Rupee Fall
-
రూపాయి పతనం.. సామాన్యులపై ధరల భారం
న్యూఢిల్లీ: రూపాయి మారకం విలువ కొత్త రికార్డు స్థాయులకు పడిపోతుండటం .. ద్రవ్యోల్బణాన్ని ఎగదోయనుంది. దీనితో ముడి చమురు దిగుమతులు భారం కానున్నాయి. అలాగే కమోడిటీల రేట్లు కూడా పెరగనున్నాయి. ఫలితంగా ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న 6 శాతం కన్నా అధిక స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం ఇంకా పెరగనుంది. రూపాయి పతనంతో వంటనూనెల దిగుమతుల బిల్లు ఎగియనుందని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏఐ) ఈడీ బీవీ మెహతా తెలిపారు. ‘ఈ భారాన్ని అంతిమంగా వినియోగదారులకే బదలాయించాల్సి వస్తుంది. అయితే, నూనెగింజల ఎగుమతులు మాత్రమే కాస్త ఊరటనిచ్చే అవకాశం ఉంది. రూపాయి పతనంతో ఎగుమతులపరంగా ఆదాయం మెరుగుపడుతుంది‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్ ఏటా 13 మిలియన్ టన్నుల వంటనూనెలు దిగుమతి చేసుకుంటోంది. ఆగస్టులో 1.89 బిలియన్ డాలర్ల విలువ చేసే ఉత్పత్తులను (గతేడాది ఆగస్టుతో పోలిస్తే 41 శాతం అధికం) దిగుమతి చేసుకుంది. మరోవైపు, కమోడిటీల రేట్లు తగ్గినా రూపాయి పడిపోవడం వల్ల ఆ మేరకు ప్రయోజనం లేకుండా పోతుందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా చీఫ్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. అటు, చారిత్రక గరిష్ట స్థాయుల నుంచి జూన్‌లో తగ్గిన తర్వాత అంతర్జాతీయంగా కమోడిటీల రేట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని ఎస్బీఐ ఒక నివేదికలో తెలిపింది. ఆగస్టు తొలినాళ్లలో కాస్త పెరిగినప్పటికీ డిమాండ్ మందగమనంపై ఆందోళనల కారణంగా మళ్లీ నెల చివర్లో తగ్గాయి. ఇంధన అవసరాల్లో 85 శాతం భాగాన్ని భారత్ దిగుమతి చేసుకుంటోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ట స్థాయి 82ను చూసిన సంగతి తెలిసిందే. క్షీణత కొనసాగవచ్చు.. అటు వాణిజ్య లోటు, ఇటు సంస్థాగత ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ పెరుగుతున్న నేపథ్యంలో రూపాయిపై మరింత ఒత్తిడి కొనసాగనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కేంద్ర బ్యాంకూ కూడా కరెన్సీ పతనాన్ని అడ్డుకోజాలదని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. రూపాయి క్షీణతను పరిమిత కాలం పాటు ఆర్బీఐ కొనసాగనిచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి రూపాయిని కాపాడుకునే ప్రయత్నాల్లో ఆర్బీఐ కరెన్సీ అసెట్లు 75 బిలియన్ డాలర్ల మేర కరిగిపోయాయని వివరించింది. ‘భారత్ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్న నేపథ్యంలో.. కరెన్సీ నిర్దిష్ట కనిష్ట స్థాయి దగ్గర సెటిల్ అయిన తర్వాత నుంచి పెరగడం ఒక్కసారిగా నాటకీయంగా పుంజుకోవచ్చు‘ అని పేర్కొంది. రూపాయి క్షీణతకు కారణం డాలరు పటిష్టంగా ఉండటమే తప్ప దేశీయంగా ఫండమెంటల్స్ బలహీనంగా ఏమీ లేవని వివరించింది. -
బుల్ మరోసారి కుదేల్
ముంబై: స్టాక్ మార్కెట్లో రెండురోజుల పాటు సందడి చేసిన బుల్ బుధవారం చతికిలపడింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలతో సెన్సెక్స్ 555 పాయింట్లు పతనమై 59,190 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 176 పాయింట్లు నష్టపోయి 17,646 వద్ద ముగిసింది. ద్రవ్యోల్బణ ఆందోళనలు, మండుతున్న ముడిచమురు ధరలు దేశీయ మార్కెట్‌ను సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత ఇన్వెస్టర్లను కలవరపెట్టింది. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఐటీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ జరగడంతో అధికంగా నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీలో మూడు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్ ఇండెక్స్‌లు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.803 కోట్ల షేర్లను, దేశీయ ఇన్వెస్టర్లు రూ.999 కోట్ల షేర్లను అమ్మారు. స్టాక్ సూచీల భారీ పతనంతో ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే రూ.2.57 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. తద్వారా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.262 లక్షల కోట్లు నమోదైంది. లాభాలతో మొదలై నష్టాల్లోకి.., దేశీయ స్టాక్ మార్కెట్ ఉదయం లాభంతోనే మొదలైంది. సెన్సెక్స్ 197 పాయింట్ల లాభంతో 59,942 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు పెరిగి 17,861 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. జాతీయ, అంతర్జాతీయ నెలకొన్న ప్రతికూలతలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీల ఆరంభలాభాలన్నీ ఆవిరియ్యాయి. అటు పిమ్మట అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ ఒక దశలో 665 పాయింట్లు పతనమైన 59,080 వద్ద, నిఫ్టీ 209 పాయింట్లు నష్టపోయి 17,613 వద్ద ఇంట్రాడే కనిష్టాలకు దిగివచ్చాయి. నష్టాలకు నాలుగు కారణాలు... క్రూడ్ పెరుగుదల భయాలు ... సప్లై మందగమనం, డిమాండ్ పెరగడంతో క్రూడాయిల్ ధరలు ఎనిమిదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. బ్రిటన్‌లో గ్యాస్ ధరలు ఒక్కరోజులోనే ఏకంగా 40% ఎగిశాయి. భారత చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. క్రూడ్ ధర పెరగడంతో చమురు దిగుమతుల బిల్లు భారీగా పెరిగిపోతుంది. దీంతో కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చనే భయాలు మార్కెట్ వర్గాలను వెంటాడాయి. కరెంట్ కోత కలవరం .... దేశవ్యాప్తంగా థర్మల్ ప్లాంట్లలో నాలుగు రోజులకు సరిపడే బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని విద్యుత్ మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించడం దలాల్ స్ట్రీట్‌ను కలవరపెట్టింది. బొగ్గు కొరత ఇలాగే కొనసాగితే విద్యుత్ సంక్షోభం తలెత్తి ఉత్పత్తి, వ్యాపారాలపై ప్రభావాన్ని చూపవచ్చనే ఆందోళనలు మొదలయ్యాయి. భారత్‌లో 70% కరెంట్ బొగ్గు ఆధారంగా నడిచే థర్మల్ ప్లాంట్ల ద్వారానే ఉత్పత్తి అవుతుంది. ప్రపంచ మార్కెట్లను ప్రతికూలతలు ... బాండ్ ఈల్డ్స్, క్రూడ్, ద్రవ్యోల్బణ పెరుగుదల భయాలతో పాటు కార్మికుల కొరతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఆసియాలో జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల మార్కెట్లు రెండు నుంచి ఒకశాతం నష్టపోయాయి. సెలవుల కారణంగా చైనా ఎక్సే్చంజీలు పనిచేయడం లేదు. యూరప్‌లోని బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ మార్కెట్లు ఒకశాతం వరకు క్షీణించాయి. అగ్ర రాజ్యమైన అమెరికా స్టాక్ మార్కెట్లో టెక్నాలజీ, బ్యాంకింగ్ రంగాల షేర్లలో అమ్మకాల తలెత్తడంతో యూఎస్ ఫ్యూచర్లు ఒకటిన్నర శాతం నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ప్రపంచ మార్కెట్ల పతనం మన మార్కెట్‌పై ప్రభావాన్ని చూపింది. రూపాయి పతనం.... క్రూడాయిల్, డాలర్ విలువ బలపటడంతో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ భారీగా క్షీణించింది. ఇంట్రాడేలో 74.99 స్థాయికి దిగివచి్చంది. చివరికి 54 పైసలు నష్టపోయి 74.98 స్థిరపడింది. ఈ ముగింపు రూపాయికి ఐదు నెలల కనిష్టస్థాయి. రూపాయి పతనం(డాలర్ బలపడ టంతో)స్టాక్ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► నష్టాల మార్కెట్లోనూ హిందుస్తాన్ కాపర్ 4% లాభపడి రూ.125 వద్ద ముగిసింది. ఈ సంస్థను చేజిక్కించుకునేందుకు వేదాంత ప్రయత్నాలు చేస్తుండటం ఈ షేరు ర్యాలీకి కారణమైనట్లు నిపుణులు తెలిపారు. ► క్రూడాయిల్ ధరలు పెరగడం ఓఎన్జీసీ షేరుకు కలిసొస్తుంది. బీఎస్ఈలో 3% లాభపడి రూ.168 వద్ద స్థిరపడింది. -
ఇంట్రాడే నష్టాలు రికవరీ
ముంబై: మిడ్‌సెషన్ నుంచి లభించిన కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రెండోరోజూ ఫ్లాట్‌గానే ముగిశాయి. ఇంట్రాడేలో 484 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ చివరకు 85 పాయింట్ల నష్టంతో 51,849 వద్ద స్థిరపడింది. మరో సూచీ నిఫ్టీ 115 పాయింట్ల కనిష్టం నుంచి కోలుకుని చివరకు ఒక పాయింటు స్వల్ప లాభంతో 15,576 వద్ద నిలిచింది. తొలి భాగంలో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, రెండో సెషన్లో దిగువ స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. రూపాయి మూడోరోజూ పతనం, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలు దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్, ఆటో, ఫార్మా, షేర్లు రాణించి సూచీలకు రికవరికి సహకారం అందించాయి. అయితే ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు నష్టాలను చవిచూశాయి. ప్రధాన సూచీలు తడబాటుకు లోనైప్పటికీ.., మార్కెట్లో విస్తృత స్థాయి కొనుగోళ్లు జరగడం విశేషం. నిఫ్టీ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఇండెక్స్‌లు ఒక టిన్నర % లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ. 921 కోట్ల షేర్లను, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.242 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొన్నారు. మిడ్‌సెషన్ నుంచి రికవరీ... దేశీయ స్టాక్ మార్కెట్ ఉదయం నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 176 పాయింట్లను కోల్పోయి 51,749 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు పతనమైన 15,520 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలిసెషన్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకే ప్రాధాన్యతనివ్వడంతో అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు తలెత్తాయి. ఒక దశలో సెన్సెక్స్ 484 పాయింట్లు పతనమై 51,451 వద్ద, నిఫ్టీ 115 పాయింట్లు నష్టమై 15,460 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. మిడ్‌సెషన్‌లో యూరప్ మార్కెట్ల లాభాల ప్రారంభం సూచీలకు ఊరటనిచ్చింది. అలాగే దిగువ స్థాయిలో సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా మెటల్, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు రాణించడంతో సూచీలు మార్కెట్ ముగిసే సరికి దాదాపు నష్టాలన్నీ పూడ్చుకోగలిగాయి. ‘‘ఆర్బీఐ పాలసీ సమావేశాల నేపథ్యంలో రెండోరోజూ స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగాయి. ప్రైవేటీకరణ జాబితాను కేంద్రం త్వరలో ఖరారు చేస్తుందనే ఆశలతో ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్‌యూ) షేర్లు రాణించాయి. నిఫ్టీ ఇండెక్స్ మరికొంత కాలం 15,500 స్థాయిని నిలుపుకొంటే, అప్‌సైడ్‌లో ఆల్‌టైం హై (15,661) స్థాయిని మరోసారి పరీక్షించవచ్చు. ఇక దిగువస్థాయిలో 15,431 వద్ద, 15300 వద్ద బలమైన మద్దతు స్థాయిలను కలిగి ఉంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ క్యూ4 ఆర్థిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత ఇన్వెస్టర్లు ఈ షేరును అమ్మేందుకు మొగ్గుచూపారు. దీంతో ఐటీసీ షేరు మూడు శాతం నష్టపోయి రూ.209 వద్ద స్థిరపడింది. ► ఇన్సైడర్ కేసులో సెబీ తాజా ఆదేశాల ఫలితంగా ఇన్ఫోసిస్ అంతర్గత దర్యాప్తును చేపట్ట డంతో కంపెనీ షేరు విక్రయాల ఒత్తిడికి లోనైంది. బీఎస్ఈలో అరశాతం నష్టంతో రూ.1,380 వద్ద ముగిసింది. ► ఆటో కాంపొనెంట్స్ కంపెనీ మదర్సన్ సుమీ షేరు 13 ర్యాలీ చేసి రూ.269 వద్ద ముగిసింది. క్యూ4లో కంపెనీ 8 రెట్ల నికరలాభాన్ని ప్రకటించడం ఇందుకు కారణమని ట్రేడర్లు తెలిపారు. -
లాభాల జోరుకు బ్రేక్
ముంబై: స్టాక్ మార్కెట్ మూడురోజుల వరుస ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. ఆర్థిక, ఇంధన, ఐటీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సెన్సెక్స్ 599 పాయింట్లను కోల్పోయి 51 వేల దిగువన 50,486 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 165 పాయింట్లను నష్టపోయి 15,081 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు, డాలర్ మారకంలో రూపాయి పతనం దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. మూడురోజుల పాటు సూచీలు భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో కొంత లాభాల స్వీకరణ కూడా చోటుచేసుకుంది. మీడియా, రియల్టీ షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. మిగతా అన్ని రంగాలకు చెందిన షేర్లలో విక్రయాలు జరిగాయి. అత్యధికంగా మెటల్ షేర్లు నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో 25 షేర్లు నష్టపోవడం గమనార్హం. సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు విదేశీ ఇన్వెస్టర్లూ గురువారం నికర అమ్మకందారులుగా నిలిచారు. ఎఫ్ఐఐలు రూ. 223 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. డీఐఐలు రూ.788 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ‘‘అగ్రరాజ్యం అమెరికా పదేళ్ల బాండ్ ఈల్డ్స్ అనూహ్యంగా ఆరు బేసిస్ పాయింట్లు పుంజుకోవడంతో అక్కడి మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. ఫలితంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల వాతావరణం నెలకొనడంతో మన మార్కెట్ ఇదే తీరు ప్రతిబింబించింది. పెద్ద కంపెనీలకు చెందిన షేర్లలో అధికంగా అమ్మకాలు జరిగాయి. అయితే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో కొనుగోళ్లు జరగడం ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చే అంశంగా ఉంది’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ బినోద్ మోదీ తెలిపారు. ఇంట్రాడేలో ట్రేడింగ్ సాగిందిలా... ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచవచ్చనే అంచనాలతో అమెరికా బాండ్ ఈల్డ్స్ తిరిగి పెరగడం ప్రారంభించింది. ఫలితంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ అమ్మకాలు మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న మన మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ ఏకంగా 633 పాయింట్ల నష్టంతో 50,812 వద్ద, నిఫ్టీ 220 పాయింట్లను కోల్పోయి 15,027 ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలతో మొగ్గుచూపడంతో ఒక దశలో సెన్సెక్స్ 905 పాయింట్లను కోల్పోయి 50,540 వద్ద, నిఫ్టీ 266 పాయింట్లు నష్టపోయి 14,980 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మరిన్ని విశేషాలు... ► అదానీ పోర్ట్స్ గంగవరం పోర్టులో 31.5 శాతం వాటాను దక్కించుకోవడంతో కంపెనీ షేరు మూడుశాతం లాభంతో రూ.752 వద్ద ముగిసింది. ► మూడో త్రైమాసికంలో ఎఫ్ఐఐలతో పాటు డీఐఐలూ ఐఆర్సీటీసీ చెందిన షేర్లను అధిక మొత్తంలో కొనుగోలు చేశారు. ఫలితంగా కంపెనీ షేరు నాలుగు శాతం ర్యాలీచేసి రూ.1,957 వద్ద స్థిరపడింది. ► అశోక హైవేస్‌లో సింహభాగం వాటాను దక్కించుకోవడంతో ఆశోకా బిల్డ్‌కాన్ షేరు నాలుగు శాతం పెరిగి రూ.115 వద్ద ముగిసింది. ► జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు మూడు శాతం పతనం కావడంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ రెండుశాతం నష్టపోయింది. -
రూపాయి పతనానికి విరుగుడేంటి?
రూపాయి పతనం ఇన్వెస్టర్లను నష్టాల పాలు చేస్తోంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి.ఆ నష్టాలింకా కొనసాగుతున్నాయి కూడా. డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడం వల్ల... దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరుగుతాయి. వాటికి డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది కనక, డాలర్ విలువ పెరిగింది కనక దిగుమతులకు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల దేశీయంగా ధరలు పెరుగుతాయి. ఓ రకంగా చూస్తే... రూపాయి పతనం కావటమనేది ఎగుమతిదారులకు లాభం. కానీ చిత్రంగా డాలర్‌తో పోలిస్తే ఇతర దేశాల కరెన్సీలూ బాగా దెబ్బతిన్నాయి. అందుకని అమెరికాకు తప్ప ఇతర దేశాలకు ఎగుమతి చేసే కంపెనీలకు పెద్దగా లాభం ఉండటం లేదు. తమ రాబడులు దెబ్బతింటాయి కనక విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడి పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లిపోవటం కొన్నాళ్లుగా జరుగుతోంది. పిల్లల్ని విదేశాల్లో చదివిస్తున్న తల్లిదండ్రులక్కూడా రూపాయి సెగ ఎక్కువే తగులుతోంది. అయితే, రూపాయి పడిపోతుంటే పోర్ట్‌ఫోలియోలో కొంత భాగంపై డబ్బులు సంపాదించుకునే అవకాశముంది. ఇందు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు కొన్ని ఉన్నాయి. వాటిని వివరించేదే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం ఎగుమతి ఆధారిత రంగాలయిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా కంపెనీల ఆదాయాలు రూపాయి పడిపోవడం వల్ల పెరిగే అవకాశాలు ఉంటాయి. రూపాయి పతనం నుంచి లాభపడాలనుకునే ట్రేడర్లు స్వల్ప కాలం కోసం ఈ స్టాక్స్‌పై దృష్టి సారించొచ్చు. కాకపోతే దీర్ఘకాలంలో మాత్రం ఈ స్టాక్స్ హెడ్జ్ కోసం ఉపయోగపడవు. గడిచిన పదేళ్ల కాలంలో మూడు సందర్భాలలో డాలర్‌తో రూపాయి ఎక్కువ నష్టపోవడం జరిగింది. 2008లో 19 శాతం, 2013లో 11 శాతం, ఈ ఏడాది ఇప్పటి వరకు 13 శాతం మేర రూపాయి నష్టపోయింది. దీంతో 2008లో సెన్సెక్స్ 52 శాతం నష్టపోగా, 2013లో 9 శాతం, ఈ ఏడాది కేవలం 3 శాతం రాబడులనే ఇచ్చింది. కానీ, బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ మాత్రం ఈ ఏడాది సెన్సెక్స్‌ను అధిగమించి ఇప్పటిదాకా 31 శాతం రిటర్నులిచ్చింది. 2013లోనూ బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ 55 శాతం పెరగడం గమనార్హం. కానీ 2008లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో సెన్సెక్స్‌తో సమానంగా నష్టపోయింది. ఫార్మా అన్నది తప్పనిసరి అవసరమైన రంగాల్లో ఒకటి. కానీ, అమెరికా ఎఫ్‌డీఏ నియంత్రణలతో అమెరికాలో ధరల పరంగా ఒత్తిడి నెలకొంది. ఫలితంగా ఈ ఏడాది ఫార్మా రంగం... రూపాయి విలువ క్షీణించినప్పటికీ కేవలం 2 శాతమే లాభపడింది. కానీ, మిగిలిన సందర్భాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగానే ఉంటూ వచ్చింది. గోల్డ్ ఈటీఎఫ్‌లూ చూడొచ్చు... మన బంగారం అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపై ఆధారపడి ఉన్నాం. అంతర్జాతీయంగా డాలర్ మారకంలోనే బంగారం ధరలు మారుతుంటాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించిన ప్రతీ సందర్భంలోనూ దేశీయంగా బంగారం ధరలు పెరుగుతుంటాయి. పోర్ట్‌ఫోలియోలో బంగారం కలిగి ఉంటే దాని ధరలు 2008లో 26 శాతం (రూపాయిల్లో) పెరగ్గా, ఈ ఏడాది 8 శాతం పెరిగాయి. కానీ, 2013లో మాత్రం డాలర్‌తో రూపాయి మార కం విలువ క్షీణించినప్పటికీ, బంగారం ధరలు పెరగలేదు. ఆ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోవడం ఇందుకు కారణం. దాంతో డాలర్‌తో రూపాయి తగ్గినప్పటికీ, దేశీయంగా ధరల పెరుగుదల చోటు చేసుకోలేదు. అందుకే రూపాయి విలువ క్షీణత ప్రభావాన్ని హెడ్జ్ చేసుకునేందుకు పోర్ట్‌ఫోలియోలో 5–10 శాతాన్ని బంగారం కోసం కేటాయించుకోవచ్చు. పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం కోసమని బంగారం తీసుకోదలిస్తే... భౌతిక బంగారం కంటే, గోల్డ్ ఈటీఎఫ్ లేదా సార్వభౌమ బంగారం బాండ్లను ఎంచుకోవడం మెరుగైన ఆప్షన్. విదేశీ మ్యూచువల్ ఫండ్స్ విదేశీ స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పథకాలు కూడా ఈ సమయంలో రాబడులకు మార్గం చూపిస్తాయి. రూపాయి తగ్గుదల ప్రభావానికి విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడి ఉండటమనేది కుషన్‌గా ఉపయోగపడుతుంది. విదేశీ స్టాక్స్‌ను కలిగి ఉండటం వల్ల రెండు రకాల ప్రయోజనాలుంటాయి. విదేశాల్లో లిస్ట్ అయిన కంపెనీల పెరిగే ఆదాయ ప్రయోజనాలకు అదనంగా, రూపాయితో డాలర్ బలోపేతం కావడం వల్ల ప్రయోజనం కూడా లభిస్తుంది. విదేశీ స్టాక్స్‌లో పాక్షికంగా, పూర్తిగా ఇన్వెస్ట్ చేసే సుమారు 40 మ్యూచువల్ ఫండ్ పథకాలు ప్రస్తుతం మన దగ్గర ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి కూడా. భిన్న రకాల పెట్టుబడి ఆప్షన్లతో ఇవి ఉన్నాయి. కొన్ని ప్రత్యేకంగా అమెరికా లేదా యూరోప్ లేదా ఆసియా ప్రాంతాలకే పరిమితమైనవీ ఉన్నాయి. జపాన్, బ్రెజిల్ లేదా చైనా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే పథకాలు కూడా ఉన్నాయి. అయితే, ఇతర వర్ధమాన మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే పథకాలపై రాబడులు మన మార్కెట్లకు అనుగుణంగానే ఉంటాయి. వైవిధ్య ప్రయోజనం పొందాలంటే వీటికి బదులు ప్రధానంగా అమెరికా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే పథకాలు రూపాయి పడిపోతున్న సమయంలో అక్కరకు వస్తాయి. మైనింగ్, కమోడిటీ, రియల్ ఎస్టేట్ ఫండ్స్‌ల్లోనూ ఎక్కువ ఒడిదుడుకులు ఉంటుంటాయి. కనుక అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ పథకాలే రూపాయి క్షీణతను అధిగమించి రాబడులు పొందేందుకు వీలు కల్పిస్తాయి. కేవలం యూఎస్ ఎస్అండ్పీ 500ను కొనుగోలు చేసినా గానీ, 2013లో 46 శాతం, ఈ ఏడాది ఇంత వరకు 21 శాతం రాబడులు వచ్చి ఉండేవి. ఇక 2008 మార్కెట్లు కుప్పకూలిన ఏడాదిలో ఎస్అండ్పీ 500పై పెట్టుబడి వల్ల నష్టం 24 శాతానికే పరిమితం అయింది. కానీ, మన మార్కెట్లు ఆ ఏడాది నష్టపోయిన మొత్తంలో ఇది సగానికంటే తక్కువే. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ యూఎస్ అపార్చునిటీస్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఈటీఎఫ్ అన్నవి రూపాయి క్షీణత కారణంగా రాబడులు ఆశించేవారికి మంచి ఆప్షన్లు. తమ పోర్ట్‌ఫోలియో మొత్తంలో 10–15 శాతం నిధులను ఈ ఫండ్ పథకాల్లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గతంలో మన ఈక్విటీ ఫండ్స్‌పై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనం ఉన్న సమయంలో విదేశీ ఫీడర్ ఫండ్స్‌కు మన ఇన్వెస్టర్లు దూరంగా ఉండేవారు. ప్రస్తుతం మన ఈక్విటీ ఫండ్స్ 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిధిలోకి రావడంతో... విదేశీ ఫండ్స్, మన ఫండ్స్ విషయంలో పన్నుల పరంగా వ్యత్యాసం తగ్గిపోయింది. -
మార్కెట్లకు ఎఫ్‌పీఐల జ్వరం
ముంబై: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) కేవైసీ నిబంధనలకు సంబంధించి సెబీ జారీ చేసిన సర్క్యులర్ తాజాగా మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎఫ్‌పీఐల లాబీ.. నిబంధనలను సవరించకపోతే ఏకంగా 75 బిలియన్ డాలర్ల విలువ చేసే పెట్టుబడులు తరలిపోతాయని హెచ్చరించింది. రూపాయి పతనం, వివిధ ప్రతికూల అంశాలకు ఇది కూడా తోడు కావడంతో మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌పీఐలకు భరోసా కల్పించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఏప్రిల్ 10 నాటి సెబీ సర్క్యులర్‌లో కొత్త ప్రతిపాదనలేమీ చేర్చలేదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి ఎస్సీ గర్గ్ మంగళవారం చెప్పారు. ఇందుకు సంబంధించిన డెడ్‌లైన్‌ను సెబీ గత నెల్లోనే డిసెంబర్ దాకా పొడిగించిందన్నారు. ఇప్పటికైతే ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు ప్రతిపాదిత మార్గదర్శకాలపై ఇప్పుడు వివాదం ఎందుకు రేపుతున్నారో అర్ధం కావడం లేదని గర్గ్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఏప్రిల్ 10 నాటి సర్క్యులర్ కారణంగా భారత మార్కెట్ల నుంచి 75 బిలియన్ డాలర్లు తరలిపోతాయన్న వ్యాఖ్యలు పూర్తిగా అర్ధరహితమైనవని, బాధ్యతారహితమైనవని సెబీ ఆక్షేపించింది. దీనిపై మంగళవారం ఉదయం ప్రత్యేక ప్రకటన కూడా జారీ చేసింది. వివాదమిదీ.. రిస్కు సామర్థ్యాల ఆధారంగా సెబీ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐ) మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. ఇందులో 2, 3 కేటగిరీలకి చెందిన ఎఫ్పీఐలంతా తమ పెట్టుబడులకు సంబంధించి లబ్ధిదారైన యజమానుల (బీవో) జాబితాను, వివరాలను (కేవైసీ) నిర్దిష్ట ఫార్మాట్లో ఆరు నెలల్లోగా సమర్పించాలంటూ సెబీ ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేసింది. వీటిని సమీక్షించాలంటూ, మార్గదర్శకాలను పాటించేందుకు మరింత గడువివ్వాలంటూ మార్కెట్ వర్గాల నుంచి అభ్యర్ధనలు రావడంతో డెడ్‌లైన్‌ను ఆగస్టులో మరో రెండు నెలలు (డిసెంబర్ దాకా) పొడిగించింది. ఆయా వర్గాల అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని భరోసా ఇచ్చింది. ఈ కేవైసీ ఆదేశాలే ప్రస్తుత వివాదానికి దారి తీశాయి. ప్రతిపాదిత కొత్త నిబంధనల కారణంగా విదేశాల్లోని భారత పౌరులు (ఓసీఐ), భారత సంతతికి చెందిన వారు (పీఐవో), ప్రవాస భారతీయులు (ఎన్నారై).. భారత మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసేందుకు అర్హత కోల్పోతారని ఎఫ్‌పీఐల లాబీ గ్రూప్ ఏఎంఆర్ఐ (అసెట్ మేనేజ్మెంట్ రౌండ్‌టేబుల్ ఆఫ్ ఇండియా) సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని సవరించకపోతే ఆయా వర్గాల నిర్వహణలో ఉన్న 75 బిలియన్ డాలర్ల పెట్టుబడులను స్వల్పకాలంలోనే అమ్మేసుకుని, వైదొలగాల్సిన పరిస్థితి ఉంటుందని పేర్కొంది. అదే జరిగితే ఇటు స్టాక్స్‌పైనా అటు రూపాయిపైనా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలపైనే ఇటు కేంద్రం, అటు సెబీ మంగళవారం స్పందించాయి. నిబంధనల ప్రభావమిదీ.. ప్రతిపాదిత నిబంధనల వెనుక ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. దీని అమలు విషయంలోనే అనేక సమస్యలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మార్గదర్శకాల పరిభాషను సమీక్షించి, సవరించకపోతే మార్కెట్లో తీవ్ర సంక్షోభానికి దారి తీయొచ్చని అంటున్నారు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం .. భారత్‌లోని లిస్టెడ్ కంపెనీలో ఒక్కో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టరు (ఎఫ్‌పీఐ) వాటా 10%కి మించరాదు. ఒకవేళ మించితే సదరు బీవో (లబ్ధిదారు) పరిమితికిమించిన వాటాలను 5 ట్రేడింగ్ సెషన్లలోగా విక్రయించుకుని, నిర్దేశిత 10% లోపునకు తగ్గించుకోవాలి. లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారు కేటగిరీలోకి మారాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మనీలాండరింగ్‌ను నిరోధించే ఉద్దేశంతో వీటిని ప్రతిపాదించారు. అందుకే ఆయా పెట్టుబడులకు అసలైన యజమానులు (బీవో) ఎవరో చెప్పి తీరాలంటూ నిర్దేశించారు. ఈ నిబంధన డిసెంబర్ నుంచి అమల్లోకి రానుంది. పరిభాషతోనే ఇబ్బంది.. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం భారత ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు 425 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. మెజారిటీ షేర్హోల్డర్లు, మేనేజర్లు ఎఫ్‌పీఐల్లో ఉన్న వివిధ ఫండ్స్ ద్వారా చాలా మటుకు ఎన్ఆర్ఐలు 75 బిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశారు. సెబీ ఆదేశాల కారణంగా వీరందరూ కూడా క్రిమినల్స్ కేటగిరీలోకి చేరిపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఎఫ్‌పీఐ మార్గం ద్వారా పెట్టుబడులు పెట్టడానికి ఇకపై ఆస్కారం ఉండదు కనుక.. ఎన్నారైలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చని, ఫలితంగా పెద్ద ఎత్తున అమ్మకాలు వెల్లువెత్తవచ్చని వారు చెబుతున్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ సంస్థ (ఎఫ్‌పీఐ)లో యాజమాన్య వాటాలు లేదా నియంత్రణాధికారాలు ఉన్న వ్యక్తి లేదా వ్యక్తుల సమూహాన్ని లబ్ధి దారైన యజమాని (బీవో)గా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) పరిగణిస్తోంది. ఒకవేళ బీవోని ప్రత్యక్షంగా గుర్తించలేని పక్షంలో సదరు ఎఫ్‌పీఐకి సంబంధించిన సీనియర్ మేనేజింగ్ అధికారినే బీవోగా పరిగణిస్తారు. అలాగే నియంత్రణాధికారాలకు కూడా పీఎంఎల్ఏలో విస్తృత నిర్వచనం ఉంది. ఈ నిర్వచనాలతోనే చిక్కొస్తుందనేది మార్కెట్ వర్గాల వాదన. ఇవే కాకుండా, కేవైసీ నిబంధల కింద చిరునామా, ట్యాక్స్ రెసిడెన్సీ నంబరు, సోషల్ సెక్యూరిటీ నంబరు కూడా ఇవ్వాల్సి రానుండటం కూడా ఇన్వెస్టర్లు ఇబ్బందిపడొచ్చంటున్నాయి. డేటా భద్రత, ప్రైవసీ చట్టాలు పటిష్టంగా లేని దేశాలకు కీలక వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడానికి ఇన్వెస్టర్లు ఇష్టపడకపోవచ్చని చెబుతున్నారు. -
రికార్డు స్థాయికి పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: ముడిచమురు ధరలు పెరగడం, రూపాయి విలువ పతనమవడంతో ఇంధన ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. సోమవారం సవరించిన ధరల ప్రకారం.. పెట్రోల్‌పై 31 పైసలు, డీజిల్‌పై 39 పైసల ధర పెరిగింది. దీంతో ముంబైలో రికార్డు స్థాయిలో లీటరు పెట్రోల్ ధర రూ.86.56కు చేరుకుంది. డీజిల్ ధర రూ.75.54గా ఉంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.79.15, లీటరు డీజిల్ రూ.71.15గా ఉంది. ఆగస్టు 16 నుంచి ఇప్పటివరకు లీటరు పెట్రోల్‌పై రూ.2, డీజిల్‌పై రూ.2.42 ధర పెరిగింది. ఇరాన్‌పై అమెరికా ఆంక్షల వల్ల సరఫరా తగ్గుతుందన్న భయంతో చమురు ధరలు 15 రోజుల్లో 7 డాలర్లు (బ్యారెల్‌కు) పెరిగాయి. రూపాయి పతనం వల్ల సీఎన్జీ, పీఎన్జీ ధరలూ పెరిగాయి. కేజీ సీఎన్జీ 63 పైసలు, పీఎన్జీ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (ఎస్సీఎం)కు రూ.1.11 పెరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో కేజీ సీఎన్జీ రూ.42.60గా పీఎన్జీ ధర ఎస్సీఎంకు రూ.28.25కు చేరుకుంది. -
చరిత్రాత్మక కనిష్టస్థాయికి చేరిన రూపాయి
-
ముఖ విలువ... మటాష్!
సాక్షి, బిజినెస్ విభాగం : మార్కెట్లు అక్కడికక్కడే తిరుగుతున్నాయి. ప్రధాన ఇండెక్స్‌లు కొంచెం పెరగటం... అంతకన్నా ఎక్కువగా తగ్గటం వంటివి చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే మార్కెట్లు 5–10 శాతం శ్రేణిలో తిరుగుతున్నాయి. దీన్ని చూస్తే మార్కెట్లు పెద్దగా పతనమవలేదనే మనకు అనిపిస్తుంది. కాకపోతే ఇది వర్తించేది లార్జ్‌క్యాప్ షేర్లకే!!. మిడ్ క్యాప్ షేర్లు ఒక మోస్తరు పతనం కాగా... క్యాప్ షేర్లు కొన్ని నెలలుగా దారుణంగా పడ్డాయి. మార్కెట్ బాగున్నపుడు భారీ రాబడులనిచ్చే స్మాల్‌క్యాప్ షేర్లు... పతనం సమయంలో అంతకన్నా భారీగా నష్టపోవటం కొత్తేమీ కాదు. అయితే ఈ సారి ఆ పతనం మరింత తీవ్రంగా ఉంది. సాధారణంగా స్మాల్ క్యాప్ షేర్లలో చురుకుగా ట్రేడయ్యే షేర్లు కొన్నే!!. ఇప్పుడు ఈ చురుకైన షేర్లలో చాలా వరకూ వాటి ముఖ విలువ కంటే దిగువనే ట్రేడవుతున్నాయి. ఇలా ముఖ విలువ కంటే తక్కువ ధరకు ట్రేడయ్యే షేర్ల సంఖ్య ఈ ఏడాది ఆరంభంలో 336గా ఉండగా, ఇప్పుడది 430కి చేరింది. 75 శాతం తగ్గిన ‘మార్కెట్’ ధర ఈ ఏడాది ఇప్పటివరకూ 5 శాతం పతనం కాగా, బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 16 శాతం, మిడ్ క్యాప్ సూచీ 13 శాతం చొప్పున పడ్డాయి. ఈ ఏడాది గీతాంజలి జెమ్స్, డైమండ్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కేఎస్కే ఎనర్జీ వెంచర్స్, ఐవీఆర్సీఎల్, జేపీ ఇన్ఫ్రాటెక్ వంటి షేర్ల మార్కెట్ ధర దాదాపు 75 శాతం వరకూ క్షీణించింది. వీటిల్లో కొన్ని ప్రతికూల వార్తల కారణంగా బాగా పతనమయ్యాయి. గీతాంజలి, జేపీ ఇన్ఫ్రా, వీడియోకాన్ ఇలా పతనమైనవే. గీతాంజలి జెమ్స్ గత నెల 4న రూ.2.75కు పడిపోయింది. ఇది జీవిత కాల కనిష్ట స్థాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 14న దీని ధర రూ.62.85. అంటే... నాలుగు నెలల కాలంలోనే 95 శాతానికి పైగా పతనమైంది. ఇక జేపీ ఇన్ఫ్రాపై ప్రస్తుతం దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. వీడియోకాన్ షేర్ ఈ నెలలో రూ.6.84కు పడింది. ఇది రికార్డ్ స్థాయి కనిష్టం. ఈ ఏడాది దీని మార్కెట్ ధర సగం హరించుకుపోయింది. స్మాల్ క్యాప్ షేర్లు.. బహుపరాక్...! అమెరికా–చైనా, ఇతర దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు చెలరేగుతుండటం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. రూపాయి పతనం కొనసాగుతుండటం, మరో ఏడాది కాలంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మన మార్కెట్లోనూ తీవ్ర ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో స్మాల్ క్యాప్ షేర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలనేది విశ్లేషకుల సూచన. భవిష్యత్తు ఆర్థిక ఫలితాలు ఆశావహంగా లేని, విలువ కూడా సరిగ్గా లేని స్మాల్‌క్యాప్ షేర్లకు దూరంగా ఉండటమే మంచిదని వారు చెబుతున్నారు. గత ఏడాది నాలుగో క్వార్టర్లో స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు మంచి ర్యాలీ చేశాయని ఈక్వినామిక్స్ రీసెర్చ్ ఎమ్డీ జి. చొక్కలింగమ్ చెప్పారు. ఈ ఏడాదిలో ఇలాంటి పలు షేర్లు బాగా పతనమయ్యాయన్నారు. అయితే మంచి విలువ గల షేర్లు కూడా బాగా పడిపోయాయని చెప్పారాయన. ‘‘ఇపుడు లార్జ్ క్యాప్ షేర్లలో వేల్యూ బబుల్ చేటు చేసుకుంది. ఈ బబుల్ పేలిపోవడం మొదలైతేనే, మంచి నాణ్యత గల చిన్న షేర్లు పెరగడం ప్రారంభమవుతుంది’’ అని ఆయన అంచనా వేశారు. ముఖ విలువ కంటే తక్కువకు ట్రేడ్ అవుతున్న మరికొన్ని షేర్లు ♦ అలోక్ ఇండస్ట్రీస్ ♦ జై బాలాజీ ఇండస్ట్రీస్ ♦ జీటీఎల్ ♦ ఆర్చిడ్ ఫార్మా ♦ పీబీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ♦ తాంతియా కన్స్ట్రక్షన్స్ ♦ ఏబీజీ షిప్‌యార్డ్ ♦ శిల్పి కేబుల్ టెక్నాలజీస్ ♦ హిందుస్తాన్ డార్–ఓలివర్ ♦ ఆంధ్రా సిమెంట్స్ ♦ బర్న్‌పూర్ సిమెంట్ ♦ ట్రీ హౌస్ ఎడ్యుకేషన్ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉండాలి.. ఫండమెంటల్స్ పరంగా పటిష్టంగా ఉన్న చిన్న షేర్లు మళ్లీ పెరుగుతాయని సర్తి గ్రూప్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ కుంజ్ బన్సాల్ చెప్పారు. ‘‘వాటికి వ్యతిరేకంగా వచ్చిన వార్తలు నిరాధారమని తేలినా... ఆర్థిక స్థితిగతులు బాగున్న షేర్లు మళ్లీ మంచి ఫలితాలనిచ్చినా వేగంగా పైకిలేస్తాయి. కానీ ఇలా జరగటానికి కొంత సమయం పడుతుంది. అప్పటిదాకా ఇన్వెస్టర్లు ఓపిక వహించాలి’’ అని చెప్పారాయన. అంతర్జాతీయంగా పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండటం, ఎన్నికల వంటి కారణాల వల్ల మరో ఏడాది పాటు మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని ఐడీబీఐ క్యాపిటల్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ చెప్పారు. ఆర్థిక స్థితిగతులు బాగుండి, మంచి ఆర్థిక ఫలితాలనిచ్చేవి తప్ప చిన్న షేర్ల ర్యాలీ కష్టమని చెప్పారాయన. -
అయిదేళ్ల కనిష్టానికి రూపాయి విలువ
ముంబై: అంతర్జాతీయంగా బలహీన ధోరణులు, దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితులపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో రూపాయి పతనం కొనసాగుతోంది. సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 34 పైసలు క్షీణించి 68.80 వద్ద క్లోజయ్యింది. ముగింపు ప్రాతిపదికన చూస్తే ఇది అయిదేళ్ల కనిష్టం. చివరిసారిగా 2013 ఆగస్టు 28న ఈ స్థాయి వద్ద రూపాయి ముగిసింది. గత గురువారం తొలిసారిగా కీలకమైన 69 మార్కును కూడా దాటేసి 69.10 స్థాయికి రూపాయి విలువ పడిపోయిన సంగతి తెలిసిందే. వాణిజ్య యుద్ధ భయాలు, పెరుగుతున్న కమోడిటీల ధరలతో దిగుమతి బిల్లుల భారం పెరుగుతుండటం తదితర అంశాలతో పరిస్థితి మరింత దిగజారవచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కరెంటు అకౌంటు లోటు గతేడాదికన్నా మరో 30 బేసిస్ పాయింట్లు అధికంగా జీడీపీలో 2.2 శాతానికి పెరగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఎక్యూట్ రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ ఆర్థికవేత్త కరణ్ మెహ్రిషి పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం నాటికి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 70 స్థాయికి చేరొచ్చని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటిదాకా రూపాయి 6.6 శాతం క్షీణించింది. గతేడాది జూలైతో పోలిస్తే 8 శాతం మేర పతనమైంది. -
రూపాయి బే‘జారు’!
ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు తాజాగా కరెన్సీ సెగ తగులుతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా నాలుగవ రోజూ రూపాయి పతనం కొనసాగింది. సాయంత్రం ఐదు గంటలతో ముగిసే ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్ఛంజ్ (ఫారెక్స్) మార్కెట్ ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 68.79 వద్ద ముగిసింది. రోజూవారీగా చూస్తే రూపాయి 18 పైసలు బలహీనపడింది. అంటే బుధవారం 68.61 వద్ద ముగిసిన రూపాయి 18 పైసలు బలహీనపడి 68.79 వద్ద ముగిసింది. 2016 నవంబర్ 24న రూపాయి ఆల్‌టైమ్ కనిష్టస్థాయి 68.73 వద్ద ముగిసింది. తర్వాత రూపాయి ఆ స్థాయికి చేరటం ఇదే. ఇప్పుడు అంతకన్నా తక్కువ స్థాయికి చేరటం గమనార్హం. ఇందంతా ఒకవైపయితే, ఇంట్రాడేలో రూపాయి ఏకంగా 69.10కి పడిపోవడం మరో ఆందోళనకరమైన అంశం. డాలర్లకోసం ఒత్తిడి... దిగుమతిదారుల నుంచి డాలర్లకోసం గణనీయమైన డిమాండ్ ఏర్పడటం రూపాయి మారకపు విలువపై తీవ్ర ప్రభావం చూపింది. ఒక దశలో ఆర్బీఐ మార్కెట్లోకి భారీగా డాలర్లను పంపి రూపాయి పతనాన్ని అడ్డుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంట్రాబ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 68.10– 68.72 శ్రేణిలో తిరిగింది. బుధవారం ముగింపుతో పోలిస్తే నష్టంతో 68.89 వద్ద ట్రేడింగ్ మొదలైంది. గతేడాది ఏకంగా 6 శాతం బలపడిన రూపాయి... ఈ ఏప్రిల్ నుంచీ బలహీనపడుతోంది. 2018లో రూపాయి విలువ 7 శాతం పతనమైంది. ఈ వార్త రాస్తున్న సమయం రాత్రి 9 గంటలకు అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ ఇండెక్స్ 95 వద్ద ఉంటే, రూపాయి 68.82 వద్ద ట్రేడవుతోంది. ఇక నైమెక్స్‌లో క్రూడ్ ధర గురువారం 74 డాలర్ల స్థాయిని తాకింది. బలహీనమంటే... క్లుప్తంగా చెప్పాలంటే, అంతర్జాతీయ వాణిజ్యం డాలర్ ద్వారానే జరుగుతుంది. ఒక వస్తువు విలువ అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ అనుకుంటే... దాన్ని మనం బుధవారం రూ. 68.61 రూపాయిలిచ్చి కొనుగోలు చేయగలిగితే, గురువారం అదే వస్తువుకోసం రూ.68.79 పెట్టాలి. దీంతో దేశంలోనూ ఈ వస్తువు ధరను పెంచి అమ్ముకోవాలి. ఇది దేశీయంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది. ద్రవ్యోల్బణం తీవ్రతరమవుతుంటే, దీని కట్టడికి ఆర్బీఐ దేశంలో వడ్డీరేట్లను పెంచాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవస్థకు దీనిని భరించే శక్తి లేకపోతే, దేశంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రూడ్‌ను ప్రధానంగా చూస్తే... మనం చమురు కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. దీన్ని డాలర్లలో కొనుగోలు చేయాలి కాబట్టి, మన చమురు కంపెనీలు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. అవి ఈ భారాన్నీ జనంపై వేస్తే, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూల ప్రభావాలు తప్పవు. అంటే స్థూలంగా దిగుమతులకు సంబంధించి మనకు రూపాయి బలహీనత నష్టమయితే, మనం ఏదైనా వస్తువు ఎగుమతిచేస్తే, లాభదాయక పరిస్థితి ఉంటుంది. పై ఉదాహరణ తీసుకుంటే, ఒక ఐటీ పరిశ్రమ తన ‘సేవలకు’ బుధవారం రూ. 68.61 ఆదాయం పొదగలిగితే, గురువారం 68.79 ఆదాయం పొందగలుగుతుంది. దేశీయ చర్యలు అవసరం వాణిజ్య యుద్ధ భయాలు, డాలర్ ఇండెక్స్ 11 నెలల గరిష్టానికి చేరడం, చమురు ధరల తీవ్రత, ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ... ఇవన్నీ దేశీయంగా రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. దేశీయంగా చూస్తే, ద్రవ్యోల్బణం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) భయాలున్నాయి. రూపాయిలో ఒడిదుడుకులను తగ్గించడానికి ఆర్బీఐ తీసుకునే చర్యలు, తగిన వర్షపాతం దేశీయ మార్కెట్‌కు సమీప భవిష్యత్‌లో కొంత ఊరటనివ్వవచ్చు. – వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్ ఎగుమతిదారులకు ఏమీ ఒరగదు రూపాయి పతనం ఒక రకంగా ఎగుమతిదారులకు కలిసిరావాలి. అయితే ఇప్పుడు చైనా సహా ఇతర దేశాల కరెన్సీలూ పడిపోతున్నాయి. క్రాస్ కరెన్సీల పతనం వల్ల మన ఎగుమతులకు సంబంధించి అంతర్జాతీయ సమ అవకాశాల స్థితి (లెవెల్ ప్లేయింట్ ఫీల్డ్) ఏర్పడుతుంది తప్ప, పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. – అజయ్ సాహి, ఎఫ్ఐఈఓ డైరెక్టర్ -
కొనసాగుతున్న రూపాయి బలహీనత
ముంబై: డాలర్ మారకంలో రూపాయి పతనం సోమవారం కూడా కొనసాగింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 12 పైసలు పతనమై, 68.12 పైసలు వద్ద ముగిసింది. గత శుక్రవారం రూపాయి ఒకేరోజు 30 పైసలు పతనమైన సంగతి తెలిసిందే. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గత మంగళవారం రూపాయి విలువ 16 నెలల కనిష్టస్థాయి 68.15 స్థాయికి చేరింది. అయితే బుధ, గురు వారాల్లో తిరిగి కొంత బలపడుతూ 67.70 స్థాయికి చేరింది. అయితే వారం చివరకు వచ్చే సరికి శుక్రవారం అనూహ్యంగా తిరిగి 30 పైసలు పడి 68 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా డాలర్లకు డిమాండ్, క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, దేశంలో కరెంట్ అకౌంట్ లోటు పెరుగుదల భయాలు వంటి అంశాలు రూపాయి పతనానికి కారణాల్లో కొన్ని. డాలర్ పెరుగుదల వల్ల ప్రభుత్వ ఆయిల్ కంపెనీల నుంచి డాలర్లకు డిమాండ్ భారీగా పెరిగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆర్బీఐ, అధికారులు రూపాయి తీవ్రంగా బలహీనపడకుండా కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, దేశం నుంచి భారీ క్యాపిటల్ అవుట్‌ఫ్లోస్ వల్ల దేశీయ కరెన్సీ పతనం ఆగటం లేదని ఆయా వర్గాలు పేర్కొన్నాయి. -
15 నెలల కనిష్టానికి సెన్సెక్స్
వదలని చైనా భయాలు - 25 వేల పాయింట్ల దిగువకు సెన్సెక్స్ - 308 పాయింట్ల నష్టంతో 24,894 వద్ద ముగింపు - 7,600 పాయింట్ల కిందకు నిఫ్టీ - 96 పాయింట్ల నష్టంతో 7,559 పాయింట్లకు డౌన్! చైనా ఆందోళనలకు వర్షాభావ భయాలు, రూపాయి పతనం తోడవడంతో స్టాక్ మార్కెట్ సోమవారం నష్టాల్లో ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 25,000 మార్క్ దిగువకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 7,600 మార్క్ దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 308 పాయింట్లు (1.22 శాతం)నష్టపోయి 24,894 పాయింట్ల వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు (1.26 శాతం)నష్టపోయి 7,559 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది 15 నెలల కనిష్ట స్థాయి. నిఫ్టీకి 13 నెలల కనిష్ట స్థాయి. ఫార్మా, లోహ, బ్యాంక్, విద్యుత్, క్యాపిటల్ గూడ్స్ షేర్లు నష్టాలపాలయ్యాయి. వరుసగా ఆరో ట్రేడింగ్ సెషన్లోనూ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ‘మోదీ’ లాభాలన్నీ మాయం సెన్సెక్స్ లాభాల్లోనే ప్రారంభమైంది. కానీ లాభాల స్వీకరణ చోటు చేసుకోవడంతో నష్టాల్లోకి జారిపోయింది. జీడీపీ వృద్ధి అంచనాలను చైనా తగ్గించడం, చైనా విదేశీ మారక ద్రవ్య నిల్వలు 9,390 కోట్ల డాలర్లు హరించుకుపోవడం వంటి అంశాల కారణంగా షాంఘై స్టాక్స్ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఈ ప్రభావం మన మార్కెట్‌పై పడింది. డాలర్‌తో రూపాయి మారకం తాజా రెండేళ్ల కనిష్ట స్థాయికి(37 పైసలు నష్టపోయి 66.83కు) పడిపోవడం సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపించింది. వర్షపాత అంచనాలు బలహీనంగా ఉండడం, కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు, పెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల అంశంపై ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయని నిపుణులంటున్నారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చినప్పటి (ఈ ఏడాది మే) నుంచి సెన్సెక్స్ సాధించిన లాభాలన్నీ దాదాపు హరించుకుపోయాయి.కాగా 30 సెన్సెక్స్ షేర్లలో 26 షేర్లు నష్టపోయాయి. కాల్ డ్రాప్స్‌కు టెలికం ఆపరేటర్లు నష్టపరిహారం చెల్లించాలన్న ట్రాయ్ ప్రతిపాదన నేపథ్యంలో టెలికం షేర్లు పతనమయ్యాయి. ఈ మూడు నెలలు ఒడిదుడుకులే: బీఓఎఫ్ఏ-ఎంల్ సెప్టెంబర్-నవంబర్ కాలానికి దేశీయ మార్కెట్లు తీవ్రమైన ఒడిదుడుకులకు గురవుతాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్ తాజా నివేదిక పేర్కొంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల అంశం, కంపెనీల ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు, బీహార్ ఎన్నికలు, దేశంలో ఆర్థిక సంస్కరణలు వంటి కారణాల వల్ల ఈ ఒడిదుడుకులు ఉంటాయని వివరించింది. -
రూపాయి భారీ పతనం
ముంబై: దేశీ కరెన్సీ మళ్లీ భారీ కుదుపునకు గురైంది. డాలరుతో రూపాయి మారకం విలువ శుక్రవారం 73 పైసలు క్షీణించి 62.66కు పడిపోయింది. ఇది రెండు నెలల కనిష్టస్థాయి కావడం గమనార్హం. గతేడాది నవంబర్ 11(77 పైసలు పతనం) తర్వాత రూపాయి ఈ స్థాయిలో దిగజారడం ఇదే తొలిసారి. బ్యాంకులు, దిగుమతిదారుల నుంచి డాలర్లకు పటిష్టమైన డిమాండ్ కారణంగా రూపాయిపై ఒత్తిడి నెలకొందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క, దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి జారిపోవడం కూడా ప్రభావం చూపినట్లు వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన కరెన్సీలతో డాలరు విలువ నీరసించినా కూడా రూపాయికి మద్దతు లభించలేదని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. చైనా జీడీపీ, పారిశ్రామిక గణాంకాలు నిరుత్సాహపరచడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయ ప్యాకేజీల్లో కోత(ట్యాపరింగ్) అంశాలవల్ల రూపాయిపై ప్రతికూల ప్రభావం పడుతోందని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈఓ అభిషేక్ గోయెంకా పేర్కొన్నారు. నెలకు 85 బిలియన్ డాలర్ల బాండ్లో కొనుగోలులో 10 బిలియన్ డాలర్లను(ఈ నెల నుంచే) కోత పెడుతూ గత నెలలో ఫెడ్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఈనెల 28, 29 తేదీల్లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్(ఫెడ్) పాలసీ సమీక్ష జరగనుంది. 28న ఆర్బీఐ పాలసీ సమీక్ష నిర్వహించనుంది. ఈ రెండింటిలో తీసుకోబోయే నిర్ణయాలు రూపాయి కదలికలకు కీలకం కానున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. -
భారత్ వృద్ధి 4.8 శాతమే: ఫిచ్
న్యూఢిల్లీ: ఫిచ్ రేటింగ్ సంస్థ భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను కుదించింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 4.8 శాతమని తాజాగా అంచనావేసింది. వృద్ధి రేటు 5.7 శాతమని ఇంతక్రితం జూన్‌లో సంస్థ అంచనా వేసింది. బలహీన డిమాండ్, ఆర్థిక మందగమనం నేపథ్యంలో వృద్ధి రేటు అంచనాలను కుదిస్తున్నట్లు ఫిచ్ తన గ్లోబల్ ఎకనమిక్ అవుట్‌లుక్‌లో పేర్కొంది. రానున్న ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు అంచనాను సైతం 6.5 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గిస్తున్నట్లు ఫిచ్ తెలిపింది. రూపాయి క్షీణత ప్రభావం ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటుపై పడుతోందని విశ్లేషించింది. -
రూపాయి 46 పైసలు డౌన్
ముంబై: ఫెడరల్ రిజర్వ్ గురువారం దేశీయ కరెన్సీకి బూస్ట్నిచ్చినప్పటికీ, శుక్రవారం పాలసీ సమీక్షను చేపట్టిన రిజర్వ్ బ్యాంక్ గాలి తీసేసింది. అనూహ్య రీతిలో రెపో రేటును పావు శాతంమేర పెంచడంతో డాలరుతో మారకంలో రూపాయి 46 పైసలు క్షీణించింది. 62.23 వద్ద ముగిసింది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే బాటలో కొత్త గవర్నర్ రఘురామ్ రాజన్ రెపో రేటును 7.25% న ఉంచి 7.5%కు పెంచడంతో రూపాయి బలహీనపడింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో తొలుత 62.05 వద్ద బలహీనంగా మొదలైంది. ఆపై గరిష్టంగా 61.88ను, కనిష్టంగా 62.61ను తాకింది. చివరకు క్రితం ముగింపు 61.77తో పోలిస్తే 0.7% తగ్గి 62.23 వద్ద స్థిరపడింది. కాగా, అమెరికా ఫెడరల్ రిజర్వ్ సహాయక ప్యాకేజీలను కొనసాగించేందుకు నిర్ణయించడంతో గురువారం ట్రేడింగ్‌లో రూపాయి 161 పైసలు జంప్‌చేసి 61.77 వద్ద నిలిచిన విషయం విదితమే. -
బాబోయ్.. రూపాయ్!
అగాధానికి దేశీ కరెన్సీ... ఒక్కరోజులో అతిపెద్ద పతనం; 256 పైసలు క్రాష్ కొత్త ఆల్‌టైమ్ కనిష్టం... 68.80కి కుదేల్ క్రూడ్ ధరల సెగ, క్యాడ్ ఆందోళనలు, విదేశీ పెట్టుబడుల రివర్స్‌గేర్‌తో బెంబేలు దిగుమతిదారుల నుంచి భారీ డాలర్ డిమాండ్ బిత్తర చూపులు చూస్తున్న ఆర్బీఐ, ప్రభుత్వం! 1 డాలరు = 69 రూపాయలు 60.. 62.. 64... 66... 68.. ఇవేవో వైకుంఠపాళిలో నిచ్చెనమెట్లు కాదు. పాతాళానికి కాళ్లుచాచిన రూపాయి పాట్లు. దేశ ఆర్థిక దుస్థితికి తగ్గట్టే.. కరెన్సీ విలువ కూడా కకావికలం అవుతోంది. తుక్కుతుక్కుగా మారుతోంది. రూపాయిని పెంచడం, తగ్గించడం మా చేతుల్లోలేదని, చికిత్సకు స్పందించేదాకా ఓపికపట్టాలంటూ స్వయంగా ఆర్థిక మంత్రి చిదంబరమే చేతులెత్తేయడం ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ను మరింత దిగజార్చింది. ముడిచమురు ధరల మంట ఇతరత్రా కారణాలతో బుధవారం ఒకేరోజు 256 పైసలు కుప్పకూలి.. అతిపెద్ద పతనాన్ని నమోదుచేసింది. 69 దరిదాపుల్లోకి పడిపోయి కొత్త ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని తాకింది. ముంబై: రోజురోజుకీ రూపాయిని చిమ్మచీకట్లు చుట్టుముట్టేస్తున్నాయి. వరుసగా మూడోరోజూ దేశీ కరెన్సీ కుప్పకూలింది. డాలరుతో రూపాయి మారకం విలువ బుధవారం చరిత్రలోనే అతిపెద్ద ఒక్కరోజు పతనంతో విలవిల్లాడింది. సిరియాలో యుద్ధభయాలతో ముడిచమురు ధరలకు అంతర్జాతీయంగా రెక్కలురావడం... కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఆందోళనలు రూపాయికి తూట్లుపొడిచాయి. దీనికితోడు ఆర్బీఐ జోక్యానికి కూడా స్పందించకపోవడం, విదేశీ పెట్టుబడుల తిరోగమనం యథేచ్ఛగా కొనసాగుతుండటం కూడా దేశీ కరెన్సీని చివురుటాకులా వణికించాయి. దీంతో 256 పైసలు(3.86%) కుప్పకూలిన రూపాయి.. చివరకు 68.80 వద్ద స్థిరపడింది.ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో బుధవారం రూపాయి ట్రేడింగ్ అత్యంత బలహీనంగా 66.90 వద్ద(క్రితం ముగింపు 66.24) వద్ద మొదలైంది. ఆ తర్వాత 67, 68 స్థాయిలను కూడా కోల్పోయి 68.75కు జారుకుంది. మధ్యాహ్నం ఒకానొకదశలో ఆర్బీఐ జోక్యం చేసుకున్నట్లు ఫారెక్స్ డీలర్లు చెబుతున్నారు. దీంతో కొంత రికవరీ అయినా.. మళ్లీ పతనబాటలోకి మళ్లింది. క్రూడ్ ధరల పెరుగుదలతో చమురు దిగుమతిదారుల నుంచి, అదేవిధంగా బ్యాంకుల నుంచి డాలర్లకు డిమాండ్ కొనసాగడం రూపాయిపై ఒత్తిడిని తీవ్రతరం చేసింది. ఒకానొక దశలో 68.85ను తాకింది. చివరకు 68.80 వద్ద స్థిరపడింది. ఇక బ్రిటిష్ పౌండ్తో పోలిస్తే రూపాయి విలువ క్రితం ముగింపు 102.80 నుంచి భారీగా క్షీణించి 106.33కు పడిపోయింది. 3 రోజుల్లో 9% ఫట్..: వరుసగా మూడోరోజూ రూపాయి అత్యంత ఘోరంగా పడిపోయింది. సోమవారం 110 పైసలు, మంగళవారం 194 పైసలు, బుధవారం 256 పైసలు మొత్తంమీద మూడు రోజుల్లో 560 పైసలు(8.86%) ఆవిరైంది. ఇక ఆగస్టులో ఇప్పటిదాకా 840 పైసలు (సుమారు 14%) కుప్పకూలడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే 1,381 పైసలు(25%) క్షీణించింది. 70-72 దిశగా...: డాలర్లకు మార్కెట్లో భారీగా కొరత నేపథ్యంలో రూపాయి విలువ 70-72 స్థాయికి పడిపోవచ్చనేది మార్కెట్ వర్గాల అభిప్రాయం. ముడిచమురు దిగుమతుల భారం, విదేశీ పెట్టుబడుల రివర్స్‌గేర్‌తో రూపా యి 70 కిందికి జారిపోవచ్చని అల్పరి ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ ప్రమిత్ బ్రహ్మభట్ చెప్పారు. కొత్త భయాలు.. పౌరులపై రసాయన ఆయుధాలను ప్రయోగిస్తున్నట్లు ఆరోపణ లు ఎదుర్కొంటున్న సిరియాపై పశ్చిమ దేశాలు సైనికదాడి చేయొచ్చనే భయాలతో ముడిచమురు ధరలు మండుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 117 డాలర్ల పైకి దూసుకెళ్లింది. అసలే బిక్కుబిక్కుమంటున్న రూపాయికి క్రూడ్ సెగ మరింత మంట పెడుతోంది. దేశంలో 80 శాతం ముడిచమురు అవసరాలను దిగుమతులద్వారానే చేసుకోవాల్సిరావడం ఈ దుస్థితికి కారణం. మరోపక్క, ఆహార భద్రత బిల్లుకు లోక్‌సభ ఆమోదంతో సబ్సిడీ భారం ఎగబాకి ద్రవ్యలోటు పెరిగిపోతుందనే భయాలు కొత్తగా వచ్చిచేరాయి. బుధవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మరో 1,120 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించేశారు. గత 8 రోజుల్లోనే బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6,800 కోట్లు) స్టాక్స్‌ను వారు వదిలించుకోవడం విదేశీ నిధుల తిరోగమనానికి నిదర్శనం. అసంబద్ధ సెంటిమెంటే కారణం: ఆర్థిక శాఖ రూపాయి అడ్డగోలు పతనానికి ఇన్వెస్టర్లలో నెలకొన్న అసంబద్ధ సెంటిమెంటే కారణమని ఆర్థిక శాఖ పేర్కొంది. భయాందోళనలకు గురవ్వొద్దంటూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ చెప్పారు. కరెన్సీ మార్కెట్లో డెరివేటివ్స్ ట్రేడింగ్‌ను నిషేధించే ప్రణాళికలేవీ ప్రభుత్వానికి లేవనిస్పష్టం చేశారు. మరోవైపు, రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసే దిశగా ఆర్బీఐ మరిన్ని చర్యలు చేపట్టింది. చమురు కంపెనీల డాలర్ల అవసరాల కోసం స్పెషల్ విండో ప్రారంభించింది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు ప్రతి నెలా 8.5 బిలియన్ డాలర్లు అవసరమవుతున్నాయి. పతనం షాక్ ఇదీ.. డాలరుతో రూపాయి మారకం విలువ ఈ ఏడాది మే నెల నుంచి చూస్తే 28% కుప్పకూలింది. గతేడాది ఆగస్టు 29న 46.15గా ఉన్న రూపాయి.. ఈ నెల 28కి అంటే ఏడాదిలో 68.80కి పడిపోయింది. అంటే దాదాపు 50 శాతం ఢమాల్ మంది. ఈ ఏడాది ఆరంభం(జనవరి) నుంచి చూస్తే దేశీ కరెన్సీ 25 శాతం కుప్పకూలింది. ఈ నెల ఒక్కనెలలోనే 14 శాతం దిగజారింది. అంతక్రితం 1991 జూలైలో ఒక్క నెలలో 22 శాతం దేశీ కరెన్సీ క్రాష్ అయింది. 1992 ఏడాది మార్చి నెలలో 11.5 శాతం క్షీణించింది. -
ఏం చేసినా లాభం లేదు...: డీబీఎస్
ముంబై: ప్రభుత్వం తాజాగా చేపడుతున్న విధాన చర్యల వల్ల రూపాయి విలువ పుంజుకోవడం అసాధ్యమని, అయితే పతనం స్పీడ్‌కు కొంత అడ్డుకట్టపడొచ్చని సింగపూర్‌కు చెందిన ప్రముఖ బ్యాంక్ డీబీఎస్ పేర్కొంది. బుధవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ ప్రారంభానికి ముందే బ్యాంక్ ఒక నోట్‌ను విడుదల చేసింది. ఇందులో రూపాయి 75కు కూడా పడిపోతుందని డీబీఎస్ పేర్కొనడం గమనార్హం. గడచిన కొద్దిరోజులుగా కొనసాగుతున్న పతనం మరింత తీవ్రతరం అవుతుందనికూడా చెప్పింది. కరెన్సీ విలువ క్షీణతకు అడ్డుకట్టవేయడం కోసం చేసే ఏ ప్రయత్నమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిష్ఫలమేనని కూడా తేల్చిచెప్పింది. -
రూపాయి135 పైసలు అప్ - 63.20 వద్ద ముగింపు
ముంబై: ఆరు రోజుల వరుస పతనానికి బ్రేక్ వేస్తూ.. రూపాయి శుక్రవారం అనూహ్యంగా కోలుకుంది. డాలర్‌తో పోలిస్తే ఏకంగా 135 పైసలు పెరిగి 63.20 వద్ద క్లోజయ్యింది. ఇంత స్థాయిలో పెరగడం ఈ ద శాబ్దంలో ఇది రెండోసారి. ఇటు ప్రభుత్వం, అటు రిజర్వ్ బ్యాంక్ గురువారం చేసిన వ్యాఖ్యలు రూపాయి బలపడటానికి దోహదపడ్డాయి. దేశీ కరెన్సీ గురువారం ఇంట్రాడేలో ఆల్‌టైం కనిష్టం 65.56కి పడిపోయిన నేపథ్యంలో నిరాశావాదానికి లోనుకానక్కర్లేదంటూ ఆర్థిక మంత్రి పి. చిదంబరం, తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉన్నాయంటూ ఆర్బీఐ ప్రకటించడం మార్కెట్ వర్గాలకు కాస్త భరోసా కల్పించాయి. శుక్రవారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 64.55తో పోలిస్తే పటిష్టంగా 64.30 వ ద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. అయితే, ఆ తర్వాత కనిష్ట స్థాయి 64.75కి కూడా తగ్గింది. కానీ చివర్లో 2.09 శాతం ఎగిసి 63.20 వద్ద ముగిసింది. 2009 మే 18 తర్వాత ఒక్క రోజులో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. అప్పట్లో దేశీ కరెన్సీ 152 పైసలు (3.08 శాతం) ఎగిసింది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ జోక్యంతో ప్రభుత్వరంగ బ్యాంకులు డాలర్లను విక్రయించి ఉంటాయని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ఫిక్స్డ్ ఇన్కమ్ ట్రేడింగ్ విభాగం హెడ్ ఆగమ్ గుప్తా తెలిపారు. ఫారెక్స్ మార్కెట్లో హెచ్చుతగ్గులను నియంత్రించడంపై ప్రభుత్వం, ఆర్బీఐ పట్టుదలగా ఉన్నాయనే భరోసాతో కార్పొరేట్లు కూడా డాలర్లను విక్రయించారని ఆయన పేర్కొన్నారు. స్పాట్ ట్రేడింగ్‌లో దేశీ కరెన్సీ 63.40-64.60 శ్రేణిలో తిరుగాడవచ్చని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. 60-61కి పెరగొచ్చు.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత కరెంటు ఖాతా లోటు (క్యాడ్) 80 బిలియన్ డాలర్ల నుంచి 68 బిలియన్ డాలర్లకు తగ్గగలదని బ్రిటన్‌కి చెందిన బార్క్లేస్ బ్యాంక్ అంచనా వేసింది. భారత్ క్యాడ్‌ని పూర్తిగా భర్తీ చేసుకోగలదని పేర్కొంది. దీంతో వచ్చే 12 నెలల్లో రూపాయి విలువ 61 స్థాయికి కోలుకోగలదని వివరించింది. ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి దేశీ కరెన్సీ 60 స్థాయికి పెరగొచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. బంగారం సహా చమురుయేతర దిగుమతులు ద్వితీయార్థంలో దిగిరావడం ద్వారా క్యాడ్ గణనీయంగా తగ్గగలదని పేర్కొంది. -
చిదంబర ఆర్థిక మథనం!
న్యూఢి ల్లీ: రూపాయి మారకం కొత్త కనిష్ట స్థాయిలకు పడిపోతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులపై ఆర్థిక మంత్రి పి. చిదంబరం సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎకానమీని మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మూడు గంటలకు పైగా సాగిన సమావేశంలో రెవెన్యూ, ఆర్థిక సర్వీసులు, డిజిన్వెస్ట్‌మెంట్ తదితర విభాగాల కార్యదర్శులు పాల్గొన్నారు. వివిధ విభాగాల పనితీరును సమీక్షించడంతో పాటు ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చేందుకు సూచనలు, సలహాలు ఇవ్వాలని అధికారులను చిదంబరం కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే, వచ్చే మూడు నెలల్లో తీసుకోవాల్సిన చర్యలను కూడా ఇందులో చర్చించినట్లు వివరించాయి. నేడు (మంగళవారం) ఆర్థిక వ్యవహారాల విభాగం అధికారులతో చిదంబరం సమావేశం కానున్నారు. రూపాయి మారకం విలువ 63.13కి పడిపోయిన నేపథ్యంలో చిదంబరం సమీక్షా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. విదేశీ కరెన్సీ తరలిపోకుండా అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకపోతోంది. ఈ దిశగా దేశీ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, భారతీయులు విదేశాలకు పంపే రెమిటెన్సులు మొదలైన వాటిపై ఆర్బీఐ ఈ నెల 14న ఆంక్షలు విధించింది. మరోవైపు, భారీగా పెరిగిపోతున్న క్యాడ్‌ను కట్టడి చేయడానికి ప్రభుత్వం పసిడి తదితర నిత్యావసరం కాని వస్తువుల దిగుమతులపై సుంకాలు పెంచడం వంటి చర్యలు తీసుకుంది. భారత్‌కి ప్రస్తుతం ఉన్న ద్రవ్యలోటు, క్యాడ్‌ను బట్టి చూస్తే రూపాయిపై ఒత్తిడి తప్పదని, దేశీ కరెన్సీ పతనం అవుతుందని చిదంబరం గతంలో చెప్పారు.