విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లపై బడ్జెట్లో విధించిన పన్నును తగ్గించవచ్చని... మందగమన ప్రభావంతో కునారిల్లిన రంగాలకు ప్యాకేజీ ప్రకటిస్తారనే ఆశలతో కొద్దిరోజులుగా పెరుగుతున్న మార్కెట్లు గురువారం ఒక్కసారిగా కుప్పకూలాయి. ఎలాంటి ప్యాకేజీ ఉండబోదని ప్రభుత్వ వర్గాలు పరోక్షంగా వెల్లడించడంతో మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తాయి. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ ఎనిమిది నెలల కనిష్టానికి పడిపోవడం దీనికి తోడయ్యాయి. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్ 36,500 పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,800 పాయింట్ల దిగువకు పడిపోయాయి. ప్రధానంగా బ్యాంక్, వాహన, లోహ షేర్లు నష్టపోయాయి. రూపాయి పతనం కారణంగా ఐటీ రంగ షేర్లు మాత్రం లాభపడ్డాయి. సెన్సెక్స్ 587 పాయింట్లు పతనమై 36,473 పాయింట్ల వద్ద, నిఫ్టీ 177 పాయింట్లు తగ్గి 10,741 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ ఏడాది మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలకు ఇదే కనిష్ట స్థాయి. వరుసగా మూడో రోజూ సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.
పతనానికి ప్రధాన కారణాలు....
ప్యాకేజీ ఆశలు హుళక్కి
డిమాండ్ తగ్గి కుదేలైన రంగాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వగలదన్న ఆశలతో ఇటీవల స్టాక్ సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడుతూ వచ్చాయి. కానీ ప్యాకేజీ ఇవ్వడం అనైతికం అంటూ ప్రధాన ఆర్థిక సలహాదారు సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించడంతో ప్యాకేజీ ఆశలు అడుగంటాయి. దీంతో బ్లూచిప్‌లతో సహా అన్ని రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి.
జోష్‌నివ్వని సెబీ నిర్ణయాలు...
ఎఫ్‌పీఐల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సెబీ సరళతరం చేసింది. అయితే సూపర్ రిచ్ సర్ చార్జీపై ఎలాంటి స్పష్టత లేకపోవడం నిరాశపరిచింది. బడ్జెట్‌లో ఈ సర్‌చార్జీ ప్రతిపాదన వెలువడినప్పటినుంచి కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలకు సెబీ నిర్ణయం ఎలాంటి అడ్డుకట్ట వేయలేకపోయింది. ఎఫ్‌పీఐలు జూలైలో రూ.17,000 కోట్లు, ఈ నెలలో రూ.10,000 కోట్ల మేర నిధులను వెనక్కి తీసుకున్నారు.
బలహీన అంతర్జాతీయ సంకేతాలు
రేట్ల కోత విషయమై అమెరికా ఫెడరల్ రిజర్వ్ దూకుడుగా వ్యవహరించకపోవచ్చని ఆ సంస్థ తాజా మినట్స్ వెల్లడించాయి. ఫలితంగా భారత్ వంటి వర్థమాన దేశాలకు విదేశీ నిధుల ప్రవాహంపై ప్రభావం పడుతుంది. మరోవైపు చైనా కరెన్సీ యువాన్ 11 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ కారణాలన్నింటి వల్ల ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. చైనా షాంఘై సూచీ, జపాన్ నికాయ్ సూచీలు మినహా మిగిలిన అన్ని ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరప్ మార్కె ట్లు నష్టాల్లో ఆరంభమై, నష్టాల్లోనే ముగిశాయి.
రూపాయి... దిగువ పయనం
విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటం, స్టాక్ మార్కెట్ బలహీనంగా ట్రేడవుతుండటంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణిస్తోంది. ఇంట్రాడేలో డాలర్‌తో రూపాయి మారకం 40 పైసలు తగ్గి 71.96ను తాకింది. ఈ ఏడాది ఇదే కనిష్ట స్థాయి. మరోవైపు ముడి చమురు ధరలు 0.65 శాతం మేర పెరగడం రూపాయిపై ఒత్తిడిని పెంచింది.
సాంకేతిక కారణాలు
కీలక మద్దతు స్థాయిలు... 10,906, 10,800, 10,750 పాయింట్లను నిఫ్టీ సూచీ కోల్పోయింది. దీంతో అమ్మకాలు ఒత్తిడి పెరిగింది. నిఫ్టీ తదుపరి మద్దతు 10,580–19,455 పాయింట్ల వద్ద ఉందని టెక్నికల్ ఎనలిస్ట్‌లు అంటున్నారు. 11,120 పాయింట్లపైన స్థిరపడగలిగితేనే నిఫ్టీ బలం పుంజుకుంటుందని వారంటున్నారు. మరోవైపు నిఫ్టీ 10,782 పాయింట్ల దిగువకు దిగి వచ్చిందని, ఇలియట్ వేవ్ థియరీలో ఐదో లెగ్ పతనాన్ని ఇది నిర్ధారిస్తోందని టెక్నికల్ ఎనలిస్ట్‌ల అభిప్రాయం.
మరిన్ని విశేషాలు...
► యస్ బ్యాంక్ షేర్ నష్టాలు నాలుగో రోజూ కొనసాగాయి. 14 శాతం నష్టంతో రూ.56.30 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ఆర్థిక అవకతవకలు జరిగిన సీజీ కన్సూమర్ కంపెనీలో ఈ బ్యాంక్‌కు కూడా వాటా ఉండటంతో ఈ షేర్ పతనమవుతోంది. గత నాలుగు రోజుల్లో ఈ షేర్ 27 శాతం నష్టపోయింది.
► 31 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. టెక్ మహీంద్రా, టీసీఎస్, హిందుస్తాన్ యునిలివర్, హెచ్‌సీఎల్ టెక్– ఈ నాలుగు షేర్లు మాత్రమే పెరిగాయి. మిగిలిన 27 షేర్లు నష్టపోయాయి.
► ఇక నిఫ్టీలో బ్రిటానియా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌యూఎల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 1 –2 శాతం మేర లాభపడగా, మిగిలిన 44 షేర్లు నష్టాల్లోనే ముగిశాయి.
► డీహెచ్‌ఎఫ్‌ఎల్ రుణదాతలు తమ రుణాల్లో కొంత భాగాన్ని ఈక్విటీగా మార్చుకునే దిశగా ఆలోచిస్తున్నారన్న వార్తల కారణంగా డీహెచ్‌ఎఫ్‌ఎల్ షేర్ 13 శాతం నష్టంతో రూ.39.70 వద్ద ముగిసింది.
► రుణ భారం తగ్గించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రమోటర్లు్ల చేస్తున్న ప్రయత్నాలు ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని నింపుతుండటంతో కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ షేర్ 5 శాతం లాభం తో రూ.76.40 వద్ద ముగిసింది. గత నాలు గు రోజుల్లో ఈ షేర్ 21 శాతం ఎగసింది.
► మార్కెట్ భారీగా పతనమైనా, హిందుస్తాన్ యూని లివర్ (హెచ్‌యూఎల్) ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.1,879ను తాకింది. నెల కాలంలో ఈ షేర్ 12 శాతం పెరిగింది.
► టాటా మోటార్స్, ఓఎన్‌జీసీ, కోల్ ఇండియా, టాటా కాఫీ, సెయిల్ వంటి దిగ్గజ షేర్లు ఐదేళ్ల కనిష్ట స్థాయిలకు క్షీణించాయి. వీటితో పాటు మరో 140 షేర్లు ఈ స్థాయికి చేరాయి. డీఎల్‌ఎఫ్, టాటా స్టీల్, ఐటీసీ, రేమండ్ వంటి 270 షేర్లు రెండేళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. మరో 400 షేర్లు ఏడాది కనిష్టానికి పడిపోయాయి. అలహాబాద్ బ్యాంక్, అవంతి ఫీడ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐషర్ మోటార్స్, తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. మరోవైపు డెన్ నెట్‌వర్క్స్, నెస్లే ఇండియాలు ఏడాది గరిష్ట స్థాయిలను తాకాయి.
ప్యాకేజీ ఇవ్వడం అనైతికం..
కష్టాల్లో ఉన్న కంపెనీలను ఆదుకోవడానికి పన్ను చెల్లింపుదార్ల సొమ్ములను ఉపయోగించడం అనైతికమని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్య ఆర్థిక వ్యవస్థకు శాపం లాంటిదన్నారు. మరోవైపు తక్కువ వడ్డీరేట్లు, ప్రైవేట్ రంగానికి రుణ లభ్యత... ఈ రెండూ ప్యాకేజీ కంటే ఉత్తమమైనవని విద్యుత్తు శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వ్యాఖ్యానించారు. వీరిద్దరి వ్యాఖ్యలూ ప్రభుత్వం ప్యాకేజీ ఇవ్వవచ్చన్న ఆశలను అడియాసలు చేశాయి. మరోవైపు ఈ క్యూ1లో జీడీపీ వృద్ధి మరింతగా తగ్గగలదని (5.5 శాతానికి )గత నెల వరకూ ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన గార్గ్ పేర్కొనడం మరింత ప్రతికూల ప్రభావం చూపించింది.
697 రేంజ్‌లో సెన్సెక్స్...
ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉండటంతో సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ఆరంభమైంది. ప్యాకేజీ ఆశలు ఆడియాసలు కావడం, రూపాయి క్షీణించడం తదితర కారణాలతో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఒక దశలో 28 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, మరో దశలో 669 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 697 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఇంట్రాడేలో 201 పాయింట్ల వరకూ నష్టపోయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ ఇంట్రాడేలో 800 పాయింట్లు నష్టపోయింది.
దెబ్బతిన్న సెంటిమెంట్
డాలర్‌తో రూపాయి మారకం విలువ ఈ ఏడాది కనిష్టానికి పడిపోవడం... స్టాక్ మార్కెట్ భారీగా నష్టపోవడానికి ఒక కారణమని షేర్‌ఖాన్ బై బీఎన్‌పీ పారిబా ఎనలిస్ట్ హేమాంగ్ జణి పేర్కొన్నారు. డిమాండ్ లేక కుదేలైన రంగాలను ఆదుకునే విషయమై ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి ప్యాకేజీ ప్రకటనలు రాకపోవడం ప్రతికూల ప్రభావం చూపించిందని తెలియజేశారు. మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థకు ప్యాకేజీ అవసరం లేదని ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించటం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment