ముంబై: ఫెడరల్ రిజర్వ్ గురువారం దేశీయ కరెన్సీకి బూస్ట్‌నిచ్చినప్పటికీ, శుక్రవారం పాలసీ సమీక్షను చేపట్టిన రిజర్వ్ బ్యాంక్ గాలి తీసేసింది. అనూహ్య రీతిలో రెపో రేటును పావు శాతంమేర పెంచడంతో డాలరుతో మారకంలో రూపాయి 46 పైసలు క్షీణించింది. 62.23 వద్ద ముగిసింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే బాటలో కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ రెపో రేటును 7.25% న ఉంచి 7.5%కు పెంచడంతో రూపాయి బలహీనపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో తొలుత 62.05 వద్ద బలహీనంగా మొదలైంది.
ఆపై గరిష్టంగా 61.88ను, కనిష్టంగా 62.61ను తాకింది. చివరకు క్రితం ముగింపు 61.77తో పోలిస్తే 0.7% తగ్గి 62.23 వద్ద స్థిరపడింది. కాగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలను కొనసాగించేందుకు నిర్ణయించడంతో గురువారం ట్రేడింగ్‌లో రూపాయి 161 పైసలు జంప్‌చేసి 61.77 వద్ద నిలిచిన విషయం విదితమే.