
తోడవనున్న 4,000 పడకలు
క్రిసిల్ రేటింగ్స్ నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలో ఉన్న ఆసుపత్రులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4,000 పడకలను జోడించనున్నాయి. ఇందుకు సుమారు రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నాయని క్రిసిల్ రేటింగ్స్ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.64,000 కోట్ల ఆదాయం నమోదు చేసిన 91 ప్రైవేట్ ఆసుపత్రులను విశ్లేషించినట్టు వెల్లడించింది. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థలు దాదాపు 6,000 బెడ్స్‌ను జోడించాయి.
ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో జోడిస్తున్న పడకలు 2020–2024 మధ్య తోడైన వాటికి సమానంగా ఉంటుంది. ఆక్యుపెన్సీ 65–70 శాతం గరిష్ట స్థాయికి చేరుకోవడం, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ కోసం నిరంతర డిమాండ్.. వెరశి ప్రైవేట్ ఆసుపత్రులు ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.25,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలో సగటు వార్షిక పెట్టుబడి కంటే ఇది దాదాపు 80 శాతం అధికం’ అని నివేదిక తెలిపింది.
అంతర్గత వనరుల ద్వారా..
మూలధన వ్యయంలో దాదాపు నాలుగింట మూడు వంతులు అంతర్గత వనరుల ద్వారా ఆసుపత్రులు సమకూరుస్తున్నాయి. అంతేకాకుండా మెరుగైన రాబడుల కారణంగా 2022 ఆర్థిక సంవత్సరం నుండి ప్రైవేట్ ఈక్విటీ, ఈక్విటీ మార్కెట్ల నుండి గణనీయంగా రూ.55,000–60,000 కోట్ల పెట్టుబడిని ఆకర్షించాయి. కొత్త పడకలలో సగం నూతన ఆసుపత్రుల ఏర్పాటు ద్వారా సమకూరనున్నాయి.
కొత్త ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలలో గణనీయ పెట్టుబడికి ఇది నిదర్శనం. ఇప్పటికే ఉన్న ఆసుపత్రుల అభివృద్ధి కారణంగా దాదాపు 40 శాతం పడకలు తోడు కానున్నాయి. ప్రస్తుత సౌకర్యాలను ఆధునీకరించడం, మెరుగుపర్చడంపై సంస్థలు దృష్టి సారిస్తాయి. నిర్మాణంలో ఉన్న, చిన్న, మధ్య తరహా ఆసుపత్రులను పెద్ద కంపెనీలు స్వా«దీనం చేసుకోవడం ద్వారా మిగిలిన 10 శాతం పడకలు జతకానున్నాయని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది.
బలమైన పనితీరు..
వైద్య రంగం ఆదాయంలో ప్రైవేట్ ఆసుపత్రుల వాటా 63 శాతం. 2020–2024 ఆర్థిక సంవత్సరాల్లో ప్రైవేట్ ఆసుపత్రులు ఆదాయంలో 18 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును, 18 శాతం ఆరోగ్యకర నిర్వహణ లాభాలను సాధించాయి. ఇది బలమైన నగదు ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది.
అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే భారతదేశంలో ఆసుపత్రుల బలమైన పనితీరు, తలసరి పడకల సామర్థ్యం తక్కువగా ఉండటంతో ప్రైవేట్ ఈక్విటీ, ఐపీవోల ద్వారా గణనీయంగా పెట్టుబడులు పెరిగాయి. ఇది బ్యాలెన్స్ షీట్లను బలోపేతం చేసింది. ఆసుపత్రులు వాటి క్రెడిట్ ప్రొఫైల్స్‌ను భౌతికంగా ప్రభావితం చేయకుండా ప్రతిష్టాత్మకంగా పడకల జోడింపును కొనసాగించడానికి వీలు కల్పించిందని నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment