December quarter
-
నష్టాలను తగ్గించుకున్న పేటీఎం
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ, పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ డిసెంబర్ త్రైమాసికంలో నష్టాలను రూ.222 కోట్లకు తగ్గించుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో నికర నష్టం రూ.392 కోట్లుగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు ఆదాయం 38 శాతం వృద్ధితో రూ.2,850 కోట్లకు దూసుకుపోయింది. సబ్‌్రస్కిప్షన్ ఆదాయం గణనీయమైన వృద్ధిని చూసిందని, మార్జిన్లు మెరుగుపడ్డాయని, చెల్లింపుల వ్యాపారం ఆదాయం పెరిగినట్టు పేటీఎం ప్రకటించింది. వర్తకులు వినియోగించే పేటీఎం పేమెంట్ డివైజ్‌లు డిసెంబర్ చివరికి 1.06 కోట్లకు పెరిగాయి. పేమెంట్స్ వ్యాపారం ఆదాయం 45 శాతం పెరిగి రూ.1,730 కోట్లు, నికర చెల్లింపుల మార్జిన్ 63 శాతం పెరిగి రూ.748 కోట్లుగా ఉన్నాయి. మర్చంట్స్ పేమెంట్స్ వ్యాల్యూమ్ (జీఎంవీ) 47 శాతం వృద్ధితో రూ.5.10 లక్షల కోట్లకు చేరింది. ఫైనాన్షియల్ సరీ్వసుల ద్వారా ఆదాయం 36 శాతం పెరిగి రూ.607 కోట్లుగా నమోదైంది. డిసెంబర్ త్రైమాసికంలో రూ.15,535 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఇందులో 56 శాతం వృద్ధిని చూపించింది. గడిచిన ఏడాదిలో పేటీఎం ద్వారా రుణాలను తీసుకునే యూజర్లు 44 లక్షలు పెరిగి మొత్తం 1.25 కోట్లకు చేరారు. -
పారిశ్రామిక రంగం పరపతి మెరుగుపడుతుంది
న్యూఢిల్లీ: భారత పరిశ్రమల పరపతి డిసెంబర్ త్రైమాసికంలో మెరుగుపడుతుందని, రుణాలపై వడ్డీ చెల్లింపుల కవరేజీ 4.5–5 రెట్లు పెరుగుతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. కార్పొరేట్ ఇండియా ఆదాయాలు మెరుగుపడడాన్ని ఇందుకు అనుకూలించే అంశంగా పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంత్సరం ద్వితీయ త్రైమాసికంలో (జూలై–సెపె్టంబర్) 601 లిస్టెడ్ కంపెనీల (ఫైనాన్షియల్ సరీ్వసులు మినహా) బ్యాలన్స్ షీట్లను విశ్లేíÙంచిన అనంతరం ఇక్రా ఈ వివరాలు వెల్లడించింది. కంపెనీల ఆపరేటింగ్ మార్జిన్లు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూసినప్పుడు 3.98 శాతం, అంతకుముందు త్రైమాసికంతో పోల్చిచూస్తే 0.64 శాతం మెరుగుపడినట్టు తెలిపింది. కమోడిటీల ధరలు శాంతించడాన్ని సానుకూలంగా పేర్కొంది. ముడి పదార్థాల ధరలు ఇటీవలి కాలంలో తగ్గడాన్ని ప్రస్తావించింది. అయినప్పటికీ ఇవి చారిత్రకంగా చూస్తే, ఇంకా ఎగువ స్థాయిల్లోనే ఉన్నట్టు పేర్కొంది. భారత కంపెనీల నిర్వహణ మార్జిన్లు ఇంకా చారిత్రక గరిష్ట స్థాయికి చేరుకోవాల్సి ఉందని వివరించింది. -
డిసెంబర్ త్రైమాసికంలో క్యాడ్ 2.2 శాతం
ముంబై: దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) డిసెంబర్ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.2 శాతంగా నమోదయ్యింది. విలువలో ఇది 18.2 బిలియన్ డాలర్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం.. రెండవ త్రైమాసికంతో పోల్చితే మూడవ త్రైమాసికంలో క్యాడ్ గణనీయంగా తగ్గింది. రెండవ త్రైమాసికంలో క్యాడ్ 30.9 బిలియన్ డాలర్లు. జీడీపీలో ఇది 3.7 శాతం. వస్తు ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు రెండవ త్రైమాసింకంతో పోల్చితే మూడవ త్రైమాసికంలో 78.3 బిలియన్ డాలర్ల నుంచి 72.7 బిలియన్ డాలర్లకు తగ్గడం క్యాడ్ తగ్గుదలకు దారితీసినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఈ కాలంలో సేవల రంగం ఎగుమతులు కూడా గణనీయంగా 24.5 శాతం మేర పెరిగాయి. అయితే నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రం 2021 ఇదే కాలంతో పోల్చితే 4.6 బిలియన్ డాలర్ల నుంచి 2.1 బిలియన్ డాలర్లరు తగ్గాయి. నికర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కూడా 5.8 బిలియన్ డాలర్ల నుంచి 4.6 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మద్య చూస్తే, కరెంట్ అకౌంట్‌లోటు జీడీపీలో 2.7 శాతంగా నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో ఈ లోటు 1.1 శాతం. -
సూక్ష్మ రుణాల్లో 19 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: సూక్ష్మ రుణ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) డిసెంబర్ త్రైమాసికంలో మంచి పనితీరు చూపించాయి. రుణ వితరణ 19 శాతం వృద్ధితో రూ.77,877 కోట్లుగా నమోదైంది. ఈ వివరాలను మైక్రో ఫైనాన్స్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఎఫ్ఐ) నెట్వర్క్ (ఎంఫిన్) విడుదల చేసిన మైక్రోమీటర్ నివేదిక తెలిపింది. సూక్ష్మ రుణ సంస్థల మొత్తం రుణ పోర్ట్‌ఫోలియో 2022 డిసెంబర్ చివరికి రూ.3.21 లక్షల కోట్లకు చేరుకుంది. 2021 డిసెంబర్ చివరికి ఉన్న రూ.2.56 లక్షల కోట్లతో పోలిస్తే 25 శాతం పెరిగింది. డిసెంబర్ త్రైమాసికంలో 189 లక్షల రుణాలను మంజూరు చేశాయి. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 165 లక్షల రుణాలుగానే ఉంది. 2022 డిసెంబర్ నాటికి మొత్తం 6.4 కోట్ల ఖాతాదారులకు సంబంధించి 12.6 కోట్ల రుణ ఖాతాలకు సేవలు అందించాయి. 83 ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలు అత్యదికంగా 38.5 శాతం వాటాతో రూ.1,23,386 కోట్ల రుణ పోర్ట్‌ఫోలియో కలిగి ఉన్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఎన్బీఎఫ్సీ–ఎంఫిన్‌లు రూ.15,951 కోట్ల నిధులు సమకూర్చుకున్నాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22.5 శాతం ఎక్కువ. సూక్ష్మ రుణాల విషయంలో ఎన్బీఎఫ్సీ–ఎంఎఫ్ఐలకు అధిక వాటా ఉండగా, ఆ తర్వాత బ్యాంకులు సూక్ష్మ రుణాల పరంగా ఎక్కువ మార్కెట్‌ను కలిగి ఉన్నట్టు ఎంఎఫిన్ సీఈవో, డైరెక్టర్ అలోక్ మిశ్రా తెలిపారు. నియంత్రణల పరిధిలోని అన్ని సంస్థలు సూక్ష్మ రుణాల పరంగా మంచి వృద్ధిని నమోదు చేయడం ఆశావహమని ఎంఫిన్ నెట్వర్క్ తెలిపింది. బీహార్ అతిపెద్ద సూక్ష్మ రుణ మార్కెట్‌గా అవతరించింది. ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమబెంగాల్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. -
గాడిన పడని ఎఫ్ఎంసీజీ రంగం
న్యూఢిల్లీ: వినియోగంపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ (ఎఫ్ఎంసీజీ) డిసెంబర్ త్రైమాసికంలో ప్రతికూల వృద్ధిని చూసింది. విశ్లేషణ సంస్థ నీల్సన్ఐక్యూ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 2022 అక్టోబర్–డిసెంబర్ కాలంలో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ అమ్మకాల విలువ 7.6 శాతం పెరిగింది. కానీ, విక్రయించిన ఉత్పత్తుల సంఖ్య పరంగా చూస్తే 0.3 శాతం తగ్గింది. విక్రయాల సంఖ్య పరంగా ప్రతికూల వృద్ధి పరిశ్రమలో నమోదైంది. కరోనా ముందు నాటితో పోలిస్తే విలువ, సంఖ్యా పరంగా అమ్మకాలు ఎగువనే ఉన్నాయి. వరుసగా ఆరో త్రైమాసికంలో గ్రామీణ మార్కెట్లో విలువ పరంగా 2.8 శాతం క్షీణత నమోదైంది. కానీ, గత డిసెంబర్ క్వార్టర్లో పట్టణ మార్కెట్లో ఎఫ్ఎంసీజీ పరిశ్రమ 1.6 శాతం వృద్ధిని చూసింది. రిటైల్ విభాగంలో ఆధునిక విక్రయ చానళ్లలో విలువ పరంగా 23.3 శాతం, సంఖ్యా పరంగా 12.6 శాతం చొప్పున వృద్ధి, అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోల్చినప్పుడు నమోదైంది. సంప్రదాయ చానళ్లు అయిన కిరాణా దుకాణాలు తదితర నమూనాల్లో అమ్మకాలు 1.5 శాతం తగ్గాయి. ‘‘వినియోగదారులు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటుండగా, తయారీదారులు కూడా ప్రోత్సాహకాలను తొలగించి మార్జిన్లను కాపాడుకునే విధానాన్ని అనుసరించారు’’అని నీల్సన్ ఐక్యూ కస్టమర్ సక్సెస్ లీడ్ సోనికా గుప్తా తెలిపారు. చిన్న ప్యాకెట్లకే మొగ్గు ‘‘సంప్రదాయ, ఆధునిక విక్రయ చానళ్లలో వినియోగదారులు ఇప్పటికీ చిన్న పరిమాణంలోని ప్యాకెట్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. తయారీ సంస్థలు సైతం విక్రయాల కోసం చిన్న ప్యాక్‌లను తమ పోర్ట్‌ఫోలియోలో నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొంది. చిన్న సంస్థల నుంచి పోటీ ఉండడం కూడా పోర్ట్‌ఫోలియో పరంగా వ్యూహాలను సమీక్షించుకోవాల్సిన అవసరం పెద్ద సంస్థలకు ఏర్పడింది. ఆహారోత్పత్తులకు వినియోగదారులు ప్రాధాన్యం ఇస్తూ, నాన్ ఫుడ్ ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులకు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని నీల్సన్ఐక్యూ నివేదిక తెలియజేసింది. నాన్ ఎఫ్ఎంసీజీ అమ్మకాలు అన్ని విభాగాల్లోనూ కరోనా ముందు నాటితో పోలిస్తే తక్కువగా నమోదువుతున్నట్టు చెప్పింది. -
నాట్కో మధ్యంతర డివిడెండ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ రంగ కంపెనీ నాట్కో ఫార్మా డిసెంబర్ త్రైమాసికం కన్సాలిడేటెడ్ ఫలితాల్లో నికరలాభం అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 22 శాతం తగ్గి రూ.62 కోట్లు సాధించింది. టర్నోవర్ రూ.591 కోట్ల నుంచి రూ.513 కోట్లకు పడిపోయింది. డిసెంబర్ త్రైమాసికానికి ఒక్కో షేరుకు రూ.1.25 మధ్యంతర డివిడెండ్ చెల్లించాలని బోర్డు నిర్ణయించింది. క్రితం ముగింపుతో పోలిస్తే నాట్కో షేరు ధర బీఎస్ఈలో గురువారం 0.38 శాతం క్షీణించి రూ.529.10 వద్ద స్థిరపడింది. -
హీరో లాభం రూ.721 కోట్లు
న్యూఢిల్లీ: హీరో మోటో కార్ప్ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.721 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభంతో పోలిస్తే 2.41 శాతం పెరిగింది. ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.8,118 కోట్లుగా ఉంది. 12.40 లక్షల యూనిట్ల మోటారు సైకిళ్లను విక్రయించినట్టు సంస్థ ప్రకటించింది. వ్యయాలు రూ.7,217 కోట్ల నుంచి రూ.7,373 కోట్లకు చేరాయి. ‘‘మా మార్కెట్ వాటా కాస్తంత కోలుకుంది. వచ్చే కొన్ని త్రైమాసికాల్లో ముఖ్యంగా ప్రీమియం విభాగంలో కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణతో మార్కెట్ వాటా పెంచుకుంటామని అంచనా వేస్తున్నాం’’అని హీరో మోటోకార్ప్ సీఎఫ్‌వో నిరంజన్ గుప్తా తెలిపారు. తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం ‘విదా’ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పలు పట్టణాలకు చేరువ చేస్తామన్నారు. -
హైదరాబాద్‌లో గృహ విక్రయాలు భేష్
న్యూఢిల్లీ: మెరుగైన అమ్మకాలతో డిసెంబర్ క్వార్టర్ (క్యూ3) ముగిసే నాటికి (2022 అక్టోబర్–డిసెంబర్) దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో విక్రయంకాని హౌసింగ్ స్టాక్‌లు 10 శాతం తగ్గి 4,61,600 యూనిట్లకు పడిపోయాయని ప్రోప్‌ఈక్విటీ సోమవారం ఒక నివేదికలో పేర్కొంది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో (క్యూ2–జూలై–సెప్టెంబర్) ఈ సంఖ్య 5,12,526 యూనిట్లుగా ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే, దేశ సగటుతో సమానంగా (10 శాతం) విక్రయంకాని గృహాల సంఖ్య క్యూ2, క్యూ3ల్లో 93,473 యూనిట్ల నుంచి 84,545కు తగ్గింది. నివేదికలో కొన్ని అంశాలను పరిశీలిస్తే.. ► తొమ్మిది నగరాల్లో హౌసింగ్ విక్రయాల సంఖ్య అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో 1,20,275 యూనిట్లు. సెప్టెంబర్ త్రైమాసికంతో పోల్చితే ఈ సంఖ్య 8 శాతం అధికంకాగా, 2021 ఇదే కాలంతో పోల్చితే 10 శాతం అధికం. ► రియల్ ఎస్టేట్ గణాంకాల విశ్లేషణ సంస్థ– ప్రోప్‌ఈక్విటీ తాజా డేటా కోసం పరిగణనలోకి తీసుకున్న గృహాల్లో అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఫ్లోర్లు విల్లాలు/గృహాలు ఉన్నాయి. హోల్డ్‌లో (నిలిచిపోయిన) ఉన్న అమ్మకాలు, నిర్మాణాల నిలిపివేత, లాటరీ ప్రాజెక్ట్‌లను ఈ గణాంకాల నుంచి మినహాయించడం జరిగింది. సవాళ్లు ఉన్నా... పటిష్ట రికవరీ అనేక సవాళ్లు ఉన్నప్పటికీ...ఈ ఏడాది గృహాల విక్రయాలు బాగా పుంజుకున్నాయి. ఇండస్ట్రీలో డిమాండ్, పాజిటివ్ సెంటిమెంట్ పెరుగుతుండటం గమనార్హం. వడ్డీరేట్లు స్థిరంగా పెరిగినప్పటికీ, కస్టమర్లు రుణాలు తీసుకోడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఆస్తుల ధర మున్ముందు పెరుగుతుందన్న అంచనాలు దీనికి ప్రధాన కారణం. – సమీర్ జసుజా, ప్రోప్‌ఈక్విటీ వ్యవస్థాపకుడు, ఎండీ మార్కెట్ సెంటిమెంట్ బాగుంది.. ఇంటి కొనుగోళ్లకు మార్కెట్ సెంటిమెంట్ భారీగా మెరుగుపడినందున భారతదేశం అంతటా అమ్మకాలు డిసెంబర్ త్రైమాసికంలో అలాగే 2022లో భారీ జంప్‌ను చూశాయి. కొనుగోళ్ల విషయంలో ఊగిసలాటలో ఉన్న చాలా మంది కస్టమర్లు ఇప్పుడు మార్కెట్లోకి తిరిగి వచ్చారు. దీనివల్లే చివరకు బ్లాక్‌బస్టర్ అమ్మకాలు జరిగాయి. – శివాంగ్ సూరజ్, ఇన్‌ఫ్రామంత్రా వ్యవస్థాపక డైరెక్టర్ సానుకూలం.. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పటికీ రియల్ ఎస్టేట్ రంగ సూచీ సానుకూల శ్రేణిలోనే ఉంది. వచ్చే ఆరు నెలలకు సంబంధించి సూచించే మా ఫ్యూచర్ సెంటిమెంట్ ఇండెక్స్ కొంత మెరుగుపడింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే, భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం, రియల్ ఎస్టేట్ రంగలో వృద్ధి అవకాశాల దృష్ట్యా భవిష్యత్తు సెంటిమెంట్ స్కోరు 2022 డిసెంబర్ త్రైమాసికంలో 58కి పెరిగింది. ఇది అంతకుముందు త్రైమాసికంలో 57గా ఉంది. – శిశిర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా సీఎండీ -
ఆఫీస్ స్పేస్ లీజింగ్ తగ్గింది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన నగరాల్లో కార్యాలయాల నికర లీజింగ్ స్థలం డిసెంబర్ త్రైమాసికంలో 31 శాతం తగ్గి 80 లక్షల చదరపు అడుగులుగా ఉంది. అంతర్జాతీయంగా ఎదురుగాలుల నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు తమ విస్తరణను ఆలస్యం చేయడమే ఇందుకు కారణమని జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. నివేదిక ప్రకారం.. అక్టోబర్–డిసెంబర్ కాలంలో చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్లో నికర లీజింగ్ డిమాండ్ అధికం కాగా, మిగిలిన నగరాల్లో తగ్గింది. నికర లీజింగ్ బెంగళూరు 50 శాతం క్షీణించి 12 లక్షల చ.అడుగులు, హైదరాబాద్‌లో 42 శాతం పడిపోయి 17.4 లక్షల చ.అడుగులు నమోదైంది. చెన్నైలో 45 శాతం పెరిగి 12.4 లక్షల చ.అడుగులు, ఢిల్లీ ఎన్సీఆర్లో 17 శాతం దూసుకెళ్లి 18.9 లక్షల చ.అడుగులుగా ఉంది. హైదరాబాద్, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పుణే, బెంగళూరు, కోల్‌కత, చెన్నై నగరాల్లో 2021తో పోలిస్తే ఈ ఏడాది కంపెనీలు తీసుకున్న లీజింగ్ స్థలం 46 శాతం అధికమై 3.8 కోట్ల చదరపు అడుగులకు చేరుకుంది. హైదరాబాద్‌లో 2022లో నికర లీజింగ్ రెండింతలై 89.6 లక్షల చ.అడుగులు నమోదైంది. -
డిసెంబర్ క్వార్టర్లో మాంద్యంలోకి యూరప్ దేశాలు
ఫ్రాంక్ఫర్ట్: ఊహించిన దానికన్నా ఎక్కువ కాలం అధిక ద్రవ్యోల్బణం కొనసాగే పరిస్థితులు కనిపిస్తుండటంతో ఈ ఏడాది డిసెంబర్ త్రైమాసికంలో యూరోపియన్ యూనియన్‌లోని (ఈయూ) చాలా మటుకు దేశాలు మాంద్యంలోకి జారుకోవచ్చని యూరోపియన్ కమిషన్ వెల్లడించింది. ద్రవ్యోల్బణంతో పాటు అధిక వడ్డీ రేట్లు, నెమ్మదిస్తున్న అంతర్జాతీయ వాణిజ్యం తదితర అంశాలు కూడా ఇందుకు కారణం కాగలవని పేర్కొంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2023) వృద్ధి అంచనాలను 0.3 శాతానికి తగ్గించింది. వాస్తవానికి ఇది 1.4 శాతంగా ఉండవచ్చని జూలైలో అంచనా వేశారు. ఈ ఏడాది ప్రథమార్ధంలో వృద్ధి ఆశ్చర్యకరంగా పటిష్టంగానే ఉన్నప్పటికీ, మూడో త్రైమాసికంలో ఈయూ ఎకానమీ వేగం తగ్గిందని యూరోపియన్ కమిషన్ తెలిపింది. దీంతో వచ్చే ఏడాదికి అంచనాలు గణనీయంగా బలహీనపడ్డాయని తెలిపింది. యూరప్‌లో అతి పెద్ద ఎకానమీ అయిన జర్మనీ పనితీరు 2023లో అత్యంత దుర్భరంగా ఉండవచ్చని పేర్కొంది. -
సంఘటిత రంగంలో పెరుగుతున్న ఉపాధి
న్యూఢిల్లీ: సంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు దేశంలో బలపడుతున్నాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పేర్కొన్నారు. 2021 డిసెంబర్ త్రైమాసికంలో తొమ్మిది పరిశ్రమలలో దాదాపు 3.14 కోట్ల మంది కార్మికులు ఉపాధి పొందారని, ఇది సంఘటిత రంగంలో ఉపాధిలో పెరుగుతున్న ధోరణిని సూచిస్తోందని ఆయన ఒక ట్వీట్ చేశారు. 2021 సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ సంఖ్య 3.10 కోట్లని తెలిపారు. ఈ మేరకు కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ త్రైమాసిక (అక్టోబర్–డిసెంబర్) సర్వే నివేదికలోని గణాంకాలను ఆయన ఉటంకించారు. గురువారం విడుదలైన నివేదికకు సంబంధించి ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► తొమ్మిది రంగాలు– తయారీ, నిర్మాణం, వాణిజ్యం, రవాణా, విద్య, ఆరోగ్యం, వసతి/రెస్టారెంట్లు, ఐటీ/బీపీఓ, ఆర్థిక సేవల విభాగాల్లో 10 లేదా అంతకంటే ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న సంస్థలకు సంబంధించి ఉపాధి డేటా ప్రాతిపదికన ఈ గణాంకాలు వెలువడ్డాయి. మొత్తం ఉపాధి రంగంలో ఈ తొమ్మిది రంగాల వాటా దాదాపు 85 శాతం. ► నివేదిక ప్రకారం అంచనా వేసిన మొత్తం కార్మికుల సంఖ్యలో దాదాపు 39 శాతం వాటాతో తయారీ రంగం మొదటి స్థానంలో నిలిచింది. తరువాత విద్యా రంగం 22 శాతంతో ఉంది. సమీక్షా కాలంలో తయారీ రంగంలో అత్యధికంగా 124 లక్షల మంది కార్మికులు ఉన్నారు. విద్యా రంగం 69.26 లక్షల మందిని కలిగిఉంది. ► వాటి తర్వాత ఐటీ/బీపీఓలు (34.57 లక్షలు), ఆరోగ్యం (32.86 లక్షలు), వాణిజ్యం (16.81 లక్షలు), రవాణా (13.20 లక్షలు), ఆర్థిక సేవలు (8.85 లక్షలు), వసతి/రెస్టారెంట్లు (8.11 లక్షలు), నిర్మాణ (6.19 లక్షలు) రంగాలు ఉన్నాయి. ► దాదాపు అన్ని (99.4 శాతం) విభాగాలు వేర్వేరు చట్టాల క్రింద నమోదయ్యాయి. ► మొత్తంమీద, దాదాపు 23.55 శాతం యూనిట్లు తమ కార్మికులకు ఉద్యోగ శిక్షణను అందించాయి. తొమ్మిది రంగాల్లో ఆరోగ్య విభాగంలోని 34.87 శాతం యూనిట్లు ఉద్యోగ శిక్షణను అందించగా, ఐటీ/బీపీఓల వాటా ఈ విషయంలో 31.1 శాతంగా ఉంది. ► కార్మిక మంత్రిత్వశాఖ నియంత్రణలో లేబర్ బ్యూరోతో ఈ సర్వే జరిగింది. వ్యవసాయేతర సంస్థల్లోని మొత్తం ఉపాధిలో ఎక్కువ భాగం ఈ తొమ్మిది ఎంపిక చేసిన రంగాలదే కావడం గమనార్హం. వ్యవస్థీకృత, అసంఘటిత విభాగాలలో ఉద్యోగాలు, నియామకాలకు సంబంధించి ఈ సర్వే నిర్వహణ జరుగుతుంది. -
మందగించిన జీడీపీ వృద్ధి రేటు
సాక్షి, న్యూఢిల్లీ: భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు బాగా మందగించింది. సెంబర్ 2018తో ముగిసిన మూడో త్రైమాసికంలో జీడీపీవృద్ధి రేటు 6.6 శాతంగా నమోదైంది. గత అయిదు త్రైమాసికాల్లో అంటే సెప్టెంబర్ 2017తో ముగిసిన క్వార్టర్ తర్వాత ఇదే అత్యంత నెమ్మదైన జీడీపీ వృద్ధి. అక్టోబర్-డిసెంబర్ మాసానికి సంబంధించిన జీడీపీ వృద్ధి గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సీఎస్ఓ) గురువారం ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉండొచ్చని గత నెల సీఎస్ఓ ముందుగా అంచనా వేసింది. గత ఏడాది ఇది 7 శాతంగా ఉంది. రాయిటర్స్ సర్వేలో 55 మంది ఆర్థిక నిపుణులు వృద్ధిరేటు 6.9 శాతంగా ఉంటుందని అంచనావేశారు. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ తక్కువ వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హం. 2018-19 ఆర్థిక సంవత్సరంలో స్థిర (2011-12) ధరల దగ్గర వాస్తవ జీడీపీ రూ.141.00 లక్ష కోట్ల స్థాయికి చేరనుందని అంచనా. జనవరి 31, 2019న ప్రకటించిన వివరాల ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరానికి అంతకుముందు సవరించిన జీడీపీ అంచనా రూ.131.80 లక్షల కోట్లుగా ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7 శాతం ఉంటుందని అంచనా. 2017-18లో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉందని సీఎస్ఓ పేర్కొంది. -
నిరాశపర్చిన పంజాబ్ నేషనల్ బ్యాంక్
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్ నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ క్వార్టర్ ఫలితాల్లో మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3 లో నికర లాభాలు పుంజుకుని రూ.207 కోట్లను నమోదు చేసింది. అయితే ఈ త్రైమాసికంలో పీఎన్బీ రూ. 555 కోట్లను ఆర్జించనుందని మార్కెట్ వర్గాలు అంచనావేశాయి. గత ఏడాదితో పోలిస్తే 306శాతం పెరుగుదలను నమోదు చేసినపప్పటికీ ఈ త్రైమాసికంలో పీఎన్బీ రూ. 555 కోట్లను ఆర్జించనుందని మార్కెట్ వర్గాలు అంచనావేశాయి. మొత్తం ఆదాయం రూ. 14, 498కోట్లను సాధించింది. గత ఏడాది ఇది రూ. 13891కోట్లుగా ఉంది. డీమానిటైజేషన్ కాలంలో తమకు టఫ్టైం అని బ్యాంక్ తెలపింది.అయితే సిబ్బంది ఈ ఛాలెంజ్‌ను విజయవంతంగా అధిగమించారని చెప్పింది. క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో నికర లాభం రూ.51 కోట్ల నుంచి రూ.207 కోట్లకు పుంజుకున్నాయి. ఇందుకు బకాయిలు(స్లిప్పేజెస్) తగ్గడం కారణమైనట్లు బ్యాంక్ తెలిపింది. ఈ క్వార్టర్లో ఫ్రెష్ స్లిప్పేజెస్ రూ. 5089 కోట్ల నుంచి రూ. 4800 కోట్లకు తగ్గినట్లు వెల్లడించింది. కాగా, నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) రూ. 4119 కోట్ల నుంచి రూ. 3731 కోట్లకు క్షీణించింది. ప్రొవిజన్లు రూ. 3,775 కోట్ల నుంచి తగ్గి రూ. 2,936 కోట్లకు పరమితమయ్యాయి. ఇక త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 13.63 శాతం నుంచి 13.7 శాతానికి నామమాత్రంగా పెరిగితే.. నికర ఎన్పీఏలు 9.1 శాతం నుంచి 9.09 శాతానికి స్వల్పంగా మెరుగయ్యాయి. -
పండుగ సీజన్లో పసిడి వెలవెల..
డిసెంబర్ త్రైమాసికంలో 8 ఏళ్ల కనిష్టానికి డిమాండ్ వర్షాభావ పరిస్థితులతో తగ్గిన రైతుల ఆదాయాలు గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిన కొనుగోళ్లు ముంబై: పెట్టుబడులపరమైన డిమాండ్ లేకపోవడం, వర్షాభావం వల్ల కరువుతో రైతుల ఆదాయాలు తగ్గిపోవడం తదితర అంశాల కారణంగా ఈసారి పండుగ సీజన్లో పసిడి అమ్మకాలు గణనీయంగా తగ్గనున్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో పుత్తడి డిమాండ్ ఏకంగా 8 ఏళ్ల కనిష్టానికి పడిపోవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం సాధారణంగా ఈ త్రైమాసికంలో అయిదేళ్ల సగటు చూస్తే డిమాండ్ 231 టన్నులు ఉండగా, గతేడాది 201.6 టన్నులుగా ఉంది. అయితే, ఈసారి మాత్రం 150-175 టన్నులు మాత్రమే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్ డెరైక్టర్ బచ్‌రాజ్ బమల్వా తెలిపారు. వివాహాది శుభకార్యాలతో పాటు ధన్తేరస్, దీపావళి తదితర పండుగల సమయం కావడంతో దేశీయంగా పసిడి అమ్మకాల్లో మూడో వంతు విక్రయాలు డిసెంబర్ త్రైమాసికంలోనే జరుగుతుంటాయి. ఇక మూడింట రెండొంతుల డిమాండ్ గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటుంది. అయితే, వాతావరణ మార్పులతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం రైతుల ఆదాయాలను తత్ఫలితంగా వారి కొనుగోలు సామర్థ్యాన్ని దెబ్బతీసింది. దీంతో పండుగ సీజన్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో పసిడికి డిమాండ్ అంతంతమాత్రంగానే నమోదైంది. ఈ పరిస్థితుల్లో డిసెంబర్ త్రైమాసికంలో పసిడి దిగుమతుల విలువ 5.7 బిలియన్ డాలర్ల స్థాయికి తగ్గొచ్చని పేర్కొన్నాయి. రూపాయి ఎఫెక్ట్ ..: అంతర్జాతీయంగా డాలర్ మారకంలో బంగారం రేట్లు అయిదేళ్ల కనిష్టానికి 9.3 శాతం మేర తగ్గినా.. ఇటు రూపాయి విలువా దాదాపు అయిదు శాతం క్షీణించడంతో భారత్‌లో పసిడి ధర తగ్గుదల 5.5 శాతానికి మాత్రమే పరిమితం అయ్యింది. ఇలా రేటు తగ్గాల్సిన స్థాయిలో తగ్గకపోవడం కూడా డిమాండ్‌పై ప్రభావం చూపినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. ధర ఇంకా పెరుగుతుందన్న ఆశలు లేకపోవడం వల్ల పెట్టుబడుల కోసం చేసే కొనుగోళ్లు కూడా పెద్దగా జరగలేదని వివరించాయి. వెయ్యి టన్నులు దాటనున్న దిగుమతులు.. అంతర్జాతీయంగా రేట్ల తగ్గుదల ఊతంతో భారత్ దిగుమతులు ఈ ఏడాది ఆల్ టైమ్ గరిష్టం 1,000 టన్నుల స్థాయిని మించగలదని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్ అంచనా వేసింది. 2014లో భారత్ 900 టన్నులు దిగుమతి చేసుకుంది. ధర తగ్గుదల ప్రయోజనాలు పొందేందుకు ఈ ఏడాది మరిన్ని దిగుమతులు జరుగుతున్నాయని ఫెడరేషన్ డెరైక్టర్ బచ్‌రాజ్ బమల్వా పేర్కొన్నారు. ఫెడరేషన్ గణాంకాల ప్రకారం జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో భారత్ 850 టన్నులు దిగుమతి చేసుకుంది. -
7.4 శాతానికి జీడీపీ జోరు..
డిసెంబర్ త్రైమాసికంలో 7.5% - వృద్ధి రేటులో చైనాను అధిగమించనున్న భారత్ - కొత్త గణాంకాల విధానంతో వృద్ధి స్పీడ్ - వ్యవసాయంలో మాత్రం నీరసం న్యూఢిల్లీ: ప్రస్తుత పూర్తి ఆర్థిక సంవత్సరం (2014-15)లో దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు జోరందుకుని, 7.4 శాతానికి పెరుగుతుందని ప్రభుత్వం తాజా అంచనాల్లో ప్రకటించింది. 2004-05 నుంచి 2011-12కు బేస్ ఇయర్ మార్పు ప్రకారం ప్రభుత్వం సోమవారం తాజాగా ఈ అడ్వాన్డ్ (ముం దస్తు) అంచనా గణాంకాలను విడుదల చేసింది. మారిన బేస్ ఇయర్ ప్రకారం గత ఆర్థిక సంవత్సరం 2013-14లో వృద్ధి రేటును 4.7%-6.9%కి ఇటీవల సవరించిన సంగతి తెలిసిందే. తాజా ఫార్ముల్లాకు అనుగుణంగా ప్రస్తుత ఏడాది వృద్ధి రేటు 6.9% నుంచి 7.4 శాతానికి (గత అంచనాలు 5.5%) ఎగబాకనున్నట్లు కేంద్ర గణాంకాల విభాగం (సీఎస్ఓ) అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 7.5%గా నమోదయ్యింది. విలువల్లో... వాస్తవిక జీడీపీ (లేదా) 2011-12 స్థిర ధరల ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ విలువ రూ. 106.57 లక్షల కోట్లు ఉంటుందని తాజా విధానం అంచనా వేస్తోంది. 2015 జనవరి 30న విడుదలైన ఫస్ట్ రివైజ్డ్ అంచనా ప్రకారం గడచిన ఆర్థిక సంవత్సరం (2013-14) ఈ విలువ రూ.99.21 లక్షల కోట్లు. అంటే 2013-14 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 2014-15లో జీడీపీ విలువ 7.4 శాతం వృద్ధితో రూ.99.21 లక్షల కోట్ల నుంచి రూ.106.57 లక్షల కోట్లకు చేరుతుందన్నమాట. ప్రస్తుత ధరల ప్రకారం జీడీపీ విలువ 2013-14 ఆర్థిక సంవత్సరం రూ.113.45 లక్షల కోట్లతో పోల్చితే 2014-15లో 11.5% వృద్ధితో రూ.126.54 లక్షల కోట్ల స్థాయికి పెరుగుతుందని ప్రభుత్వం అంచనావేసింది. రంగాల వారీగా ఇలా: డిసెంబర్ త్రైమాసికంలో 7 శాతానికి పైగా వృద్ధి రేటును నమోదుచేసుకున్న రంగాల్లో ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెసనల్ సర్వీసులు, ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్లు, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, ఇతర యుటిలిటీ సర్వీసులు ఉన్నాయి. వ్యవసాయం. అటవీ, మత్య్స విభాగాలు కలిపి కేవలం 1.1% వృద్ధిని నమోదుచేసుకున్నాయి. ఒక్క వ్యవసాయ రంగంలో అసలు వృద్ధిలేకపోగా 0.4 శాతం (మైనస్) క్షీణత నమోదయ్యింది. చైనాను అధిగమించడంపై: అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా నమోదయితే, ఈ రేటు విషయంలో భారత్ చైనాను అధిగమించినట్లవుతుంది. ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి మొదటి దేశమవుతుంది. అయితే ఈ విషయంలో సెంట్రల్ స్టాటిస్టిక్స్ అధికారి అశిష్ కుమార్ విభిన్నంగా స్పందించారు. చైనా ఆర్థిక వ్యవస్థ పరిమాణం మనదేశం ఆర్థిక పరిమాణం కన్నా నాలుగైదురెట్లు అధికమని ఈ కారణంగా మన దేశంలో ఏడు శాతం వృద్ధి కొనసాగినా... ఆ దేశ ఆర్థిక వ్యవస్థను అధిగమించాలంటే మనకు ఇంకా 20 నుంచి 30 ఏళ్లు పడుతుందని అన్నారు. బేస్ ఇయర్ అంటే: వివిధ రంగాలకు సంబంధించిన గణాంకాలకు ఒక నిర్దిష్ట ఏడాదిని మూలంగా తీసుకుని అప్పటి ధర/విలువ ప్రాతిపదికన తదుపరి ప్రతి ఏడాదీ పెరిగే ధర/విలువ వృద్ధి తీరును పరిశీలించడం జరుగుతుంది. పెరుగుదలను శాతాల్లో చూపుతారు. ఈ లెక్కింపునకు ప్రాతిపదికగా తీసుకున్న సంవత్సరాన్నే ‘బేస్ ఇయర్’ అంటారు. వృద్ధి పెరగడం లెక్కల్లో పొరపాటా?-అసోచామ్ బేస్ ఇయర్ మార్పుతో ప్రకటించిన కొత్త జీడీపీ అం చనాలు ఆయోమయం సృష్టిస్తున్నాయని పారిశ్రామిక చాం బర్ అసోచామ్ విమర్శించింది. జీడీపీ లెక్కింపు మారినంతనే ఆర్థిక వ్యవస్థ మందగమనం నుంచి జోరుపెరిగినట్లు కన్పిస్తున్నదంటే, ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్లుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ రావత్ అన్నారు. వ్యవస్థలో పెట్టుబడుల పునరుద్ధరణ జరగలేదని, చమురు ధరలు తగ్గినప్పటికీ, వినియోగ డిమాండ్ పెరగలేదని వ్యాఖ్యానించారు. నెలవారీ తలసరి ఆదాయం రూ.7,378 10 శాతం పెరుగుదల జీవన ప్రమాణ సూచికగా భావించే నెలవారీ తలసరి ఆదాయం తాజా గణాంకాల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.7,378.17(119 డాలర్లు)కు పెరగనుంది. ఇది 10% ఎక్కువ. బేస్ ఇయర్ మారడంతో తలసరి ఆదాయం గణాంకాలు కూడా మారాయి. కొత్త అంచనాల ప్రకారం, గత ఆర్థిక సంవత్సరం నెలవారీ తలసరి ఆదాయం రూ.6,699గా ఉంది. వస్తువుల, సేవలకు జత అయిన స్థూల విలువతో పాటు పరోక్ష పన్నులను కూడా మదింపు చేసి కొత్త తలసరి ఆదాయాన్ని గణించారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ.80,388గా ఉన్న వార్షిక తలసరి నికర ఆదాయం 2014-15 ఆర్థిక సంవత్సరంలో 10% వృద్ధితో రూ.88,538కు (ప్రస్తుత ధరల ప్రకారం) పెరుగుతుంది. స్థిర ధరల్లో 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 5,829.92గా ఉన్న నెలవారీ తలసరి ఆదాయం 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.6,182.75కు పెరుగుతుంది.