ముంబై: దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) డిసెంబర్ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.2 శాతంగా నమోదయ్యింది. విలువలో ఇది 18.2 బిలియన్ డాలర్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గణాంకాల ప్రకారం.. రెండవ త్రైమాసికంతో పోల్చితే మూడవ త్రైమాసికంలో క్యాడ్ గణనీయంగా తగ్గింది. రెండవ త్రైమాసికంలో క్యాడ్ 30.9 బిలియన్ డాలర్లు. జీడీపీలో ఇది 3.7 శాతం.
వస్తు ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు రెండవ త్రైమాసింకంతో పోల్చితే మూడవ త్రైమాసికంలో 78.3 బిలియన్ డాలర్ల నుంచి 72.7 బిలియన్ డాలర్లకు తగ్గడం క్యాడ్ తగ్గుదలకు దారితీసినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఈ కాలంలో సేవల రంగం ఎగుమతులు కూడా గణనీయంగా 24.5 శాతం మేర పెరిగాయి. అయితే నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రం 2021 ఇదే కాలంతో పోల్చితే 4.6 బిలియన్ డాలర్ల నుంచి 2.1 బిలియన్ డాలర్లరు తగ్గాయి. నికర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ కూడా 5.8 బిలియన్ డాలర్ల నుంచి 4.6 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మద్య చూస్తే, కరెంట్ అకౌంట్‌లోటు జీడీపీలో 2.7 శాతంగా నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో ఈ లోటు 1.1 శాతం.
Comments
Please login to add a commentAdd a comment