ప్రస్తుత కేలండర్ ఏడాది(2024)లో ప్రైమరీ మార్కెట్లు జోరు చూపుతున్నాయి. గత వారం 4 కంపెనీలు ఐపీవోలు చేపట్టగా.. ఈ వారం మరో 4 కంపెనీల ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. ఈ బాటలో తాజాగా లక్ష్మీ డెంటల్‌కు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. మరో 2 కంపెనీలు లిస్టింగ్‌కు అనుమతించమంటూ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేశాయి. మరోపక్క ఎన్లాన్ హెల్త్‌కేర్ అక్టోబర్‌లో దాఖలు చేసిన ప్రాస్పెక్టస్‌ను సెబీ తాజాగా వెనక్కి పంపింది. వివరాలు చూద్దాం..
ఆనంద్ రాఠీ
ఆనంద్ రాఠీ గ్రూప్ బ్రోకరేజీ కంపెనీ.. ఆనంద్ రాఠీ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా తాజా ఈక్విటీ జారీ ద్వారా రూ. 745 కోట్లు సమీకరించే ప్రణాళికలు వేసింది. వీటిలో రూ. 550 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్‌సహా సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. బ్రోకింగ్, మార్జిన్ ట్రేడింగ్, ఫైనాన్షియల్ ప్రొడక్టుల పంపిణీ తదితర విస్తారిత ఫైనాన్షియల్ సర్వీసులను ఆనంద్ రాఠీ బ్రాండుతో కంపెనీ ఆఫర్ చేస్తోంది. సంస్థాగత ఇన్వెస్టర్లతోపాటు రిటైల్, హెచ్‌ఎన్‌ఐలకు సేవలు సమకూర్చుతోంది. గతేడాది(2023–24) ఆదాయం 46 శాతం జంప్‌చేసి రూ. 682 కోట్లను తాకింది. నికర లాభం మరింత అధికంగా దాదాపు రెట్టింపై రూ. 77 కోట్లను దాటింది. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ. 442 కోట్ల ఆదాయం, రూ. 64 కోట్ల నికర లాభం అందుకుంది.
జీకే ఎనర్జీ
సౌర విద్యుత్ ఆధారిత వ్యవసాయ వాటర్ పంప్ సిస్టమ్స్ కంపెనీ.. జీకే ఎనర్జీ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో భాగంగా రూ. 500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 84 లక్షల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 422 కోట్లు దీర్ఘకాలిక వర్కింగ్ క్యాపిటల్‌కు, మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది. కంపెనీ ప్రధానంగా సౌర విద్యుత్ వ్యవసాయ వాటర్ పంప్ సిస్టమ్స్‌కు సంబంధించి ఈపీసీ సేవలు అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పీఎం–కేయూఎస్‌యూఎం పథకంలో భాగంగా సర్వీసులు సమకూర్చుతోంది. జల్‌జీవన్ మిషన్‌కింద నీటి నిల్వ, పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేస్తోంది. 2024 అక్టోబర్‌కల్లా రూ. 759 కోట్ల ఆర్డర్‌బుక్‌ను సాధించింది. గతేడాది(2023–24) ఆదాయం 44 శాతం ఎగసి రూ. 411 కోట్లను తాకింది. నికర లాభం మరింత అధికంగా రూ. 10 కోట్ల నుంచి రూ. 36 కోట్లకు జంప్‌చేసింది. ఈ బాటలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) ఏప్రిల్–సెప్టెంబర్‌లో రూ. 422 కోట్ల ఆదాయం, రూ. 51 కోట్ల నికర లాభం అందుకుంది.
లక్ష్మీ డెంటల్ రెడీ
సెప్టెంబర్‌లో ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన లక్ష్మీ డెంటల్ తాజాగా అనుమతి పొందింది. ప్రాస్పెక్టస్ ప్రకారం ఐపీవోలో భాగంగా రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.28 కోట్ల షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థ బిజ్‌డెంట్ డివైసెస్‌లో పెట్టుబడులకు, కొత్త మెషీనరీ కొనుగోలుకి, రుణ చెల్లింపులు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. ఎండ్‌టుఎండ్ సమీకృత డెంటల్ ప్రొడక్టుల కంపెనీ ఇది. ఎలైనర్ సొల్యూషన్స్, పీడియాట్రిక్ డెంటల్ తదితర పలు ఉత్పత్తులను రూపొందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment