బాబోయ్.. రూపాయ్! | Rupee hits new low of 68.85 vs dollar, logs biggest single-day loss | Sakshi
Sakshi News home page

బాబోయ్.. రూపాయ్!

Published Thu, Aug 29 2013 4:59 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM

బాబోయ్.. రూపాయ్!

బాబోయ్.. రూపాయ్!

  • అగాధానికి దేశీ కరెన్సీ...
  •  ఒక్కరోజులో అతిపెద్ద పతనం; 256 పైసలు క్రాష్
  •  కొత్త ఆల్‌టైమ్ కనిష్టం... 68.80కి కుదేల్
  •  క్రూడ్ ధరల సెగ, క్యాడ్ ఆందోళనలు,  విదేశీ పెట్టుబడుల రివర్స్‌గేర్‌తో బెంబేలు
  •  దిగుమతిదారుల నుంచి భారీ డాలర్ డిమాండ్
  •  బిత్తర చూపులు చూస్తున్న ఆర్‌బీఐ, ప్రభుత్వం!
  •  
     1 డాలరు = 69 రూపాయలు
     60.. 62.. 64... 66... 68.. ఇవేవో  వైకుంఠపాళిలో నిచ్చెనమెట్లు కాదు. పాతాళానికి కాళ్లుచాచిన రూపాయి పాట్లు. దేశ ఆర్థిక దుస్థితికి తగ్గట్టే.. కరెన్సీ విలువ కూడా కకావికలం అవుతోంది. తుక్కుతుక్కుగా మారుతోంది. రూపాయిని పెంచడం, తగ్గించడం మా చేతుల్లోలేదని, చికిత్సకు స్పందించేదాకా ఓపికపట్టాలంటూ స్వయంగా ఆర్థిక మంత్రి చిదంబరమే చేతులెత్తేయడం ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ను మరింత దిగజార్చింది. ముడిచమురు ధరల మంట ఇతరత్రా కారణాలతో బుధవారం ఒకేరోజు 256 పైసలు కుప్పకూలి.. అతిపెద్ద పతనాన్ని నమోదుచేసింది. 69 దరిదాపుల్లోకి పడిపోయి కొత్త ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని తాకింది.
     
    ముంబై: రోజురోజుకీ రూపాయిని చిమ్మచీకట్లు చుట్టుముట్టేస్తున్నాయి. వరుసగా మూడోరోజూ దేశీ కరెన్సీ కుప్పకూలింది. డాలరుతో రూపాయి మారకం విలువ బుధవారం చరిత్రలోనే అతిపెద్ద ఒక్కరోజు పతనంతో విలవిల్లాడింది. సిరియాలో యుద్ధభయాలతో ముడిచమురు ధరలకు అంతర్జాతీయంగా రెక్కలురావడం... కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఆందోళనలు రూపాయికి తూట్లుపొడిచాయి. దీనికితోడు ఆర్‌బీఐ జోక్యానికి కూడా స్పందించకపోవడం, విదేశీ పెట్టుబడుల తిరోగమనం యథేచ్ఛగా కొనసాగుతుండటం కూడా దేశీ కరెన్సీని చివురుటాకులా వణికించాయి. దీంతో 256 పైసలు(3.86%) కుప్పకూలిన రూపాయి.. చివరకు 68.80 వద్ద స్థిరపడింది.ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో బుధవారం రూపాయి ట్రేడింగ్ అత్యంత బలహీనంగా 66.90 వద్ద(క్రితం ముగింపు 66.24) వద్ద మొదలైంది.
     
     ఆ తర్వాత 67, 68 స్థాయిలను కూడా కోల్పోయి 68.75కు జారుకుంది. మధ్యాహ్నం ఒకానొకదశలో ఆర్‌బీఐ జోక్యం చేసుకున్నట్లు ఫారెక్స్ డీలర్లు చెబుతున్నారు. దీంతో కొంత రికవరీ అయినా.. మళ్లీ పతనబాటలోకి మళ్లింది. క్రూడ్ ధరల పెరుగుదలతో చమురు దిగుమతిదారుల నుంచి, అదేవిధంగా బ్యాంకుల నుంచి డాలర్లకు డిమాండ్ కొనసాగడం రూపాయిపై ఒత్తిడిని తీవ్రతరం చేసింది. ఒకానొక దశలో 68.85ను తాకింది. చివరకు 68.80 వద్ద స్థిరపడింది. ఇక బ్రిటిష్ పౌండ్‌తో పోలిస్తే రూపాయి విలువ క్రితం ముగింపు 102.80 నుంచి భారీగా క్షీణించి 106.33కు పడిపోయింది.
     
     3 రోజుల్లో 9% ఫట్..: వరుసగా మూడోరోజూ రూపాయి అత్యంత ఘోరంగా పడిపోయింది. సోమవారం 110 పైసలు, మంగళవారం 194 పైసలు, బుధవారం 256 పైసలు మొత్తంమీద మూడు రోజుల్లో 560 పైసలు(8.86%) ఆవిరైంది. ఇక ఆగస్టులో ఇప్పటిదాకా 840 పైసలు (సుమారు 14%) కుప్పకూలడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే 1,381 పైసలు(25%) క్షీణించింది.
     
     70-72 దిశగా...: డాలర్లకు మార్కెట్లో భారీగా కొరత నేపథ్యంలో రూపాయి విలువ 70-72 స్థాయికి పడిపోవచ్చనేది మార్కెట్ వర్గాల అభిప్రాయం. ముడిచమురు దిగుమతుల భారం, విదేశీ పెట్టుబడుల రివర్స్‌గేర్‌తో రూపా యి  70 కిందికి జారిపోవచ్చని అల్పరి ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ ప్రమిత్ బ్రహ్మభట్ చెప్పారు.
     
     కొత్త భయాలు..
     పౌరులపై రసాయన ఆయుధాలను ప్రయోగిస్తున్నట్లు ఆరోపణ లు ఎదుర్కొంటున్న సిరియాపై పశ్చిమ దేశాలు సైనికదాడి చేయొచ్చనే భయాలతో ముడిచమురు ధరలు మండుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 117 డాలర్ల పైకి దూసుకెళ్లింది. అసలే బిక్కుబిక్కుమంటున్న రూపాయికి క్రూడ్ సెగ మరింత మంట పెడుతోంది. దేశంలో 80 శాతం ముడిచమురు అవసరాలను దిగుమతులద్వారానే చేసుకోవాల్సిరావడం ఈ దుస్థితికి కారణం.  మరోపక్క, ఆహార భద్రత బిల్లుకు లోక్‌సభ ఆమోదంతో సబ్సిడీ భారం ఎగబాకి ద్రవ్యలోటు పెరిగిపోతుందనే భయాలు కొత్తగా వచ్చిచేరాయి.    బుధవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మరో 1,120 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించేశారు. గత 8 రోజుల్లోనే బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6,800 కోట్లు) స్టాక్స్‌ను వారు వదిలించుకోవడం విదేశీ నిధుల తిరోగమనానికి నిదర్శనం.
     
     అసంబద్ధ సెంటిమెంటే కారణం: ఆర్థిక శాఖ
     రూపాయి అడ్డగోలు పతనానికి ఇన్వెస్టర్లలో నెలకొన్న అసంబద్ధ సెంటిమెంటే కారణమని ఆర్థిక శాఖ పేర్కొంది. భయాందోళనలకు గురవ్వొద్దంటూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ చెప్పారు. కరెన్సీ మార్కెట్‌లో డెరివేటివ్స్ ట్రేడింగ్‌ను నిషేధించే ప్రణాళికలేవీ ప్రభుత్వానికి లేవనిస్పష్టం చేశారు. మరోవైపు, రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసే దిశగా ఆర్‌బీఐ మరిన్ని చర్యలు చేపట్టింది. చమురు కంపెనీల డాలర్ల అవసరాల కోసం స్పెషల్ విండో ప్రారంభించింది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు ప్రతి నెలా 8.5 బిలియన్ డాలర్లు అవసరమవుతున్నాయి.
     
     పతనం షాక్ ఇదీ..
     

    •    డాలరుతో రూపాయి మారకం విలువ ఈ ఏడాది
    •      మే నెల నుంచి చూస్తే  28% కుప్పకూలింది.
    •    గతేడాది ఆగస్టు 29న 46.15గా ఉన్న రూపాయి.. ఈ నెల 28కి అంటే ఏడాదిలో 68.80కి పడిపోయింది. అంటే దాదాపు 50 శాతం ఢమాల్ మంది.
    •    ఈ ఏడాది ఆరంభం(జనవరి) నుంచి చూస్తే దేశీ కరెన్సీ 25 శాతం కుప్పకూలింది.
    •    ఈ నెల ఒక్కనెలలోనే 14 శాతం దిగజారింది.
    •    అంతక్రితం 1991 జూలైలో ఒక్క నెలలో 22 శాతం దేశీ కరెన్సీ క్రాష్ అయింది. 1992 ఏడాది  మార్చి నెలలో 11.5 శాతం  క్షీణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement