న్యూఢిల్లీ: సూక్ష్మ రుణ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) డిసెంబర్ త్రైమాసికంలో మంచి పనితీరు చూపించాయి. రుణ వితరణ 19 శాతం వృద్ధితో రూ.77,877 కోట్లుగా నమోదైంది. ఈ వివరాలను మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఎఫ్‌ఐ) నెట్‌వర్క్ (ఎంఫిన్) విడుదల చేసిన మైక్రోమీటర్ నివేదిక తెలిపింది. సూక్ష్మ రుణ సంస్థల మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో 2022 డిసెంబర్ చివరికి రూ.3.21 లక్షల కోట్లకు చేరుకుంది.
2021 డిసెంబర్ చివరికి ఉన్న రూ.2.56 లక్షల కోట్లతో పోలిస్తే 25 శాతం పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో 189 లక్షల రుణాలను మంజూరు చేశాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 165 లక్షల రుణాలుగానే ఉంది. 2022 డిసెంబర్ నాటికి మొత్తం 6.4 కోట్ల ఖాతాదారులకు సంబంధించి 12.6 కోట్ల రుణ ఖాతాలకు సేవలు అందించాయి. 83 ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐలు అత్యదికంగా 38.5 శాతం వాటాతో రూ.1,23,386 కోట్ల రుణ పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నాయి.
డిసెంబర్ త్రైమాసికంలో ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఫిన్‌లు రూ.15,951 కోట్ల నిధులు సమకూర్చుకున్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22.5 శాతం ఎక్కువ. సూక్ష్మ రుణాల విషయంలో ఎన్‌బీఎఫ్‌సీ–ఎంఎఫ్‌ఐలకు అధిక వాటా ఉండగా, ఆ తర్వాత బ్యాంకులు సూక్ష్మ రుణాల పరంగా ఎక్కువ మార్కెట్‌ను కలిగి ఉన్నట్టు ఎంఎఫిన్ సీఈవో, డైరెక్టర్ అలోక్ మిశ్రా తెలిపారు. నియంత్రణల పరిధిలోని అన్ని సంస్థలు సూక్ష్మ రుణాల పరంగా మంచి వృద్ధిని నమోదు చేయడం ఆశావహమని ఎంఫిన్ నెట్‌వర్క్ తెలిపింది. బీహార్ అతిపెద్ద సూక్ష్మ రుణ మార్కెట్‌గా అవతరించింది. ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమబెంగాల్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment