foreign exchange
-
విదేశీ మారక ద్రవ్య నిల్వలు@644.391 బిలియన్ డాలర్లు
ముంబై: భారత్ విదేశీ మారక నిల్వలు డిసెంబర్ 20తో ముగిసిన వారంలో.. అంతక్రితం వారం (డిసెంబర్ 13) ముగింపుతో పోల్చితే 8.478 బిలియన్ డాలర్లు తగ్గి 644.391 బిలియన్ డాలర్లకు చేరాయి. డిసెంబర్ 13తో మగిసిన వారంలో కూడా నిల్వలు 1.988 బిలియన్ డాలర్లు తగ్గి ఆరు నెలల కనిష్ట స్థాయి 652.869 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి.నిల్వలు గత కొన్ని వారాలుగా తగ్గుతూ వస్తుండడం గమనార్హం. డాలర్ మారకంలో రూపాయి స్థిరీకరణ కోసం ఆర్బీఐ డాలర్లను మార్కెట్లోకి పంప్ చేయడం, మారకద్రవ్య రీ వ్యాల్యూయేషన్లు దీనికి ప్రధాన కారణం. సెపె్టంబర్ చివరిలో విదేశీ మారక నిల్వలు ఆల్‌టైమ్ గరిష్టం 704.885 బిలియన్ డాలర్లకు తాకిన సంగతి తెలిసిందే.విదేశీ కరెన్సీ ఆస్తులుయూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీల విలువల పెరుగుదల, క్షీణత ప్రభావానికి లోనయ్యే మొత్తం విదేశీ కరెన్సీ అసెట్స్ (డాలర్లు) 6.014 బిలియన్ డాలర్లు తగ్గి, 556.562 బిలియన్ డాలర్లకు చేరాయి. బంగారం నిల్వలు విదేశీ మారకద్రవ్య నిల్వలో భాగమైన బంగారం నిల్వలు 2.33 బిలియన్ డాలర్లు తగ్గి 65.726 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. ప్రత్యేక డ్రాయింగ్ హక్కులు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద నిల్వల ప్రత్యేక డ్రాయింగ్ హక్కులకు సంబంధించిన ఈ విభాగం విలువ 112 మిలియన్ డాలర్లు తగ్గి 17.885 బిలియన్ డాలర్లకు దిగివచ్చింది. ఐఎంఎఫ్ వద్ద నిల్వలు ఐఎంఎఫ్ వద్ద నిల్వల పరిమాణం 23 మిలియన్ డాలర్లు తగ్గి, 4.217 బిలియన్ డాలర్లకు చేరింది. -
విదేశీ మారకద్రవ్య నిల్వలు: భారత్‌లో ఇంత తగ్గాయా?
భారతదేశంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా తగ్గిపోయాయి. డిసెంబర్ 13తో ముగిసిన వారానికి ఇండియన్ ఫారెక్స్ నిల్వలు 1.988 బిలియన్ డాలర్లు తగ్గి 652.869 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్బీఐ వెల్లడించింది. అంతకు ముందువారంలో.. మొత్తం నిల్వలు 3.235 బిలియన్ల డాలర్లు తగ్గి 654.857 బిలియన్ల వద్ద నిలిచాయి.విదేశీ మారకద్రవ్య నిల్వలు గత కొన్ని వారాలుగా తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. డాలర్ విలువతో పోలిస్తే.. ఇతర కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. విదేశీ కరెన్సీ ఆస్తులలో మార్పులు ఫారెక్స్ మార్కెట్లో సెంట్రల్ బ్యాంక్ జోక్యంతో పాటు నిల్వలలో ఉన్న విదేశీ ఆస్తుల విలువ పెరగడం లేదా తరుగుదల కారణంగా సంభవిస్తాయి.రూపాయిలో అస్థిరతలను తగ్గించడంలో సహాయపడటానికి ఆర్బీఐ చేసిన ఫారెక్స్ మార్కెట్ జోక్యాలతో పాటు రీవాల్యుయేషన్ కూడా తగ్గుముఖం పట్టింది. సెప్టెంబరులో ఫారెక్స్ నిల్వలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి 704.885 బిలియన్ డాలర్లకు పెరిగాయి.మారక ద్రవ్య నిల్వలు తగ్గినప్పటికీ.. బంగారం నిల్వలు 1.121 బిలియన్ డాలర్లు పెరిగి 68.056 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (SDRs) 35 మిలియన్ డాలర్లు తగ్గి 17.997 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు సమాచారం. -
భారత్ సరికొత్త రికార్డ్: ఆర్బీఐ
భారతదేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు వరుసగా ఏడు వారాలపాటు స్థిరమైన పెరుగుదలను నమోదు చేశాయి. దీంతో విదేశీ మారకద్రవ్య నిల్వలు మొదటిసారి 12.588 బిలియన్ డాలర్లు పెరిగి.. 700 బిలియన్స్ దాటినట్లు రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా (RBI) వెల్లడించింది. ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద పెరుగుదలలో ఇది ఒకటని ఆర్బీఐ పేర్కొంది.విదేశీ మార్కద్యవ్య నిల్వలు 700 బిలియన్ డాలర్లు దాటడంతో.. చైనా, జపాన్, స్విట్జర్లాండ్ తరువాత ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. రీవాల్యుయేషన్ లాభాలు, స్పాట్ మార్కెట్ డాలర్ కొనుగోళ్ల కారణంగా విదేశీ కరెన్సీ ఆస్తులు 10.46 బిలియన్లు పెరిగాయి.ఇదీ చదవండి: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అవిరల్ జైన్గత వారం (సెప్టెంబర్ 20) విదేశీ మారకద్రవ్య నిల్వలు 2.84 బిలియన్ డాలర్లు పెరి 692.29 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆ తరువాత మారకద్రవ్య నిల్వలు మొదటిసారి 12.588 బిలియన్ డాలర్లు పెరిగి 704.885 బిలియన్ డాలర్లకు చేరుకుంది. సెప్టెంబర్ 20న బంగారం నిల్వలు కూడా 2.18 బిలియన్ డాలర్లు పెరిగి 65.79 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. -
రికార్డు స్ధాయి దిశగా ఫారెక్స్ నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వల పరిమాణం రికార్డుల స్థాయిగా కదులుతోంది. జనవరి 12వ తేదీతో ముగిసిన వారంలో నిల్వలు 1.63 బిలియన్ డాలర్లు పెరిగి 618.9 బిలియన్ డాలర్లకు ఎగశాయి. 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయి 645 బిలియన్ డాలర్లకు ఎగశాయి. రూపాయి పటిష్టతను కాపాడడం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గరిష్ట స్థాయిల నుంచి దాదాపు 100 బిలియన్ డాలర్లకుపైగా తగ్గినప్పటికీ తిరిగి కొంత ఒడిదుడుకులతో ఎగువదిశగా ఫారెక్స్ నిల్వలు ఎగశాయి. ప్రస్తుత దేశ ఫారెక్స్ నిల్వలు 13 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. ► మొత్తం నిల్వల్లో ప్రధాన భాగంగా ఉన్న డాలర్ల రూపంలోని ఫారిన్ కరెన్సీ అసెట్స్ 1.859 బిలియన్ డాలర్లు ఎగసి 548.508 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► పసిడి నిల్వల విలువ 242 మిలియన్ డాలర్ల పెరిగి 47.247 బిలియన్ డాలర్లకు ఎగసింది. ► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)– స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) విలువ 12 మిలియన్ డాలర్లు పెరిగి 18.31 బిలియన్ డాలర్లకు చేరింది. ► ఐఎంఎఫ్ వద్ద భారత్ నిల్వల 6 మిలియన్ డాలర్లు పెరిగి 4.872 బిలియన్ డాలర్లకు ఎగసింది. -
భారీగా తగ్గిన కరెంట్ అకౌంట్ లోటు
ముంబై: నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చి–పోయే విదేశీ మారక ద్రవ్యం నికర వ్యత్యాలను ప్రతిబింబించే భారత్ కరెంట్ అకౌంట్.. తాజా అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతికి అద్దం పడుతోంది. భారత్ కరెంట్ అకౌంట్ లోటు (సీఏడీ– క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం జూలై–సెపె్టంబర్ కాలంలో భారీగా ఒక శాతానికి (స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ విలువలతో పోల్చి) పరిమితమైంది. విలువల్లో ఇది 8.3 బిలియన్ డాలర్లు. సమీక్షా కాలంలో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు తగ్గడం, సేవల రంగం ఎగుమతుల్లో పెరుగుదల దీనికి కారణం. 2022 ఇదే కాలంలో కరెంట్ అకౌంట్ లోటు 3.8 శాతంగా (విలువలో 30.9 బిలియన్ డాలర్లు) నమోదయ్యింది. ఆర్బీఐ తాజా ఈ తాజా గణాంకాలను విడుదల చేసింది. తాజా ముఖ్య గణాంకాలను పరిశీలిస్తే.. ► 2022–23 జూలై–సెపె్టంబర్ నెలల్లో వస్తు ఎగుమతుల విలువ 78.3 బిలియన్ డాలర్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ 61.9 బిలియన్ డాలర్లకు తగ్గింది. ► సేవల ఎగుమతులు 4 శాతం ఎగశాయి. సాఫ్ట్వేర్ ఎగుమతులు పెరగడం, వ్యాపార, పర్యాటక సేవలు మెరుగుపడ్డాయి. ఎగుమతుల ఒడిదుడుకులు... అంతర్జాతీయ తీవ్ర అనిశ్చితి పరిస్థితులకు భారత్ వస్తు ఎగుమతులు అద్దం పడుతున్నాయి. అక్టోబర్‌లో ‘ప్లస్’లోకి వచి్చన ఎగుమతులు తిరిగి నవంబర్‌లో మైనస్‌లోకి జారిపోయాయి. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, ఉక్రెయిన్ యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం సవాళ్లు, కఠిన ద్రవ్య పరిస్థితుల నేపథ్యంలో 2023 ఫిబ్రవరి నుంచి జూలై వరకూ భారత్ వస్తు ఎగుమతుల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణతలో నడిచాయి. అయితే ఆగస్టులో వృద్ధిలోకి (3.88 శాతం) మారినా, మళ్లీ సెప్టెంబర్‌లో 2.6 శాతం క్షీణించాయి. అక్టోబర్‌లో సానుకూల ఫలితం వెలువడింది. మరుసటి నెల– నవంబర్లోనే మళ్లీ క్షీణరేటు నమోదయ్యింది. ఇక దిగుమతుల విషయానికి వస్తే.. 10 నెలల తర్వాత అక్టోబర్‌లో ఎగువబాటకు చేరిన దిగుమతులు నవంబర్‌లో మళ్లీ క్షీణతలోకి జారాయి. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 6.51 శాతం క్షీణించి 278.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతుల విలువ కూడా 8.67 శాతం క్షీణించి 445.15 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు– ఈ ఏడు నెలల్లో 166.36 బిలియన్ డాలర్లుగా ఉంది. -
విదేశాల్లో డైరెక్ట్ లిస్టింగ్‌కు గ్రీన్ సిగ్నల్..
న్యూఢిల్లీ: భారతీయ కంపెనీలు విదేశీ ఎక్స్చెంజీలలో నేరుగా లిస్టయ్యేందుకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం కంపెనీల చట్టంలో సంబంధిత సెక్షన్ 5ని నోటిఫై చేసింది. దీని ప్రకారం నిర్దిష్ట తరగతులకు చెందిన పబ్లిక్ కంపెనీలు .. ఆమోదయోగ్యమైన కొన్ని విదేశీ స్టాక్ ఎక్స్చెంజీలలో తమ షేర్లను లిస్ట్ చేసుకోవచ్చు. అయితే, ఈ సెక్షన్‌కు సంబంధించిన నిబంధనలను ఇంకా నోటిఫై చేయాల్సి ఉంది. విదేశాల్లో లిస్టింగ్ కోసం విదేశీ మారక నిర్వహణ చట్టం మొదలైన వాటిని కూడా సవరించాల్సి ఉంటుందని న్యాయ సేవల సంస్థ సిరిల్ అమర్‌చంద్ మంగళ్‌దాస్ పార్ట్నర్ యష్ అషర్ తెలిపారు. తాజా పరిణామంతో పెట్టుబడుల సమీకరణకు దేశీ కంపెనీలకు మరో మాధ్యమం అందుబాటులోకి వచ్చినట్లవుతుందని పేర్కొన్నారు. అయితే, వ్యాల్యుయేషన్లను అంతర్జాతీయ ఇన్వెస్టర్లు లెక్కగట్టే విధానం, విదేశాల్లో లిస్టింగ్ వల్ల వాణిజ్యపరంగా ఒనగూరే ప్రయోజనాలు మొదలైన వాటన్నింటినీ కంపెనీలు మదింపు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం దేశీ కంపెనీలు అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో విదేశాల్లో లిస్టవుతున్నాయి. 2020 మే నెలలో కోవిడ్ ఉపశమన ప్యాకేజీలో భాగంగా భారతీయ సంస్థలు విదేశాల్లో నేరుగా లిస్టయ్యేందుకు అనుమతించే ప్రతిపాదనను కేంద్రం తెరపైకి తెచ్చింది. సదరు సంస్థలు ప్రపంచ మార్కెట్ల నుంచి పెట్టుబడులను సమీకరించుకునేందుకు తోడ్పా టు అందించేలా దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు జూలై 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. పటిష్టమైన మనీలాండరింగ్ నిబంధనలు అమలయ్యే ఎన్వైఎస్ఈ, నాస్డాక్, ఎల్ఎస్ఈ మొదలైన పది ఎక్సే్చంజీలను పరిశీలించవచ్చని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. -
ఎకానమీకి ‘కరెంట్ అకౌంట్’ అనిశ్చితి
న్యూఢిల్లీ: నిర్దిష్ట కాలంలో దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారక ద్రవ్యం నికర వ్యత్యాలను ప్రతిబింబించే భారత్ కరెంట్ అకౌంట్.. తాజా అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితికి అద్దం పడుతోంది. త్రైమాసికాల పరంగా చూస్తే, 2023 జనవరి– మార్చి మధ్య 0.2 శాతం ఉన్న కరెంట్ అకౌంట్ లోటు– క్యాడ్ (జీడీపీ విలువలో) తదుపరి త్రైమాసిక కాలంలో (2023 ఏప్రిల్–జూన్) మధ్య 1.1 శాతానికి పెరిగింది. విలువల్లో చూస్తే ఈ పరిమాణం 1.3 బిలియన్ డాలర్ల నుంచి 9.2 బిలియన్ డాలర్లకు ఎగసింది. ఎగుమతులకన్నా దిగుమతులు భారీగా పెరగడం (వాణిజ్యలోటు) దీనికి కారణం. ఇక వార్షికంగా చూస్తే మాత్రం 2022 ఏప్రిల్–జూన్ మధ్య 2.1 శాతంగా ఉన్న క్యాడ్ తాజా సమీక్షా క్వార్టర్లో (2023 ఏప్రిల్–జూన్) 1.1 శాతానికి తగ్గడం గమనార్హం. విలువల్లో సైతం 17.9 బిలియన్ డాలర్ల నుంచి 9.2 బిలియన్ డాలర్లకు తగ్గింది. వార్షికంగా (పోలి్చ) చూస్తే, అంతర్జాతీయంగా ఎకానమీ మందగమన పరిస్థితులను ఇది సూచిస్తోంది. త్రైమాసికంగా బలహీనతలు... ఇటీవలి నెలల్లో భారత్ వస్తు ఎగుమతులు క్షీణతలో కొనసాగుతున్నాయి. సేవల రంగానిదీ ఇదే ధోరణి. కంప్యూటర్ ఎగుమతుల్లో క్షీణత కనబడుతోంది. పర్యాటకం, వ్యాపార సేవల్లో కూడా ఇదే బలహీన ధోరణి నెలకొంది. విదేశాల్లో ఉద్యోగాలు చూసే భారతీయులు దేశానికి డాలర్ల పంపకంసహా వివిధ అంశాలకు సంబంధించిన ప్రైవేటు ట్రాన్స్ఫర్ రిసిట్స్ (ఆదాయాలు) త్రైమాసికంగా తగ్గుతున్నాయి. 2023 జనవరి–మార్చి మధ్య ఇలా దేశానికి వచి్చన మొత్తాల విలువ 28.6 బిలియన్ డాలర్లయితే, ఏప్రిల్–జూన్ మధ్య 27.1 బిలియన్ డాలర్లకు తగ్గింది. దేశ దిగుమతుల భారం మరోవైపు పెరుగుతుండడం గమనార్హం. క్రూడ్ ధరలు ఇటీవల పెరగడం ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం. భారత్ వస్తు ఎగుమతులు 2023 ఆగస్టులో వరుసగా ఏడవనెల వృద్ధిలేకపోగా క్షీణబాటనే నడిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఐదు నెలల్లో ఎగుమతులు 11.9 శాతం క్షీణించి 172.95 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. మరోవైపు భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం ఎగుమతులు ఆగస్టులో 26.5 బిలియన్ డాలర్ల (2022 ఆగస్టు) నుంచి స్వల్పంగా 26.39 బిలియన్ డాలర్లకు తగ్గాయి. 2023–24లో 2.1 శాతానికి అప్! ఈ నేపథ్యంలో 2023–24 జూలై–ఆగస్టు త్రైమాసికంలో (క్యూ2) క్యాడ్ జీడీపీలో 2.3 శాతం (విలువల్లో 19 నుంచి 21 బిలియన్ డాలర్లు) విలువకు చేరవచ్చని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్ అదితీ నయ్యర్ అంచనావేస్తున్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ శాతం 2.1 శాతంగా (73 బిలియన్ డాలర్ల నుంచి 75 బిలియన్ డాలర్లు) ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు. 2022–23లో క్యాడ్ జీడీపీలో 2 శాతం. విలువలోల 67 బిలియన్ డాలర్లు. విదేశీ రుణ భారం 629 బిలియన్ డాలర్లు భారత్ విదేశీ రుణ భారం జూన్ ముగిసే నాటికి 629.1 బిలియన్ డాలర్లకు చేరిందని ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. మార్చితో ముగిసిన నెలతో (624.3 బిలియన్ డాలర్లు) పోలి్చచూస్తే ఈ విలువ 4.7 బిలియన్ డాలర్లు పెరిగింది. అయితే రుణ భారం జీడీపీతో పోలి్చతే ఇదే కాలంలో 18.8 శాతం నుంచి 18.6 శాతానికి తగ్గింది. గణాంకాల ప్రకారం దీర్ఘకాలిక రుణం (ఏడాదిపైన మెచ్యూరిటీ) మార్చితో పోలి్చతే 9.6 బిలియన్ డాలర్లు పెరిగి 505.5 బిలియన్ డాలర్లకు చేరింది. -
విదేశాల్లో నేరుగా దేశీ సంస్థల లిస్టింగ్
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు తమ షేర్లను నేరుగా విదేశీ స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేసుకునేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి కోవిడ్–19 సహాయక ప్యాకేజీ కింద 2020 మేలోనే ప్రకటించినప్పటికీ, దీనిపై తాజాగా నిర్ణయం తీసుకుంది. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్వహించిన కార్పొరేట్ డెట్ మార్కెట్ డెవలప్మెంట్ ఫండ్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాలు తెలిపారు. ‘ఐఎఫ్ఎస్సీ ఎక్సే్చంజీల్లో లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు నేరుగా లిస్ట్ అయ్యేందుకు అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది‘ అని ఆమె చెప్పారు. సంస్థలు అంతర్జాతీయంగా పెట్టుబడులు సమీకరించుకునేందుకు, మెరుగైన వేల్యుయేషన్స్ దక్కించుకునేందుకు దీనితో తోడ్పాటు లభించగలదని మంత్రి పేర్కొన్నారు. మరికొద్ది వారాల్లో దీనికి సంబంధించిన నిబంధనలను నోటిఫై చేయనున్నట్లు ఆర్థిక శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. తొలుత గుజరాత్ గిఫ్ట్ సిటీలోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)లో లిస్ట్ అయ్యేందుకు, ఆ తర్వాత ఎనిమిది లేదా తొమ్మిది నిర్దిష్ట దేశాల్లో లిస్టింగ్‌కు అనుమతినివ్వొచ్చని పేర్కొన్నారు. ఈ జాబితాలో బ్రిటన్, కెనడా, స్విట్జర్లాండ్, అమెరికా మొదలైనవి ఉండొచ్చని అంచనాలు ఉన్నాయి. స్టార్టప్‌లు.. రిలయన్స్‌కు బూస్ట్.. కొత్త పాలసీతో యూనికార్న్‌లు (1 బిలియన్ డాలర్లకు పైగా వేల్యుయేషన్ గల స్టార్టప్‌లు), విదేశాల్లో లిస్టింగ్‌పై కసరత్తు చేస్తున్న రిలయన్స్ డిజిటల్ విభాగానికి ఊతం లభించగలదని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. ప్రస్తుత విధానం ప్రకారం భారతీయ సంస్థలు.. ప్రధానంగా అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో విదేశాల్లో లిస్ట్ కావాల్సి ఉంటోంది. ఇన్ఫోసిస్, విప్రో తదితర సంస్థలు ఇదే బాటలో లిస్ట్ అయ్యాయి. విదేశాల్లో లిస్టింగ్ వల్ల భారతీయ కంపెనీలు వివిధ దేశాల్లోని ఎక్సే్చంజీల ద్వారా విదేశీ నిధులను సమకూర్చుకునేందుకు వీలుంటుంది. -
వరదలా విదేశీ డబ్బులు.. ప్రపంచంలోనే తొలి స్థానంలో ప్రవాస భారతీయులు
వంద బిలియన్ డాలర్లు.. మన రూపాయల్లో సుమారు 8 లక్షల కోట్లు! గతేడాది విదేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపిన మొత్తమిది! ఇలాంటి చెల్లింపుల్లో ప్రవాస భారతీయులు ప్రపంచంలోనే టాప్! అయితే ఏంటి? చాలా ఉంది! ఈ మొత్తం అనేక మందికి అన్నం పెడుతోంది! పేదరికం తగ్గేందుకు, ప్రజల ఆరోగ్యం మెరుగయ్యేందుకు, నవజాత శిశువులు పుష్టిగా ఉండేందుకూ కారణమవుతోంది..ఎలా? ప్రపంచ బ్యాంకు తాజా లెక్కల ప్రకారం 2022–23లో ప్రపంచం మొత్తమ్మీద అభివృద్ధి చెందిన దేశాల నుంచి అభివృద్ధి చెందుతున్న లేదా పేద దేశాలకు పంపిన మొత్తం 80,000 కోట్ల డాలర్లు. ఈ విషయంలో అన్ని దేశాల కంటే తొలి స్థానంలో ఉన్న భారత్‌కు విదేశాల్లోని భారతీయులు వంద బిలియన్ డాలర్లు పంపితే, అరవై బిలియన్ డాలర్లతో మెక్సికో రెండో స్థానంలో ఉంది. విదేశాల్లో ఉన్న మన బంధువులు లేదా మిత్రులు ఇంటికి పంపే డబ్బుల్ని ఇక్కడ రకరకాలుగా పెట్టుబడి పెడుతుంటారు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ చక్రాలు కదులుతూ ఉంటాయి. పన్నుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయమూ లభిస్తుంటుంది. పైగా మధ్యవర్తి లేకుండా నేరుగా డాలర్లు భారత్‌కు వస్తుంటాయి. ఈ డాలర్లను ప్రభుత్వం ముడిచమురు, తదితర కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు. ఎగువన ఉన్న వారికీ... దారిద్య్రరేఖకు దిగువన ఉన్న వారినే కాకుండా ఎగువన ఉన్న వారికీ ఈ చెల్లింపులు ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవస్థల్లో ఒడిదుడుకులు ఎదురైనప్పుడు, లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దారిద్య్రరేఖకు కొంచెం ఎగువన ఉన్న వారు కూడా కిందకు పడిపోతారు. ఈ పరిస్థితుల్లో విదేశాల్లోని బంధుమిత్రులు పంపే అదనపు మొత్తాలు బాధితులు పుంజుకునేందుకు ఉపయోగపడతాయన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. 2018 ఆగస్టు నాటి భారీ వరదల సమయంలో భారత్‌కు చెల్లింపులు దాదాపు 14 శాతం వరకూ పెరిగాయి. అంతెందుకు 2008లో ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయినా, విదేశీ పెట్టుబడులు తగ్గిపోయినా ఈ రకమైన చెల్లింపులు పెరగడం గమనార్హం. అంటే ప్రభుత్వాలకు నమ్మకంగా వచ్చిపడే విదేశీ మారక ద్రవ్యం ఇది. వ్యయం తడిసిమోపెడు! అంతాబాగానే ఉంది కానీ.. ఇటీవలి కాలంలో చెల్లింపుల కోసం అయ్యే వ్యయం తడిసిమోపెడు అవుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ అధ్యక్షతన ప్రస్తుతం జరుగుతున్న జీ20 సమావేశాల్లోనూ ఈ అంశంపై విస్తృత చర్చ జరగడం గమనార్హం. డాలర్ మారకం విలువల్లోని తేడాలు, పంపేందుకు, అందుకునేందుకు చెల్లించాల్సిన కమీషన్లు ఎక్కువగా ఉండటం వల్ల చెల్లింపుల వల్ల కలిగే ప్రయోజనాలు పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నాం. ప్రస్తుతం ఈ కమీషన్లు, మారక విలువల్లోని తేడాలనీ కలిపి ప్రతి చెల్లింపునకూ 6.24 శాతం మొత్తాన్ని కోల్పోవాల్సి వస్తోంది. చదవండి: మన డేటా ఎంత భద్రం? కేంద్రం ముసాయిదా బిల్లులో ఏముంది ? అయితే మూడేళ్ల క్రితం ఇది ఏడు శాతంగా ఉంది. సమీప భవిష్యత్తులో దీనిని మూడు శాతానికి తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. డబ్బులు మార్పిడి చేసే కంపెనీలు మరిన్ని అందుబాటులో ఉండేలా చేసి వాటి మధ్య పోటీ పెంచాలన్నది ఈ దిశలో జరుగుతున్న ప్రయత్నాల్లో ఒకటి. ఆయా దేశాలు ఈ చెల్లింపులపై విధిస్తున్న పన్నులను తగ్గించేందుకు, వీలైతే పూర్తిగా మాఫీ చేసేలా కూడా ప్రయత్నిస్తున్నారు. ఈ వ్యయం తగ్గించుకునేందుకు వలస కార్మికులు లేదా ఉద్యోగులు మధ్యవర్తులను ఆశ్రయించడం వల్ల కొన్నిసార్లు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుని ఈ వ్యయాన్ని వీలైనంతగా తగ్గిస్తే వినియోగదారులకు లాభం చేకూరడమే కాకుండా.. దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుంది. విదేశాలకూ పెరుగుతున్న చెల్లింపులు దశాబ్దాలుగా విదేశాల నుంచి భారత్‌కు ‘‘చెల్లింపులు’’ పెరుగుతూనే ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో విదేశాలకు వెళుతున్న మొత్తం కూడా రికార్డు స్థాయిలో పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం గత ఏడాది ఈ మొత్తం 2,710 కోట్ల డాలర్లకు చేరుకుంది. లిబరైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద భారతీయులు తమ వ్యక్తిగత అవసరాల కోసం (పర్యాటకం, విద్య, అనుమతులు అవసరం లేని పెట్టుబడులు) ఏటా దాదాపు రూ.2 కోట్లు ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. 2004లో ఇది రూ.24 లక్షలు మాత్రమే. 2015లో ఈ పరిమితిని పెంచారు. దీంతో 2004లో విదేశాలకు వెళ్లే మొత్తం 460 బిలియన్ డాలర్లు కాగా 2022 నాటికి 2,710 కోట్ల డాలర్లకు చేరింది. 80 శాతం పేద, మధ్యాదాయ దేశాలే.. గత ఏడాది చెల్లింపుల్లో దాదాపు 80 శాతం పేద, మధ్యాదాయ దేశాలే అందుకున్నాయి. కొన్ని దేశాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే ఎక్కువగా ఈ చెల్లింపులు ఉండటం గమనార్హం. కాగా ఈ డబ్బులు పేదరిక నిర్మూలనకు ఎలా ఉపయోగపడతాయన్న అంశంపై మూడేళ్ల క్రితం మారియా ఫాషోలిన్సే అనే శాస్త్రవేత్త ఒక అధ్యయనం నిర్వహించారు. కార్మికులను ఇతర దేశాలకు పంపే 25 ఆసియా దేశాలను ఎంచుకుని ఈ అధ్యయనం చేశారు. వలసలు, చెల్లింపులపై ప్రపంచబ్యాంకు వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ఆయా దేశాల్లోని పేదల సంఖ్య, వారిలో ఉండే అంతరం (కటిక పేదలు.. ఓ మోస్తరు పేదలు) వంటి వివరాలు సేకరించారు. వీటిద్వారా ఆయా దేశాల్లో పేదరికం ఎంతమేరకు ఉందన్నది నిర్ధారించుకున్నారు. రోజుకు రెండు డాలర్లు లేదా అంతకంటే తక్కువ ఆదాయం ఉన్న వారిని ప్రపంచబ్యాంకు పేదల కింద లెక్కవేస్తుంది. ఈ వివరాలను పొందుపరిచి గణితశాస్త్ర సూత్రాల ప్రకారం లెక్క వేస్తే విదేశాల నుంచి వీరికి అందే చెల్లింపుల ప్రభావం ఎక్కువగానే ఉన్నట్లు స్పష్టమైంది. ఒకొక్కరికి అందే డబ్బులు పది శాతం పెరిగినా ఆ దేశంలో పేదరికంలో ఉన్న వారి శాతం (వంద మందిలో పేదల సంఖ్య) 0.4 శాతం తగ్గుతుందని తేలింది. చెల్లింపుల డబ్బులతో పేదలు మంచి ఆహారం తీసుకోవడం మాత్రమే కాకుండా.. పిల్లలను చదివించుకునేందుకూ వీలేర్పడుతోంది. ఆపత్కాలాన్ని కూడా తట్టుకుని వీరు బతకగలుగుతున్నారు. - (కంచర్ల యాదగిరిరెడ్డి) -
PV జయంతి నేడు: క్లిష్టకాలంలో దేశాన్ని గట్టెక్కించిన తెలుగు బిడ్డ
భారత దేశ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కలిగిన మేధావీ, పరిపాలనాదక్షుడూ పాము లపర్తి వెంకట నరసింహారావు. ఎవరి జీవితం, ఎట్లా మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. తమిళ నాడు శ్రీపెరుంబుదూర్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న రాజీవ్ గాంధీని 1991 మే 21న ఎల్టీ టీఈ ఆత్మాహుతి దాడితో హత్య చేసింది. అత్యధిక మెజారిటీతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్ట బెట్టారు. భారత పదవ ప్రధానమంత్రిగా బాధ్యత చేపట్టారు పీవీ. ఆ సమయంలో భారతదేశం అంతర్జాతీయ చెల్లింపులపై డిఫాల్ట్ అయ్యి రెండు వారాలు కావ స్తోంది. విదేశీ మారక నిల్వలు కేవలం రెండు వారాల దిగుమతులకు మాత్రమే సరిపో యేంతగా ఉన్నాయి. అంతకు నెలరోజుల క్రితం మొత్తం 55 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ తనఖా పెట్టింది. పెద్ద మొత్తంలో చెల్లింపులు తగ్గు ముఖం పట్టాయి. భారతదేశా నికి రుణం ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిగా నియమించారు పీవీ. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడడానికి ఎటువంటి నిర్ణయం తీసుకోవడానికైనా ఆయనకు స్వేచ్ఛ నిచ్చారు. అప్పటివరకూ ఉన్న కఠిన నిబంధనలను సడళించి సరళీకరణకు ద్వారాలు తెరచింది పీవీ ప్రభుత్వం. దాని ఫలితాలనే ఇప్పుడు మనమంతా అనుభ విస్తున్నాం. అంతర్జాతీయ సమాజంలో భారత్ పట్ల సన్నగిల్లిన విశ్వాసాన్ని తిరిగి పాదుకొల్పారు పీవీ. ఫలితంగా అంతర్జాతీయ ద్రవ్య సంస్థల సహాయం మళ్లీ ప్రారంభమయ్యింది. అలా దేశాన్ని తిరిగి అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చారు. ప్రస్తుత తెలంగాణలోని హనుమకొండ జిల్లా లోని ‘వంగర’ గ్రామంలో 1921లో పీవీ జన్మించారు. అంచెలంచెలుగా రాష్ట్ర, కేంద్ర రాజకీయాల్లో ఎదిగారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగింది. ఆ సమయంలో ఆయన తీవ్ర మైన విమర్శలను ఎదుర్కొన్నారు. దక్షిణ భారత్‌కు చెందిన పీవీకి వ్యతిరేకంగా ఆయన సొంత పార్టీ ప్రముఖులే పనిచేసి ఆయనను పదవి నుంచి లాగి వేయడానికి ప్రయత్నించారు. కానీ ఇటు ప్రతి పక్షాలు, అటు అసంతృప్తులైన సొంత పార్టీ వారి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఆయన విజయవంతంగా తన ఐదేళ్ల పదవీకాలాన్ని దిగ్విజయంగా ముగించారు. ఆయన మరణించి 18 ఏళ్లు గడిచాయి. పీవీ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ తన సందేశాన్ని ట్వీట్ ద్వారా పంచుకున్నారు. Remembering Shri PV Narasimha Rao Ji on his birth anniversary. His far-sighted leadership and commitment to India’s development was noteworthy. We honor his invaluable contributions to our nation's progress. — Narendra Modi (@narendramodi) June 28, 2023 కాంగ్రెస్ పార్టీ పీవీ చేసిన సేవలను స్మరించుకుంది. On his birth anniversary, we remember the former PM of India, P.V. Narasimha Rao, who introduced some noteworthy liberal reforms to the Indian economy. Today, we pay a humble tribute to Mr. Rao, a distinguished statesman who reinvented India, both at home & abroad. pic.twitter.com/Cb0YPKbGjw — Congress (@INCIndia) June 28, 2023 ఈ తరుణంలో దేశానికి పీవీ చేసిన సేవను అన్ని వర్గాలూ మరచిపోవడం బాధాకరం. ఆయన శత జయంతి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు శత జయంతి ఉత్సవాలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించి ఆయన కీర్తి ప్రతిష్ఠలను ఇను మడింప చేశారు.ఇంతటి మహా మేధా వినీ, పరిపాలనా దక్షుణ్ణీ నేను నా జీవితంలో ఆరుసార్లు అతి దగ్గర నుండి చూశాను. ఆయనతో కొంత సమయం గడిపాను. నా జీవితంలో మరపు రాని సందర్భాలివి. 1977లో పెద్ద పల్లి జిల్లా మా కొలనూరు పక్క ఊరైన ‘పెగడ పల్లి’లో మా చుట్టాల ఇంటిలో పెళ్లి సందర్భంగా ఆయనతో కలిసి బంతి భోజనం చేశాను. మరొకసారి ఒక దినపత్రిక విలేక రిగా పెద్దపల్లి విశ్రాంత భవనంలో ఆయన పక్క కూర్చుని ముచ్చటించడం అరుదైన ఘటన. – దండంరాజు రాంచందర్ రావు, రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్, సింగరేణి భవన్, హైదరాబాద్ (నేడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి) -
ఫారెక్స్.. రికార్డుకు 50 బిలియన్ డాలర్ల దూరం!
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు (ఫారెక్స్) జూన్ 16వ తేదీతో ముగిసిన వారంలో 596.098 బిలియన్ డాలర్లకు చేరాయి. జూన్ 9వ తేదీతో ముగిసిన వారంలో పోలి్చతే 2.35 బిలియన్ డాలర్లు ఎగశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం రికార్డు స్థాయికి మరో 50 బిలియన్ డాలర్ల దూరానికి ఫారెక్స్ నిల్వలు చేరాయి. 2021 అక్టోబర్‌లో ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైమ్ రికార్డు 645 బిలియన్ డాలర్లను తాకాయి. రూపాయి పతన నివారణకు చర్యలుసహా ఆర్థిక వ్యవస్థ పటిష్టతకు ఆర్బీఐ తీసుకున్న పలు చర్యల నేపథ్యంలో రికార్డు స్థాయి నుంచి 100 బిలియన్ డాలర్లు కిందకు దిగాయి. తిరిగి మళ్లీ పురోగమన బాటన పయనిస్తున్నాయి. ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు దేశ దాదాపు 12 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. -
విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: విదేశీ పర్యాటకుల ద్వారా 2022 ఆర్థిక సంవత్సరంలో దేశానికి ఒక లక్షా 34 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం లభించిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2021 ఆర్థిక సంవత్సరంలో పర్యాటకుల ద్వారా 65 వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వచ్చినట్లు చెప్పారు. 2019లో కోవిడ్ ప్రబలడానికి ముందు కోటి మంది విదేశీ పర్యాటకులు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఇమ్మిగ్రేషన్ బ్యూరో అందించిన తాజా సమాచారం ప్రకారం 2022లో దేశాన్ని సందర్శించిన విదేశీ పర్యాటకుల సంఖ్య 60 లక్షలు ఉన్నట్లు మంత్రి వివరించారు. కోవిడ్ ప్రభావం తగ్గిన తర్వాత విదేశీ పర్యాటకం గణనీయంగా పుంజుకుంటోందని మంత్రి వెల్లడించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు తమ మంత్రిత్వ శాఖ స్వదేశ్ దర్శన్, ప్రసాద్ వంటి వినూత్న పథకాలతోపాటు పర్యాటక ప్రదేశాల్లో మౌలిక వసతులను మెరుగుపరచేందుకు ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్థిక సహాయం అందిస్తోందని అన్నారు. విదేశీ పర్యాటకులకు పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన సమాచారం అందించేందుకు పర్యాటక మంత్రిత్వ శాఖ 12 విదేశీ భాషల్లో టూరిస్టు హెల్ప్‌లైన్‌ను ప్రారంభించింది 166 దేశాలకు సంబంధించిన పర్యాటకులకు అయిదు సబ్ కేటగిరీల్లో ఈ వీసా మంజురు చేసే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. 1000 నుంచి 7500 రూపాయలు ఉండే హోటల్ గది అద్దెలపై జీఎస్టీని 12 శాతానికి తగ్గించి పర్యాటక ప్రాంతాల్లో వసతి సౌకర్యాల కల్పనకు పోటీని పెంచేందుకు దోహదం చేసినట్లు మంత్రి చెప్పారు. పర్యాటక మంత్రిత్వ శాఖ సిఫార్సుల మేరకు 59 టూరిజం రూట్లను వివిధ ఎయిర్‌లైన్స్‌కు కేటాయించినట్లు చెప్పారు. దేశంలో 55 ప్రాంతాల్లో జి 20 సమావేశాలు జరుగుతున్నాయి. పర్యాటకుల కోసం ఈ ప్రదేశాల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరుస్తున్నట్లు మంత్రి తెలిపారు. జి-20 ప్రతినిధులు దేశంలోని వివిధ ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ఏపీలో 79 లక్షల మంది కార్మికులకు ఉచిత ప్రమాద బీమా కేంద్ర ప్రభుత్వ ఈ-శ్రమ్ పోర్టల్ లో 2023 మార్చి 27 నాటికి ఆంధ్రప్రదేశ్ నుంచి 79,54,498 మందితో పాటు దేశవ్యాప్తంగా 28,78,93,401 మంది అసంఘటిత రంగ కార్మికులు నమోదు చేసుకున్నారని, వీరందరికీ మొదటి ఏడాది రూ. 2 లక్షల ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలీ వెల్లడించారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం మరో ఏడాదిపాటు పొడిగించే యోచన ఉందా? అన్న మరో ప్రశ్నకు జవాబిస్తూ ఇన్సూరెన్స్ కవరేజ్ పొడిగించే ప్రతిపాదన ఏదీ లేదని, పోర్టల్‌లో నమోదు చేసుకున్న అర్హులైన ప్రతి ఒక్కరికీ మొదటి సంవత్సరం మాత్రమే ఉచిత ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. చదవండి: ప్రపంచంలో ఎవరూ ఇలా ధైర్యంగా అడగలేరు: సజ్జల రామకృష్ణారెడ్డి ఈ-శ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడంతో పాటు స్పెషల్ డ్రైవ్‌లు, క్యాంపులు నిర్వహించి, ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థల ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు ఈ పథకంపై అవగాహన కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ-శ్రమ్ పోర్టల్ ప్రమోషన్ కోసం నిధులు అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
డిసెంబర్ త్రైమాసికంలో క్యాడ్ 2.2 శాతం
ముంబై: దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించిన కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) డిసెంబర్ త్రైమాసిక స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.2 శాతంగా నమోదయ్యింది. విలువలో ఇది 18.2 బిలియన్ డాలర్లు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం.. రెండవ త్రైమాసికంతో పోల్చితే మూడవ త్రైమాసికంలో క్యాడ్ గణనీయంగా తగ్గింది. రెండవ త్రైమాసికంలో క్యాడ్ 30.9 బిలియన్ డాలర్లు. జీడీపీలో ఇది 3.7 శాతం. వస్తు ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించిన వాణిజ్యలోటు రెండవ త్రైమాసింకంతో పోల్చితే మూడవ త్రైమాసికంలో 78.3 బిలియన్ డాలర్ల నుంచి 72.7 బిలియన్ డాలర్లకు తగ్గడం క్యాడ్ తగ్గుదలకు దారితీసినట్లు గణాంకాలు వెల్లడించాయి. ఈ కాలంలో సేవల రంగం ఎగుమతులు కూడా గణనీయంగా 24.5 శాతం మేర పెరిగాయి. అయితే నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మాత్రం 2021 ఇదే కాలంతో పోల్చితే 4.6 బిలియన్ డాలర్ల నుంచి 2.1 బిలియన్ డాలర్లరు తగ్గాయి. నికర విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ కూడా 5.8 బిలియన్ డాలర్ల నుంచి 4.6 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక 2022 ఏప్రిల్ నుంచి డిసెంబర్ మద్య చూస్తే, కరెంట్ అకౌంట్‌లోటు జీడీపీలో 2.7 శాతంగా నమోదయ్యింది. 2021 ఇదే కాలంలో ఈ లోటు 1.1 శాతం. -
ఫారెక్స్.. ‘డౌన్’ టర్న్
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు (ఫారెక్స్) మూడు వారాల అప్‌ట్రెండ్ తర్వాత మళ్లీ దిగువముఖంగా పయనించాయి. ఫిబ్రవరి 3వ తేదీతో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 1.49 బిలియన్ డాలర్లు తగ్గి, 575.267 బిలియన్ డాలర్లకు చేరాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజా గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. 2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రూపాయి విలువ పడిపోకుండా చూసే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ భారీగా డాలర్లు వ్యయం చేయడంతో గరిష్ట స్థాయి నుంచి 100 బిలియన్ డాలర్లుకుపైగా పడిపోయాయి. అయితే ఫిబ్రవరి 3కు ముందు వారానికి ముందు 21 రోజల్లో పురోగతి బాటన పయనించాయి. విభాగాల వారీగా చూస్తే.. డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఫిబ్రవరి 3వ తేదీతో ముగిసిన వారంలో 1.3 బిలియన్ డాలర్లు తగ్గి, 508 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వలు 246 మిలియన్ డాలర్లు తగ్గి 43.781 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) సంస్థ వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) 66 మిలియన్ డాలర్లు పెరిగి, 18.544 బిలియన్ డాలర్లకు చేరింది. ఇక ఐఎంఎఫ్ వద్ద భారత్ రిజర్వ్స్ పరిస్థితి 9 మిలియన్ డాలర్లు పెరిగి, 5.247 బిలియన్ డాలర్లకు చేరింది. -
అడుగంటిన విదేశీ మారక నిల్వలు
ఇస్లామాబాద్: పీకల్లోతు ఆర్థిక సంక్షోభంతో అష్టకష్టాలు పడుతున్న పాకిస్తాన్‌కు విదేశీ రుణాలు సైతం దొరకడం లేదు. 2022లో జూలై నుంచి డిసెంబర్ వరకు కేవలం 5.6 బిలియన్ డాలర్ల రుణాలు లభించాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) రుణ కార్యక్రమాన్ని పునరుద్ధరించే విషయంలో సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందంటున్నారు. విదేశీ మారక నిల్వలు 3.1 బిలియన్ డాలర్లకు అడుగంటాయి. కొత్త అప్పులు పుట్టడం లేదు. తీసుకున్న అప్పులపై వడ్డీలు భారీగా పెరిగిపోతున్నాయి. వాటి చెల్లింపుకూ అప్పులే గతి! క్రెడిట్ రేటింగ్ దెబ్బ పాకిస్తాన్‌కు డిసెంబర్లో 532 మిలియన్ డాలర్ల రుణం లభించింది. ఇందులో 44 శాతం అంటే.. 231 మిలియన్ డాలర్లను ఆసియన్ అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) రుణంగా ఇచ్చింది. పాక్ ప్రభుత్వం చాలా దేశాలకు చెల్లింపులు చేయాల్సి ఉంది. గత ఏడు రోజుల్లో చైనా ఆర్థిక సంస్థలకు 828 మిలియన్ డాలర్లు చెల్లించింది. -
ఐదు వారాల తర్వాత ఫారెక్స్ దిగువముఖం
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు వరుసగా ఐదు వారాల పెరుగుదల తర్వాత డిసెంబర్ 16తో ముగిసిన వారంలో తగ్గాయి. డిసెంబర్ 9వ తేదీన 564.06 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫారెక్స్ నిల్వలు 16తో ముగిసిన వారానికి 571 మిలియన్ డాలర్లు తగ్గి 563.499 బిలియన్ డాలర్లకు చేరాయని ఆర్బీఐ తాజా గణాంకాలు వెల్లడించాయి. అక్టోబర్ 2021లో దేశ విదేశీ మారకపు విలువ 645 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే ప్రపంచ పరిణామాలు, ఒత్తిళ్లు, రూపాయిని రక్షించుకోవడానికి సెంట్రల్ బ్యాంక్ చర్యలతో గరిష్టం నుంచి దాదాపు 100 బిలియన్ డాలర్లు తగ్గి దాదాపు ఒక దశలో 540 బిలియన్ డాలర్ల వరకూ పడ్డాయి. -
ఏడాదిలో 120 బిలియన్ డాలర్ల ఫారెక్స్ డౌన్
ముంబై: అంతర్జాతీయ రిజర్వ్ కరెన్సీ డాలర్ మారకంలో రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకుల నిరోధం, కరెన్సీ విలువల్లో సర్దుబాట్లు వంటి అంశాల నేపథ్యంలో భారత్ విదేశీ మారక నిల్వలు భారీగా తగ్గుతున్నాయి. రికార్డు నమోదు తర్వాత సంవత్సరం తిరిగే సరికి ఏకంగా 120 బిలియన్ డాలర్లమేర నిల్వలు పతనం అయ్యాయి. అక్టోబర్ 21తో ముగిసిన వారంలో (అంతక్రితం అక్టోబర్ 14వ తేదీతో ముగిసిన వారంతో పోల్చి) ఫారెక్స్ నిల్వలు 3.847 బిలియన్ డాలర్లు తగ్గి రెండేళ్ల కనిష్ట స్థాయి 524.52 బిలియన్ డాలర్లకు దిగివచ్చాయి. 2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు రికార్డు స్థాయిలో 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయిని తాకాయి. అటుతర్వాతి పరిణామాల నేపథ్యంలో ఏడాది కాలంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం ఏప్రిల్‌లో 606.5 బిలియన్ డాలర్ల వద్ద ఉన్న ఫారెక్స్ నిల్వలు అటు తర్వాత భారీగా పడిపోయాయి. ప్రస్తుత నిల్వలు దాదాపు 10 నెలల దిగుమతులకు సరిపోతాయన్నది అంచనా. ఇది తగిన స్థాయేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► డాలర్ల రూపంలో పేర్కొనే ఫారెన్ కరెన్సీ అసెట్స్ (ఎఫ్సీఏ)అక్టోబర్ 21తో ముగిసిన వారంలో 3.593 బిలియన్ డాలర్లు పడిపోయి 465.075 బిలియన్ డాలర్లకు చేరాయి. ► పసిడి నిల్వల విలువ 247 మిలియన్ డాలర్లు తగ్గిపోయి 37.206 బిలియన్ డాలర్లకు పడింది. ► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)కు సంబంధించి స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్) విలువ మాత్రం 7 మిలియన్ డాలర్లు తగ్గి 17.44 బిలియన్ డాలర్లకు దిగింది. ► ఇక ఐఎంఎఫ్ వద్ద దేశ నిల్వల పరిస్థితి చూస్తే ఈ పరిమాణం 14 మిలియన్ డాలర్లు తగ్గి, 4.799 బిలియన్ డాలర్లకు చేరింది. తగిన స్థాయిలో భారత్ ఫారెక్స్ నిల్వలు భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయి. అమెరికాలో కఠిన ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా కమోడీటీ ధరల తీవ్రత వంటి సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో ఈ నిల్వలు కొనసాగుతున్నాయి. ఈ పటిష్టత నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్ల వల్ల దేశానికి ప్రస్తుతం మేము ఇస్తున్న సావరిన్ రేటింగ్‌కు (బీబీబీ మైనస్, స్టేబుల్ అవుట్‌లుక్‌తో) వచ్చిన ఇబ్బంది ఏదీ లేదు. – ఫిచ్ రేటింగ్స్ -
తగిన స్థాయిలో భారత్ ఫారెక్స్ నిల్వలు
న్యూఢిల్లీ: భారత్ విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు తగిన స్థాయిలో ఉన్నాయని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. అమెరికాలో కఠిన ద్రవ్య విధానం, అంతర్జాతీయంగా కమోడీటీ ధరల తీవ్రత వంటి సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో ఈ నిల్వలు ఉన్నట్లు తెలిపింది. ఈ పటిష్టత నేపథ్యంలో అంతర్జాతీయంగా ఎదురయ్యే సవాళ్ల వల్ల దేశానికి ప్రస్తుతం ఇస్తున్న సావరిన్ రేటింగ్‌కు వచ్చిన ఇబ్బంది ఏదీ లేదని భరోసా ఇచ్చింది. ఈ ఏడాది జనవరి సెప్టెంబర్ మధ్య ఫారెక్స్ నిల్వలు దాదాపు 100 బిలియన్ డాలర్లు తగ్గి, 533 బిలియన్ డాలర్లు చేరినప్పటికీ.. దేశ దాదాపు 10 నెలల దిగుమతుల అవసరాలకు ఇవి సరిపోతాయని అంచనా. తాజా పరిస్థితులపై ఫిచ్ రేటింగ్ వెలువరించిన తాజా నివేదిక అంశాలను పరిశీలిస్తే.. ► భారత్‌లోకి వచ్చీ–పోయే విదేశీ నిధుల మధ్య నికర వ్యత్యాసానికి సంబంధించి కరెంట్ అకౌంట్ ఖాతా లోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతంగా ఉంటుంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (1.2 శాతం) భారీగా పెరిగినప్పటికీ, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ► పబ్లిక్ ఫైనాన్స్ పరిస్థితులు రేటింగ్‌లో కీలక పాత్ర పోషిస్తాయి. భారత్ సావరిన్ రుణ అంశాలు అంతర్జాతీయ ఫైనాన్సింగ్‌పై పరిమితంగానే ఆధారపడడం ఇక్కడ గమనార్హం. దీనివల్ల ప్రపంచ అస్థిరత నుండి భారతదేశం తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం లేదు. భారీ ఫారెక్స్ నిల్వలు రుణ చెల్లింపు సామర్థ్యానికి భరోసాను ఇస్తాయి. స్వల్పకాలిక అంతర్జాతీయ రుణం మొత్తం ఫారెక్స్ నిల్వల్లో కేవలం 24 శాతమే ఉండడం సానుకూల అంశం. ► 2022 రెండవ త్రైమాసికంలో భారత్ స్థూల విదేశీ రుణం జీడీపీలో 18.6 శాతంగా ఉంది. 2021 ‘బీబీబీ’ రేటెడ్ సావరిన్ దేశాల 72 శాతంతో పోల్చితే ఇది చాలా తక్కువ. ► భారత్ ఎగుమతులపై యూరోపియన్, అమెరికా మార్కెట్ల మందగమన ప్రభావం సమీప కాలంలో ఉండవచ్చు. అయితే 2022–23లో క్యాడ్ 3.4 శాతం (జీడీపీలో) ఉన్నా, 2023– 24లో ఇది 2 శాతానికి తగ్గే అవకాశం ఉంది. భారత్ ఎగుమతుల్లో ప్రధానమైన ఇంధన ధరల తగ్గుతాయన్న అంచనాలు దీనికి కారణం. రేటింగ్స్ ఇలా... భారత్‌కు ఫిచ్ ‘బీబీబీ– (జూన్‌లో నెగటివ్ అవుట్‌లుక్ నుంచి స్టేబుల్ అవుట్‌లుక్‌కు పెంపు) రేటింగ్ ఇస్తోంది. ఎస్అండ్పీ ‘బీబీబీ–’ రేటింగ్‌ను కలిగి ఉంది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్ బీఏఏ3 (స్టేబుల్ అవుట్‌లుక్) రేటింగ్‌ను ఇస్తోంది. ఈ రేటింగ్స్ చెత్ గ్రేడ్‌కు ఒక అంచె ఎక్కువ. ఒక దేశం లేదా కంపెనీల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు రేటింగ్ సంస్థల రేటింగ్‌ను ప్రాతిపదికగా తీసుకునే సంగతి తెలిసిందే. -
రూపీ వర్తకానికి మొగ్గు చూపండి
న్యూఢిల్లీ: విదేశీ వాణిజ్యంలో రూపాయి పాత్రను పెంచడంపై కేంద్ర ఆర్థిక శాఖ దృష్టి పెట్టింది. ఎగుమతులు, దిగుమతుల లావాదేవీలను రూపీ మారకంలోనే నిర్వహించడానికి మొగ్గు చూపాలని వాణిజ్య మండళ్ల ప్రతినిధులు, బ్యాంకులను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. సీమాంతర చెల్లింపులు రూపీలో జరిగేలా చూసేందుకు విదేశాల్లోని భాగస్వామ్య బ్యాంకులతో కలసి ప్రత్యేక రూపీ వాస్ట్రో ఖాతాలు ఆఫర్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని బ్యాంకులకు సూచించింది. ప్రస్తుతం విదేశీ వాణిజ్యం అంతా డాలర్ మారకంలో కొనసాగుతుండడం గమనార్హం. దీని కారణంగా ఎక్కువ అస్థిరతలు నెలకొనడంతో తాజా సూచన చేయడం గమనార్హం. వాణిజ్య సంఘాలు, వాటి విదేశీ భాగస్వామ్య సంస్థలు రూపీ మారకంలో లావాదేవీలకు వీలుగా కార్యాచరణను రూపొందించుకోవాలని ఆర్థిక శాఖ కోరింది. వాణిజ్య మండళ్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ ప్రతినిధులు, విదేశాంగ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రూపీ మారకంలో వాణిజ్యానికి శ్రీలంక, అర్జెంటీనా, జింబాబ్వే సానుకూలంగా ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా వాణిజ్య సంస్థలు రూపీలో మారకానికి ఆసక్తితో ఉన్నందున.. రూపీ మారకంలో ఎగుమతులు, దిగుమతులకు వీలు కల్పించేందుకు బ్యాంకులు అదనపు ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశిస్తూ ఆర్బీఐ ఈ ఏడాది జూలైలోనే ఒక సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం రష్యా నుంచి మన దేశం చమురును పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న విషయం తెలిసిందే. రష్యాపై పాశ్చాత్య దేశాల ఆంక్షలతో రూపాయి మారకంలోనే ఆ దేశం నుంచి అధిక శాతం దిగుమతులు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. చదవండి: Mahindra Xuv 400 Electric Suv: మహీంద్రా ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ చార్జ్‌తో 400 కి.మీ ప్రయాణం! -
World Biofuel Day: 8 ఏళ్లు.. రూ. 50 వేల కోట్లు..
పానిపట్: పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి వినియోగించడం వల్ల గత 7–8 ఏళ్లలో రూ. 50,000 కోట్ల మేర విదేశీ మారకం ఆదా అయ్యిందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. రైతులకు ఆ స్థాయిలో లబ్ధి చేకూరిందని పేర్కొన్నారు. ఐవోసీ పానిపట్‌లో నెలకొల్పిన రెండో తరం ఇథనాల్ ప్లాంటును ప్రపంచ బయో ఇంధన దినోత్సవం సందర్భంగా బుధవారం జాతికి అంకితం చేసిన మోదీ ఈ విషయాలు తెలిపారు. దాదాపు రూ. 900 కోట్లతో ఏర్పాటైన ఈ ప్లాంటుతో.. వ్యవసాయ క్షేత్రాల్లో గడ్డిదుబ్బును తగులబెట్టే సమస్యకు శాశ్వత పరిష్కార మార్గం కూడా లభించగలదని అన్నారు. హర్యానా, ఢిల్లీలో కాలుష్యం తగ్గడానికి కూడా ఈ ప్లాంటు దోహదపడగలదని ప్రధాని చెప్పారు. గత 8 ఏళ్లలో ఇథనాల్ ఉత్పత్తి 40 కోట్ల లీటర్ల నుండి 400 కోట్ల లీటర్లకు పెరిగినట్లు వివరించారు. 2023 ఏప్రిల్ నుంచి 20% ఇథనాల్ మిశ్రమం వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి 20% ఇథనాల్ మిశ్రమంతో పెట్రోల్‌ను ఎంపిక చేసిన పెట్రోల్ బంకుల ద్వారా సరఫరా చేయనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ పురి తెలిపారు. 2025 నాటికి దేశమంతటా దీన్ని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. ప్రస్తుతం ఇది 10 శాతం స్థాయిలో ఉంటోంది. -
విధాన చికిత్సతోనే ఆర్థికారోగ్యం
అంతర్జాతీయ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి వేగంగా పతనమవుతోంది. డాలర్‌ను కొనుగోలు చేయాలంటే మరిన్ని రూపాయలు వెచ్చించాలి. విలువ తగ్గిన కరెన్సీ వల్ల దిగుమతులు మరింత ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిపోతాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. రూపాయి విలువ పతనం మన అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగిపోతుంది. పరిశ్రమ లాభదాయికతను అడ్డుకుంటుంది. జీవన వ్యయాన్ని పెంచుతుంది. వీటన్నింటి కారణంగా విదేశీ రుణాలపై వడ్డీ చెల్లింపులు అధికమవుతాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతాయి. రిజర్వ్ బ్యాంక్ విధానపరమైన జోక్యం ద్వారా కేంద్రప్రభుత్వం రూపాయి పతనాన్ని అడ్డుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి మారక విలువ ఇటీవలి సంవత్సరాల్లో దిగజారిపోతూ వచ్చింది. దీంతో ఆర్థికవ్యవస్థ, అంతర్జాతీయ నగదు బదిలీలు ప్రభావితం అయ్యాయి. డాలర్‌తో పోలిస్తే భారతీయ కరెన్సీ సాపేక్షిక బలం ఈ సంవత్సరం 5.9 శాతానికి పడిపోయింది. దీంతో అంతర్జాతీయ విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో రూపాయి బలం వేగంగా పతనమవుతూ వస్తోంది. అంటే డాలర్‌ను కొనుగోలు చేయాలంటే మరిన్ని రూపా యలు వెచ్చించాలన్నమాట. రూపాయి విలువ పతనమవుతున్నదంటే, స్థూల ఆర్థిక ప్రాథమిక సూత్రాల బలహీనతకు అది సంకేతం. స్థూల ఆర్థిక చరాంకాల్లో వడ్డీ రేటు, అంతర్జాతీయ వాణిజ్యం, ద్రవ్యోల్బణం, ప్రభుత్వ రుణం, నిరు ద్యోగిత, మదుపు అనేవి ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి సూచికలు. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ చాలినన్ని చర్యలు చేపట్టకపోవడం... రూపాయి పతనం సహా, స్థూల ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక అంశాలు దిగ జారడాన్ని అనుమతించినట్టయింది. రూపాయి పతనమవుతున్న రేటు సమీప భవిష్యత్తులో భారతీయ ఆర్థిక వ్యవస్థ ప్రమాదాలను ఎదుర్కొనబోతోందన్న సంకేతాలను వెలువరిస్తోంది. మారకపు రేటు అస్థిరత్వం అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక పరిణా మాలతో నేరుగా ప్రభావితం అవుతుంది. అంతర్జాతీయంగా చూస్తే, చుక్కలనంటిన చమురు ధరలు, చమురు దిగుమతులపై భారతదేశం అత్యధికంగా ఆధారపడటం అనేవి స్వేచ్ఛాయుతంగా చలించే మార కపు రేటు వ్యవస్థలో రూపాయి విలువను తీవ్రంగా ప్రభావితం చేశాయి. విలువ తగ్గిపోయిన భారతీయ కరెన్సీ వల్ల దిగుమతులు మరింత ఖర్చుతో కూడిన వ్యవహారంగా మారిపోయాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో 85 శాతం మేరకు ముడి చమురు దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. ప్రపంచంలోనే చమురును అధికంగా దిగుమతి చేసుకుంటున్న మూడో దేశం భారత్. ఏటా 212.2 మిలియన్ టన్నుల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. 2021–22లో ఈ దిగు మతులు విలువ 119 బిలియన్ డాలర్లు. బ్రెంట్ ఆయిల్ ధర బ్యారెల్ 110 డాలర్లకు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు అమ్మ కాలు డాలర్లలోనే జరుగుతున్నాయి కనుక డాలర్‌కు డిమాండ్ కూడా పెరుగుతోంది. రూపాయి విలువ పడిపోవడం అనేది మన ఎగుమతు లకు సాయం చేసినప్పటికీ, దిగుమతులపై అధికంగా ఆధారపడటం కారణంగా భారత్ దెబ్బతింటోంది. దేశీయంగా చూస్తే, భారత్ ఇప్పటికే 9.6 బిలియన్ డాలర్లతో రికార్డు స్థాయిలో కరెంట్ అకౌంట్ లోటు సమస్యను ఎదుర్కొంటోంది. ఇది దేశ స్థూలదేశీయోత్పత్తిలో 1.3 శాతానికి సమానం. రూపాయి బలహీనపడుతుండటంతో కరెంట్ అకౌంట్ లోటు మరింతగా పెరగవచ్చు. పైగా, జీడీపీలో 6.4 శాతం అధిక ద్రవ్యలోటు వల్ల 2022–23 సంవత్సరంలో భారత విదేశీ రుణం రూ. 1,52,17,910 కోట్లకు పెరుగుతుందని అంచనా. దీంతో 9.41 లక్షల కోట్ల మేరకు అధిక వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. లేదా ఇది మొత్తం రెవెన్యూ వ్యయంలో 29 శాతం. రూపాయి విలువ పతనం కావడం అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. పైగా, ద్రవ్యోల్బణం అత్యధికంగా 7 శాతానికి చేరడం, విదేశీ సంస్థాగత మదుపుదారులు 2022లో 28.4 బిలియన్ డాలర్ల విదేశీ నిధులను ఉపసంహరించుకోవడం కూడా డాలర్ మారక రూపాయి క్షీణించడానికి దారి తీసింది. ఉత్పత్తి ఖర్చులు పెరిగిపోవడం వల్ల తాము పెట్టిన పెట్టుబడులకు తక్కువ రాబడులు రావడం లేదా లాభ దాయకత తగ్గిపోవడంతో పెట్టుబడుల ఉపసంహరణ వేగం పుంజు కుంది. లాభాలను ఆశించడంతోపాటు, తాము పెట్టుబడులను పెట్టా లంటే స్థిరమైన, నిలకడైన స్థూల ఆర్థిక వ్యవస్థ ఉండాలని విదేశీ సంస్థాగత మదుపుదారులు కోరుకుంటారు. మరోవైపున రూపాయి కొనుగోలు శక్తి బలహీనపడటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో దిగుమతుల ఖర్చులు అత్యధికంగా పెరిగి పోయాయి. అధిక ద్రవ్యోల్బణం రేటు రూపాయి విలువను దిగజార్చి వేసింది. అంటే జీవనవ్యయం పెరిగిపోయిందని అర్థం. దీని ఫలి తంగా ఉత్పత్తి ఖర్చులు, జీవన వ్యయం పెరిగి, పరిశ్రమలు, మదుపు దారులు లాభాలు సాధించే అవకాశం హరించుకుపోయింది. అంతర్జాతీయ విదేశీ మారక మార్కెట్లోని ‘హాట్ కరెన్సీ’తో పోలిస్తే ఒక దేశం కరెన్సీ విలువ పెరగడాన్ని బట్టే ఆ దేశ ఆర్థిక శక్తి నిర్ణయించబడుతుందని ఇది సూచిస్తుంది. 2025 నాటికి 5 లక్షల కోట్ల డాలర్ల విలువైన ఆర్థికవ్యవస్థగా మారాలని భారత్ ఆకాంక్షిస్తోంది. కానీ ఇతర దేశాలతో సమానంగా భారత ఆర్థిక శక్తిని నిర్ణయించడంలో అంతర్జాతీయ విదేశీ మారక మార్కెట్ ముఖ్యపాత్ర వహిస్తుందని మరవరాదు. విధానపరమైన జోక్యం ద్వారా రూపాయి పతనాన్ని అడ్డుకోలేక పోయినట్లయితే ఆర్థిక సంక్షోభం మరింత ముదిరే ప్రమాదముంది. రూపాయి విలువ పతనం వల్ల చెల్లింపుల సమస్య మరింత దిగజారిపోతుంది, మన అంతర్జాతీయ వాణిజ్యాన్ని దెబ్బతీస్తుంది. ద్రవ్యోల్బణం మరింతగా పెరిగిపోతుంది. పరిశ్రమల లాభదాయిక తను అడ్డుకుంటుంది. జీవన వ్యయాన్ని పెంచుతుంది. విదేశాలకు వెళ్లే భారతీయులపై భారం పెరిగిపోతుంది. వీటన్నింటి కారణంగా విదేశీ రుణాలపై వడ్డీ చెల్లింపులు అధికమవుతాయి. నిరుద్యోగం అమాంతం పెరుగుతుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోతాయి. రిజర్వ్ బ్యాంక్ సకాలంలో, కఠినమైన విధాన పరమైన జోక్యం చేసుకోవడం ద్వారానే డాలర్ మారక రూపాయి విలువ పతనాన్ని కేంద్రప్రభుత్వం అడ్డుకోవచ్చు. పెరిగిపోతున్న ఎక్స్చేంజ్ రేట్లను సమర్థంగా నిర్వహించడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అంతకు మించి భారత్‌లో ద్రవ్యోల్బణాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. డీజిల్, పెట్రోల్ వంటి ఉత్పత్తులపై కేంద్ర ఎక్సైజ్ పన్నులు అధికంగా ఉన్నాయి. వీటిని కుదించాల్సిన అవసరం ఉంది. డాలర్ల రూపంలో విదేశీ మారకద్రవ్యాన్ని 49 బిలియన్ డాలర్ల వద్ద స్థిరపర్చడంలో, విదేశీ మారక ద్రవ్య నిల్వలను 600 బిలియన్ డాలర్ల వద్ద స్థిర పర్చడంలో ఆర్బీఐ సమర్థంగా పనిచేస్తోంది. విదేశీ మారక ద్రవ్య నిల్వల రూపంలో ఉంచిన డాలర్లను విడుదల చేయడం ద్వారా మన కరెన్సీ విలువను స్థిరపర్చడానికి ఆర్బీఐ జోక్యం తోడ్పడుతుంది. మన రూపాయికి విదేశీ విలువ పైనే ఆర్థిక పురోగతి, ద్రవ్య సుస్థిరత ఆధారపడి ఉంటాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి మదుపు దారులు, ప్రవాస భారతీయ మదుపుదారులను ప్రోత్సహించాలంటే రూపాయి విలువకు విదేశాల్లో స్థిరత్వాన్ని ఆర్బీఐ కలిగించాలి. ఎందుకంటే ఆఫ్ షోర్ కరెన్సీ, ఇతర ద్రవ్యపరమైన రిస్కులు ఆర్థిక వ్యవస్థపై వేగంగా ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి, బలమైన ఆఫ్‌షోర్ రూపీ మారక మార్కెట్‌ను అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ మారక స్థిరత్వాన్ని తీసుకురావడమే కాకుండా, డాలర్ మారక రూపాయి అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న ఆటు పోట్లను తగ్గించవచ్చు కూడా. దీనికి సంబంధించి ఉషా తోరట్ అధ్యక్షతన ఆఫ్‌షోర్ రూపీ మార్కెట్లపై టాస్క్ ఫోర్స్ రూపొందించిన నివేదిక సిఫార్సులను రిజర్వ్ బ్యాంక్ తప్పనిసరిగా పరిగణించాల్సి ఉంది. బలమైన దేశీయ, విదేశీ రూపీ మార్కెట్‌ను అభివృద్ధి చేస్తే, అది స్థిరమైన ధరల నిర్ణాయకం లాగా వ్యవహరిస్తుందనీ, విదేశీ మారక ద్రవ్య మార్కెట్లో మన రూపాయిపై డాలర్ కలిగించే షాక్‌లను తట్టు కునేలా చేస్తుందనీ ఈ నివేదిక సూచించింది. కృష్ణ రాజ్ వ్యాసకర్త ప్రొఫెసర్, ఇనిస్టిట్యూట్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ చేంజ్, బెంగళూరు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఈ పతనం ఏ తీరాలకు చేరుస్తుందో!
రూపాయి అంతకంతకూ దిగజారు తోంది. రోజుకో కొత్త రికార్డు క్రియేట్ చేస్తోంది. ఈ నెల 14న డాలర్‌తో రూపాయి మారకం విలువ గరిష్టంగా 80 రూపాయలు దాటింది. ప్రస్తుతం కాస్త తగ్గి 79.96 రూపాయలకు చేరింది. ఫారిన్ ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు దేశంలో పెట్టుబడులను ఉపసంహరిం చుకోవడం కూడా రూపాయిపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ నెలలో ఇప్పటిదాకా రూ.4 వేల కోట్లకుపైగా విదేశీ పెట్టుబడులు వెనక్కిపోయాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు నచ్చకనే ఇన్వెస్టర్లు వెనక్కి వెళ్లిపోతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు అమెరికాలో వడ్డీరేట్ల పెంపు కూడా రూపాయిపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ద్రవ్యోల్బణం అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతోంది. కేంద్రం, రిజర్వ్ బ్యాంకు అంచనాలతో పొంతన లేకుండా ద్రవ్యో ల్బణం పెరుగుతోంది. అంతర్జాతీయంగా భౌగోళిక ఉద్రిక్తతలే దీనికి కారణమని రిజర్వ్ బ్యాంక్ అంటోంది. కేంద్రం నిర్దేశాల ప్రకారం వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చి 17న 6.95 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాలసీ నిర్ణయానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి పెరిగింది. దీనితో 2022–23 ఆర్థిక సంవ త్సరం మొత్తంలో 5.7 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం ఉంటుందన్న క్రితం అంచనాలను ఆర్బీఐ తాజాగా ఒక శాతం పెంచి 6.7 శాతానికి చేర్చింది. ధరల వేగాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల కన్నా ఇది 70 బేసిస్ పాయింట్లు ఎక్కువ. 2012 మార్చి 29 నుంచి ఏప్రిల్పదకొండు వరకు ముడి చమురు సగటు ధర 121.28 డాలర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థ పీపీఏసీ వెల్లడించిన సమాచారం ప్రకారం 2022 జూన్ 10న మనం కొనుగోలు చేసిన చమురు ధర 121.28 డాలర్లు. 2012లో అప్పటి ప్రభుత్వం చెల్లించిన మొత్తం రూ. 6,201.05 కాగా... ఎనిమిదేళ్ల పాలనలో నరేంద్ర మోదీ అదే డాలర్లకు చెల్లించిన మొత్తం రూ. 9,434.29. రూపాయి విలువ పతనాన్ని అరికట్టలేకపోవడం వల్ల ఈ రోజు మనం ప్రతీ ముడిచమురు పీపాకు పదేళ్ల నాటి కంటే అదనంగా రూ.3,233.24 చెల్లి స్తున్నాం. పదేళ్ల క్రితం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 51.13 ఉండగా మోదీ పాలనలో అది రూ. 80 దాటింది. పదేళ్ల క్రితం, ఇప్పుడు ముడి చమురు ధర ఒకే విధంగా ఉన్నప్పటికీ రూపాయి పతనం కారణంగా మనం చెల్లించే మొత్తం భారీగా పెరిగింది. రూపాయి పతనంతో దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దిగజారుతోంది. దీంతో అప్పులు కూడా కట్టలేని స్థితికి చేరుకుంటోంది. రాబోయే 9 నెలల్లో దాదాపు 621 బిలియన్ డాలర్ల అప్పులు చెల్లించాల్సి ఉంది. ఇందులో ఇప్పటి వరకు 40 శాతం... అంటే 267 బిలియన్ల అప్పు ఇంకా పెండింగ్ లోనే ఉందని స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కలే చెబుతున్నాయి. ఇది మన దగ్గరున్న విదేశీమారక నిల్వల్లో 44 శాతానికి సమానం. మరోవైపు రూపాయి పతనాన్ని అరి కట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ తన దగ్గర ఉన్న డాలర్లను మార్కెట్లో అమ్ముతోంది. గత డిసెంబరు 31 నాటికి 633.6 బిలియన్ డాలర్లుండగా, జూన్ 24న 593.3 బిలియన్ డాలర్లకు విదేశీ మారక ద్రవ్యం తగ్గింది. ఈ ఏడాది రెండో అర్ధభాగంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ 77–81 మధ్య ఉండొచ్చని అంచనా (ఇప్పుడున్న ముడిచమురు ధరలు స్థిరంగా ఉంటేనే). రూపాయి పడితే ఇబ్బందేంటి అన్న అనుమానం సామాన్య మానవునికి రావచ్చు. అసలు సమస్య అంతా అక్కడే ఉంది. రూపాయి పడితే బడా వ్యాపారవేత్తలకంటే కూడా సాధారణ పౌరులే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనం ఇతర దేశాల నుండి కొన్న వస్తువులకు వాళ్లు డాలర్ల లెక్కలోనే బిల్లు ఇస్తారు. అప్పుడు మనం రూపాయిలను డాలర్లుగా మార్చి చెల్లించాలి. అంటే రూపాయి విలువ తరిగే కొద్దీ మనం ఎక్కువ ధనాన్ని దిగు మతులకు చెల్లించవలసి ఉంటుందన్నమాట. ఈ లెక్కన దిగుమతి చేసుకునే అన్ని వస్తువుల ధరలూ పెరుగుతాయి. గ్యాస్, పెట్రోల్ వంటివాటి ధరలు పెరగడం వల్ల అన్ని వినియోగ వస్తువుల ధరలూ పెరుగుతాయి. రూపాయి పతనానికి ముకుతాడు వేయకుంటే... ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న పరిస్థితులు అతి త్వరలోనే భారత్‌లో కనిపించే ప్రమాదముందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. - వై. సతీష్ రెడ్డి చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ -
విదేశీ మారకద్రవ్యం పెంచేలా పరిశోధనలు
సాక్షి, అమరావతి: విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆహార ఉత్పత్తుల సాగులో మరింత స్వయం సమృద్ధి సాధించాల్సిన ఆవశ్యకత ఉందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ (ఐఐపీఎం) డైరెక్టర్ రాకేష్ మోహన్‌జోషి అన్నారు. దిగుమతులను తగ్గించి, విదేశీ మారక ద్రవ్యం పెంచేందుకు ఎగుమతులను ప్రోత్సహించేలా పరిశోధనలు సాగాలన్నారు. గుంటూరు లాంలోని ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవస్థాపక దినోత్సవంలో ఆయన కీలకోపన్యాసం చేశారు. మన దేశంలో నూటికి 60 శాతం మంది వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, అదే అమెరికాలో 3–4 శాతం మంది, న్యూజిలాండ్‌లో 3–5 శాతం మంది మాత్రమే ఈ రంగంపై ఆధారపడ్డారని చెప్పారు. మన దేశ మార్కెట్లోకి వచ్చే ప్రాసెస్డ్ ఆహార ఉత్పత్తుల్లో మెజార్టీ వాటా అమెరికాదేనన్నారు. ఆర్బీకేల సేవలు అమోఘం ఏపీలో రైతు భరోసా కేంద్రాలు సాగు ఉత్పాదకాలను రైతుల ముంగిటకు అందించడంతో పాటు పరిశోధనా ఫలితాలు క్షేత్ర స్థాయిలో రైతులకు చేరవేసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని జోషి కొనియాడారు. ఏపీ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీ ఎస్ నాగిరెడ్డి మాట్లాడుతూ పరిశోధనాలయాలు రైతుల పాలిట దేవాలయాలని పేర్కొన్నారు. వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వీసీ డాక్టర్ టి. జానకిరామ్ తదితరులు మాట్లాడారు. -
రూపాయి మళ్లీ రివర్స్‌గేర్..
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ శుక్రవారం 25 పైసలు నష్టపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 76.42 వద్ద ముగిసింది. వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్లలో నష్టాల్లో నడిచిన రూపాయి, బుధ, గురు వారాల్లో కొంత తేరుకుని 33 పైసలు లాభపడింది. అయితే మళ్లీ మూడవరోజు యథాపూర్వం నష్టాలోకి జారింది. దేశం నుంచి విదేశీ మారకపు నిల్వలు వెనక్కు మళ్లడం, డాలర్ ఇండెక్స్ (101) 25 నెలల గరిష్ట స్థాయికి చేరడం, మేలో జరిగిన ఫెడ్ ఫండ్ సమీక్షలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్ల (ప్రస్తుతం 0.25–0.50 శాతం శ్రేణి) వడ్డీరేటు పెరుగుతుందన్న వార్తలు రూపాయి బలహీనతకు ప్రధాన కారణం. డాలర్ మారకంలో శుక్రవారం రూపాయి ట్రేడింగ్ 76.31 వద్ద రూపాయి ప్రారంభమైంది. 76.19 గరిష్ట–76.50 కనిష్ట స్థాయిల్లో తిరిగింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, ఈక్విటీ మార్కెట్ల పతనం నేపథ్యంలో ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి మారకం విలువ మార్చి 8వ తేదీన రూపాయి ఇంట్రాడే కనిష్టం 77.05 స్థాయిని చూస్తే, ముగింపులో 77గా ఉంది. రూపాయికి ఇవి రెండు చరిత్రాత్మక స్థాయిలు. తాజా అనిశ్చిత పరిస్థితులు రూపాయి బలహీనతకే దారితీస్తాయని నిపుణులు భావిస్తున్నారు. చదవండి👉🏼: అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా చర్యలు -
ఎల్ఐసీలో ఎఫ్‌డీఐలకు నిబంధనల్లో సవరణలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) మార్గం సుగమం అయ్యేలా కేంద్రం చర్యలు తీసుకుంది. ఇందుకోసం విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా)లో తగు సవరణలు చేసింది. దీని ప్రకారం ఎల్ఐసీలో ఆటోమేటిక్ పద్ధతిలో 20 శాతం వరకూ ఎఫ్‌డీఐలకు వీలుంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఎఫ్‌డీఐలకు సంబంధించి 20 శాతం పరిమితి ఉంది (కేంద్రం అనుమతులకు లోబడి). దీన్ని ఎల్ఐసీ, ఇతరత్రా ఆ తరహా కార్పొరేట్ సంస్థలకు కూడా వర్తింపచేయాలని నిర్ణయించినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. మెగా పబ్లిక్ ఇష్యూలో ఎల్ఐసీలో సుమారు 5 శాతం వాటా విక్రయించి దాదాపు రూ. 63,000 కోట్లు సమీకరించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు రూ. 18,300 కోట్ల పేటీఎం ఐపీవోనే దేశీయంగా ఇప్పటివరకూ అతి పెద్ద పబ్లిక్ ఇష్యూగా ఉంది. కోల్ ఇండియా (2010లో రూ. 15,500 కోట్లు), రిలయన్స్ పవర్ (2008లో రూ. 11,700 కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. -
ఉక్రెయిన్‌పై రష్యా దాడి: భారత్ మౌనం వెనుక అనేక కారణాలు..
Russia Ukraine War: ‘రష్యా తీరుపై భారత వైఖరితో మేం తీవ్ర అసంతృప్తికి లోనయ్యాం’ – భారత్‌లో ఉక్రెయిన్ రాయబారి ఇగోర్ పొలిఖా ఇటీవల వ్యక్తం చేసిన ఆవేదన ఇది. ఉక్రెయిన్ వివాదంపై భారత స్పందనపై అంతర్జాతీయంగా నెలకొన్న అభిప్రాయాలకు ఇది అద్దం పడుతోంది. రష్యా దాడిని చాలా దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నా భారత్ మాత్రం ‘సంయమనం, చర్చలు’ అంటూ మధ్యేమార్గంగా స్పందిస్తూ వస్తోంది. దీని వెనక చాలా కారణాలే ఉన్నాయి. ఉక్రెయిన్ను అడ్డుపెట్టుకుని ఢీ అంటే ఢీ అంటున్న రష్యా, అమెరికా రెండూ భారత్‌కు బాగా కావాల్సిన దేశాలే అవడం వాటిలో ముఖ్యమైనది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ ఉదంతంపై స్పష్టంగా ఏ వైఖరి తీసుకున్నా అగ్ర రాజ్యాల్లో ఏదో ఒకదానికి దూరం కావాల్సి రావచ్చు. ఆ పరిస్థితి తలెత్తకుండా జాగ్రత్త పడేందుకే ఆచితూచి స్పందించడానికే భారత్ ప్రాధాన్యమిస్తోంది... రష్యా.. చిరకాల మిత్రుడు చారిత్రకంగా భారత్‌కు రష్యా దీర్ఘకాలిక మిత్రదేశం. అంతేగాక అతి పెద్ద ఆయుధ సరఫరాదారు కూడా. ఉక్రెయిన్ ఉదంతంలో మన వైఖరిని ఈ అంశం బాగానే ప్రభావితం చేస్తోంది. మిలటరీ హార్డ్‌వేర్, టెక్నాలజీ తదితరాలపై కూడా చాలావరకు రష్యా మీదే భారత్ ఆధారపడింది. ఒకరకంగా భారత ఆయుధ పరికరాల్లో సగానికి పైగా రష్యావే. ఇటీవలే ఏకంగా రూ.35,000 కోట్ల విలువైన ఎస్–400 క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి సమకూర్చుకుంది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌గా పేరున్న ఎస్–400 డీల్‌ను అమెరికా అభ్యంతరాలను తోసిరాజని మరీ ఓకే చేసుకుంది. దాంతోపాటు 6.1 లక్షల అత్యాధునిక ఏకే–203 అసాల్ట్ రైఫిళ్ల తయారీ ఒప్పందం కూడా ఇరు దేశాల మధ్య కుదిరింది. దీని విలువ రూ.5 వేల కోట్ల పైచిలుకే. గత డిసెంబర్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రష్యాతో కలిసి యూపీలోని అమేథీ ఫ్యాక్టరీలో ఈ రైఫిళ్లను తయారు చేస్తారు. చదవండి: (అమెరికాకు రష్యా స్పేస్ ఏజెన్సీ అధిపతి హెచ్చరికలు) రష్యాకు చేరువవుతున్న చైనా ఇటీవలి కాలంలో రష్యాకు చైనా, పాకిస్తాన్ దగ్గరవుతున్న తీరు కూడా భారత్‌ను ఆందోళన పరుస్తోంది. ముఖ్యంగా చైనా అయితే ఉక్రెయిన్ వివాదంలో రష్యాకు బాహాటంగానే మద్దతిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్ గనక రష్యా వ్యతిరేక వైఖరి తీసుకుంటే చైనాతో ఆ దేశం బంధం ఇంకా గట్టిపడే ప్రమాదముంది. ఇది దేశ భద్రతకు సవాలు కాగలదన్నది భారత్ ఆలోచన. ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తున్న చైనా, మనకు అతి పెద్ద మిత్రుడైన రష్యానూ తనవైపు తిప్పుకుంటే మనపైకి మరింతగా పేట్రేగుతుందన్న ఆందోళనలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యాను బాహాటంగా తప్పుబట్టడం తెలివైన పని కాదన్నది మన వ్యూహకర్తల వాదన. విదేశీ మారక ద్రవ్యానికి ఆయువు పట్టు ►అమెరికాతో భారీగా భారత వాణిజ్యం ►ఐటీ ఎగుమతుల్లో అధిక భాగం అమెరికాకే ►ఐటీ అడ్డా సిలికాన్ వ్యాలీలో భారతీయులదే హవా ►మన విదేశీ మారక ద్రవ్యంలో ఎక్కువగా అమెరికా నుంచే కీలక దశలో యూఎస్‌తో బంధం అమెరికాతో కూడా భారత్‌కు బలమైన బంధమే ఉంది. పైగా గత పది పదిహేనేళ్లుగా అది క్రమంగా పెరుగుతూ వస్తోంది. యూఎస్‌తో మనం పలు ఆయుధ సరఫరా ఒప్పందాలు కూడా చేసుకున్నాం. దాంతోపాటు ఇరుదేశాల మధ్య వాణిజ్యం కూడా భారీ పరిమాణంలో జరుగుతూ వస్తోంది. అమెరికాలోని భారతీయుల సంఖ్య 50 లక్షల పైచిలుకే. వీరిలో భారత టెకీల సంఖ్య చాలా ఎక్కువ. అమెరికా వ్యవహారాల్లో మనవారి పాత్ర, సిలికాన్ వ్యాలీపై భారత టెకీల ప్రభావం కూడా చాలా ఎక్కువ. అమెరికా నుంచి ఏటా మనకు భారీగా విదేశీ మారక ద్రవ్యం సమకూరుతుంటుంది. అంతేగాక ఏటా యూఎస్ విడుదల చేసే హెచ్1బీ వీసాల్లో చాలావరకు మనవాళ్లకే దక్కుతుంటాయి. మన ఐటీ ఎగుమతుల్లో సింహభాగం వెళ్లేది అమెరికాకే. పైగా ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాలతో కలిసి క్వాడ్ పేరుతో భారత్ కూటమి కూడా ఏర్పాటు చేసింది. చైనాకు రష్యా దగ్గరవుతున్న దృష్ట్యా అమెరికాతో సాన్నిహిత్యం వ్యూహాత్మకంగా మనకు ఎప్పుడూ కీలకమే. ఈ నేపథ్యంలో రష్యాకు పూర్తి అనుకూల వైఖరి తీసుకుని అమెరికాను నొప్పించరాదన్నది కేంద్రం వైఖరిగా కన్పిస్తోంది. -
ప్రజల బంగారంపై పాక్ ప్రభుత్వం కన్ను
ఇస్లామాబాద్: నానాటికీ క్షీణిస్తున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలను పెంచుకునేందుకు ప్రజల నుంచి బంగారాన్ని అప్పుగా తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం యోచిస్తోంది. పాక్ ఆర్థిక పరిస్థితి ఇటీవల కాలంలో వేగంగా క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో పాక్ ఈఈసీ (ఎకనమిక్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) ప్రజల నుంచి బంగారం తీసుకునే ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం కమర్షియల్ బ్యాంకులు ప్రజల నుంచి బంగారం రుణంగా తీసుకొని వడ్డీ చెల్లిస్తాయి. ఇలా సేకరించిన బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్లో డిపాజిట్ చేసి విదేశీ నిల్వలు పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. పాక్ ప్రజల వద్ద దాదాపు 5వేల టన్నుల బంగారం ఉంటుందని అంచనా. -
అనధికార ఫ్లాట్‌ఫామ్స్‌పై ఫారెక్స్ ట్రేడింగ్ వద్దు..ఆర్బీఐ హెచ్చరిక
ముంబై: అనధికార ఎలక్ట్రానిక్ ఫ్లాట్‌ఫామ్స్‌పై విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) ట్రేడింగ్ చేయవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇన్వెస్టర్లను హెచ్చరించింది. అటువంటి ఆర్థిక లావాదేవీల వల్ల విదేశీ మారకద్రవ్య నిర్వహణా చట్టం (ఫెమా) కింద జరిమానాలు పడే అవకాశం ఉందని కూడా సూచించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, సెర్చ్ ఇంజన్లు, ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫారమ్‌లు, గేమింగ్ యాప్ తదితర ఫ్లాట్‌ఫామ్స్‌పై భారతీయ నివాసితులకు ఫారెక్స్ ట్రేడింగ్ సౌకర్యాలను అందిస్తామంటూ వస్తున్న తప్పుదోవ పట్టించే అనధికార ఈటీపీల ప్రకటనలను ఆర్బీఐ గమనిస్తున్నట్లు తెలిపింది. అనుమతించబడిన ఫారెక్స్ లావాదేవీలను ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఆర్బీఐ లేదా గుర్తింపు పొందిన స్టాక్ ఎక్సే్ఛంజీల (ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, మెట్రోపాలిటన్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇండియా) అధికారిక ఈటీపీల మాత్రమే నిర్వహించాలని సూచించింది. ఫెమా కింద రూపొందించిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశీ ఎక్సే్ఛంజీలు, విదేశీ కౌంటర్పార్టీలకు మార్జిన్ల కోసం చెల్లింపులకు ఎంతమాత్రం అనుమతి లేదని స్పష్టం చేసింది. ఫారెక్స్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ పథకాలను చేపట్టేందుకు కొందరు మోసపూరిత సంస్థలు వారి ఏజెంట్లు ఇన్వెస్టర్లను వ్యక్తిగతంగా సంప్రదించి భారీ రాబడుల హామీలతో వారిని ప్రలోభపెడుతూ, అనధికార ఈటీపీలను నిర్వహిస్తున్న అంశాలు తమ దృష్టికి వచ్చినట్లు తెలిపింది. ఇటువంటి అనధికార ఈటీపీలు, పోర్టల్‌లు చేసిన మోసపూరిత పథకాలు, ట్రేడింగ్‌ల వల్ల అనేకమంది భారీ ఎత్తున డబ్బును పోగొట్టుకుంటున్న సంఘటనలూ వెలుగుచూస్తున్నట్లు తెలిపారు. -
ఫారెక్స్ నిల్వల్లో భారీ వృద్ధి
ముంబై: విదేశీ మారకద్రవ్య నిల్వలు 2021 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 58.38 బిలియన్ డాలర్లు పెరిగి 635.36 బిలియన్ డాలర్లకు చేరినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నివేదిక పేర్కొంది. విదేశీ మారకద్రవ్య నిల్వల నిర్వహణపై అర్థ వార్షిక నివేదికను ఆర్బీఐ ఆవిష్కరించింది. 2021 మార్చి ముగింపునకు భారత్ విదేశీ మారకపు నిధులు 17.4 నెలల దిగుమతులకు సరిపోయేంతగా ఉంటే, 2021 జూన్ నాటికి ఈ కాలం 15.8 నెలలకు సరిపోయినట్లు పేర్కొంది. 2021 సెప్టెంబర్ నాటికి ఆర్బీఐ 743.84 మెట్రిక్ టన్నుల పసిడి నిల్వలను కలిగి ఉందని తెలిపింది. 451.54 మెట్రిక్ టన్నుల బంగారాన్ని విదేశాల్లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ అలాగే బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ (బీఐఎస్) వద్ద సురక్షిత కస్టడీలో ఉంచగా, దేశీయంగా 292.30 టన్నుల బంగారం నిల్వ ఉందని నివేదిక వివరించింది. మొత్తం విదేశీ మారకపు నిల్వల్లో బంగారం వాటా 2021 మార్చి నాటికి 5.87 శాతంగా ఉంటే, సెప్టెంబర్ నాటికి 5.88 శాతానికి పెరిగినట్లు పేర్కొన్నారు. 2020 జూన్ 5తో ముగిసిన వారంలో మొట్టమొదటిసారి భారత్ ఫారెక్స్ నిల్వలు అర ట్రిలియన్ స్థాయిని అధిగమించి 501.70 బిలియన్ డాలర్లకు చేరాయి. అటు తర్వాత కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, నిల్వలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఏడాది తిరిగే సరికి నిల్వలు మరో 100 బిలియన్ డాలర్లపైగా పెరిగాయి. 2021 జూన్ 4వతేదీతో ముగిసిన వారంలో మొదటిసారి 600 బిలియన్ డాలర్లను దాటాయి. -
అంతర్జాతీయ షాక్‌లను తట్టుకోగలం
ముంబై: భారత్‌కు ఉన్న బలమైన విదేశీ మారక నిల్వలు అంతర్జాతీయ షాక్‌ల నుంచి రక్షణగా నిలవలేవు కానీ.. వాటిని ఎదుర్కోవడానికి సాయపడతాయని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. బుధవారం క్రిసిల్ రేటింగ్స్ నిర్వహించిన వెబినార్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. భారత్‌కు బలమైన విదేశీ మారక నిల్వలు ఉన్నాయని, అవి అంతర్జాతీయ కుదుపులకు రక్షణ అన్న ఒక తప్పుడు అభిప్రాయం ఉన్నట్టు చెప్పారు. ‘‘అంతర్జాతీయ షాక్‌ల (సంక్షోభాలు) నుంచి మనకేమీ రక్షణ లేదు. అంతర్జాతీయ షాక్‌ల ప్రభావం ఇక్కడ కనిపిస్తూనే ఉంది. కాకపోతే మనకున్న విదేశీ మారక నిల్వలతో వాటిని ఏదుర్కొని నిలబడొచ్చు. ఆ ఒత్తిళ్లను అధిగమించడానికి అవి సాయపడతాయంతే’’అని సుబ్బారావు పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మానిటరీ పాలసీ సాధారణ స్థితికి చేరితే.. పెద్ద ఎత్తున విదేశీ నిధులు తిరిగి వెళ్లిపోతాయని చెప్పారు. అప్పుడు మారక రేటు అస్థిరతలను నియంత్రించేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోవచ్చన్నారు. నాస్డాక్లో హెల్త్‌కేర్ ట్రయాంగిల్ లిస్టింగ్ ముంబై: క్లౌడ్ కంప్యూటింగ్ సంస్థ సెక్యూర్‌క్లౌడ్ టెక్నాలజీస్ తాజాగా తమ అనుబంధ సంస్థ హెల్త్‌కేర్ ట్రయాంగిల్‌ను అమెరికన్ స్టాక్ ఎక్సే్చంజీ నాస్డాక్లో లిస్ట్ చేసింది. టెక్నాలజీ సంస్థలకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద స్టాక్ ఎక్సే్చంజీలో లిస్ట్ కావడం వల్ల తమ సంస్థ ప్రాచుర్యం, విశ్వసనీయత మరింత పెరగగలవని కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ త్యాగరాజన్ తెలిపారు. పబ్లిక్ ఇషఅయూ ద్వారా హెల్త్‌కేర్ ట్రయాంగిల్ 15 మిలియన్ డాలర్లు సమీకరించినట్లు సెక్యూర్‌క్లౌడ్, హెల్త్‌కేర్ ట్రయాంగిల్ చైర్మన్ సురేష్ వెంకటాచారి తెలిపారు. ఇతర సంస్థల కొనుగోళ్లు, వర్కింగ్ క్యాపిటల్, ఇతరత్రా పెట్టుబడుల అవసరాలకు ఈ నిధులను వినియోగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. చెన్నైలో రిజిస్టరై, సిలికాన్ వేలీ కేంద్రంగా పనిచేస్తున్న సెక్యూర్‌క్లౌడ్ దేశీయంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో చాలా కాలం క్రితమే లిస్టయ్యింది. లైఫ్‌సైన్సెస్, హెల్త్‌కేర్ విభాగాలకు సేవలు అందించేందుకు 2019లో కాలిఫోరి్నయా ప్రధాన కార్యాలయంగా హెల్త్‌కేర్ ట్రయాంగిల్‌ను ప్రారంభించింది. బీఎస్ఈలో బుధవారం సెక్యూర్‌క్లౌడ్ షేరు 1.3 శాతం క్షీణించి రూ. 216 వద్ద క్లోజయ్యింది. -
ఫారెక్స్ నిల్వల పెంపునకు ఆర్బీఐ మొగ్గు!
ముంబై: విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలను మరింత పెంచుకోవడానికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మొగ్గుచూపుతుందని భావిస్తున్నట్లు ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ– బార్క్లేస్ ఇండియా తన తాజా నివేదికలో అంచనావేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి భారత్ ఫారెక్స్ 655 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనావేసింది. అంతర్జాతీయంగా ఎటువంటి ఆర్థిక ఒడిదుడుకులు ఎదురయినప్పటికీ తట్టుకుని నిలబడగలిగే అసాధారణ ద్రవ్య విధానానికి, దాని కొనసాగింపునకు మద్దతు నివ్వడానికి ప్రస్తుత పరిస్థితిలో ఫారెక్స్ నిల్వలను పెంచుకోవడంవైపు ఆర్బీఐ దృష్టి సారించే వీలుందని విశ్లేషించింది. ఆగస్టు 6వ తేదీతో ముగిసిన వారంలో భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు జీవితకాల గరిష్టం 621.464 బిలియన్ డాలర్లను (దాదాపు రూ.45 లక్షల కోట్లు తాకిన సంగతి తెలిసిందే. దాదాపు 16 నెలల దిగుమతులుకు సరిపోతాయి. రూపాయి మరింత బలహీనత! డాలర్ మారకంలో రూపాయి విలువ మరింత బలహీనపడే అవకాశం ఉందని కూడా బార్క్లేస్ అంచనావేయడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఇందుకు కొంత సానుకూలంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నట్లు వివరించింది. రూపాయి విలువను మద్దతుగా హెడ్జింగ్ విధానాలకు వినియోగించడానికి ఉద్దేశించిన ‘ఫార్వర్డ్ డాలర్ హోల్డింగ్స్’ బుక్ పరిమాణాన్ని క్రమంగా తగ్గిస్తూ, స్పాట్ డాలర్ల నిల్వలను ఆర్బీఐ పెంచుకోడావడాన్ని ఈ సందర్భంగా బార్క్లేస్ ఇండియా ప్రస్తావించింది. బార్క్లేస్ వెలువరించిన గణాంకాల ప్రకారం ఆర్బీఐ ‘ఫార్వర్డ్ డాలర్ హోల్డింగ్స్’ బుక్ పరిమాణం 2021 మార్చి నాటికి 74.2 బిలియన్ డాలర్లు ఉంటే, ఈ విలువ జూన్ ముగింపునకు 49 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. జూలై నాటికి మరింత తగ్గి 42 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఇటీవలి వారాల్లో రిజర్వ్ భారీగా పెరగడానికి కారణం ఆర్బీఐ డాలర్లను ‘ఫార్వర్డ్ హోల్డింగ్స్’ నుంచి ‘స్పాట్ నిల్వల్లోకి’ మార్చడం కూడా ఒక కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇదే వరవడి మున్ముందూ కొనసాగే అవకాశం ఉందని బార్క్లేస్ అంచనావేసింది. ఈ పరిస్థితుల్లో 2022 మార్చి నాటికి డాలర్ మారకంలో రూపాయి విలువ 75.50 –80.70 శ్రేణిలో కదలాడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇం ట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). రూపాయి బలహీనత వల్ల భారత్‌కు ఎగుమతుల ద్వారా అధిక ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. -
రికార్డు దిశగా భారత విదేశీ మారక నిల్వలు...!
ముంబై: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్నాయి. జూన్ 11తో ముగిసిన వారంలో వరుసగా రెండవవారమూ 600 బిలియన్ డాలర్ల ఎగువన సరికొత్త గరిష్ట స్థాయిలను నమోదుచేసుకున్నాయి. వారంవారీగా నిల్వలు 3.074 బిలియన్ డాలర్లు పెరిగి 608.081 బిలియన్ డాలర్లకు చేరాయి (డాలర్ మారకంలో రూపాయి ప్రస్తుత విలువ ప్రకారం దాదాపు రూ.45 లక్షల కోట్లు) . శుక్రవారం ఆర్బీఐ తాజా గణాంకాలను విడుదల చేసింది. 2020 జూన్ 5తో ముగిసిన వారంలో మొట్టమొదటిసారి భారత్ ఫారెక్స్ నిల్వలు అర ట్రిలియన్ మార్క్దాటి 501.70 బిలియన్ డాలర్లకు చేరాయి. అటు తర్వాత కొంచెం ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, నిల్వలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఏడాది తిరిగే సరికి నిల్వలు మరో 100 బిలియన్ డాలర్లు పెరిగాయి. జూన్ 4వతేదీతో ముగిసిన వారంలో మొదటిసారి 600 బిలియన్ డాలర్లను దాటి 605.008 డాలర్ల స్థాయికి చేరాయి. తాజా సమీక్షా వారంలో ఈ దూకుడు కొనసాగింది. ప్రస్తుత నిల్వలు భారత్ 20 నెలల దిగుమతులకు దాదాపు సరిపోతాయన్నది అంచనా. అంతర్జాతీయంగా భారత్ ఎకానమీకి వచ్చే కష్టనష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి ప్రస్తుత స్థాయి నిల్వలు దోహదపడతాయని ఈ నెల మొదట్లో జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష విశ్లేషించిన సంగతి తెలిసిందే. గణాంకాలను విభాగాల వారీగా పరిశీలిస్తే.. మొత్తం నిల్వల్లో డాలర్ల రూపంలో చూస్తే ప్రధానమైన ఫారిన్ కరెన్సీ అసెట్స్ విలువ తాజా సమీక్షా వారంలో 2.567 బిలియన్ డాలర్లు పెరిగి 563.457 బిలియన్ డాలర్లకు చేరింది. పసిడి నిల్వలు 496 మిలియన్ డాలర్లు ఎగసి 38.101 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) వద్ద స్పెషల్ డ్రాయింగ్స్ రైట్స్ విలువ 1 మిలియన్ డాలర్లు తగ్గి 1.512 డాలర్లకు చేరింది. ఐఎంఎఫ్ వద్ద భారత్ ఫారెక్స్ నిల్వల పరిమాణం 11 మిలియన్ డాలర్లు పెరిగి 5.011 బిలియన్ డాలర్లకు చేరాయి. చదవండి: యూట్యూబ్ చూసి.. దెబ్బకి సెలబ్రిటీ అయిపోయాడు! -
రష్యాను అధిగమించిన భారత్..!
న్యూఢిల్లీ: విదేశీ-మారక నిల్వల్లో రష్యాను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతి పెద్ద విదేశీ మారక నిల్వల దేశంగా భారత్ అవతరించింది. దక్షిణాసియా దేశాల సెంట్రల్ బ్యాంక్ పెట్టుబడుల ఉపసంహరణ చర్యలకు వ్యతిరేకంగా ఆర్థిక వ్యవస్థను పరిరక్షించడానికి డాలర్లను నిల్వ చేయడంతో భారత్ విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగాయి.ఈ ఏడాది పెట్టుబడులు వేగంగా పెరిగిన తరువాత, ఇరు దేశాల మారక నిల్వలు దాదాపు సమానమయ్యాయి. ఇటీవలి వారాల్లో రష్యా కంపెనీల్లో పెట్టుబడులు వేగంగా తగ్గడంతో మారక నిల్వల్లో భారత్ ముందుకు వచ్చింది. ఫలితంగా ప్రపంచం విదేశీ మారక నిల్వల్లో భారత్ నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. విదేశీ మారక నిల్వల్లో భారత్ నాలుగో స్ధానం.. మార్చి 5 నాటికి భారతదేశ విదేశీ కరెన్సీ హోల్డింగ్స్ 4.3 బిలియన్ డాలర్లు తగ్గి 580.3 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం తెలిపింది. రష్యా 580.1 బిలియన్ డాలర్ల మారక నిల్వలు కలిగి ఉంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రకారం విదేశీ మారక నిల్వల్లో మొదటి స్థానంలో చైనా ఉండగా, తరువాతి స్థానాల్లో వరుసగా జపాన్ , స్విట్జర్లాండ్ ఉన్నాయి. ప్రస్తుతం భారత్ దగ్గర సుమారు 18 నెలల దిగుమతులను చేయడానికి సరిపోయే విదేశీ నిల్వలున్నాయి. అరుదైన కరెంట్-అకౌంట్ మిగులు, స్థానిక స్టాక్ మార్కెట్లోకి పెట్టుబడుల పెరుగుదల, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అధికంగా రావడంతో మారక నిల్వలు పెరిగాయి.ఆర్థిక వ్యవస్థలో ఒడిదుడుకులు బలమైన విదేశీ మారక నిల్వలతో విదేశీ పెట్టుబడిదారులకు, క్రెడిట్ రేటింగ్ కంపెనీలకు ప్రభుత్వం రుణ బాధ్యతలను తీర్చగలదని విశ్లేషకులు తెలిపారు. ఈ తాజా డేటాను విడుదల చేయడానికి ముందే డ్యూయిష్ బ్యాంక్ చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ కౌశిక్ దాస్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లలో భారత్‌లో వివిధ నిల్వలు గణనీయంగా మెరుగుపడ్డాయని తెలిపారు. ఫారెన్ ఎక్సేఛేంజ్ నిల్వలు గణనీయంగా పెరగడంతో ఆర్థిక వ్యవస్థకు ఏదైనా బాహ్య షాక్-ఆధారిత మూలధన-స్టాప్ , రాబోయే కాలంలో పెట్టుబడుల ఉపసంహరణ జరిగిన సులువుగా ఆర్బీఐ డీల్ చేయగలదు.సెంట్రల్ బ్యాంక్ డేటా ప్రకారం గత ఏడాది స్పాట్ ఫారెన్ ఎక్సేఛేంజ్ మార్కెట్లో ఆర్బిఐ 88 బిలియన్ డాలర్లను నికరంగా కొనుగోలు చేసింది. ఇది గత ఏడాది ఆసియాలోని ప్రధాన కరెన్సీలలో రూపాయి విలువ చెత్తగా ప్రదర్శించడానికి సహాయపడింది.రూపాయి విలువ సోమవారం 0.1% పెరిగి డాలర్‌కు 72.71 కు చేరుకుంది. ఇటీవలి ఆర్బిఐ నివేదిక-2013 విదేశీ-మారక నిల్వలను మరింత బలోపేతం చేయాలని సిఫారసు చేసింది. (చదవండి: అదిరిపోయిన కియా ఎలక్ట్రిక్ కార్ టీజర్) -
రికార్డు స్థాయిలో దేశంలో విదేశీ కరెన్సీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి చేతిలో చిక్కుకుని భారత ఆర్థిక వ్యవస్థ ఓ పక్క విలవిలలాడుతుంటే దేశంలో విదేశీ మారక ద్రవ్యం నిల్వలు మాత్రం మున్నెన్నడు లేని విధంగా అనూహ్యంగా పెరగుతున్నాయి. విదేశీ ద్రవ్యం నిల్వలు రికార్డు స్థాయిలో 37.92 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయని భారతీయ రిజర్వ్ బ్యాంక్ జూన్ 12వ తేదీన విడుదల చేసిన ఓ నివేదికలో పేర్కొంది. ఆర్థిక మాంద్యం పరిస్థితులు భయపెడుతున్నప్పటికీ విదేశీ ద్రవ్యం విలువలు పెరగడం విశేషం.విదేశాల నుంచి నేరుగా వచ్చే దిగుమతులు తగ్గిపోవడం, విదేశాల నుంచి నేరుగా వచ్చే పెట్టుబడులు పెరగడం వల్ల విదేశీ ద్రవ్యం పెరిగిందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వివరించింది. (రిలయన్స్ @ రూ.11లక్షల కోట్లు) ఈ ఏడాది మొదట్లోనే అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా తగ్గడం కలిసొచ్చింది. గత ఏప్రిల్ నెలలో బారెల్ క్రూడాయిల్ ధర గత 20 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తగ్గిందని మొదటిసారని ఆర్బీఊ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి చమురు దిగుమతులపై 5900 కోట్ల డాలర్లు మిగులుతాయని ముంబై కేంద్రంగా పని చేస్తోన్న మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ అంచనా వేసింది. దేశంలోని ఒక్క రిలయెన్సీ అంబానీయే తన జియో ఫ్లాట్ఫారమ్ను విక్రయించి దేశంలోకి లక్ష కోట్ల విదేశీ ద్రవ్య నిల్వలు వచ్చి పడ్డాయి. భారతీయ స్టాక్ ఎక్చేంజ్‌ల్లో గత మే మూడు వారాల్లోనే 9,089 కోట్ల రూపాయలను విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టారు. -
విదేశాల్లో నేరుగా లిస్టింగ్..
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు విదేశీ ఎక్సే్చంజీల్లో నేరుగా లిస్టయ్యే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇందుకు అనుగుణంగా కంపెనీల చట్టం, 2013కి సవరణలు చేయనుంది. మరోవైపు, ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో ప్రవాస భారతీయులు (ఎన్నారై) 100 శాతం వాటాలు కొనుగోలు చేసేందుకు అనుమతులివ్వాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం కొన్ని భారతీయ సంస్థల షేర్లు విదేశీ ఎక్సే్చంజీల్లో ట్రేడవుతున్నప్పటికీ.. అమెరికన్ డిపాజిటరీ రిసీట్స్ (ఏడీఆర్), గ్లోబల్ డిపాజిటరీ రిసీట్స్ (జీడీఆర్) రూపంలో లిస్టయి ఉంటున్నాయి. నేరుగా విదేశాల్లో లిస్టింగ్ అవకాశం లభించిన పక్షంలో ఆయా సంస్థలు విస్తృత స్థాయిలో నిధులు సమీకరించుకునేందుకు మరిన్ని మార్గాలు లభించడంతో పాటు.. దేశంలోకి మరింతగా పెట్టుబడులు రావడానికి ఆస్కారం ఉండగలదని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. దేశీ లిస్టెడ్, అన్‌లిస్టెడ్ కంపెనీలు కూడా విదేశాల్లో లిస్టయ్యేందుకు వెసులుబాటునిచ్చేలా కంపెనీల చట్టంలో తగు మార్పులు చేయనున్నట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ తెలిపారు. ఇది పూర్తిగా అమల్లోకి వచ్చేందుకు కొన్ని నెలలు పడుతుందని.. త్వరలో నియమ, నిబంధనలను నోటిఫై చేస్తామన్నారు. అటు కంపెనీల చట్టంలో 72 సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జైలు శిక్షల్లాంటి క్రిమినల్ చర్యల నిబంధనలను తొలగిస్తామని, పెనాల్టీల పరిమాణాన్ని కూడా తగ్గిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఎయిరిండియాలో 49%గానే విదేశీ ఎయిర్‌లైన్స్ వాటాలు.. భారీ రుణాలు, నష్టాల భారంతో అమ్మకానికి వచ్చిన ఎయిరిండియాలో ఎన్నారైల పెట్టుబడుల పరిమితిని 100%కి పెంచుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో విదేశీ ఎయిర్‌లైన్స్ సహా ఇతరత్రా విదేశీ సంస్థలు.. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎయిరిండియాలో 49%కి మించి వాటాలు కొనుగోలు చేయడానికి ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. తద్వారా ఎయిరిండియా నియంత్రణాధికారాలు భారతీయుల చేతుల్లోనే ఉండేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం భారత్‌లో ఇతరత్రా ప్యాసింజర్ ఎయిర్‌లైన్స్‌లో ఎన్నారైలు ఆటోమేటిక్ పద్ధతిలో 100% వాటాలు కొనుగోలు చేసే వెసులుబాటు ఉన్నప్పటికీ.. ఎయిరిండియాలో మాత్రం 49%కి మాత్రమే అనుమతులు న్నాయి. ఎయిరిండియా విషయంలో ఇదొక మైలురాయిలాంటి నిర్ణయంగా జవదేకర్ చెప్పారు. కంపెనీ ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లినా.. ప్రయాణికులకు యథాప్రకారం మెరుగైన సేవలు అందిస్తుందని, పెట్టుబడి అవకాశాలు పెంచుకోగలదని ఆయన తెలిపారు. ఏప్రిల్ నుంచి బ్యాంకుల విలీనం అమల్లోకి.. ప్రభుత్వ రంగంలోని 10 బ్యాంకులను నాలుగు కింద విలీనం చేసే ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. భారీ స్థాయికి చేరడం ద్వారా మెగా బ్యాంకులు.. ఇటు దేశీయంగాను, అటు అంతర్జాతీయంగాను మరింతగా పోటీపడగలవని, వ్యయాలు తగ్గించుకోగలవని ఆమె పేర్కొన్నారు. విలీనంతో ప్రభుత్వ రంగంలో ఏడు భారీ బ్యాంకులు, అయిదు చిన్న స్థాయి బ్యాంకులు మిగలనున్నాయి. కన్సాలిడేషన్ ప్రణాళిక ప్రకారం ఆంధ్రా బ్యాంకు.. కార్పొరేషన్ బ్యాంకును యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయనున్నారు. అలాగే, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ .. యునైటెడ్ బ్యాంక్‌ను పంజాబ్ నేషనల్ బ్యాంకులో, సిండికేట్ బ్యాంకును కెనరా బ్యాంకులో, అలహాబాద్ బ్యాంకును ఇండియన్ బ్యాంకులో కలపనున్నారు. -
విదేశీ ఎక్సే్చంజీల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్!
న్యూఢిల్లీ: విదేశీ సంస్థల నుంచి దేశానికి మరిన్ని విదేశీ పెట్టుబడులను ఆకర్షించే కీలక చర్యలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శ్రీకారం చుడుతోంది. విదేశీ ఎక్సే్చంజ్‌ల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్‌కు తగిన ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందుకు సంబంధించి కొన్ని సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. ‘‘గ్లోబల్ ఇండెక్స్‌లను నిర్వహించే పలు సంస్థలతో చర్చలు జరుపుతున్నాం. ఈ చర్చలు పురోగతిలో ఉన్నాయి. అయితే ఎప్పటిలోగా ప్రభుత్వ బాండ్లు విదేశీ ఎక్సే్చంజ్‌ల్లో లిస్టవుతాయన్న విషయాన్ని మాత్రం నేను చెప్పలేను’’ అని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. విదేశీ ఎక్సే్చంజ్‌ల్లో ప్రభుత్వ బాండ్ల లిస్టింగ్‌కు విదేశీ ఇన్వెస్టర్ల నుంచి సుదీర్ఘకాలంగా సూచనలు అందుతున్నాయి. అయితే దీనికి 2020–21 బడ్జెట్లోనే సూత్రప్రాయ ఆమోదముద్ర పడింది. ‘‘కొన్ని నిర్దిష్ట కేటగిరీల ప్రభుత్వ బాండ్లను నాన్–రెసిడెంట్ ఇన్వెస్టర్లకు ఉద్దేశించడం జరుగుతోంది. దేశీయ ఇన్వెస్టర్లతోపాటు విదేశీ ఇన్వెస్టర్లకూ ఈ బాండ్లు అందుబాటులో ఉంటాయి’’ అని తన ఫిబ్రవరి 1 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కాగా ద్రవ్య స్థిరత్వానికి ఆర్బీఐ అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, 50 ఎన్‌బీఎఫ్‌సీల పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తోందని గవర్నర్ తన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బ్యాంకులుసహా ఫైనాన్షియల్ విభాగం మొత్తం ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందనీ ఆయన పేర్కొన్నారు. -
ఆల్‌టైమ్ గరిష్టానికి ఫారెక్స్ నిల్వలు
ముంబై: విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. నవంబర్ 8తో ముగిసిన వారానికి ఫారెక్స్ నిల్వలు 1.710 బిలియన్ డాలర్లు పెరిగి 447.81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతవారం ఈ నిల్వలు 446.098 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. -
ఓ విదేశీ జంట.. కరెన్సీ కావాలంటూ!
సాక్షి, కర్నూలు : కరెన్సీ మార్పిడి కోసం వచ్చామంటూ మాటలతో బురిడీ కొట్టించి ఓ విదేశీ జంట పలు దేశాల విదేశీ కరెన్సీని చోరీ చేసి ఉడాయించింది. పోలీసుల కథనం మేరకు.. కర్నూలు స్కంద బిజినెస్ పార్క్‌లో ఉన్న ఫారిన్ ఎక్సేంజ్ కార్యాలయానికి ఈ నెల 13వ తేదీన న్యూజిలాండ్‌కు చెందిన వారమని ఓ విదేశీ జంట వచ్చింది. తమ వద్ద ఉన్న కరెన్సీ మార్చి ఇవ్వాలని క్యాషియర్‌ను మాటల్లోకి దింపింది. అతన్ని ఏమార్చి రూ.1.40 లక్షల విలువైన పలు విదేశీ కరెన్సీని తస్కరించి ఉడాయించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇదే జంట ఈ నెల 10వ తేదీన కొచ్చిన్, 11న మైసూర్లో విదేశీ కరెన్సీ చోరీ చేసినట్లు సీసీ కెమెరా ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ అలర్ట్‌గా ఉండాలని సూచించారు. -
ఫారెక్స్ నిల్వలు @ 420.05 బిలియన్ డాలర్లు
ముంబై: భారత విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్ రిజర్వ్స్) మే10వ తేదీతో ముగిసిన వారంలో 1.36 బిలియన్ డాలర్లు పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 420.05 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతకుముందు వారంలో 171.9 మిలియన్ డాలర్లు పెరిగి 418.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. తాజా వారంలో.. మొత్తం మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు (ఎఫ్సీఏ) 1.35 బిలియన్ డాలర్లు పెరిగి 392.22 బిలియన్ డాలర్లకి చేరాయి. (అమెరికా డాలర్ మినహాయించి మిగిలిన కరెన్సీలైన యూరో, పౌండ్, యెన్ వంటి ఇతర నిల్వల పెరుగుదల/తరుగుదలను డాలర్లలోనికి మార్చి లెక్కించడాన్నే ఎఫ్‌సీఏగా వ్యవహరిస్తారు.) బంగారం నిల్వలు ఎటువంటి మార్పులులేకుండా 23.021 బిలియన్ డాలర్ల వద్ద ఉండగా.. అంతర్జాతీయంగా ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) వద్ద ఉన్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ 3 మిలియన్ డాలర్లు పెరిగి 1.454 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఫండ్‌తో నిల్వల స్థితి 7 మిలియన్ డాలర్లు పెరిగి 3.35 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు ఆర్బీఐ తెలిపింది. విదేశీ మారక నిల్వలు గతేడాది ఏప్రిల్ 13న 426.028 బిలియన్ డాలర్లకు చేరి జీవితకాల గరిష్ట స్థాయిని నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
భారీగా పెరిగిన విదేశీ మారక నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారక నిల్వలు మార్చి 15వ తేదీతో ముగిసిన వారంలో భారీగా 3.6 బిలియన్ డాలర్లు పెరిగాయి. దీనితో ఈ పరిమాణం 405.6 బిలియన్ డాలర్లకు చేరింది. డాలర్ రూపంలో పేర్కొనే ఫారెన్ కరెన్సీ అసెట్స్ విలువ పెరుగుదల దీనికి ప్రధాన కారణం. 2018 ఏప్రిల్ 13న భారత్ విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయి 426.028 బిలియన్ డాలర్ల స్థాయిని చూశాయి. అటు తర్వాత రూపాయ బలహీనత, విదేశీ నిధులు వెనక్కుపోవడం వంటి అంశాల నేపథ్యంలో కొంత తగ్గాయి. -
పసిడిపై ఆర్బీఐ గురి
న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధ భయాలు, రాజకీయంగా అనిశ్చితి మొదలైన పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కూడా అదే బాటలో పసిడి కొనుగోళ్లు జరుపుతోంది. జనవరిలో 6.5 టన్నుల మేర పసిడి కొనుగోలు చేసింది. దీంతో ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు 607 టన్నులకు చేరాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) గణాంకాల ప్రకారం భారత విదేశీ మారక నిల్వల్లో (ఫారెక్స్) పసిడి వాటా క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2018లో 6.2 శాతంగా ఉన్న పరిమాణం జనవరిలో మరికాస్త పెరిగి 6.4 శాతానికి చేరింది. డబ్ల్యూజీసీ గణాంకాల ప్రకారం ఫారెక్స్ నిల్వల్లో పసిడి వాటా అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం 11వ స్థానంలో ఉంది. 612.5 టన్నులతో నెదర్లాండ్స్ 10వ స్థానంలో ఉంది. రెండు దేశాల నిల్వల మధ్య వ్యత్యాసం కేవలం 5.5 టన్నులు మాత్రమే ఉండటంతో.. త్వరలోనే భారత్ 10వ స్థానానికి చేరొచ్చన్న డబ్ల్యూజీసీ భావిస్తోంది. నెదర్లాండ్స్ సెంట్రల్ బ్యాంక్ పసిడి నిల్వల్లో గత దశాబ్దకాలంగా పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. అంతక్రితం దాకా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్స్‌తో ఒప్పందాల కారణంగా నెదర్లాండ్స్ పసిడి విక్రయిస్తూ నిల్వలను తగ్గించుకుంటూ వచ్చింది. తాజా నిల్వల గణాంకాల ప్రకారం భారత్ త్వరలోనే నెదర్లాండ్స్ స్థానాన్ని ఆక్రమించే అవకాశముందని అంచనాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అదే ధోరణి.. వాస్తవానికి మిగతా ప్రపంచ దేశాల్లో కూడా ఇదే ధోరణి నెలకొంది. డాలర్ బలపడుతున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వ్‌లలో ఇతరత్రా సాధనాల వాటాను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మిగతా అన్నింటికన్నా బంగారమే పటిష్టమైన హెడ్జింగ్ సాధనంగా ఉంటుందని భావిస్తున్నాయి. అందుకే పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. రికార్డు స్థాయిలో కొనుగోళ్లు.. జనవరిలో స్థూలంగా 13 టన్నుల పసిడిని విక్రయించిన సెంట్రల్ బ్యాంకులు .. 48 టన్నుల మేర కొనుగోళ్లు జరిపాయి. దీంతో నికర కొనుగోళ్లు 35 టన్నులుగా నమోదయ్యాయి. ఇందులో సింహభాగం కొనుగోళ్లు తొమ్మిది సెంట్రల్ బ్యాంకులే జరిపాయి. 2002 తర్వాత జనవరి నెలలో సెంట్రల్ బ్యాంకులు ఈ స్థాయిలో పసిడి కొనుగోలు చేయడం ఇదే ప్రథమమని డబ్ల్యూజీసీ డైరెక్టర్ (మార్కెట్ ఇంటెలిజెన్స్) అలిస్టెయిర్ హెవిట్ తెలిపారు. ఎక్కువగా వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు ఈ కొనుగోళ్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి తదితర అంశాల నేపథ్యంలో అవి హెడ్జింగ్ కోసం బంగారంపై దృష్టి పెడుతున్నాయని వివరించారు. 2018లో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ఏకంగా 600 టన్నుల పసిడి కొనుగోలు చేశాయి. ఇది ఆయిదు దశాబ్దాల గరిష్టం కావడం గమనార్హం. వర్ధమాన దేశాల సెంట్రల్ మార్కెట్లే ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. -
2 బిలియన్ డాలర్లకుపైగా తగ్గిన విదేశీ మారక నిల్వలు!
ముంబై: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు ఫిబ్రవరి 8వ తేదీతో ముగిసిన వారంలో అంతక్రితం వారం (1వ తేదీ)తో పోల్చిచూస్తే, 2.11 బిలియన్ డాలర్లు పడిపోయాయి. 398.122 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఆర్బీఐ తాజా గణాంకాల ప్రకారం... ►ఫిబ్రవరి 1వ తేదీతో ముగిసిన వారంలో విదేశీ మారకనిల్వలు వారంవారీగా 2.063 బిలియన్ డాలర్లు పెరిగి 400.24 బిలియన్ డాలర్లకు పెరిగాయి. ►వారం తిరిగేసరికి 8వ తేదీ నాటికి డాలర్ల రూపంలో పేర్కొనే ఫారిన్ కరెన్సీ అసెట్స్ 2.448 బిలియన్ డాలర్లు తగ్గి, 370.981 డాలర్లకి పడ్డాయి. ►పసిడి నిల్వలు స్థిరంగా 22.68 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ విలువ 8 మిలియన్ డాలర్లు తగ్గాయి. 1.462 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇక ఐఎంఎఫ్‌కు సంబంధించి నిల్వల పరిమాణం 337.3 మిలియన్ డాలర్లు పెరిగి 2.991 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► 2018 ఏప్రిల్ 13వ తేదీతో మగిసిన వారంలో విదేశీ మారకద్రవ్య నిల్వల రికార్డు స్థాయి 426.028 బిలియన్ డాలర్లు. అటు తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చింది. -
భారత ఫారెక్స్ నిల్వలు 393 బిలియన్ డాలర్లు
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు డిసెంబర్ 28తో ముగిసిన వారంలో 116.4 మిలియన్ డాలర్లు ఎగశాయి. దీనితో నిల్వలు మొత్తం విలువ 393.40 బిలియన్ డాలర్లకు చేరింది. విలువను డాలర్ రూపంలో పేర్కొనే విదేశీ కరెన్సీ (యూరో, పౌండ్, యన్ వంటివి) అసెట్స్ పెరగడం దీనికి ప్రధాన కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. 2018 ఏప్రిల్ 13న రికార్డు స్థాయి 426.028 బిలియన్ డాలర్లకు చేరిన విదేశీ మారకనిల్వలు అటు తర్వాత క్రమంగా తగ్గాయి. తాజాగా విడుదలైన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... ఫారిన్ కరెన్సీ అసెట్స్: మొత్తం నిల్వల్లో ప్రధాన భాగమైన ఈ విభాగం పరిమాణం 106.30 మిలియన్ డాలర్లు పెరిగి 368.077 బిలియన్ డాలర్లకు చేరింది. ►పసిడి నిల్వల విలువ స్థిరంగా 21.224 బిలియన్ డాలర్లుగా ఉంది. ►ఇక ఐఎంఎఫ్‌కు సంబంధించిన దేశీ నగదు నిల్వలు కూడా 6.5 మిలియన్ డాలర్లు పెరిగి 2.640 బిలియన్ డాలర్లకు ఎగసింది. -
కార్ల కంపెనీల ధరల హారన్
న్యూఢిల్లీ: దేశీ ఆటో రంగ దిగ్గజ సంస్థలన్నీ జనవరి ఒకటి నుంచి కార్ల ధరలను పెంచేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే దాదాపు అన్ని కంపెనీలు పెంపు ప్రకటనలు చేశాయి. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదిలీ చేయడంలో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఒక్కొక్కటిగా వివరణ ఇస్తున్నాయి. ఇప్పటివరకు వెల్లడైన అధికారిక సమాచారం ప్రకారం కనీసం 1.5 నుంచి 4 శాతం వరకు కార్లు, ప్యాసింజర్ వాహనాల ధరలు వచ్చే నెల ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి. నిస్సాన్ మోటార్స్ ఇండియా తమ ప్యాసింజర్ వాహనాల ధరలను 4 శాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించింది. ‘అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీల ధరలు పెరిగాయి. ఫారెన్ ఎక్సే్ఛంజ్ రేట్లలో ప్రతికూల మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ధరల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తున్నాం. నిస్సాన్, డాట్సన్ ధరలు ఒకటో తేదీ నుంచి పెరగనున్నాయి.’ అని సంస్థ డైరెక్టర్ హర్దీప్ సింగ్ వ్యాఖ్యానించారు. పెరిగిన కమోడిటీ ధరలు, ఫారెన్ ఎక్సే్ఛంజ్ మార్పులు కారణంగా తమ కార్ల ధరలను 2.5% పెంచనున్నట్లు ఫోర్డ్ ఇండియా ఈడీ వినయ్ రైనా వెల్లడించారు. ఇక టాటా మోటార్స్..మోడల్‌ను బట్టి గరిçష్టంగా రూ.40వేల వరకూ ఉండొచ్చని తెలియజేసింది. ‘‘పెరిగిన ముడి పదార్థాల ధరలు, మారిన మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఈ పెంపు తప్పటం లేదు’’ అని కంపెనీ ప్యాసింజర్ వాహన వ్యాపార విభాగం ప్రెసిడెంట్ మయాంక్ పరీక్ తెలిపారు. మరోవైపు రెనో, మారుతీ, ఇసుజు, టయోటా కూడా జనవరి 1 నుంచి ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. -
విదేశీ మారక నిల్వలు.. రికార్డ్
న్యూఢిల్లీ: మరోవైపు దేశీయ విదేశీ మారకద్రవ్య నిల్వలు కొత్త రికార్డులకు చేరాయి. సెప్టెంబర్ 8వ తేదీతో ముగిసిన వారంలో 400.726 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతక్రితం వారంతో పోల్చితే ఈ మొత్తం 2.604 బిలియన్ డాలర్లకు చేరింది. డాలర్ల రూపంలో పేర్కొనే విదేశీ కరెన్సీ అసెట్స్ ఈ కాలంలో భారీగా 2.56 బిలియన్ డాలర్లు పెరిగి 376.20 బిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి నిల్వల విలువ యథాపూర్వం 20.69 బిలియన్ డాలర్లుగా ఉంది. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో భారీగా 11.4 బిలియన్ డాలర్లు దేశానికి వచ్చాయి. గత ఏడాది ఇదే కాలంలో దేశానికి వచ్చిన విదేశీ మారక నిల్వలు 7 బిలియన్ డాలర్లుకాగా, 2016–17 చివరి త్రైమాసికంలో ఈ మొత్తం 7.3 బిలియన్ డాలర్లు మాత్రమే. భారత్ రుణ భారం 472 బిలియన్ డాలర్లు భారత్ విదేశీ రుణ భారం ఈ ఏడాది మార్చి ముగిసే నాటికి 472 బిలియన్ డాలర్లు. వార్షిక ప్రాతిపదికన 13.1 బిలియన్ డాలర్లు (2.7 శాతం) తగ్గాయి. ఎన్ఆర్ఐ డిపాజిట్లు, వాణిజ్య రుణాలు తగ్గడం దీనికి కారణం. విదేశీ రుణ భారం నిర్వహణా స్థాయిలోనే ఉందని ఆర్థిక వ్యవహారాల శాఖ విడుదల చేసిన ఒక నివేదిక తెలిపింది. -
దినకరన్ చార్జ్‌షీట్ రద్దు
హైకోర్టు ఉత్తర్వులు టీ.నగర్: విదేశీ మారకద్రవ్యం కేసులో అన్నాడీఎంకే అమ్మ పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌పై ఏప్రిల్ 19వ తేదీ వరకు దాఖలైన చార్జ్‌షీటును రద్దు చేస్తూ మద్రాసు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అందులో పిటిషనర్ తరఫు న్యాయవాది పాల్గొనే విధంగా జూలై 31వ తేదీలోగా ఒకే రోజున కొత్త చార్జ్‌షీటును నమోదు చేయాలని, మూడు నెలల్లోగా విచారణను ఎగ్మూరు ఆర్థిక నేరాల విభాగం కోర్టు ముగించాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. గత 1996–97లో జేజే టీవీకి విదేశాల నుంచి ప్రసార పరికరాలను కొనుగోలు చేయడానికి సంబంధించి విదేశీ మారకద్రవ్యం మోసానికి పాల్పడినట్లు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ, ఆమె అక్క కుమారుడు భాస్కరన్, జేజే టీవీపై నాలుగు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల నుంచి తమను విడిపించాలని కోరుతూ శశికళ, టీటీవీ దినకరన్ ఇదివరకే ఎగ్మూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన ఎగ్మూరు కోర్టు గత 2015లో శశికళపైన ఒక కేసులోను, దినకరన్‌పై రెండు కేసుల్లోను, భాస్కరన్‌పై ఒక కేసులోను వారిని విడిపిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఎగ్మూరు కోర్టు ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ ఈడీ హైకోర్టులో అప్పీలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు విదేశీ మారకద్రవ్యం కేసు నుంచి శశికళ, దినకరన్ విడిపించడాన్ని రద్దుచేస్తూ ఎగ్మూరు కోర్టు కేసు విచారణను కొనసాగించాల్సిందిగా ఉత్తర్వులిచ్చింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం టీటీవీ దినకరన్పైన రెండు కేసుల విచారణను ఎగ్మూరు కోర్టు న్యాయమూర్తి సమక్షంలో జరుగుతూ వచ్చింది. ఇలాఉండగా కొడనాడు ఎస్టేట్ బంగళాను నకిలీ సంస్థల ద్వారా కొనుగోలు చేయడానికి ప్రయత్నించినట్లు దాఖలైన కేసులో దినకరన్‌పై ఎగ్మూరు కోర్టు చార్జ్‌షీటు నమోదు చేసింది. కేసుకు సంబంధించి టీటీవీ దినకరన్ కోర్టులో హాజరయ్యారు. తాను ఏ పొరపాటు చేయలేదని తన తరఫు వివరణ ఇచ్చారు. ఈ కేసులో దినకరన్‌పై చార్జ్షీట్లు నమోదు చేయడంతో కేసులో తదుపరి విచారణను జూన్ 22వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు. ఇలాండగా మద్రాసు హైకోర్టులో టీటీవీ దినకరన్ కొత్తగా ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో తనపై చార్జ్‌షీటు నమోదు చేసే సమయంలో తన తరఫు వాదనలు వినకుండా చార్జ్‌షీటు నమోదు చేశారని, అందువల్ల చార్జిషీటు నమోదుకు, ఎగ్మూరు కోర్టు విచారణకు స్టే విధించాలని టీటీవీ దినకరన్ పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ 10 రోజుల క్రితం న్యాయమూర్తి ఎంఎస్ రమేష్ బెంచ్ ఎదుట విచారణకు వచ్చింది. ఆ సమయంలో దినకరన్‌పై చార్జ్‌షీటు నమోదుకు మధ్యంతర స్టే విధిస్తూ కేసు విచారణను వాయిదా వేశారు. ఈ కేసుపై సోమవారం విచారణ జరిపిన మద్రాసు హైకోర్టు న్యాయమూర్తి ఎంఎస్ రమేష్ విదేశీ మారకద్రవ్యం కేసులో దినకరన్‌పై ఏప్రిల్ 19 వరకు నమోదైన చార్జ్‌షీటు రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. అంతేకాకుండా పిటిషనర్ తరఫు న్యాయవాది పాల్గొనే విధంగా జూలై 31వ తేదీలోగా ఒకే రోజున కొత్త చార్జ్‌షీటును నమోదు చేయాలని, ఇదివరకే కాలాతీతమైన కేసును మరింతగా పొడిగించకూడదని తెలిపారు. అంతేకాకుండా కేసుపై ప్రతిరోజూ విచారణ జరిపి మూడు నెలల్లోగా విచారణను ఎగ్మూరు ఆర్థికనేరాల విభాగం కోర్టు ముగిం చాలని ఉత్తర్వులిచ్చారు. -
తెలియదు.. గుర్తు లేదు!
♦ చిన్నమ్మ పల్లవి ♦ వీడియో కాన్ఫరెన్స్ విచారణ ♦ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి ♦ ఇక క్రాస్ ఎగ్జామిన్ విదేశీ మారక ద్రవ్యం కేసులో కోర్టు సంధించిన ప్రశ్నలకు చిన్నమ్మ శశికళ ఉక్కిరిబిక్కిరి అయ్యారు. న్యాయమూర్తి ప్రశ్నలకు సమాధానాలు ‘తెలియదు.. గుర్తు లేదు’ అని దాటవేశారు. ఆమేరకు శనివారం పరప్పన అగ్రహార చెర నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చెన్నై ఎగ్మూర్ కోర్టు ప్రశ్నలకు ఆమె దాటవేత ధోరణి అనుసరించారు. సాక్షి, చెన్నై : దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళపై కేసులకు కొదవ లేదు. అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం చిన్నమ్మ శశికళ పరప్పన అగ్రహార చెరలో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈడీ దాఖలుచేసిన పలు కేసుల విచారణలు ఒకటి తర్వాత మరొకటి చెన్నై ఎగ్మూర్ కోర్టు ముందుకు వస్తున్నాయి. 1991–1996 మధ్య కాలంలో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు చిన్నమ్మ అండ్ ఫ్యామిలీ సాగించిన అవినీతి వ్యవహారాలు, మాయాజాలాలను తదుపరి అధికారంలోకి వచ్చిన డీఎంకే ఒక్కొక్కటిగా వెలుగులోకి తెచ్చింది. ఆ దిశగా 1996 –2001 మధ్యకాలంలో శశికళపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఐదు కేసులను నమోదు చేసింది. ఇందులో నాలుగు కేసుల్లో శశికళ మీద అభియోగాలు మోపింది. మూడు కేసుల్లో శశికళతో పాటు ఆమె బంధువులు కూడా నిందితులుగా ఉన్నారు. ఇందులో జయ టీవీకి విదేశాల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల కొనుగోళ్లు చిన్నమ్మ మెడకు ఉచ్చుగా మారింది. రిజర్వు బ్యాంక్ అనుమతి లేకుండా నగదు బట్వాడా డాలర్లలో సాగినట్టు ఈడీ తేల్చింది. ఈ కేసు విచారణను చెన్నై ఎగ్మూర్ కోర్టులో సాగుతోంది. కోర్టుకు శశికళ నేరుగా హాజరు కావాల్సి ఉన్నా, పరప్పన అగ్రహార చెరలో శిక్ష అనుభవిస్తున్న దృష్ట్యా, కుదర లేదు. వాయిదాల పర్వంతో సాగుతూ వచ్చిన ఈ పిటిషన్ విచారణ మరింత వేగవంతం అయింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించేందుకు ఎగ్మూర్ ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జకీర్ హుస్సేన్ ఆదేశాలు ఇచ్చారు. ఉక్కిరి బిక్కిరి.. దాటవేత శనివారం ఎగ్మూర్ కోర్టులో విచారణ ఆసక్తికరంగా సాగింది. 11.15 గంటల నుంచి 12.40 గంటల వరకు విచారణ జరిగింది. పరప్పన అగ్రహార చెర నుంచి వీడియో కాన్ఫరెన్స్ ముందుకు ఖైదీల యూనిఫాం గెటప్‌లో చిన్నమ్మ ప్రత్యక్షం అయ్యారు. ఆమెను ప్రశ్నలతో న్యాయమూర్తి ఉక్కిరి బిక్కిరి చేశారు. విదేశీ మారక ద్రవ్యం కేసులో ఈడీ మోపిన అభియోగాలను వివరిస్తూ ప్రశ్నలను సంధించారు. న్యాయమూర్తి ప్రశ్నలకు తెలియదు.. గుర్తు లేదు అన్న సమాధానాలతో చిన్నమ్మ దాటవేశారు. అనేక ప్రశ్నలను చిన్నమ్మను ఇరకాటంలో పెట్టే విధంగా సాగినా, చాకచక్యంగా దాటవేత ధోరణి సాగించడం గమనార్హం. ఇక, విచారణను ఈనెల 13వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు ఆ రోజున క్రాస్ ఎగ్జామిన్ సాగుతుందని విచారణను న్యాయమూర్తి ముగించారు. ఇక, శశికళ, ఆమె బంధువు సుధాకరన్ మీద దాఖలుచేసిన మరో విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ ఏడో తేదీ విచారణకు రానుంది. ఇప్పటికే సుధాకరన్ కోర్టుకు హాజరైన దృష్ట్యా, ఆ రోజున మరోమారు చిన్నమ్మ శశికళ వీడియో కాన్ఫరెన్స్ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
చిన్నమ్మ తంత్రం
సాక్షి, చెన్నై : విదేశీ మారక ద్రవ్యం కేసులో చిన్నమ్మ శశికళ కుటుంబీకులు కోర్టుకు హాజరయ్యారు. పరప్పన అగ్రహార చెర నుంచి భద్రత నడుమ సుధాకరన్ను ఎగ్మూర్ కోర్టుకు తీసుకొచ్చారు. ఆయనతో పాటుగా మరో బంధువు భాస్కరన్ విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా బెంగళూరు చెరలో ఉన్న శశికళతో దినకరన్, తంబిదురైతో పాటుగా ఐదుగురు ఎమ్మెల్యేలు వేర్వేరుగా ములాఖత్ కావడం గమనార్హం. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, చిన్నమ్మ శశికళ కుటుంబానికి చెందిన వారిపై విదేశీ మారక ద్రవ్యం కేసుల మోత మోగుతున్న విషయం తెలిసిందే. శశికళ మీద కూడా ఈ కేసు నమోదై ఉంది. ఈ కేసుల విచారణ చెన్నై ఎగ్మూర్ ఆర్థిక నేరాల విభాగం కోర్టు న్యాయమూర్తి మలర్ మది విచారిస్తున్నారు. శశికళ అక్క కుమారుడు, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్, అన్న కుమారుడు భాస్కరన్ పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఇక, దివంగత సీఎం జయలలిత మాజీ దత్తపుత్రుడు సుధాకరన్, శశికళ విచారణకు డుమ్మా కొడుతూ వస్తున్నారు. ఇందుకు కారణం ఆ ఇద్దరు అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార చెరలో శిక్ష అనుభవిస్తుండటమే. విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ నిమిత్తం సుధాకరన్ను హాజరుపరచాలని ఇప్పటికే పలుమార్లు కోర్టు సమన్లు జారీచేసింది. అయితే, కర్ణాటక పోలీసులు అందుకు తగ్గ చర్యలు తీసుకోలేదు. అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండటాన్ని ఓ కారణంగా ఆ పోలీసులు చూపించారు. ఎట్టకేలకు మంగళవారం జరిగిన విచారణకు పరప్పన అగ్రహార చెర నుంచి గట్టి భద్రత నడుమ సుధాకరన్ను చెన్నైకి తీసుకొచ్చారు. నిఘా నీడలో ఆయన్ను ఎగ్మూర్ కోర్టులో హాజరుపరిచారు. సూపర్ డూపర్ టీవీకి ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలుతో తనకు సంబంధం లేదని, అన్యాయంగా ఇరికించారంటూ కోర్టుకు సుధాకరన్ విన్నవించుకున్నారు. అభియోగాలపై ప్రభుత్వ తరపు వాదన, సాక్షుల విచారణకు కోర్టు తేదీ నిర్ణయించడంతో సుధాకరన్ అంగీకరించారు. ఇదే కేసు నిమిత్తం భాస్కరన్ సైతం కోర్టుకు హాజరైన తన వాదన వినిపించారు. తదుపరి విచారణను జూలై 13కు వాయిదా వేశారు. దీంతో సుధాకరన్ను గట్టి భద్రత నడుమ మళ్లీ బెంగళూరుకు తరలించారు. ఇక, విదేశీ మారక ద్రవ్యం కేసు విచారణ నిమిత్తం చిన్నమ్మ శశికళను కోర్టులో ఎప్పుడు హాజరు పరుస్తారో అన్నది వేచి చూడాల్సిందే. చిన్నమ్మతో ములాఖత్ : పరప్పన అగ్రహార చెరలో ఉన్న శశికళతో మూడోసారిగా మంగళవారం దినకరన్ ములాఖత్ అయ్యారు. ఆయనతో పాటుగా సెంథిల్ బాలాజీ, పళనియప్పన్ తదితర ఐదుగురు ఎమ్మెల్యేలు శశికళను కలిశారు. రాష్ట్రంలో పళనిస్వామి ప్రభుత్వం సాగిస్తున్న వ్యవహారాలు, పార్టీలతో తమకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాలు, అసంతృప్తి ఎమ్మెల్యేల గురించి చిన్నమ్మకు వివరించినట్టు సమాచారం. ఈసందర్భంగా మీడియాతో దినకరన్ మాట్లాడుతూ, తమ కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవని, దివాకరన్‌తో సాగుతున్న వివాదంపై స్పందించారు. వివాదాలన్నీ పనిగట్టుకుని సృష్టిస్తున్నారని, తమ కుటుంబీకులు అందరూ ఐక్యతతోనే ఉన్నట్టు తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్‌పై చిన్నమ్మ తన నిర్ణయాన్ని పార్టీకి పంపుతారని, అందుకు తగ్గ ప్రకటన వెలువడుతుందన్నారు. ఇక, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై చిన్నమ్మతో వేరుగా ములాఖత్ కావడం గమనార్హం. చాలాకాలం అనంతరం చిన్నమ్మతో ఆయన భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రపతి ఎన్నికలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని మీడియాతో మాట్లాడుతూ తంబిదురై వ్యాఖ్యానించడం విశేషం. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటు బీజేపీకి అనుకూలంగా పడే రీతిలో పార్టీ వర్గాలకు సందేశం ఇవ్వాలన్న సంకేతాన్ని చిన్నమ్మకు తంబి దురై సూచించినట్టు సమాచారం. అలాగే, ఇదే ఎన్నికల్ని అడ్డం పెట్టుకుని కేంద్రాన్ని ఎదుర్కొందామా..? లేదా, సామరస్యంగా సాగుదామా..? అన్న అంశంపై దినకరన్ మంతనాలు సాగించినట్టు తెలిసింది. అయితే, తన రాజకీయ తంత్రాన్ని ఎన్నికల తేదీ నాటికి ప్రయోగించేందుకు చిన్నమ్మ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. -
రూపాయి.. రన్!
మూడు నెలల గరిష్ట స్థాయి • డాలర్ మారకంలో 66.85 పైసలు • అంతర్జాతీయ ట్రేడింగ్‌లో మరింత లాభం • నేడు మరింత బలపడే అవకాశం • డాలర్ బలహీనత, ఈక్విటీ మార్కెట్ల దన్ను! • తాత్కాలికమేనంటున్న నిపుణులు ముంబై: అనూహ్య రీతిలో డాలర్ మారకంలో రూపాయి విలువ దాదాపు 10 ట్రేడింగ్ సెషన్ల నుంచి పరుగులు పెడుతోంది. ఈ సమయంలో డాలర్ మారకంలో దాదాపు 1.75 పైసలు బలపడింది. గురువారం ట్రేడింగ్ ముగిసే సమయానికి ఫారెక్స్ మార్కెట్లో మూడు నెలల గరిష్ట స్థాయి 66.85 వద్ద ముగిసింది. భారత్ రూపాయి నవంబర్ 10 తరువాత ఈ స్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. ఇంట్రాబ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో బుధవారం రూపాయి ముగింపు 67.19 పైసలు. క్రితం ముగింపుతో పోల్చితే రూపాయి దాదాపు 34 పైసలు (0.51%) లాభపడింది. కాగా భారత్‌లో ఫారెక్స్ ట్రేడింగ్ ముగిసిన తరువాత, అంతర్జాతీయ మార్కెట్లో సైతం రూపాయి భారీగా బలపడింది. తుది సమాచారం అందే సరికి మరో 20 పైసలు లాభపడి 66.65 సమీపంలో ట్రేడవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే శుక్రవారం సైతం రూపాయి జోరును కొనసాగించే అవకాశం ఉంది. ఈ పరుగు ఎందుకు... ⇔ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేనాటికి దాదాపు 14 సంవత్సరాల గరిష్ట స్థాయిలో 104 డాలర్లకు చేరింది. అయితే డాలర్ బలహీనపడాలన్న అమెరికా అధ్యక్షుని విధానానికి తోడు, అధిక స్థాయిలో ప్రాఫిట్ బుకింగ్ వల్ల ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడ్ అయ్యే డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం 101 డాలర్ల దిగువ స్థాయిలో ట్రేడవుతోంది. ఈ ప్రభావం భారత్ కరెన్సీమీదే కాకుండా, మిగిలిన కొన్ని ఆసియా దేశాల కరెన్సీల బలోపేతానికి సైతం కారణమవుతోంది. ⇔ ఇక అమెరికా ఆర్థిక వృద్ధిపై నెలకొన్న అనుమానాలు డాలర్ బలహీనతకు దారితీస్తాయన్న అంచనాలు ఆ కరెన్సీ సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది. ముఖ్యంగా ఫెడ్ వడ్డీరేట్లు ఇప్పట్లో పెంచబోదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ⇔ భారత్‌లో బుధవారం పాలసీ సందర్భంగా ఆర్బీఐ రెపో రేటు తగ్గిస్తే– రూపాయికి బ్రేక్‌లు పడతాయని భావించారు. అయితే ఇదీ జరగలేదు. రెపో రేటును 6.25 స్థాయిలోనే ఆర్బీఐ కొనసాగించింది. ⇔ డాలర్ మరింత బలహీనపడుతున్న అంచనాలతో బ్యాంకులు, ఎగుమతిదారులు సైతం ఆ కరెన్సీ భారీ అమ్మకాలకు దిగుతున్నారు. ఇది భారత్ కరెన్సీకి బలాన్ని ఇస్తోంది. బలపడితే ఏమిటి? రూపాయి బలపడితే ప్రధానంగా భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన ఎగుమతులకు తక్కువ డాలర్లు చేతికి అందుతాయి. సాఫ్ట్వేర్, టెక్స్టైల్స్, జెమ్స్ అండ్ జ్యువలరీ వంటి రంగాలపై ఇది తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్నది నిపుణుల విశ్లేషణ. ఇప్పటికే భారత్ ఎగుమతులు తీవ్ర ప్రతికూలతలను ఎదుర్కొంటున్నాయి. ర్యాలీ స్వల్పకాలమే! ⇔ కాగా రూపాయి పరుగు స్వల్పకాలమేనని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు కొన్ని కారణాలు చూస్తే ⇔ ఫార్వార్డ్ మార్కెట్లో డాలర్ ప్రీమియం స్థిరంగా కొనసాగుతోంది. కార్పొరేట్ నుంచి చెల్లింపుల ఒత్తిడి దీనికి కారణం. బెంచ్‌మార్క్ ఆరు నెలల ప్రీమియం జూలైకి సంబంధించి బుధవారం 154–156 పైసల శ్రేణి నుంచి 155.5–156.5 పైసల శ్రేణికి పెరిగింది. 2018 జనవరి ప్రీమియంసైతం 301–303 శ్రేణి నుంచి 305–306పైసలకు పెరిగింది. ⇔ ఇక ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేని పరిస్థితితో వచ్చే నెల రోజుల్లో డాలర్ బలపడే అవకాశం ఉంది. డాలర్ ఇండెక్స్ ప్రస్తుత 100 ఎగువ స్థాయి ఆ కరెన్సీకి బలోపేతమైన అంశమే. ⇔ 2016 సంవత్సరం మొదటి నుంచీ డాలర్ మారకంలో 66.2–68.7 శ్రేణిలో తిరుగుతున్న రూపాయి తన కదలిక బాటను మార్చుకునే అవకాశం ఉందని మరో బ్యాంకింగ్ సేవల దిగ్గజం– డీబీఎస్ నివేదిక ఒకటి అంచనావేసింది. ⇔ పాలసీ రేట్లు యథాతథంగా కొనసాగించాలన్న ఆర్బీఐ నిర్ణయం సైతం సమీప కాలంలో భారత్ ఈక్విటీలు, రూపాయిపై ప్రతికూలత చూపుతాయని జపాన్ బ్రోకరేజ్‌సంస్థ నోమురా పేర్కొంది. ఇప్పటికిప్పుడు రూపాయి బలంగా ఉన్నా, సమీప కాలంలో కొంత బలహీనత ఖాయమని అంటోంది. -
చిక్కుల్లో చిన్నమ్మ
► మళ్లీ మెడకు చిక్కుకున్న విదేశీ మారక ద్రవ్యం కేసు ► కింది కోర్టు తీర్పును రద్దు చేసిన మదురై హైకోర్టు ► శశికళ, దినకరన్ లపై ఈడీ కేసులకు సమర్థన సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. విదేశీ మారక ద్రవ్యం మోసం కేసు నుంచి శశికళ, ఆమె సమీప బంధువు దినకరన్ లకు విముక్తి కల్పిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును మదురై హైకోర్టు రద్దు చేసింది. ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పెట్టిన అన్ని కేసులను చట్టపరంగా ఎదుర్కొనక తప్పదని న్యాయమూర్తి జి.చొక్కలింగం బుధవారం తీర్పు చెప్పారు. తీర్పు వివరాలు ఇలా.. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వాటాదారుగా ఉన్న భరణి బీచ్ రిసార్ట్స్ సంస్థకు ఎన్ ఆర్ఐ సుశీలా రామస్వామి అనే వ్యక్తి నుంచి పరోక్షంగా రూ.3 కోట్లు అప్పు అందింది. ఈ మొత్తంలో రూ.2.2 కోట్లు కొడనాడు ఎస్టేట్స్‌లో వాటాగా పెట్టుబడి పెట్టారు. రిజర్వుబ్యాంకు అనుమతి లేకుండా విదేశీ మారక ద్రవ్యం చేతులు మార్చినట్లుగా శశికళ, దినకరన్, జేజే టీవీ తదితరులపై 1996లో ఎన్ ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ)కు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదు మేరకు పలు సెక్షన్లపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసు నుంచి తమను తప్పించాల్సిందిగా కోరుతూ చెన్నై ఆర్థిక నేరాల న్యాయస్థానంలో శశికళ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు 2015లో తీర్పు చెప్పింది. మూడు కేసుల నుంచి శశికళకు విముక్తి కల్పించేందుకు నిరాకరించి, ఒక కేసు నుంచి తప్పించేందుకు అంగీకరించింది. అలాగే రెండు కేసుల నుంచి దినకరన్ కు విముక్తి కల్పించింది. విముక్తి కల్పించేందుకు నిరాకరించిన మూడు కేసులపై శశికళ మద్రాసు హైకోర్టులో అప్పీలు చేసింది. శశికళ, దినకరన్ లపై కేసులు ఎత్తివేయడం సరికాదంటూ ఈడీ కూడా హైకోర్టులో అప్పీలు పిటిషన్ దాఖలు చేసింది. శశికళ, దినకరన్ లకు వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ లో ఈ విధంగా పేర్కొన్నారు. శశికళ స్నేహితురాలు చిత్ర అనే వ్యక్తికి ఎన్ ఆర్ఐ సుశీలా రామస్వామి రూ.3 కోట్లను అప్పుగా ఇచ్చారు. అప్పుగా తీసుకున్న ఆ మొత్తాన్ని శశికళ ఖాతాకు చిత్ర బదిలీ చేశారు. ఇందుకోసం 25 చెక్కులను చిత్ర ఇచ్చారు. తలా రూ.22 లక్షల విలువైన రెండు చెక్కులు శశికళ బంధువులు సుధాకరన్, ఇళవరసి పేర్లతో జారీ కాగా, మిగిలిన చెక్కులపై పేర్లు లేకుండానే ఇచ్చారు. భరణి బీచ్ రిసార్ట్స్ సంస్థ పేరుతో పాయస్గార్డెన్ ఇంటి ఫోన్ ద్వారా మలేషియాలోని సుశీలా రామస్వామి ఇంటికి అనేక సార్లు మాట్లాడి ఉన్నారు. ఈ లావాదేవీల్లో నడిచిన గోల్మాల్ను కిందికోర్టు న్యాయమూర్తి గుర్తించలేదు. కాబట్టి ఒక కేసు నుంచి శశికళకు, రెండు కేసుల నుంచి దినకరన్ కు విముక్తి కల్పిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని ఈడీ తన అప్పీలు పిటిషన్ లో హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఈ శశికళ, ఈడీ తరపున దాఖలైన అప్పీలు పిటిషన్లపై వాదోపవాదాలు ముగిసిన నేపథ్యంలో గతంలో న్యాయమూర్తి తేదీని ప్రకటించకుండా తీర్పును వాయిదా వేశారు. కాగా, న్యాయమూర్తి జీ.చొక్కలింగం బుధవారం సాయంత్రం మదురై హైకోర్టులో తీర్పు చెప్పారు. రిజర్వు బ్యాంకు అనుమతి లేకుండా విదేశీ మారకద్రవ్యం చేతులు మారిందని, శశికళ భాగస్వామిగా ఉన్న సంస్థకు ఈ సొమ్ము చేరినట్లుగా న్యాయస్థానం విశ్వసిస్తోందని న్యాయమూర్తి అన్నారు. సంస్థకు తాను భాగస్వామిగా మాత్రమే ఉన్నానని, కార్యకలాపాలతో సంబంధం లేదనే వాదన అంగీకరించేది లేదని, భాగస్వామిగా అన్ని కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నట్లుగా చూపుతూ అవసరమైన డాక్యుమెంట్లు ఉన్నాయని చెప్పారు. సంస్థాపరమైన లావాదేవీల్లో శశికళ సంతకాలు కూడా చేసి ఉన్నారని తెలిపారు. కాబట్టి చట్టపరమైన చర్యలను ఎదుర్కొనక తప్పదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కింది కోర్టు ఇచ్చిన తీర్పును న్యాయమూర్తి సమర్థిస్తూ, మూడు కేసుల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ శశికళ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ ను కొట్టివేశారు. అలాగే, శశికళ, దినకరన్ లకు విముక్తి ప్రసాదిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఈడీ దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక నేరాల కింద వారిపై చర్యలు సమంజసం కాబట్టి విముక్తి ప్రసాదిస్తూ కింది కోర్టు జారీచేసిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. శశికళ, దినకరన్ లు ఈడీ పెట్టిన కేసుల విచారణను ఎదుర్కొనక తప్పదని న్యాయమూర్తి చొక్కలింగం స్పష్టం చేశారు. -
విదేశీ మారక నిల్వలు @36,030 కోట్ల డాలర్లు
డిసెంబర్ 30తో ముగిసిన వారానికి పెరిగిన నిల్వలు: ఆర్బీఐ ముంబై: విదేశీ కరెన్సీ ఆస్తులు పెరగడంతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి. గత నెల 30తో ముగిసిన వారానికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు 62.55 కోట్ల డాలర్లు పెరిగి 36, 029.6 కోట్ల డాలర్లకు పెరిగాయని భారత రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) తెలిపింది. ఆర్బీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం.., అంతకు ముందటి వారంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 93.52 కోట్ల డాలర్లు తగ్గి 35, 967.1 కోట్ల డాలర్లకు పడిపోయాయి. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు జీవిత కాల గరిష్ట స్థాయి, 37,199 కోట్లకు చేరాయి. డిసెంబర్ 30తో ముగిసిన వారానికి విదేశీ కరెన్సీ నిల్వలు 61.24 కోట్ల డాలర్లు పెరిగి 33, 658.2 కోట్ల డాలర్లకు ఎగిశాయి. పుత్తడి నిల్వలు 1,998.2 కోట్ల డాలర్ల వద్ద నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్–ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్) వద్దనున్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్(ఎస్డీఆర్) 49 లక్షల డాలర్లు పెరిగి 143.2 కోట్ల డాలర్లకు చేరాయి. ఈ సంస్థ వద్ద భారత రిజర్వ్ స్థితి 82 లక్షల డాలర్లు పెరిగి 229.9 కోట్ల డాలర్లకు పెరిగాయి. -
తగ్గిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు
విదేశీ కరెన్సీ ఆస్తులు క్షీణించడమే కారణం ముంబై: విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఈ నెల 23తో ముగిసిన వారానికి తగ్గాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు తగ్గడంతో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 94 కోట్ల డాలర్లు తగ్గి 35,967 కోట్ల డాలర్లకు పడిపోయాయని ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం,,. అంతకు ముందటి వారంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు 238 కోట్ల డాలర్లు క్షీణించి 36,060 కోట్లకు తగ్గాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన వారానికి ఈ నిల్వలు జీవిత కాల గరిష్ట స్థాయి, 37,199 కోట్ల డాలర్లకు పెరిగాయి. ఇక ఈ నెల 23తో ముగిసిన వారానికి మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అధిక భాగం ఉండే విదేశీ కరెన్సీ ఆస్తులు(ఎఫ్సీఏ–ఫారిన్ కరెన్సీ అసెట్స్) 93 కోట్ల డాలర్లు తగ్గి 33,597 కోట్ల డాలర్లకు పడిపోయాయి. పుత్తడి నిల్వలు నిలకడగా 1,998 కోట్ల డాలర్లుగా ఉన్నాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) వద్దనున్న స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 9 లక్షల డాలర్లు తగ్గి 142 కోట్ల డాలర్లకు పడిపోయాయి.దీంతో ఐఎంఎఫ్ వద్ద భారత రిజర్వ్ పొజిషన్ 11 లక్షల డాలర్లు తగ్గి 229 కోట్ల డాలర్లకు పడిపోయింది. -
ఫారెక్స్ నిల్వలు డౌన్
367 బిలియన్ డాలర్లకి పరిమితం ముంబై: దేశీ విదేశీ మారక నిల్వలు నవంబర్ 11తో ముగిసిన వారంలో 1.19 బిలియన్ డాలర్ల క్షీణతతో 367.04 బిలియన్ డాలర్లకు పడ్డాయి. విదేశీ కరెన్సీ అసెట్స్‌లో తగ్గుదలే ఫారెక్స్ నిల్వల క్షీణతకు కారణమని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. విదేశీ కరెన్సీ అసెట్స్ 1.15 బిలియన్ డాలర్ల క్షీణతతో 342.77 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇక బంగారు నిల్వలు స్థిరంగా 20.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా కడుపటి వారంలో ఫారెక్స్ నిల్వలు 368.23 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. సెప్టెంబర్ 30తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు ఆల్‌టైం గరిష్టానికి (371.99 బిలియన్ డాలర్లకు) ఎగసిన విషయం తెలిసిందే. -
ఆల్‌టైం గరిష్టానికి ఫారెక్స్ నిల్వలు
ముంబై: దేశంలోని విదేశీ మారక నిల్వలు సెప్టెంబర్ 30తో ముగిసిన వారంలో 1.22 బిలియన్ డాలర్ల మేర ఎగసి 371.99 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది ఆల్‌టైం గరిష్ట స్థాయి. విదేశీ కరెన్సీ అసెట్స్‌లో పెరుగుదల కారణంగానే ఫారెక్స్ నిల్వలు సరికొత్త శిఖరాగ్రానికి ఎగసినట్లు ఆర్బీఐ గణాంకాలు పేర్కొంటున్నాయి. విదేశీ కరెన్సీ అసెట్స్ 1.46 బిలియన్ డాలర్ల పెరుగుదలతో 346.71 బిలియన్ డాలర్లుగా చేరాయి. బంగారం నిల్వలు 236.4 మిలియన్ డాలర్ల తగ్గుదలతో 21.40 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా కడపటి వారంలో ఫారెక్స్ నిల్వలు 370.76 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక ఫారెక్స్ నిల్వల గరిష్ట స్థాయి ఇదివరకు (సెప్టెంబర్ 9తో ముగిసిన వారంలో) 371.27 బిలియన్ డాలర్లుగా ఉంది. -
మాల్యాకు మరో చిక్కు
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు బకాయిపడి, తప్పించుకుని తిరుగుతున్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు ఇచ్చిన వ్యక్తిగత హాజరు మినహాయింపును ఢిల్లీ కోర్టు ఎత్తివేసింది. సెప్టెంబర్ 9న కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఫిర్యాదు మేరకు కోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. ఫారిన్ ఎక్చ్సేంజ్ రూల్స్ ఉల్లఘించించారనే ఆరోపణల కింద విజయ్ మాల్యా కచ్చితంగా కోర్టులో హాజరుకావాలని పేర్కొంది. మనీ లాండరింగ్ కేసులో మాల్యాను ప్రకటిత నేరస్తుడిగా ప్రత్యేక కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్ కు సంబంధించి రూ.9000కోట్ల రుణాన్ని బ్యాంకులకు ఎగనామం పెట్టి మార్చిలో మాల్యా బ్రిటన్ కు చెక్కేశాడు. అయితే నిన్న ఇంగ్లండ్ లోని సిల్వర్ స్టోన్ లో జరుగుతున్న ఫార్ములా వన్ రేసింగ్ పోటీల్లో ఆయన సహారా ఫోర్స్ వన్ జట్టు సహ భాగస్వామి హోదాలో మీడియా ముందు ప్రత్యక్షమయ్యాడు. జీవితం అనేది సాగిపోతుండాలి అనే వేదాంత ధోరణిలో మీడియాతో మాట్లాడారు. భారత ప్రభుత్వం తన పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడంతో ఎటూ వెళ్లలేని పరిస్థితిపై ఆయన పెదవి విరిచారు. వారంలో 6 రోజులు పనిచేస్తూ కొన్ని కిలోల మేర బరువు తగ్గానని, తానిప్పుడు ఫిట్‌గా ఉన్నానన్నారు. ఫైనాన్సియల్ కేసుల్లో విచారణ నిమిత్తం భారత్ కు తిరిగి రావాలని తామిచ్చే ఆదేశాలపై మాల్యా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఆరోపిస్తోంది. ఇటీవలే మాల్యాకు సంబంధించిన రూ.1,411 కోట్ల ప్రాపర్టీని ఈడీ అటాచ్ చేసింది. ఏప్రిల్ లో మాల్యా పాస్ పోర్టు కూడా రద్దు అయింది. -
రికార్డు స్థాయికి విదేశీ మారక నిల్వలు
ముంబై: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు ఏప్రిల్ 8వ తేదీతో ముగిసిన వారంలో రికార్డు గరిష్ట స్థాయికి చేరాయి. అంతకుముందు వారంతో పోల్చితే... 158 మిలియన్ డాలర్లు ఎగసి 360 బిలియన్ డాలర్లుకు ఎగబాకాయి. విదేశీ కరెన్సీ అసెట్స్‌గా పేర్కొనే డాలర్ల పరిమాణం పెరగడం మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి పెరిగేందుకు దోహదపడినట్లు శుక్రవారం విడుదలైన రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గణాంకాలు తెలిపాయి. కేవలం డాలరు ఆస్తులే 159 మిలియన్లు ఎగసి 336 బిలియన్లకు చేరాయి. కాగా పసిడి నిల్వలు స్థిరంగా 20 బిలయన్ డాలర్లుగా కొనసాగుతున్నాయి. -
ఆల్ టైం గరిష్టానికి ఫారెక్స్ నిల్వలు
ముంబై: దేశంలో విదేశీ మారక నిల్వలు ఆల్‌టైం గరిష్ట స్థాయికి పెరిగాయి. ఈ నెల 18తో ముగిసిన వారంలో ఫారెక్స్ నిల్వలు 2.53 బిలియన్ డాలర్లమేర పెరిగి 355.94 బిలియన్ డాలర్లకు ఎగశాయి. విదేశీ కరెన్సీ ఎసెట్స్ (ఎఫ్సీఏ) పెరుగుదల ఫారెక్స్ నిల్వల వృద్ధే ప్రధాన కారణమని ఆర్బీఐ తెలిపింది. ఈ నెల 18తో ముగిసిన వారపు కడపటి వారంలో ఫారెక్స్ నిల్వలు 353.40 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఎఫ్‌సీఏలు 2.5 బిలియన్ డాలర్ల వృద్ధితో 332.50 బిలియన్ డాలర్లకు పెరిగాయి. గోల్డ్ నిల్వలు స్వల్పంగా పెరిగి (0.6 మిలియన్ డాలర్లు) 19.32 బిలియన్ డాలర్లకు చేరాయి. -
హార్బర్ అభివృద్ధిపై ఆశ
నవ్యాంధ్ర రాజధానిగా రూపొందుతున్న జిల్లాకు తీరప్రాంతం ఆయువు పట్టుగా మారనుంది. రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నం హార్బర్ రాష్ట్రంలో విశాఖపట్నం తరువాత అత్యంత ప్రాధాన్యత గలది. విదేశీ మారకద్రవ్య సముపార్జనతో పాటు వేలాదిమందికి ఉపాధి కేంద్రంగా మారిన ఈ హార్బర్ అభివృద్ధి ప్రతిపాదనలకే పరిమితమైంది. అమరావతి అంకురార్పణతోనైనా ఈ దిశగా పాలకులు దృష్టి సారిస్తారని, తమకు మంచి రోజులొస్తాయని తీరప్రాంత ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. రేపల్లె: రేపల్లె నియోజకవర్గంలోని నిజాంపట్నం సముద్ర తీరంలో సహజసిద్ధంగా ఏర్పడిన పాయను అనువైన ప్రాంతంగా ఎంచుకుని 1980లో అటవీశాఖకు చెందిన 38 ఎకరాల్లో హార్బర్ నిర్మించారు. దీనికి అనుసంధానంగా తొలి దశ పనుల్లో భాగంగా 50 బోట్లను నిలుపుదల చేసుకునే విధంగా జె ట్టీ నిర్మించారు. హార్బర్ ఏర్పాటుతో ఆప్రాంతం దినదినాభివృద్ధి చెందుతూ వచ్చింది. బోట్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కాకినాడ, మచిలీపట్నం, చీరాల ఓడరేవు, నెల్లూరు, మద్రాసుకు చెందిన బోట్లు మత్స్యసంపద విక్రయాలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో రాకపోకలు సాగించటం మొదలుపెట్టాయి. దీంతో జెట్టీ సమస్య జటిలంగా మారింది. మురిగిపోయిన నిధులు.. జెట్టీ సమస్య పరిష్కారానికి పదేళ్ల కిందట నాడు కూచినపూడి శాసనసభ్యులుగా ఉన్న మోపిదేవి వెంకటరమాణారావు హార్బర్ రెండో దశ పనులకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం జెట్టీ అభివృద్ధికి రూ.10 కేటాయించినప్పటికీ అటవీశాఖకు చెందిన భూమికి అనుమతి మంజూరుకాక నిధులు మురిగిపోయాయి. కొంతకాలం తరువాత సమస్యను నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లి హార్బర్ అభివృద్ధికి కావలసిన ఐదెకరాల అటవీశాఖ భూమిని కేటాయింపు చేయించడంలో మోపిదేవి సఫలీకృతులయ్యారు. వైఎస్ ఆకస్మిక మరణంతో పనులు మాత్రం ముందుకు సాగలేదు. 2011 ఫిబ్రవరి 7న రచ్చబండ కార్యక్రమానికి నిజాంపట్నం వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా హార్బర్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఒక్కఅడుగూ ముందుకు పడలేదు. పెరిగిన బోట్లు.. తరచూ వివాదాలు... హార్బర్లోని జెట్టీలో 50 బోట్లు నిలిపేందుకు మాత్రమే చోటు సరిపోతుంది. ప్రస్తుతం నిజాంపట్నంలో 150 మెక్‌నైజ్డ్ బోట్లు, 150 మోటరైజ్డ్ బోట్లు ఉన్నాయి. వీటితో పాటు నిత్యం ఇతర ప్రాంతాలకు చెందిన బోట్లు 50 వరకు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. వేటనుంచి వచ్చిన బోట్లు నిలుపుకునేందుకు జెట్టీలో ఖాళీలేక మత్స్య సంపద దిగుమతి చేసుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాల సమయంలో బోట్లు ఒకేసారి ఒడ్డుకు చేర తాయి. వీటిని పక్కపక్కనే నిలపడం వల్ల అలలు, ఈదురుగాలుల ప్రభావానికి ఒకదానికి ఒకటి ఢీకొని దెబ్బతింటున్నాయి. జెట్టీలో చోటుకోసం గొడవలు జరగ డం పరిపాటిగా మారింది. పాయ పక్కనే లంగర్లు వేసి, మడ చెట్లకు కట్టి ఉంచితే ఇటీవల తుపాన్ల సమయంలో మూడు బోట్లు తాళ్లు తెగిపోయి సముద్రంలోకి వెళ్లిపోయాయి. ఏర్పాటు చేయాలని మత్స్యకారులు కోరుతున్నారు. -
మోడు వారిన జీడి
గుబురుగా పెరిగిన చెట్లు, గుత్తులుగా వేలాడే జీడిమామిడి కాయలతో కళకళలాడిన సాగరతీరం నేడు ఎడారిని తలపిస్తోంది. పచ్చని తోటలతో ఆహ్లాదకరంగా ఉండే ప్రాంతం మోడువారిన చెట్లతో వెలవెలబోతోంది. చూద్దామన్నా కాపు కనిపించని పరిస్థితి నెలకొంది. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ తీరంలోని జీడిమామిడి తోటలను గాలికి వదిలేడంతో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే అటవీ సంపద వేరుపురుగు సోకి అంతరించిపోతోంది. పర్యావరణ సమతుల్యతకు, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతున్న ఈ తోటల పరిరక్షణకు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంది. పిట్టలవానిపాలెం : గుంటూరు జిల్లాలో ప్రధాన తీరప్రాంతమైన బాపట్ల సమీపంలో ముత్తాయపాలెం, కర్లపాలెం, పేరలి తదితర గ్రామాలు, ప్రకాశం జిల్లాలోని చినగంజాం మండలం కడవకుదురు ప్రాంతంలో వేలాది ఎకరాల విస్తీర్ణంలో రిజర్వు ఫారెస్టు భూములున్నాయి. ఈ భూముల్లో అటవీ శాఖ 1956, 57, 58 సంవత్సరాల కాలంలో జీడి మామిడి సాగు చేపట్టింది. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే జీడిమామిడి తోటల పరిరక్షణకు 1980లో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. బాపట్ల ఫారెస్టు రేంజ్ పరిధిలోని జీడిమామిడి తోటలను నెల్లూరు అటవీ అభివృద్ధి ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేసి బాపట్ల ఫారెస్టు రేంజ్ విభాగాన్ని కావలి నార్త్ డివిజన్‌గా ఏర్పాటు చేసింది. జీడి మామిడి తోటలను ఆసంస్థ పర్యవేక్షణలోకి చేర్చింది. 2000 సంవత్సరం వరకు ఈ ప్రాంతాల్లో జీడి మామిడి తోటల పరిస్థితి బాగానే ఉంది. తర్వాత కాలంలో చెట్లను వేరు పురుగు ఆశించి సమూలంగా నాశనం చేస్తోంది. నాడు 5,000.. నేడు 150.. తోటలు అంతరించిపోతున్నప్పటికీ అటవీ అభివృద్ధి సంస్థ మాత్రం మొద్దు నిద్ర వీడకపోవడంతో జీడిమామిడి ద్వారా ప్రభుత్వానికి అందాల్సిన రాబడి పూర్తిగా పడిపోయింది. ఆయా ప్రాంతాలలో తోటలపై ఆధారపడి జీవించే వారి పరిస్థితి దెబ్బతింది. కర్లపాలెం మండలం కొత్తనందాయపాలెంలో 65 హెక్టార్లలో విస్తరించి ఉన్న జీడిమామిడి చెట్లు 15 ఏళ్ల క్రితం ఐదు వేల చెట్లు ఉండేవి. ప్రస్తుతం వాటి సంఖ్య కేవలం 150 చెట్లకు చేరుకుంది. దీన్ని బట్టి జీడి మామిడి తోటల పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కర్లపాలెం మండలం కొత్తనందాయపాలెంలో 65 హెక్టార్లు, పేరలిలో 1000 హెక్టార్లు, బాపట్ల మండలం ముత్తాయపాలెంలో 2000 హెక్టార్లు, ప్రకాశం జిల్లా కడవకుదురులో 100 హెక్టార్లు విస్తీర్ణంలో జీడిమామిడి తోటలు ఉన్నాయి. గణనీయంగా తగ్గిన ఆదాయం.. గడచిన పదేళ్లుగా జీడిమామిడి ధరలు పెరుగుతున్నాయి. కానీ ఆదాయం తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం తోటల్లో చెట్లు సంఖ్య తగ్గి, ఫలసాయం తగ్గిపోవడమే. వేలంపాటల ద్వారా ప్రభుత్వానికి వచ్చే రాబడి గణనీయంగా తగ్గిపోతుంది. గతేడాది బాపట్ల సెక్షన్ పరిధిలోని జీడిమామిడి తోటలకు రూ.80 లక్షల ఆదాయం సమకూరగా ఈ ఏడాది రూ.40 లక్షలకు పడిపోయింది. దిద్దుబాటు చర్యలతో పూర్వ వైభవం.. అంతరించిపోతున్న జీడిమామిడి తోటలపై ప్రభుత్వం దృష్టి సారించాలి. తిరిగి తోటలను అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి.మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు, అవి పెరిగి ఫలసాయం అందించే వరకు ఆయా అటవీ భూముల్లోని రైతులకు నామమాత్రపు లీజుకు ఇవ్వాలి.దీని వలన మొక్కల పెంపకానికయ్యే ఆర్థిక భారం తగ్గడంతో పాటు రైతులకు ఉపాధి కలుగుతుంది. గతంలో చాలా బాగుండేది.. గతంలో జీడిమామిడి తోటలు చాలా గుబురుగా ఉండేవి. గత పదేళ్లుగా చెట్లు ఎండిపోతున్నాయి. ఈ ప్రాంతమంతా ఎడారిగా మారింది. ఈసంవత్సరం అసలు చూద్దామన్నా కాపు కన్పించడం లేదు. అధికారులు పరిశీలించి మొక్కలు నాటి పూర్వవైభవం వచ్చేలా చర్యలు తీసుకోవాలి. - శ్రీనివాసరెడ్డి, తోట కాపలాదారు, కొత్త నందాయపాలెం, కర్లపాలెం మండలం తిరిగి మొక్కలు నాటితే బాగుంటుంది.. నిరుడు చూసిన చెట్లు ఈఏడు ఎండిపోతున్నాయి. దాదాపుగా 65 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న నందాయపాలెం తోట పూర్తిగా ఎండిపోయే స్థితికి చేరుకుంది. పచ్చని తోటల దగ్గర ఉండే మాలాంటి వారం చల్లదనం కోల్పోయా. తోట ఎండిపోవడం వలన పర్యావరణ సమతుల్యం కూడా దెబ్బతింటుంది. తిరిగి మొక్కలు నాటితే బాగుంటుంది. - వెంకట్రామిరెడ్డి, కొత్త నందాయపాలెం, కర్లపాలెం మండలం -
‘అచ్ఛేదిన్’ వచ్చినట్టేనా?!
అయిదేళ్ల కోసం అధికారం చేపట్టి ప్రారంభించిన ప్రయాణంలో ఏ ప్రభుత్వానికైనా తొలి ఏడాది కాలమూ పరీక్షా సమయమే. అది వేసే అడుగులపైనే అందరి దృష్టీ ఉంటుంది. అది తీసుకుంటున్న నిర్ణయాల్లోని మంచిచెడ్డలపై లోతైన చర్చ జరుగుతుంది. అందునా ఎన్నికల సమయంలో బీజేపీ తన ప్రచారహోరుతో ప్రత్యర్థులను గుక్కతిప్పుకోకుండా చేసింది గనుక జనంలో అంచనాలు కూడా భారీగా ఉంటాయి. ఇన్నిటిమధ్య పనితీరులో ఏ కొంచెం వెనకబడినట్టు కనబడినా అది తీవ్ర ప్రభావాన్నే చూపుతుంది. తొలి ఏడాదిలో సాధించిన విజయాలేమిటో... లోటుపాట్లేమిటో... ఎక్కడెక్కడ సరిదిద్దుకోవాల్సి ఉన్నదో విశ్లేషించుకుంటే మిగిలిన నాలుగేళ్ల కాలమూ మెరుగైన తీరును ప్రదర్శించడానికి పాలకులకు వీలవుతుంది. సాఫల్య వైఫల్యాల సమీక్ష పాలనకు చురుకుదనాన్ని తెస్తుంది. ఏడాది కాలమన్నది రాజకీయాల్లో సుదీర్ఘమైనదే కావచ్చుగానీ ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చేందుకు ప్రభుత్వానికది స్వల్ప వ్యవధికిందే లెక్క. కనుక తొలి సంవత్సరమే అన్నీ నెరవేర్చలేకపోయిందని చెప్పడం సరికాదు. అందులోనూ బీజేపీ ఇచ్చిన హామీలు చిన్నవేమీ కాదు. విదేశీ పెట్టుబడులను రప్పించి, యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తామని... మలి దశ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థకు జవజీవాలు తెస్తామని చెప్పింది. అంతేకాదు...పాలనలో చోటుచేసుకుంటున్న జాప్యాన్ని నివారించి, అవినీతిని అంతమొందిస్తామని హామీ ఇచ్చింది. కనుకనే ప్రత్యేకించి యువత, మధ్యతరగతి మోదీకి నీరాజనాలు పట్టాయి. అదేవిధంగా పేద, బలహీనవర్గాలను ‘అచ్ఛేదిన్’ (మంచిరోజులు) నినాద ం సమ్మోహనపరిచింది. వ్యవసాయాన్ని గిట్టుబాటయ్యేలా చేస్తామన్నందుకు రైతులు అండగా నిలిచారు. ఏడాది తర్వాత ఇప్పుడీ వర్గాలు నిరాశలోకి జారుకున్నాయనడం తొందరపాటే అవుతుందిగానీ...సంశయాలైతే చోటు చేసుకుంటున్నాయని చెప్పకతప్పదు. ఈ ఏడాదికాలంలోనూ ఎన్డీయే సర్కారు ఎన్నో పథకాలను ప్రారంభించింది. జన్‌ధన్ యోజన మొదలుకొని జన్సురక్షా, స్వచ్ఛభారత్, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా వరకూ అందులో ఎన్నో ఉన్నాయి. వీటి సాఫల్యవైఫల్యాల సంగతలా ఉంచి దేశ ఆర్థిక వ్యవస్థ కాస్త కోలుకున్న మాట వాస్తవం. కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పినట్టు ద్రవ్యోల్బణం చాన్నాళ్ల తర్వాత అదుపులోకి వచ్చింది. విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరిగాయి. కరెంటు అకౌంటు లోటు గణనీయంగా తగ్గింది. రెవెన్యూ లోటు తగ్గుముఖంపట్టింది. జీడీపీ కూడా 7.5 శాతం దగ్గరుంది. అయితే ఇందుకు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పడిపోవడం కూడా కారణమని గుర్తించాలి. దౌత్యరంగంలో మోదీ సాధించిన విజయాలు ఎన్నదగ్గవి. ఇక రైతుల వరకూ చూస్తే 50 శాతం పంటనష్టం జరిగిన సందర్భాల్లో మాత్రమే రైతుకు పరిహారం అందే పరిస్థితినుంచి 33 శాతం పంటనష్టానికి కూడా పరిహారం ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టారు. పరిహారం మొత్తాన్ని కూడా పెంచారు. మధురలో సోమవారం నిర్వహించిన ర్యాలీ సందర్భంగా రైతులకు మరిన్ని మేళ్లు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మోదీ ప్రకటించారు. అయితే, అవి రైతులు ఆశించిన స్థాయిలో ఉంటాయా? సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో హోరెత్తించినంతగా సాకారమవుతాయా? పెను సంక్షోభంలో చిక్కుకున్న వ్యవసాయరంగానికి ఇప్పుడు కావాల్సింది అరకొర సాయం కాదు. ఇన్నాళ్లూ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో ఎక్కువగా కనబడే రైతుల ఆత్మహత్యలు బీహార్, యూపీ, రాజస్థాన్‌వంటి ప్రాంతాలకు పాకాయి. సాక్షాత్తూ దేశ రాజధానిలోనే ఒక రైతు ఆత్మహత్యకు ఒడిగట్టాడు. వ్యవసాయంలో పెట్టుబడుల అవసరం పెరిగిపోవడం... అదే సమయంలో పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం, సవాలక్ష నిబంధనలతో బ్యాంకుల్లో అప్పుపుట్టక ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సిరావడం లాంటి కారణాలు అన్నదాతను అధోగతిలోకి నెట్టేస్తున్నాయి. అందువల్లనే రోజూ 2,035 మంది రైతులు ఆ రంగంనుంచి తప్పుకుంటున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ సర్వే వెల్లడించింది. ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ఉత్పాదక ఖర్చు కంటే కనీసం 50 శాతం ఎక్కువగా ఉండాలని స్వామినాథన్ కమిషన్ సూచించింది. ఆ సూచనలను తాము అధికారంలోకొస్తే అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటించింది. దాన్ని అమలు చేయకపోగా అది ఆచరణ సాధ్యం కాదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలుచేసింది. ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 10 శాతంపైగా కోత పడింది. ఇవన్నీ చాలనట్టు పారిశ్రామికాభివృద్ధికీ, రైతులనుంచి తీసుకునే భూములకూ పోటీపెట్టి భూసేకరణ చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. రైతుల భూములను ప్రభుత్వాలు ఏకపక్షంగా స్వాధీనం చేసుకునేందుకు వీలు కల్పించింది. ఇలాంటి పోకడలు అసలే అంతంతమాత్రంగా ఉన్న రైతును మరింత కుంగదీస్తున్నాయి. రైల్వే, రక్షణ రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించడం, బీమా రంగంలో 49 శాతం ఎఫ్డీఐకు వీలుకల్పించడం, న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం స్థానంలో కొత్త విధానానికి శ్రీకారం చుట్టడం వంటివి ఈ ఏడాది కాలంలో తీసుకున్న కీలక నిర్ణయాలు. అయితే, అన్ని వర్గాలనూ కలుపుకొని వెళ్లలేని అశక్తత మోదీ సర్కారును పీడిస్తున్నది. భూసేకరణ ఆర్డినెన్స్‌పై సర్వత్రా వ్యతిరేకత ఉన్నదని తెలిసినా తన వైఖరిని మార్చుకోకపోవడం, ైమైనారిటీల్లో అభద్రతను కలిగించే ప్రకటనలు చేస్తున్న నేతలను అదుపు చేయలేకపోవడం, స్వచ్ఛంద సంస్థలపై అవసరానికి మించి ఆంక్షలు విధించి అసమ్మతి గొంతు నొక్కుతున్నారన్న అభిప్రాయాన్ని కలిగించడంవంటివి ప్రభుత్వ ప్రతిష్టను పెంచవు. ప్రధాన సమాచార కమిషనర్, చీఫ్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ), లోక్‌పాల్ పదవులన్నీ చాన్నాళ్లుగా ఖాళీగా ఉన్నాయి. తాము కుంభకోణాలకు తావులేని పాలనను అందివ్వగలిగామని మోదీ చెప్పిన మాటల్లో వాస్తవమున్నా ఇలాంటి నిఘా వ్యవస్థలు చురుగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవడం అవసరం. అప్పుడు మోదీ ప్రభుత్వ నిష్కళంకత గురించి ఆయన చెప్పుకోనవసరంలేదు. ఆ వ్యవస్థలే మాట్లాడతాయి. రెండో సంవత్సరంలోకి అడుగుపెడుతున్న ఎన్డీయే సర్కారు తన లోటుపాట్లను సవరించుకుని ముందుకెళ్తుందని ఆశిద్దాం. -
కొత్త గరిష్టానికి
- విదేశీ మారక నిల్వలు ముంబై: భారత విదేశీ మారక నిల్వలు కొత్త గరిష్ట స్థాయికి చేరాయి. మే 15తో ముగిసిన వారంలో 1.745 బిలియన్ డాలర్లు పెరిగి 353.876 బిలియన్ డాలర్లకు చేరాయి. ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం విదేశీ కరెన్సీ అసెట్స్ పెరగడం ఇందుకు తోడ్పడింది. అంత క్రితం వారంలో విదేశీ మారక నిల్వలు 262.4 మిలియన్ డాలర్లు పెరిగి 352.131 బిలియన్ డాలర్లకు చేరాయి. తాజాగా విదేశీ కరెన్సీ అసెట్స్ 1.708 బిలియన్ డాలర్ల మేర ఎగియగా, పసిడి నిల్వలు 19.335 బిలియన్ డాలర్ల స్థాయిలో స్థిరంగా ఉన్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ 27.8 మిలియన్ డాలర్లు పెరిగి 4.090 బిలియన్ డాలర్లకు చేరాయి. -
రికార్డు స్థాయికి విదేశీ మారక నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారక నిల్వలు కొత్త రికార్డు గరిష్ట స్థాయికి చేరాయి. ఏప్రిల్ 24తో ముగిసిన వారానికి 344.6 బిలియన్ డాలర్లకు ఎగసాయి. అంతక్రితం వారంతో (ఏప్రిల్ 17) పోల్చిచూస్తే, ఇవి 1.4 బిలియన్ డాలర్లు అధికం. రిజర్వ్ బ్యాంక్ సమాచారం ప్రకారం... ⇒ విదేశీ కరెన్సీ అసెట్స్‌గా(ఎఫ్సీఏ) పరిగణించే డాలర్ల పరిమాణం 1.4 బిలియన్ డాలర్లు ఎగసి, 320.26 బిలియన్ డాలర్లకు చేరింది. ⇒ బంగారం నిల్వల విలువ స్థిరంగా 19.03 బిలియన్ డాలర్ల వద్ద ఉంది. ⇒ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ వద్ద స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ స్వల్పంగా 0.2 మిలియన్ డాలర్లు ఎగసి, 4 బిలియన్ డాలర్లకు చేరాయి. -
ఆల్‌టైమ్ గరిష్టానికి విదేశీ మారక నిల్వలు
ముంబై: భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. జనవరి 30వ తేదీతో ముగిసిన వారాంతానికి 327.88 బిలియన్ డాలర్లను చేరాయి. అంతకు ముందు వారంతో పోల్చితే ఈ నిల్వలు ఏకంగా 5.84 బిలియన్లు పెరిగినట్లు ఆర్బీఐ గణాంకాలు తెలిపాయి. భారీగా విదేశీ వ్యవస్థాగత పెట్టుబడులు (ఎఫ్ఐఐ) దేశానికి రావడం, డాలర్లు పెద్దగా దేశం నుంచి బయటకు పోకపోవడం వంటి అంశాలు దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలు రికార్డు స్థాయికి చేరడానికి కారణమని అధికార వర్గాలు తెలిపాయి. -
విదేశీ మారక అక్రమాలపై ఈడీ దర్యాప్తు
‘నల్లధన’ సిట్ విజ్ఞప్తి న్యూఢిల్లీ: విదేశీ మారకంలో నిబంధనల ఉల్లంఘనలు, అక్రమ నిధులను అరికట్టడానికి ఆర్బీఐ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని నల్లధనంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కోరింది. రూ. 100 కోట్లకుపైగా ఎగుమతి బకాయిల వివరాలను ఈడీకి అందజేసింది. సాధారణంగా బ్యాంకులు ఇప్పటివరకు ఈ సమాచారాన్ని డీఆర్ఐ, కస్టమ్స్ సంస్థలకే ఇచ్చేవి. ప్రస్తుత ప్రొటోకాల్ ప్రకారం విదేశాలకు ఎగుమతి చేసే వారు తమకు రావలసిన బకాయిల సమాచారాన్ని 9 నెలల్లోగా ఆర్బీఐకి ఇవ్వాలి. లేకపోతే అక్రమాలకు పాల్పడుతున్నట్లు భావిస్తారు. వీటిని విదేశీ మారకం నిబంధనల ఉల్లంఘన, హవాలా కేసులుగా పరిగణిస్తారు. ఇలాంటి కేసులు చాలా ఉన్నట్లు సిట్ గుర్తించింది. -
ధరల కట్టడే లక్ష్యం...
ఇరాక్ సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొంటాం తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉన్నాయ్... క్యాడ్ కూడా భారీగా దిగొచ్చింది... ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వెల్లడి ముంబై: ధరల పెరుగుదలకు కళ్లెం వేయడమే తమ ప్రధాన కర్తవ్యమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. రానున్న కొద్ది త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా తమ చర్యలు కొనసాగుతాయని... దీనిపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశంలో అధిక ధరలకు అడ్డుకట్టవేయాలంటే ప్రభుత్వం ఆహారోత్పత్తులకు సంబంధించి తగిన నిర్వహణ విధానాలను అమలు చేయాల్సి ఉంటుందని రాజన్ అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణ పరిస్థితులను ఆర్బీఐ, ప్రభుత్వం నిశితంగా గమనిస్తున్నాయని, గత రెండు మూడు నెలలుగా ఆహార ధరలు మళ్లీ పుంజుకుంటున్నట్లు ఆయన చెప్పారు. మంగళవారమిక్కడ ఎస్బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మే నెలలో టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణంరేటు ఐదు నెలల గరిష్టానికి(6.01%) ఎగబాకిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో ఈ రేటు 5.2%. ఆహారోత్పత్తులు, నిత్యావసరాల రేట్లు ఎగబాకడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచింది. కాగా, ఎల్ నినోతో ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురవకపోవచ్చని... దీంతో ద్రవ్యోల్బణం మరింత ఎగబాకే ప్రమాదం పొంచిఉందన్న ఆందోళనలు అధికమవుతున్నాయి. కాగా, రాజన్ తాజా వ్యాఖ్యలతో ఇప్పట్లో పాలసీ వడ్డీరేట్ల తగ్గింపు ఉండబోదన్న సంకేతాలు బలపడుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. ఇరాక్ అనిశ్చితిపై... ఇరాక్‌లో అంతర్యుద్ధం కారణంగా నెలకొన్న సంక్షోభం సహా ఎలాంటి పరిస్థితులనైనా దీటుగా ఎదుర్కోగల సత్తా భారత్‌కు ఉందని రాజన్ పేర్కొన్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం అంతర్జాతీయ ప్రతికూలతలను తట్టుకోవడంలో మనం మరింత మెరుగైన స్థితిలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ‘దేశంలో తగినన్ని విదేశీ మారక(ఫారెక్స్) నిల్వలు ఉన్నాయి. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా భారీగా దిగొచ్చింది. ఈ నేపథ్యంలో ఇరాక్ సహా ఇతరత్రా ఎలాంటి అంతర్జాతీయ సంక్షోభాలు ఎదురైనా మనకు ముప్పేమీ లేదు. ఇరాక్‌లో చమురు నిల్వలన్నీ దక్షిణ ప్రాంతంలోనే ఉన్నాథ యి. అక్కడ జరుగుతున్న అంతర్యుద్ధం ఆ దేశ క్రూడ్ బిజినెస్‌పై పెద్దగా ప్రభావమేమీ చూపకపోవచ్చు. అయినప్పటికీ ఈ అంశం కొంత ఆందోళనకరమైనదే. అక్కడి సంక్షోభాన్ని నిశితంగా గమనిస్తున్నాం’ అని రాజన్ పేర్కొన్నారు. బంగారం ఇతరత్రా దిగుమతులు దిగిరావడంతో గత ఆర్థిక సంవత్సరం(2013-14)లో క్యాడ్ జీడీపీలో 1.7 శాతానికి(32.4 బిలియన్ డాలర్లు) తగ్గడం రూపాయిపై కొంత ఒత్తిడి తగ్గించింది. అంతేకాదు ఆఖరి త్రైమాసికంలో అయితే, ఈ లోటు ఏకంగా 0.2 శాతానికి(1.2 బిలియన్ డాలర్లు) పరిమితమైంది. అంతక్రితం ఏడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టమైన 4.7 శాతానికి(87.8 బిలియన్ డాలర్లు) ఎగబాకిన సంగతి తెలిసిందే. ఇరాక్ ప్రభుత్వంపై సున్నీ తీవ్రవాదుల భీకర దాడులు... చాలా ప్రాంతాలను ఆక్రమించుకోవడంతో చమురు ధరలకు రెక్కలు రావడం తెలిసిందే. ఈ సంక్షోభం వల్ల అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లలోనూ తీవ్ర ప్రకంపనలు చెలరేగాయి కూడా. దీంతో డాలరుతో రూపాయి మారకం విలువ కూడా మళ్లీ 60 దిగువకు పడిపోవడం గమనార్హం. క్రూడ్ రేట్ల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం కూడా ఎగబాకే ప్రమాదం పొంచిఉంది. కాగా, చమురు దిగుమతులపై అత్యధికంగా ఆధారపడుతున్న భారత్‌కు క్రూడ్ రేట్ల పెరుగుదల ఇబ్బందికర అంశమే. -
సాగుకు...నానో బలిమి!
రైతు... దేశానికి వెన్నెముక అంటారు. కానీ విత్తులు మొదలుకొని కోతల వరకూ... అన్ని దశల్లోనూ పెట్టే ఖర్చు... రైతుపై పెనుభారం మోపుతోంది. ఈ సాగు పెట్టుబడి కొంచెం తగ్గినా... బోలెడు ఉపయోగముంటుంది. శాస్త్రవేత్తలు ఇందుకోసం ఎనెన్నో ప్రయోగాలు చేస్తున్నారు కూడా. సెంట్రల్ ఏరిడ్ జోన్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు నానోటెక్నాలజీ సాయంతో అభివృద్ధి చేసిన ఎరువులుఈ కోవకే చెందుతాయి. అటు ఖర్చు తగ్గించడంతోపాటు దిగుబడులూ పెంచే ఈ వినూత్న ఎరువు వివరాలు... విత్తనాలు నాటింది మొదలు... పంట కాపుకొచ్చేంత వరకూ మనం ఎరువులు వాడుతూంటాం. మొక్క ఏపుగా ఎదిగేందుకు మంచి దిగుబడులు ఇచ్చేందుకు ఇది అవసరమని కూడా అంటారు. కానీ ఇందులో వాస్తవం కొంతే. వేసిన ఎరువులో మొక్క తీసుకునేది సగం కంటే తక్కువ మాత్రమే ఉంటే... మిగిలిన సగం వృధా అవుతూంటుంది. ఇలా కాకుండా వేసిన ఎరువులు... చాలా నెమ్మదిగా తమలోని పోషకాలను విడుదల చేస్తూ మొక్కలకు అందిస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. కానీ... ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న యూరియా, పొటాష్, డీఏపీ వంటి రసాయన ఎరువులకు ఈ లక్షణం ఉండదు. కొంచెం అటుఇటుగా వారం రోజుల్లో పోషకాలన్నింటిని విడుదల చేసి నీటిలో కలిసిపోతాయి. మరి ప్రత్యామ్నాయం? నానో ఎరువులు! సూక్ష్మ ప్రపంచం... నానో ఎరువుల గురించి తెలుసుకునే ముందు అసలు నానో అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. మన తల వెంట్రుక ఎంత పలుచగా ఉంటుందో మనకు తెలుసు. దాన్ని ఓ లక్ష సార్లు నిలువుగా చీల్చారనుకోండి. ఒక్కో ముక్క నానోమీటర్ మందం ఉంటుంది. అంత సూక్ష్మమైనదన్నమాట ఈ నానో! ఈ స్థాయిలో ఉండే పదార్థాల లక్షణాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు.. మామూలుగా ఉన్నప్పుడు బంగారం అర్ధవాహకం. అంటే దీని గుండా విద్యుత్తు ప్రవాహం కొంచెమే అవుతుందన్నమాట. అదే నానోస్థాయిలో మాత్రం చాలా సులువుగా విద్యుత్తు ప్రవహిస్తుంది. ఇదేవిధంగా నానోస్థాయిలో ఉండే ఎరువులు తమలోని పోషకాలను సాధారణ ఎరువులతో పోలిస్తే నాలుగు రెట్లు తక్కువ వేగంతో విడుదల చేస్తాయి. ఫలితంగా ఒకసారి వేసిన ఎరువులు చాలాకాలం పాటు మొక్కలకు ఉపయోపగడతాయన్నమాట. నాలుగింతలు తక్కువ ఖర్చు... తరఫ్దార్ అభివృద్ధి చేసిన పద్ధతిలో నానో ఎరువుల ఖరీదు సంప్రదాయ ఎరువులతో పోలిస్తే రెండు నుంచి నాలుగింతలు తక్కువ ఉంటుంది. అదే సమయంలో పర్యావరణానికి హాని కలిగించే రసాయనాల వాడకాన్ని 80 రెట్ల వరకూ తగ్గించవచ్చు. పంట రకాన్ని బట్టి నానో ఫాస్పరస్ ధర ఒక హెక్టారుకు రూ.350 నుంచి రూ.400 వరకూ ఉంటే, ఎస్ఎస్పీ ధర రూ.480 నుంచి రూ.640, డీఏపీ ధర రూ.1500 నుంచి రూ.2000 వరకూ మాత్రమే ఉంటుంది. నానో ఎరువుల వాడకం వల్ల మొక్కలు పీల్చుకోగల పోషకాల శాతం కూడా ఎక్కువ అవుతుంది. దీన్నే శాస్త్ర పరిభాషలో న్యూట్రియెంట్ యూజ్ ఎఫిషియెన్సీ అంటారు. సంప్రదాయ ఎరువులతో ఇది 42 శాతానికి మించదు. కానీ నానో ఎరువుల విషయంలో ఇది 58 శాతం కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా మొక్కలు ఏపుగా ఎదగడంతోపాటు ఎక్కువ దిగుబడులు అందిస్తాయి. ఒక అంచనా ప్రకారం నానో ఎరువుల ద్వారా పెరిగే దిగుబడులు 17 నుంచి 54 శాతం వరకూ ఉంటాయి. నానో ఎరువులతో ఇంకా కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. నేల ఎక్కువ తేమను ఒడిసిపట్టుకోవడం, కార్బన్ మోతాదులను పెంచడం వీటిల్లో కొన్ని. స్థానికంగా తయారు చేసుకోవడం ద్వారా ఎరువుల దిగుమతులు తగ్గి విలువైన విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది కూడా. భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 67 లక్షల టన్నుల ఎరువులను దిగుమతి చేసుకోగా ఇందుకోసం దాదాపు 200 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టింది. తరఫ్దార్ కృషి... నానో ఎరువుల తయారీ కోసం చాలాకాలంగా ప్రయాత్నాలు జరుగుతున్నాయి. మన పొరుగుదేశం బంగ్లాదేశ్‌తోపాటు దేశంలోని తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధకులూ ఈ దిశగా పరిశోధనలు చేస్తున్నారు. జోధ్‌పూర్‌లోని సెంట్రల్ ఏరిడ్ జోన్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్త జె.సి.తరఫ్దార్ ఇటీవలే ఇందులో విజయం సాధించారు. ప్రపంచంలోనే తొలిసారిగా బయో సింథసిస్ (ఎంజైమ్‌ల సాయంతో) పద్ధతిలో నానో ఎరువులను తయారు చేసే ప్రక్రియను ఆవిష్కరించారు. బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవుల ఎంజైమ్‌ల సాయంతో యూరియా, పొటాష్ వంటి ఎరువులను నానోస్థాయిలోకి మార్చగలిగారు. ప్రశస్తి ఇంజినీరింగ్‌తో ఒప్పందం... నానో ఎరువులను వాణిజ్యస్థాయిలో ఉత్పత్తి చేసేందుకు సెంట్రల్ ఏరిడ్ జోన్ రీసెర్చ్ సెంటర్ సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రతిష్ట ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వ్యవసాయ శాస్త్రవేత్తలు, మాజీ ఐఏఎస్ అధికారులు కొందరు బోర్డు సభ్యులుగా ఉన్న ఈ సంస్థ ఇప్పటికే సేంద్రీయ వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, పోషకాలను అభివృద్ధి చేస్తోంది. ‘‘సహజమైన పదార్థాలతో తయారు చేస్తూండటం వల్ల ఈ నానో ఎరువులతో పర్యావరణానికి ఎలాంటి నష్టం ఉండదు. అన్ని రకాల పంటలకూ దీన్ని వాడవచ్చు.’’ - జె.సి.తరఫ్దార్ -
రూపాయి భారీ పతనం
ముంబై: దేశీ కరెన్సీ మళ్లీ భారీ కుదుపునకు గురైంది. డాలరుతో రూపాయి మారకం విలువ శుక్రవారం 73 పైసలు క్షీణించి 62.66కు పడిపోయింది. ఇది రెండు నెలల కనిష్టస్థాయి కావడం గమనార్హం. గతేడాది నవంబర్ 11(77 పైసలు పతనం) తర్వాత రూపాయి ఈ స్థాయిలో దిగజారడం ఇదే తొలిసారి. బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు పటిష్టమైన డిమాండ్ కారణంగా రూపాయిపై ఒత్తిడి నెలకొందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క, దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారిపోవడం కూడా ప్రభావం చూపినట్లు వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన కరెన్సీలతో డాలరు విలువ నీరసించినా కూడా రూపాయికి మద్దతు లభించలేదని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. చైనా జీడీపీ, పారిశ్రామిక గణాంకాలు నిరుత్సాహపరచడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల్లో కోత(ట్యాపరింగ్) అంశాలవల్ల రూపాయిపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈఓ అభిషేక్ గోయెంకా పేర్కొన్నారు. నెలకు 85 బిలియన్ డాలర్ల బాండ్లో కొనుగోలులో 10 బిలియన్ డాలర్లను(ఈ నెల నుంచే) కోత పెడుతూ గత నెలలో ఫెడ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈనెల 28, 29 తేదీల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్(ఫెడ్) పాలసీ సమీక్ష జరగనుంది. 28న ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్వహించనుంది. ఈ రెండింటిలో తీసుకోబోయే నిర్ణయాలు రూపాయి కదలికలకు కీలకం కానున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. -
పడకేసిన ‘ఫారిన్ ఎక్స్చేంజ్’
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: భారత ప్రభుత్వ పరిధిలోని తపాలా శాఖలో విదేశీ మారకద్రవ్యం (ఫారిన్ ఎక్స్చేంజి) సేవలకు మంగళం పాడారు. దాంతో వందలాది మంది వినియోగదారులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. జిల్లావ్యాప్తంగా తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయంలో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ సేవలు సక్రమంగా నిర్వహించేందుకు, పర్యవేక్షణకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ హోదాలో అధికారిని నియమించారు. కానీ సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సేవలను ఏడాది కాలంగా ఆపేశారు. ఈ సేవలను తపాలాలో కొనసాగించేందుకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. తపాలా శాఖాధికారుల సమన్వయంతో హెచ్డీఎఫ్సీ బ్యాంకు సిబ్బంది రోజువారీగా వచ్చి సేవలకు సాంకేతిక సహకారం అందించాల్సి ఉంది. జిల్లాలోని పడమటి మండలాలతో పాటు చిత్తూరు పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మంది ప్రజలు కువైట్, దుబాయ్, సింగపూర్‌లో స్థిరపడ్డారు. అంతేగాక తిరుపతి డివిజన్ పరిధిలో కూడా అనేక మంది అమెరికాలో ఉన్నారు. వారికి సంబంధించిన బంధువులంతా స్వగ్రామాల్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న వారు ఇక్కడి బంధువులకు ప్రతినెలా ఆయా దేశాల కరెన్సీని పంపుతుంటారు. ఈ నగదునున విదేశీ మారక ద్రవ్యాల కేంద్రాల ద్వారా మనదేశ నగదుగా మార్చుకుంటారు. ఇందుకోసం బయట ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కేంద్రాల్లో రూ.వందకు కొంత కమీషన్ పట్టుకుని ఇస్తుంటారు. తపాలా శాఖలోని ఫారిన్ ఎక్స్చేంజి ద్వారా అయితే ఎలాంటి కమీషన్ లేకుండా విదేశీ నగదును మార్చుకోవచ్చు. అలాంటి సేవలను తపాలా శాఖలో ఆపేయడం వల్ల ప్రతిరోజూ వందలాది మంది వినియోగదారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అంతేగాక ఆయా దేశాల క రెన్సీ మార్పిడిలో భాగంగా రోజువారీ నిర్ణీత ధరలను(రూపాయితో మారకం విలువ) బట్టి మన దేశ నగదుకు ఎంత సమానమనే విషయాన్ని డిస్ల్పే ద్వారా తెలుసుకునే సౌలభ్యం కూడా తపాలా శాఖలో మాత్రమే ఉంది. ఈ ప్రక్రియ ద్వారా తపాలా శాఖకు హెచ్డీఎఫ్సీ బ్యాంకు నుంచి ఆదాయం సమకూరుతుంది. ఇప్పటికైనా తపాలా ఉన్నతాధికారులు స్పందించి ఆగిపోయిన ఫారిన్ ఎక్స్చేంజి సేవలను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. -
రూపాయి విలువ మరింత పతనం
రూపాయి పతనం కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజూ రూపాయి విలువ మరింత దిగజారింది. బుధవారం దేశీయ కరెన్సీ విలువ మరో 17 పైసలు పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రెండు నెలల కనిష్ట స్థాయిలో 63.88 వద్దకు దిగజారింది. మంగళవారం రూపాయి మారకం విలువ 47 పైసలు పడిపోయి 63.71 వద్ద ముగియగా, మరుసటి రోజు మరింత దిగజారడం ఆందోళన కలిగించే విషయం. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ కొనసాగడం రూపాయి క్షీణతకు దారితీసినట్లు ఫారెక్స్ డీలర్లు చెబుతున్నారు. మరోపక్క, ప్రపంచవ్యాప్తంగా డాలరు బలపడటం కూడా దేశీ కరెన్సీపై ప్రతికూల ప్రభావం చూపింది. నష్టాల బాటలో నడుస్తున్న బీఎస్ఈ సెన్సెక్స్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపింది. సెన్సెక్స్ ఆరంభంలో 53.97 పాయింట్లు కోల్పోయింది. -
వాల్‌మార్ట్ పెట్టుబడులపై ఇక ఆర్బీఐ దర్యాప్తు!
ముంబై/న్యూఢిల్లీ: అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ భారత్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇక రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) దర్యాప్తు చేపట్టనున్నట్లు సమాచారం. భారతీ గ్రూప్‌తో జాయింట్ వెంచర్ ద్వారా వాల్‌మార్ట్ హోల్‌సేల్(క్యాష్ అండ్ క్యారీ) రిటైల్ వ్యాపారాన్ని భారత్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, వాల్‌మార్ట్ విదేశీ మారకద్రవ్య లావాదేవీల నిబంధనల(ఫెమా)ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. దీనిపై ఇప్పటికే దర్యాప్తును పూర్తి చేసిన ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) తన నివేదికను ఆర్బీఐకి సమర్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కాగా, వాల్‌మార్ట్ పెట్టుబడుల విషయంలో నిబంధనలను ఉల్లంఘించలేదని ఈడీ క్లీన్చిట్ ఇచ్చింది. దీంతో ఇక ఆర్బీఐ ఈడీ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేపట్టి తన నిర్ణయాన్ని వెల్లడించాల్సి ఉందని ఈడీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, భారతీతో జాయింట్ వెంచర్ నుంచి ఇటీవలే తెగతెంపులు చేసుకున్న వాల్‌మార్ట్... భారత్‌లో ఇక సొంతంగా వ్యాపారాన్ని నిర్వహిస్తామని, ఇక్కడి నిబంధనలను తాము పూర్తిగా పాటిస్తున్నామని అంటోంది. -
రూపాయి అర శాతం అప్..
ముంబై: వరుసగా క్షీణించిన రూపాయి మారకం విలువ బుధవారం మళ్లీ పెరిగింది. డాలర్‌తో పోలిస్తే 31 పైసలు బలపడి 62.44 వద్ద ముగిసింది. ఎగుమతిదారులు, బ్యాంకులు.. డాలర్లను విక్రయించడం దీనికి దోహదపడింది. ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 62.75తో పోలిస్తే కాస్త బలహీనంగా 62.76 వద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో 62.88 స్థాయికి కూడా తగ్గింది. అయితే, బ్యాంకులు డాలర్లను విక్రయించడంతో మళ్లీ కోలుకుని 62.31కి ఎగిసి చివరికి 0.49 శాతం లాభంతో 62.44 వద్ద ముగిసింది. కార్పొరేట్లు.. ప్రధానంగా ఐటీ ఎగుమతి సంస్థలు డాలర్లను విక్రయించడం కూడా ఇందుకు దోహదపడి ఉండొచ్చని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈవో అభిషేక్ గోయెంకా చెప్పారు. క్రితం మూడు సెషన్లలో రూపాయి మారకం విలువ 98 పైసల మేర పతనమైంది. రూపాయి ట్రేడింగ్ 62-63 శ్రేణిలో తిరుగాడవచ్చని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఇండియా) సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. -
రూపాయి 46 పైసలు డౌన్
ముంబై: ఫెడరల్ రిజర్వ్ గురువారం దేశీయ కరెన్సీకి బూస్ట్నిచ్చినప్పటికీ, శుక్రవారం పాలసీ సమీక్షను చేపట్టిన రిజర్వ్ బ్యాంక్ గాలి తీసేసింది. అనూహ్య రీతిలో రెపో రేటును పావు శాతంమేర పెంచడంతో డాలరుతో మారకంలో రూపాయి 46 పైసలు క్షీణించింది. 62.23 వద్ద ముగిసింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే బాటలో కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ రెపో రేటును 7.25% న ఉంచి 7.5%కు పెంచడంతో రూపాయి బలహీనపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో తొలుత 62.05 వద్ద బలహీనంగా మొదలైంది. ఆపై గరిష్టంగా 61.88ను, కనిష్టంగా 62.61ను తాకింది. చివరకు క్రితం ముగింపు 61.77తో పోలిస్తే 0.7% తగ్గి 62.23 వద్ద స్థిరపడింది. కాగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలను కొనసాగించేందుకు నిర్ణయించడంతో గురువారం ట్రేడింగ్‌లో రూపాయి 161 పైసలు జంప్‌చేసి 61.77 వద్ద నిలిచిన విషయం విదితమే. -
చాలా కరెన్సీలతోనూ ‘బ్రేక్’ డ్యాన్సే!
న్యూఢిల్లీ: రూపాయి విలువ ఒక్క డాలరుతో మాత్రమే పాతాళానికి జారుకుంటూ రికార్డులు బ్రేక్ చేస్తోందంటే పొరపాటే. ప్రపంచంలోని ఇతర ప్రధాన కరెన్సీలన్నింటితో కూడా రూపాయి తుక్కుతుక్కు అవుతోంది. బ్రిటిష్ పౌండ్, యూరో, స్విస్ ఫ్రాంక్‌లతో పోలిస్తే అత్యంత ఘోరంగా కుప్పకూలింది. పౌండ్తో దేశీ కరెన్సీ 100 స్థాయిని ఇప్పటికే అధిగమించగా.. బుధవారం 106 దిగువకు పడిపోయి కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి జారిపోయింది. యూరోతో 92, స్విస్ ఫ్రాంక్‌తో 75, కెనడా డాలర్‌తో 65, ఆస్ట్రేలియన్ డాలర్‌తో 60 కిందికి క్షీణించాయి. ఇంకా చాలా దేశాలన్నింటి కరెన్సీలు కూడా రూపాయిని ‘బ్రేక్’ డ్యాన్స్ ఆడిస్తున్నాయి. కువైట్ దినార్‌తో 240, బహ్రయిన్ దినార్‌తో 180, ఒమాన్ రియాల్‌తో 175 దిగువకు రూపాయి విలువ పడిపోయింది. విదేశీ పెట్టుబడుల తిరోగమనం, ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనం రూపాయిని దెబ్బకొడుతూవస్తున్నాయి. వీటితో బలపడిందండోయ్... రూపాయి విలువ ఇతర దేశాల కరెన్సీలతో కుప్పకూలుతుంటే.. కొన్ని దేశాలతో పోలిస్తే మాత్రం బలపడింది. అయితే, ఇవన్నీ అనామక దేశాలే! రూపాయి పుంజుకున్న జాబితాలో పనామా, టాంగో, సురినాం, తజికిస్థాన్, సాల్మన్ ఐలాండ్స్, సాల్వడార్, హైతి, కిర్గిస్థాన్, లైబీరియా, సిరియా, కాంగో, సోమాలియా, సియర్రా లియోన్ వంటివి ఉన్నాయి. ప్రపంచంలో 8 దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ 100 కిందకి పడిపోయింది. యూరో, జోర్డాన్ దినార్లతో 90 కిందికి జారింది. ఇక 50 దేశాల కరెన్సీలతో రూపాయి విలువ 50 దిగువకు క్షీణించడం గమనార్హం. రూపాయితో పోలిస్తే అధిక మారకం విలువ గల దేశాలు ప్రపంచంలో 100కు పైగానే ఉన్నాయి. -
మార్కెట్లోకి కొత్త యూరియా!
కేంద్రం ఆదేశంతో ‘వేపనూనె’ యూరియాను తీసుకొచ్చిన కంపెనీలు సాక్షి, హైదరాబాద్: దేశీయ మార్కెట్లోకి కొత్త రకం యూరియా వచ్చింది. మనదేశంలో తయారవుతున్న యూరియాలో కనీసం 35 శాతం వేపనూనె పూత యూరియా ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధన మేరకు ఈ యూరియాను తీసుకొచ్చారు. రాష్ట్రంలో అత్యధికంగా యూరియాను సరఫరాచేసే ‘క్రిషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్’(క్రిభ్కో) ఇప్పటికే 65వేల టన్నుల వేప నూనె పూత ఉన్న యూరియాను మన మార్కెట్లో ఉంచగా, నాగార్జున ఫెర్టిలైజర్స్ మరో 10వేల టన్నుల యూరియాను అందుబాటులో ఉంచింది. యూరియా వినియోగ సామర్థ్యాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఈ చర్య వల్ల రైతులకు ప్రయోజనం కలగడమే కాకుండా యూరియా దిగుమతులు తగ్గి ఏడాదికి దాదాపు 99 కోట్ల డాలర్ల(దాదాపు రూ.5,940 కోట్లు) విదేశీ మారక ద్రవ్యం ఆదా అయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం వాడుకలో ఉన్న యూరియాలో పైర్లకు 30 శాతం అందుతుండగా.. మిగిలిన 70 శాతం గాలిలో, భూమిలో వృథా అవుతుంది. యూరియాకు వేప నూనె పూత ఉంటే ఈ వృథా గణనీయంగా తగ్గుతుంది. చాలాకాలం నుంచి వ్యవసాయ శాఖ అధికారులు యూరియాకు వేప నూనె పూత వేయమని రైతులకు సలహా ఇస్తూ ఉన్నారు. అయితే రైతు స్థాయిలో ఇలా చేయడంలో ఉన్న ఇబ్బందుల రీత్యా ఈ సలహాను పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో యూరియా ఉత్పత్తి దశలోనే వేప నూనె పూత ఉండేలా చూసేందుకు కేంద్రం నడుంబిగించింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 35 శాతం యూరియాకు వేపనూనె పూత తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. దీంతో సంబంధిత యూరియా కంపెనీలు వారి కర్మాగారాల్లో అందుకు తగిన మార్పులు చేసుకుంటున్నాయి. వచ్చే రెండు మూడేళ్లలో వేప పూత యూరియానే మార్కెట్లో ఉంచేలా చేసేందుకు కసరత్తు జరుగుతోంది. బస్తాకు రూ.14 అదనం... ప్రస్తుతం మామూలు యూరియా 50 కిలోల బస్తా ధర రూ.284 ఉండగా, వేప నూనె పూత పూసిన యూరియా బస్తా ధరను రూ.298గా ప్రభుత్వం నిర్ణయించింది. బస్తాకు రూ.14 అదనంగా చెల్లించినా, ఐదు బస్తాల మామూలు యూరియా వాడాల్సిన చోట వేప నూనె పూత ఉన్న యూరియా నాలుగు బస్తాలు వేస్తే సరిపోతుంది. వేప నూనె పూత యూరియా వాడకం పూర్తిస్థాయిలో అలవాటైతే దేశవ్యాప్తంగా 30 లక్షల టన్నుల యూరియా వాడకం తగ్గే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఏటా 3 కోట్ల టన్నుల యూరియా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో 30 లక్షల టన్నుల యూరియా వినియోగంలో ఉంది. వేప నూనె పూత పూసిన యూరియా వాడినట్లయితే కనిష్టంగా 10 శాతం యూరియా వినియోగం తగ్గుతుంది. దీంతో ఆ మేరకు యూరియా దిగుమతులను తగ్గించుకోవచ్చని క్రిభ్కో అధికారి ఒకరు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా టన్ను యూరియా 330 డాలర్లు పలుకుతోందని, ఈ లెక్కన మనకు దాదాపు 99 కోట్ల డాలర్ల విదేశీ మారక ద్రవ్యం మిగులుతుందన్నారు. క్రిభ్కో, నాగార్జున ఫెర్టిలైజర్ కంపెనీ లిమిటెడ్, గుజరాత్ నర్మదా వ్యాలీ ఫెర్టిలైజర్స్, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్(ఉజ్వల యూరియా)లు మన రాష్ట్రానికి ప్రధానంగా యూరియా సరఫరా చేస్తున్నాయి. -
రూపాయి క్షీణతకు అడ్డుకట్టకు చర్యలు!
న్యూఢిల్లీ: అడ్డూఅదుపూలేకుండా జారిపోతున్న రూపాయికి మద్దతుగా ప్రభుత్వం నేడు(సోమవారం) మరిన్ని చర్యలను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి చిదంబరం ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎస్ఆర్ రావుతో విస్తృత చర్చలు జరిపారు. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారామ్ కూడా సీనియర్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రూపాయి స్థిరీకరణకు కీలక చర్యలు వెలువడతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా విదేశీ నిధులను మరింత ఆకర్షించడమే ఈ చర్యల ప్రధానోద్దేశం. కార్పొరేట్ కంపెనీల విదేశీ రుణ సమీకరణ(ఈసీబీ) నిబంధనలను సడలించడం, నిత్యావసరంకాని వస్తువుల దిగుమతులపై సుంకం పెంపు, ఎగుమతులకు ప్రోత్సాహం వంటివి ఉండొచ్చని భావిస్తున్నారు. గత వారంలో డాలరుతో రూపాయి మారకం విలువ కొత్త ఆల్‌టైమ్ కనిష్టాన్ని(61.80) తాకిన సంగతి తెలిసిందే.ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా రూపాయి విలువ 15 శాతం పైగానే క్షీణించింది.దేశీ కరెన్సీ చికిత్సకు ఆర్బీఐ ఇప్పటికే ద్రవ్యసరఫరా(లిక్విడిటీ) కట్టడి, స్పెక్యులేషన్‌ను తగ్గించేవిధంగా చర్యలు తీసుకున్నప్పటికీ... రూపాయి పతనం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రతి సోమవారం రూ.22,000 కోట్ల మేర ప్రభుత్వ బాండ్ల వేలం చేపట్టనున్నట్లు కూడా ఆర్బీఐ తాజాగా ప్రకటించడం గమనార్హం. కాగా, ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)లు సార్వభౌమ బాండ్ల తరహా(క్వాసీ-సావరీన్) రుణపత్రాల జారీ ద్వారా విదేశీ నిధులను సమీకరించేందుకు కూడా కేంద్రం అనుమతించే అవకాశాలున్నాయని సమాచారం. క్యాడ్ కట్టడే లక్ష్యం...: కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్-మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారకం మధ్య వ్యత్యాసం)ను తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకాలను భారీగా పెంచింది. గతేడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(జీడీపీతో పోలిస్తే 4.8%) ఎగబాకడం తెలిసిందే. క్యాడ్‌కు అడ్డుకట్టవేయడానికి వీలుగా నిత్యావసరంకాని వస్తువుల దిగుమతిపై సుంకాన్ని పెంచాలని మంత్రుల కమిటీ ఇప్పటికే ఆర్థిక మంత్రికి సిఫార్సుల నివేదికను సమర్పించింది. కేంద్రం దీన్ని నిశితంగా పరిశీలిస్తోంది. బొగ్గు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ దిగుమతులపై దృష్టిపెట్టినట్లు చిదంబరం ఇదివరకే చెప్పారు.