రూపాయి క్షీణతకు అడ్డుకట్టకు చర్యలు!
రూపాయి క్షీణతకు అడ్డుకట్టకు చర్యలు!
Published Mon, Aug 12 2013 2:44 AM | Last Updated on Thu, Oct 4 2018 5:26 PM
న్యూఢిల్లీ: అడ్డూఅదుపూలేకుండా జారిపోతున్న రూపాయికి మద్దతుగా ప్రభుత్వం నేడు(సోమవారం) మరిన్ని చర్యలను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆర్థిక మంత్రి చిదంబరం ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎస్‌ఆర్ రావుతో విస్తృత చర్చలు జరిపారు. అదేవిధంగా ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అరవింద్ మాయారామ్ కూడా సీనియర్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో రూపాయి స్థిరీకరణకు కీలక చర్యలు వెలువడతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా విదేశీ నిధులను మరింత ఆకర్షించడమే ఈ చర్యల ప్రధానోద్దేశం. కార్పొరేట్ కంపెనీల విదేశీ రుణ సమీకరణ(ఈసీబీ) నిబంధనలను సడలించడం, నిత్యావసరంకాని వస్తువుల దిగుమతులపై సుంకం పెంపు, ఎగుమతులకు ప్రోత్సాహం వంటివి ఉండొచ్చని భావిస్తున్నారు.
గత వారంలో డాలరుతో రూపాయి మారకం విలువ కొత్త ఆల్‌టైమ్ కనిష్టాన్ని(61.80) తాకిన సంగతి తెలిసిందే.ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా రూపాయి విలువ 15 శాతం పైగానే క్షీణించింది.దేశీ కరెన్సీ చికిత్సకు ఆర్‌బీఐ ఇప్పటికే ద్రవ్యసరఫరా(లిక్విడిటీ) కట్టడి, స్పెక్యులేషన్‌ను తగ్గించేవిధంగా చర్యలు తీసుకున్నప్పటికీ... రూపాయి పతనం యథేచ్ఛగా కొనసాగుతూనే ఉంది. దీంతో ప్రతి సోమవారం రూ.22,000 కోట్ల మేర ప్రభుత్వ బాండ్‌ల వేలం చేపట్టనున్నట్లు కూడా ఆర్‌బీఐ తాజాగా ప్రకటించడం గమనార్హం. కాగా, ప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)లు సార్వభౌమ బాండ్‌ల తరహా(క్వాసీ-సావరీన్) రుణపత్రాల జారీ ద్వారా విదేశీ నిధులను సమీకరించేందుకు కూడా కేంద్రం అనుమతించే అవకాశాలున్నాయని సమాచారం.
క్యాడ్ కట్టడే లక్ష్యం...: కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్-మూలధన పెట్టుబడులు మినహా దేశంలోకి వచ్చే, బయటికిపోయే విదేశీ మారకం మధ్య వ్యత్యాసం)ను తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే బంగారంపై దిగుమతి సుంకాలను భారీగా పెంచింది. గతేడాది(2012-13)లో క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి(జీడీపీతో పోలిస్తే 4.8%) ఎగబాకడం తెలిసిందే. క్యాడ్‌కు అడ్డుకట్టవేయడానికి వీలుగా నిత్యావసరంకాని వస్తువుల దిగుమతిపై సుంకాన్ని పెంచాలని మంత్రుల కమిటీ ఇప్పటికే ఆర్థిక మంత్రికి సిఫార్సుల నివేదికను సమర్పించింది. కేంద్రం దీన్ని నిశితంగా పరిశీలిస్తోంది. బొగ్గు, ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ దిగుమతులపై దృష్టిపెట్టినట్లు చిదంబరం ఇదివరకే చెప్పారు.
Advertisement
Advertisement