మార్కెట్లకు ఎఫ్‌పీఐల జ్వరం | Sensex extends losing streak on FPI outflows, rupee slump | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు ఎఫ్‌పీఐల జ్వరం

Published Wed, Sep 5 2018 12:25 AM | Last Updated on Wed, Sep 5 2018 5:16 AM

Sensex extends losing streak on FPI outflows, rupee slump - Sakshi

ముంబై: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) కేవైసీ నిబంధనలకు సంబంధించి సెబీ జారీ చేసిన సర్క్యులర్‌ తాజాగా మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎఫ్‌పీఐల లాబీ.. నిబంధనలను సవరించకపోతే ఏకంగా 75 బిలియన్‌ డాలర్ల విలువ చేసే పెట్టుబడులు తరలిపోతాయని హెచ్చరించింది. రూపాయి పతనం, వివిధ ప్రతికూల అంశాలకు ఇది కూడా తోడు కావడంతో మార్కెట్లలో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌పీఐలకు భరోసా కల్పించేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఏప్రిల్‌ 10 నాటి సెబీ సర్క్యులర్‌లో కొత్త ప్రతిపాదనలేమీ చేర్చలేదని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి ఎస్‌సీ గర్గ్‌ మంగళవారం చెప్పారు.

ఇందుకు సంబంధించిన డెడ్‌లైన్‌ను సెబీ గత నెల్లోనే డిసెంబర్‌ దాకా పొడిగించిందన్నారు. ఇప్పటికైతే ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు ప్రతిపాదిత మార్గదర్శకాలపై ఇప్పుడు వివాదం ఎందుకు రేపుతున్నారో అర్ధం కావడం లేదని గర్గ్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఏప్రిల్‌ 10 నాటి సర్క్యులర్‌ కారణంగా భారత మార్కెట్ల నుంచి 75 బిలియన్‌ డాలర్లు తరలిపోతాయన్న వ్యాఖ్యలు పూర్తిగా అర్ధరహితమైనవని, బాధ్యతారహితమైనవని సెబీ ఆక్షేపించింది. దీనిపై మంగళవారం ఉదయం ప్రత్యేక ప్రకటన కూడా జారీ చేసింది.  

వివాదమిదీ..
రిస్కు సామర్థ్యాల ఆధారంగా సెబీ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లను (ఎఫ్‌పీఐ) మూడు కేటగిరీల కింద వర్గీకరించింది. ఇందులో 2, 3 కేటగిరీలకి చెందిన ఎఫ్‌పీఐలంతా తమ పెట్టుబడులకు సంబంధించి  లబ్ధిదారైన యజమానుల (బీవో) జాబితాను, వివరాలను (కేవైసీ) నిర్దిష్ట ఫార్మాట్‌లో ఆరు నెలల్లోగా సమర్పించాలంటూ సెబీ ఏప్రిల్‌లో ఆదేశాలు జారీ చేసింది.  వీటిని సమీక్షించాలంటూ, మార్గదర్శకాలను పాటించేందుకు మరింత గడువివ్వాలంటూ మార్కెట్‌ వర్గాల నుంచి అభ్యర్ధనలు రావడంతో డెడ్‌లైన్‌ను ఆగస్టులో మరో రెండు నెలలు (డిసెంబర్‌ దాకా) పొడిగించింది.

ఆయా వర్గాల అభ్యంతరాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తుందని భరోసా ఇచ్చింది. ఈ కేవైసీ ఆదేశాలే ప్రస్తుత వివాదానికి దారి తీశాయి. ప్రతిపాదిత కొత్త నిబంధనల కారణంగా విదేశాల్లోని భారత పౌరులు (ఓసీఐ), భారత సంతతికి చెందిన వారు (పీఐవో), ప్రవాస భారతీయులు (ఎన్నారై).. భారత మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేసేందుకు అర్హత కోల్పోతారని ఎఫ్‌పీఐల లాబీ గ్రూప్‌ ఏఎంఆర్‌ఐ (అసెట్‌ మేనేజ్‌మెంట్‌ రౌండ్‌టేబుల్‌ ఆఫ్‌ ఇండియా) సోమవారం ఆందోళన వ్యక్తం చేసింది.

వీటిని సవరించకపోతే ఆయా వర్గాల నిర్వహణలో ఉన్న 75 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను స్వల్పకాలంలోనే అమ్మేసుకుని, వైదొలగాల్సిన పరిస్థితి ఉంటుందని పేర్కొంది. అదే జరిగితే ఇటు స్టాక్స్‌పైనా అటు రూపాయిపైనా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. ఈ వ్యాఖ్యలపైనే ఇటు కేంద్రం, అటు సెబీ మంగళవారం స్పందించాయి.

నిబంధనల ప్రభావమిదీ..
ప్రతిపాదిత నిబంధనల వెనుక ఉద్దేశం మంచిదే అయినప్పటికీ.. దీని అమలు విషయంలోనే అనేక సమస్యలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మార్గదర్శకాల పరిభాషను సమీక్షించి, సవరించకపోతే మార్కెట్లో తీవ్ర సంక్షోభానికి దారి తీయొచ్చని అంటున్నారు. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం .. భారత్‌లోని లిస్టెడ్‌ కంపెనీలో ఒక్కో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టరు (ఎఫ్‌పీఐ) వాటా 10%కి మించరాదు.

ఒకవేళ మించితే సదరు బీవో  (లబ్ధిదారు) పరిమితికిమించిన వాటాలను 5 ట్రేడింగ్‌ సెషన్లలోగా విక్రయించుకుని, నిర్దేశిత 10% లోపునకు తగ్గించుకోవాలి. లేదా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిదారు కేటగిరీలోకి మారాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మనీలాండరింగ్‌ను నిరోధించే ఉద్దేశంతో వీటిని ప్రతిపాదించారు. అందుకే ఆయా పెట్టుబడులకు అసలైన యజమానులు (బీవో) ఎవరో చెప్పి తీరాలంటూ నిర్దేశించారు. ఈ నిబంధన డిసెంబర్‌ నుంచి అమల్లోకి రానుంది.


పరిభాషతోనే ఇబ్బంది..
ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం భారత ఈక్విటీల్లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు 425 బిలియన్‌ డాలర్ల మేర ఉన్నాయి. మెజారిటీ షేర్‌హోల్డర్లు, మేనేజర్లు ఎఫ్‌పీఐల్లో ఉన్న వివిధ ఫండ్స్‌ ద్వారా చాలా మటుకు ఎన్‌ఆర్‌ఐలు 75 బిలియన్‌ డాలర్ల దాకా ఇన్వెస్ట్‌ చేశారు. సెబీ ఆదేశాల కారణంగా వీరందరూ కూడా క్రిమినల్స్‌ కేటగిరీలోకి చేరిపోయే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

ఎఫ్‌పీఐ మార్గం ద్వారా పెట్టుబడులు పెట్టడానికి ఇకపై ఆస్కారం ఉండదు కనుక.. ఎన్నారైలు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవచ్చని, ఫలితంగా పెద్ద ఎత్తున అమ్మకాలు వెల్లువెత్తవచ్చని వారు చెబుతున్నారు. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ (ఎఫ్‌పీఐ)లో యాజమాన్య వాటాలు లేదా నియంత్రణాధికారాలు ఉన్న వ్యక్తి లేదా వ్యక్తుల సమూహాన్ని లబ్ధి దారైన యజమాని (బీవో)గా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) పరిగణిస్తోంది. ఒకవేళ బీవోని ప్రత్యక్షంగా గుర్తించలేని పక్షంలో సదరు ఎఫ్‌పీఐకి సంబంధించిన సీనియర్‌ మేనేజింగ్‌ అధికారినే బీవోగా పరిగణిస్తారు.

అలాగే నియంత్రణాధికారాలకు కూడా పీఎంఎల్‌ఏలో విస్తృత నిర్వచనం ఉంది. ఈ నిర్వచనాలతోనే చిక్కొస్తుందనేది మార్కెట్‌ వర్గాల వాదన. ఇవే కాకుండా, కేవైసీ నిబంధల కింద చిరునామా, ట్యాక్స్‌ రెసిడెన్సీ నంబరు, సోషల్‌ సెక్యూరిటీ నంబరు కూడా ఇవ్వాల్సి రానుండటం కూడా ఇన్వెస్టర్లు ఇబ్బందిపడొచ్చంటున్నాయి. డేటా భద్రత, ప్రైవసీ చట్టాలు పటిష్టంగా లేని దేశాలకు కీలక వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వడానికి ఇన్వెస్టర్లు ఇష్టపడకపోవచ్చని చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement