సాక్షి, బిజినెస్ విభాగం : మార్కెట్లు అక్కడికక్కడే తిరుగుతున్నాయి. ప్రధాన ఇండెక్స్‌లు కొంచెం పెరగటం... అంతకన్నా ఎక్కువగా తగ్గటం వంటివి చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే మార్కెట్లు 5–10 శాతం శ్రేణిలో తిరుగుతున్నాయి. దీన్ని చూస్తే మార్కెట్లు పెద్దగా పతనమవలేదనే మనకు అనిపిస్తుంది. కాకపోతే ఇది వర్తించేది లార్జ్‌క్యాప్ షేర్లకే!!. మిడ్ క్యాప్ షేర్లు ఒక మోస్తరు పతనం కాగా... క్యాప్ షేర్లు కొన్ని నెలలుగా దారుణంగా పడ్డాయి.
మార్కెట్ బాగున్నపుడు భారీ రాబడులనిచ్చే స్మాల్‌క్యాప్ షేర్లు... పతనం సమయంలో అంతకన్నా భారీగా నష్టపోవటం కొత్తేమీ కాదు. అయితే ఈ సారి ఆ పతనం మరింత తీవ్రంగా ఉంది. సాధారణంగా స్మాల్ క్యాప్ షేర్లలో చురుకుగా ట్రేడయ్యే షేర్లు కొన్నే!!. ఇప్పుడు ఈ చురుకైన షేర్లలో చాలా వరకూ వాటి ముఖ విలువ కంటే దిగువనే ట్రేడవుతున్నాయి. ఇలా ముఖ విలువ కంటే తక్కువ ధరకు ట్రేడయ్యే షేర్ల సంఖ్య ఈ ఏడాది ఆరంభంలో 336గా ఉండగా, ఇప్పుడది 430కి చేరింది.
75 శాతం తగ్గిన ‘మార్కెట్’ ధర
ఈ ఏడాది ఇప్పటివరకూ 5 శాతం పతనం కాగా, బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ సూచీ 16 శాతం, మిడ్ క్యాప్ సూచీ 13 శాతం చొప్పున పడ్డాయి. ఈ ఏడాది గీతాంజలి జెమ్స్, డైమండ్ పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కేఎస్‌కే ఎనర్జీ వెంచర్స్, ఐవీఆర్‌సీఎల్, జేపీ ఇన్‌ఫ్రాటెక్ వంటి షేర్ల మార్కెట్ ధర దాదాపు 75 శాతం వరకూ క్షీణించింది. వీటిల్లో కొన్ని ప్రతికూల వార్తల కారణంగా బాగా పతనమయ్యాయి. గీతాంజలి, జేపీ ఇన్‌ఫ్రా, వీడియోకాన్ ఇలా పతనమైనవే.
గీతాంజలి జెమ్స్ గత నెల 4న రూ.2.75కు పడిపోయింది. ఇది జీవిత కాల కనిష్ట స్థాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 14న దీని ధర రూ.62.85. అంటే... నాలుగు నెలల కాలంలోనే 95 శాతానికి పైగా పతనమైంది. ఇక జేపీ ఇన్‌ఫ్రాపై ప్రస్తుతం దివాలా ప్రక్రియ కొనసాగుతోంది. వీడియోకాన్ షేర్ ఈ నెలలో రూ.6.84కు పడింది. ఇది రికార్డ్ స్థాయి కనిష్టం. ఈ ఏడాది దీని మార్కెట్ ధర సగం హరించుకుపోయింది.
స్మాల్ క్యాప్ షేర్లు.. బహుపరాక్...!
అమెరికా–చైనా, ఇతర దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు చెలరేగుతుండటం, అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భగ్గుమంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది.
రూపాయి పతనం కొనసాగుతుండటం, మరో ఏడాది కాలంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మన మార్కెట్లోనూ తీవ్ర ఒడిదుడుకులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో స్మాల్ క్యాప్ షేర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలనేది విశ్లేషకుల సూచన. భవిష్యత్తు ఆర్థిక ఫలితాలు ఆశావహంగా లేని, విలువ కూడా సరిగ్గా లేని స్మాల్‌క్యాప్ షేర్లకు దూరంగా ఉండటమే మంచిదని వారు చెబుతున్నారు.
గత ఏడాది నాలుగో క్వార్టర్‌లో స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు మంచి ర్యాలీ చేశాయని ఈక్వినామిక్స్ రీసెర్చ్ ఎమ్‌డీ జి. చొక్కలింగమ్ చెప్పారు. ఈ ఏడాదిలో ఇలాంటి పలు షేర్లు బాగా పతనమయ్యాయన్నారు. అయితే మంచి విలువ గల షేర్లు కూడా బాగా పడిపోయాయని చెప్పారాయన. ‘‘ఇపుడు లార్జ్ క్యాప్ షేర్లలో వేల్యూ బబుల్ చేటు చేసుకుంది. ఈ బబుల్ పేలిపోవడం మొదలైతేనే, మంచి నాణ్యత గల చిన్న షేర్లు పెరగడం ప్రారంభమవుతుంది’’ అని ఆయన అంచనా వేశారు.
ముఖ విలువ కంటే తక్కువకు ట్రేడ్ అవుతున్న మరికొన్ని షేర్లు
♦ అలోక్ ఇండస్ట్రీస్
♦ జై బాలాజీ ఇండస్ట్రీస్
♦ జీటీఎల్
♦ ఆర్చిడ్ ఫార్మా
♦ పీబీఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
♦ తాంతియా కన్‌స్ట్రక్షన్స్
♦ ఏబీజీ షిప్‌యార్డ్
♦ శిల్పి కేబుల్ టెక్నాలజీస్
♦ హిందుస్తాన్ డార్–ఓలివర్
♦ ఆంధ్రా సిమెంట్స్
♦ బర్న్‌పూర్ సిమెంట్
♦ ట్రీ హౌస్ ఎడ్యుకేషన్
ఫండమెంటల్స్ పటిష్టంగా ఉండాలి..
ఫండమెంటల్స్ పరంగా పటిష్టంగా ఉన్న చిన్న షేర్లు మళ్లీ పెరుగుతాయని సర్తి గ్రూప్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ కుంజ్ బన్సాల్ చెప్పారు. ‘‘వాటికి వ్యతిరేకంగా వచ్చిన వార్తలు నిరాధారమని తేలినా... ఆర్థిక స్థితిగతులు బాగున్న షేర్లు మళ్లీ మంచి ఫలితాలనిచ్చినా వేగంగా పైకిలేస్తాయి. కానీ ఇలా జరగటానికి కొంత సమయం పడుతుంది.
అప్పటిదాకా ఇన్వెస్టర్లు ఓపిక వహించాలి’’ అని చెప్పారాయన. అంతర్జాతీయంగా పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండటం, ఎన్నికల వంటి కారణాల వల్ల మరో ఏడాది పాటు మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగుతాయని ఐడీబీఐ క్యాపిటల్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ చెప్పారు. ఆర్థిక స్థితిగతులు బాగుండి, మంచి ఆర్థిక ఫలితాలనిచ్చేవి తప్ప చిన్న షేర్ల ర్యాలీ కష్టమని చెప్పారాయన.
Comments
Please login to add a commentAdd a comment