న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీల షేర్ల ర్యాలీ విషయంలో నియంత్రణలపరమైన వైఫల్యమేమీ లేదని సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ పేర్కొంది. అయితే, హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక రావడానికి ముందే అదానీ స్టాక్స్‌లో షార్ట్ బిల్డప్ జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయని తెలిపింది. రిపోర్టు వెల్లడై, షేర్లు కుప్పకూలిన తర్వాత ట్రేడర్లు పొజిషన్లు స్క్వేర్ ఆఫ్ చేసి, లాభపడ్డారని వివరించింది.
ఆరు సంస్థలు అనుమానాస్పద ట్రేడింగ్ నిర్వహించాయని.. వాటిలో నాలుగు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) కాగా, ఒకటి కార్పొరేట్ సంస్థ, మరొక వ్యక్తి ఉన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను ప్రస్తావిస్తూ పేర్కొంది. ‘మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇచ్చిన వివరణ, డేటా ప్రకారం నియంత్రణ వైఫల్యాల వల్ల షేర్ల ధరల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలను ధ్రువీకరించలేము‘ అని సుప్రీం కోర్టుకు ఇచ్చిన 173 పేజీల నివేదికలో కమిటీ తెలిపింది.
అలాగే, పరస్పర సంబంధమున్న వర్గాల మధ్య లావాదేవీల్లోనూ, కనీస పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనల విషయంలోనూ సెబీ విఫలమైనట్లు చెప్పలేమని కమిటీ వివరించింది. సందేహాస్పద విదేశీ సంస్థల నుంచి అదానీ సంస్థల్లోకి నిధులు వచ్చాయన్న ఆరోపణలపై సెబీ 2020 నుంచి చేస్తున్న విచారణలో నిర్దిష్టంగా ఏమీ తేలలేదని కమిటీ తెలిపింది. ఈ నివేదికే తుది తీర్పు కాకపోయినప్పటికీ అదానీ సామ్రాజ్యానికి కాస్త ఊరట మాత్రం కలిగించేదేనని సంబంధిత వర్గాలు తెలిపాయి.
అదానీ గ్రూప్ ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ సంస్థల షేర్లు కుప్పకూలాయి. ఈ వ్యవహారంపై అటు సెబీ తన వంతుగా దర్యాప్తు చేస్తుండగా, సుప్రీంకోర్టు కూడా సమాంతరంగా ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని నియమించింది. సుప్రీం కోర్టు మాజీ జడ్జి జస్టిస్ ఏఎం సాప్రే సారథ్యంలోని ఈ కమిటీలో కేవీ కామత్, ఓపీ భట్, నందన్ నీలేకని వంటి దిగ్గజాలు ఉన్నారు.
స్టాక్స్ రయ్..
కమిటీ నివేదికతో శుక్రవారం అదానీ గ్రూప్ స్టాక్స్‌కు ఊతం లభించింది. గ్రూప్‌లోని 10 స్టాక్స్ 1.2 శాతం నుంచి 7 శాతం వరకు పెరిగాయి. అదానీ విల్మర్ 6.85%, అదానీ పవర్ 4.93%, అదానీ ట్రాన్స్‌మిషన్ 4.62%, అదానీ గ్రీన్ ఎనర్జీ 4.18%, అదానీ ఎంటర్‌ప్రైజెస్.. అదానీ పోర్ట్స్ చెరి 3.65 శాతం, ఎన్‌డీటీవీ 3.53%, అదానీ టోటల్ గ్యాస్ 3.05% లాభపడ్డాయి. అంబుజా సిమెంట్స్, ఏసీసీ చెరి 1 శాతం లాభపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment