ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (ఎఫ్‌పీఐ) విషయంలో అప్రమత్తంగా ఉండాలని క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఎఫ్‌పీఐ మార్గం ద్వారా స్టాక్ మార్కెట్ యాక్సెస్‌ను సులభతరం చేస్తామంటూ మోసగిస్తున్న ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
ఎఫ్‌పీఐలతో తమకు అనుబంధం ఉందని, ఎఫ్‌పీఐ లేదా సంస్థాగత ఖాతాల ద్వారా ట్రేడింగ్ అవకాశాలు కల్పిస్తామని కొన్ని మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్లను మభ్యపెడుతున్నాయని సెబీకి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ సెబీ ఈ హెచ్చరిక ప్రకటన విడుదల చేసింది.
మోసగిస్తున్నారిలా..
స్టాక్ మార్కెట్‌లో ఆన్‌లైన్ ట్రేడింగ్ కోర్సులు, సెమినార్‌లు, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా మోసగాళ్లు బాధితులను ప్రలోభపెడుతున్నారని, ఇందుకోసం వాట్సాప్ లేదా టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పాటు లైవ్ బ్రాడ్‌క్యాస్ట్‌ను ఉపయోగిస్తున్నారని సెబీ పేర్కొంది.
సెబీ నమోదిత ఎఫ్‌పీఐలకు చెందిన ఉద్యోగులు లేదా అనుబంధ సంస్థలుగా చెప్పుకొంటూ షేర్ల కొనుగోలు, ఐపీఓలకు సబ్‌స్క్రయిబ్ కోసం బాధితులతో యాప్‌లను డౌన్‌లోడ్ చేయిస్తున్నారని సెబీ తెలిపింది. ఇలాంటి మోసాలు చేయడానికి తప్పుడు పేర్లతో నమోదైన మొబైల్ నంబర్‌లను ఉపయోగిస్తాస్తున్నారని వెల్లడించింది. నిబంధనల ప్రకారం.. దేశంలో నివసిస్తున్న పౌరులకు ఎఫ్‌పీఐ పెట్టుబడి మార్గం అందుబాటులో ఉండదు. అయితే దీనికి కొన్ని పరిమిత మినహాయింపులు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment