
పెరిగిపోయిన మొండి బాకీలు
డిసెంబర్ క్వార్టర్‌పై క్రిఫ్ హైమార్క్ నివేదిక
ముంబై: సూక్ష్మ రుణ రంగంలో సంక్షోభం కొనసాగుతోంది. డిసెంబర్ త్రైమాసికంలో రుణ వితరణ క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చిచూసినప్పుడు 42 శాతం మేర తగ్గిపోయినట్టు క్రిఫ్ హైమార్క్ నివేదిక తెలిపింది. మొత్తం 1.19 కోట్ల రుణ దరఖాస్తులకు ఆమోదం లభించినట్టు.. వీటి ద్వారా రూ.63,400 కోట్ల రుణాలు జారీ చేసినట్టు తెలిపింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రుణ వితరణ రూ.97,400 కోట్లుగా ఉంది.
పేదలు, తక్కువ ఆదాయ వర్గాలు సూక్ష్మ రుణ ఖాతాదారులుగా ఉండడం గమనార్హం. 31–180 రోజుల వరకు చెల్లింపుల్లేని రుణాలు (మొండి బాకీలు) మొత్తం రుణాల్లో 6.4 శాతానికి పెరిగాయి. 2023 డిసెంబర్ చివరికి ఇవి 2 శాతంగానే ఉన్నాయి. ఈ ప్రకారం సూక్ష్మ రుణ రంగంలో తీవ్ర ఒత్తిళ్లు నెలకొన్నట్టు తెలుస్తోంది.
సూక్ష్మ రుణ సంస్థల నిర్వహణలోని మొత్తం రుణ ఆస్తులు 2023 డిసెంబర్‌తో పోల్చి చూస్తే 4 శాతం మేర, 2024 సెపె్టంబర్ త్రైమాసికంతో పోల్చి చూస్తే 5.4 శాతం క్షీణించి రూ.3.91 లక్షల కోట్లుగా ఉన్నాయి.
ఒక్కో వ్యక్తికి గరిష్టంగా కొన్ని సంస్థల పరిధిలోనే రుణాల మంజూరు పరిమితులు ప్రభావం చూపించినట్టు ఈ నివేదిక తెలిపింది. యాక్టివ్ రుణాలు (లావాదేవీలు కలిగిన) డిసెంబర్ చివరికి 14.6 కోట్లకు తగ్గాయి. ఏడాది క్రితం ఇవి 15.7 కోట్లుగా ఉన్నాయి. అత్యధికంగా కేరళలో 15.8 శాతం, రాజస్థాన్‌లో 11.6 శాతం, ఒడిశాలో 9 శాతం, తమిళనాడులో 8.3 శాతం చొప్పున సూక్ష్మ రుణ వితరణ తగ్గింది. యూపీలో మాత్రం 1.2 శాతం వృద్ధి నమోదైంది.