పండుగ సీజన్‌లో పసిడి వెలవెల..
డిసెంబర్ త్రైమాసికంలో
8 ఏళ్ల కనిష్టానికి డిమాండ్
వర్షాభావ పరిస్థితులతో తగ్గిన
రైతుల ఆదాయాలు
గ్రామీణ ప్రాంతాల్లో తగ్గిన కొనుగోళ్లు
ముంబై: పెట్టుబడులపరమైన డిమాండ్ లేకపోవడం, వర్షాభావం వల్ల కరువుతో రైతుల ఆదాయాలు తగ్గిపోవడం తదితర అంశాల కారణంగా ఈసారి పండుగ సీజన్‌లో పసిడి అమ్మకాలు గణనీయంగా తగ్గనున్నాయి. డిసెంబర్ త్రైమాసికంలో పుత్తడి డిమాండ్ ఏకంగా 8 ఏళ్ల కనిష్టానికి పడిపోవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం సాధారణంగా ఈ త్రైమాసికంలో అయిదేళ్ల సగటు చూస్తే డిమాండ్ 231 టన్నులు ఉండగా, గతేడాది 201.6 టన్నులుగా ఉంది. అయితే, ఈసారి మాత్రం 150-175 టన్నులు మాత్రమే ఉండగలదని అంచనా వేస్తున్నట్లు ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్ డెరైక్టర్ బచ్‌రాజ్ బమల్వా తెలిపారు.
వివాహాది శుభకార్యాలతో పాటు ధన్‌తేరస్, దీపావళి తదితర పండుగల సమయం కావడంతో దేశీయంగా పసిడి అమ్మకాల్లో మూడో వంతు విక్రయాలు డిసెంబర్ త్రైమాసికంలోనే జరుగుతుంటాయి. ఇక మూడింట రెండొంతుల డిమాండ్ గ్రామీణ ప్రాంతాల నుంచే ఉంటుంది. అయితే, వాతావరణ మార్పులతో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం రైతుల ఆదాయాలను తత్ఫలితంగా వారి కొనుగోలు సామర్థ్యాన్ని దెబ్బతీసింది. దీంతో పండుగ సీజన్‌లోనూ గ్రామీణ ప్రాంతాల్లో పసిడికి డిమాండ్ అంతంతమాత్రంగానే నమోదైంది. ఈ పరిస్థితుల్లో డిసెంబర్ త్రైమాసికంలో పసిడి దిగుమతుల విలువ 5.7 బిలియన్ డాలర్ల స్థాయికి తగ్గొచ్చని పేర్కొన్నాయి.
రూపాయి ఎఫెక్ట్ ..: అంతర్జాతీయంగా డాలర్ మారకంలో బంగారం రేట్లు అయిదేళ్ల కనిష్టానికి 9.3 శాతం మేర తగ్గినా.. ఇటు రూపాయి విలువా దాదాపు అయిదు శాతం క్షీణించడంతో భారత్‌లో పసిడి ధర తగ్గుదల 5.5 శాతానికి మాత్రమే పరిమితం అయ్యింది. ఇలా రేటు తగ్గాల్సిన స్థాయిలో తగ్గకపోవడం కూడా డిమాండ్‌పై ప్రభావం చూపినట్లు పరిశ్రమవర్గాలు తెలిపాయి. ధర ఇంకా పెరుగుతుందన్న ఆశలు లేకపోవడం వల్ల పెట్టుబడుల కోసం చేసే కొనుగోళ్లు కూడా పెద్దగా జరగలేదని వివరించాయి.
వెయ్యి టన్నులు దాటనున్న దిగుమతులు..
అంతర్జాతీయంగా రేట్ల తగ్గుదల ఊతంతో భారత్ దిగుమతులు ఈ ఏడాది ఆల్ టైమ్ గరిష్టం 1,000 టన్నుల స్థాయిని మించగలదని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ ట్రేడ్ ఫెడరేషన్ అంచనా వేసింది. 2014లో భారత్ 900 టన్నులు దిగుమతి చేసుకుంది. ధర తగ్గుదల ప్రయోజనాలు పొందేందుకు ఈ ఏడాది మరిన్ని దిగుమతులు జరుగుతున్నాయని ఫెడరేషన్ డెరైక్టర్ బచ్‌రాజ్ బమల్వా పేర్కొన్నారు. ఫెడరేషన్ గణాంకాల ప్రకారం జనవరి-సెప్టెంబర్ మధ్య కాలంలో భారత్ 850 టన్నులు దిగుమతి చేసుకుంది.