూడా ఉన్నారు. రూ.10 వేల నుంచి రూ.15 వేల జీతాలకు ఆశపడుతున్న వారిని ఎంపిక చేసుకుని సాంకేతికంగా డైరెక్టర్లుగా చేస్తున్నారు. వీరందరినీ డమ్మీలుగా ఉంచుతున్న చైనీయులు ఆయా యాప్స్ నిర్వహణ, పర్యవేక్షణకు తమ దేశీయుల్నే నియమించుకుంటున్నారు. (లోన్‌యాప్: తల్లి ఫొటోలు మార్ఫింగ్) ఇండోనేసియా నుంచి వస్తున్న ఆదేశాలు... ఈ పాత్రధారులకు లోన్ యాప్స్ నిర్వహణ, విధివిధానాల్లో మార్పులు, అమలుకు సంబంధించి విదేశాల్లోని సూత్రధారుల నుంచే ఆదేశాలు అందుతున్నాయి. దీనికోసం వాట్సాప్ సహా వివిధ రకాల యాప్స్‌ను వాడుతున్నారు. అయితే వీటి ద్వారా చైనా నుంచి నేరుగా ఆదేశాలిచ్చే ఆస్కారం లేకపోవడంతో ఇండోనేసియా, మలేసియా తదితర దేశాల్లో తమ స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడ ఉండే చైనీయులిచ్చే ఆదేశాల ప్రకారం.. దేశంలో ఉంటున్న పాత్రధారులు పనిచేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ‘వేధింపుల’కోసం కాల్‌సెంటర్లు... తమ యాప్స్ నుంచి లోన్లు తీసుకుని, తిరిగి చెల్లించడంలో విఫలమైన వారిని ‘వేధించడానికి’ సూత్రధారులు కాల్సెంటర్లను ఎంచుకుంటున్నారు. ఇక్కడి పాత్రధారులకు ఆదేశాలు జారీ చేస్తూ కొన్ని కాల్‌సెంటర్లతో ఒప్పందాలు చేసుకునే బాధ్యతల్ని అప్పగిస్తున్నారు. ఇలా దాదాపు 30 వరకు యాప్స్ నిర్వాహకులు హైదరాబాద్‌లో 3, గుర్గావ్లో ఒక కాల్ సెంటర్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వీళ్లకు పాత్రధారుల నుంచి ‘డిఫాల్టర్స్ జాబితాలు’అందుతాయి. వాటి ఆధారంగా వారితో పాటు కుటుంబీకులు, స్నేహితులు పరిచయస్తులకు కాల్స్ చేయడం... వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ ద్వారా సందేశాలు పంపడం, ప్రత్యేకంగా గ్రూప్‌లు క్రియేట్ చేసి వేధించడం ఈ కాల్సెంటర్స్లోని ఉద్యోగుల పని. (చదవండి: ఈ దోపిడీ మరో ‘దృశ్యం’ ) రెండు ప్రాంతాల్లో వరుస దాడులు... ఈ లోన్ యాప్స్ వేధింపులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్లో 12 కేసులు నమోదయ్యాయి. బాధితులకు వచ్చిన వేధింపు కాల్స్, సందేశాలకు సంబంధించిన ఫోన్ నంబర్లను దర్యాప్తు అధికారులు సేకరించారు. ఈ నంబర్లు రిజిస్టర్ అయి ఉన్న చిరునామాలు, అవి యాక్టివేట్ అయి ఉన్న లొకేషన్స్‌ను సేకరించారు. హైదరాబాద్ బేగంపేటలో రెండు ప్రాంతాల్లో ఉన్న కాల్‌సెంటర్లతో పాటు పంజగుట్టలో ఒక చోట, గుర్గావ్లో రెండు చోట్ల ఉన్న కాల్ సెంటర్లపై సోమవారం దాడులు చేశారు. వీటిలో పని చేస్తున్న 1,100 మంది ఉద్యోగులతో పాటు నిర్వాహకుల్ని ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక ఆధారాలను బట్టి తమకు వివిధ యాప్స్ ద్వారా అందుతున్న ఆదేశాలు, జాబితాల ఆధారంగా వీళ్లు పని చేస్తున్నట్లు తేల్చారు. హోస్టింగ్స్ వివరాలు తెలిస్తే కొలిక్కి... ఈ తరహా లోన్ యాప్స్ గూగుల్ ప్లే స్టోర్స్‌లో 250 ఉన్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. వీటి నగదు లావాదేవీలన్నీ బ్యాంకు ఖాతాలతో పాటు గూగుల్ పే తదితర వ్యాలెట్స్ ద్వారా జరుగుతున్నట్లు తేలింది. గూగుల్‌కు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆల్ఫాబెట్ ఐఎన్‌సీ. అధీనంలో ఉన్నట్లు గుర్తించారు. వీరి నుంచి సమాచారం సేకరిస్తే ఆయా యాప్స్‌ను ఎవరు? ఎక్కడ నుంచి హోస్ట్ చేస్తున్నారు? ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు ఎవరి పేరుతో ఉన్నాయి? తదితర వివరాలు తెలుస్తాయి. ఈ నేపథ్యంలో వాటిని అందించాల్సిందిగా కోరుతూ ఆల్ఫాబెట్ సంస్థలకు ఈ–మెయిల్ పంపారు. అక్కడ నుంచి సమాధానం వస్తే ఈ కేసుల్లో అనేక విషయాలపై స్పష్టత వస్తుందని అధికారులు చెప్తున్నారు. పోలీసుల అదుపులో ఇద్దరు యూపీవాసులు రాజేంద్రనగర్: ఇన్స్టంట్ లోన్ యాప్ ఊబిలో చిక్కి ఆత్మహత్య చేసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సునీల్ కేసులో సైబరాబాద్ క్రైమ్, రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్య చేసుకున్న సునీల్ సెల్‌ఫోన్‌కు వచ్చిన కాల్ డేటాతో పాటు యాప్‌లను గుర్తించారు. సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. రెండు టీమ్‌లు బెంగళూర్‌తో పాటు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు కాల్ సెంటర్ నిర్వాహకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో వీటిపై పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ కేసులో కొంత పురోగతి సాధించినట్లు సమాచారం. పూర్తి సాంకేతికత ఆధారాలను సేకరించి ఆ మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు తెలిసింది. పోలీసుల అదుపులో ఉన్న ఇద్దరినీ సైబర్‌క్రైమ్ పోలీసులు రాజేంద్రనగర్ పీఎస్‌కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో ఈ కేసులో ప్రమేయం ఉన్న మిగతా వారిని అరెస్టు చేయనున్నట్లు తెలుస్తోంది. -
నేటి నుంచి ‘ఉజ్జీవన్’ ఐపీఓ
ధర శ్రేణి రూ.207-210 ముంబై: సూక్ష్మ రుణ సంస్థ ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానున్నది. సోమవారం (మే 2న ) ముగియనున్న ఈ ఐపీఓకు ధరల శ్రేణిని రూ.207-210గా కంపెనీ నిర్ణయించింది. చిన్న ఫైనాన్స్ బ్యాంక్ ఏర్పాటు కోసం సూత్రప్రాయ ఆమోదాన్ని ఇప్పటికే ఈ కంపెనీ పొందింది. ఈ ఐపీఓ ద్వారా రూ.358 కోట్ల తాజా మూలధనాన్ని సమీకరిస్తామని ఉజ్జీవన్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సుధా సురేశ్ తెలిపారు.