Rupee vs Dollar
-
4 నెలల గరిష్టానికి రూపాయి
ముంబై, సాక్షి: వారాంతాన ఒడిదొడుకులకు లోనైన దేశీ కరెన్సీ హుషారుగా ప్రారంభమైంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 19 పైసలు పుంజుకుని 72.93 వద్ద ప్రారంభమైంది. డాలరుతో మారకంలో తదుపరి 72.90 వరకూ బలపడింది. ఇది నాలుగు నెలల గరిష్టంకాగా.. ఒక దశలో 73.03 వరకూ బలహీనపడింది కూడా. గత వారం పలు దేశాల కరెన్సీ మార్కెట్లకు సెలవుకావడంతో స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య 73.12 వద్ద ముగిసింది. ఇటీవల ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 32 నెలల కనిష్టం 90 దిగువకు చేరిన విషయం విదితమే. ఇంతక్రితం 2018 ఏప్రిల్‌లో మాత్రమే డాలరు ఇండెక్స్ ఈ స్థాయిలో కదిలినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. (2020: ఎఫ్‌పీఐల పెట్టుబడుల స్పీడ్) వ్యాక్సిన్ల ఎఫెక్ట్ కోవిడ్-19 కట్టడికి వీలుగా వారాంతాన ప్రభుత్వం ఒకేసారి రెండు వ్యాక్సిన్లకు ఆమోదముద్ర వేయడంతో దేశీ కరెన్సీకి జోష్ వచ్చినట్లు ఫారెక్స్ నిపుణులు తెలియజేశారు. దీంతో ఆర్థిక వ్యవస్థ వేగవంత రికవరీని సాధించగలదన్న అంచనాలు పెరిగినట్లు తెలియజేశారు. దీనికితోడు అక్టోబర్ 1 నుంచీ చూస్తే దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో సుమారు 20 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడం రూపాయికి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు పేర్కొన్నారు. నవంబర్‌లో దేశీ ఈక్విటీలలో ఎఫ్‌పీఐలు గత 12 ఏళ్లలోలేని విధంగా 8.1 బిలియన్ డాలర్లను పెట్టుబడులకు తరలించిన విషయం విదితమే. మరోపక్క డిసెంబర్లో రికార్డ్ స్థాయి జీఎస్టీ వసూళ్లు, కరెంట్ ఖాతా మిగులు వంటి అంశాలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. -
రెండో రోజూ రూపాయి పరుగు
ముంబై, సాక్షి: వరుసగా రెండో రోజు దేశీ కరెన్సీ జోరు చూపుతోంది. ప్రస్తుతం డాలరుతో మారకంలో 25 పైసలు బలపడి 73.06 వద్ద ట్రేడవుతోంది. ఇది రెండున్నర నెలల గరిష్టంకాగా.. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో తొలుత 15 పైసలు పుంజుకుని 73.16 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఒక దశలో 73.05 వరకూ బలపడింది. బుధవారం సైతం డాలరుతో మారకంలో రూపాయి 11 పైసలు లాభపడి 73.31 వద్ద స్థిరపడింది. చదవండి: (2020: ఎఫ్‌పీఐల పెట్టుబడుల స్పీడ్) కారణాలేవిటంటే.. ఇటీవల కొద్ది రోజులుగా డాలరు ఇండెక్స్ బలహీనపడుతోంది. తాజాగా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో 90 దిగువకు చేరింది. 89.64 వద్ద 32 నెలల కనిష్టాన్ని తాకింది. ఇంతక్రితం 2018 ఏప్రిల్‌లో మాత్రమే డాలరు ఇండెక్స్ ఈ స్థాయిలో కదిలినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ఆసియా దేశాల కరెన్సీలు పుంజుకోవడం సెంటిమెంటు బలపడేందుకు దోహదం చేసినట్లు తెలియజేశాయి. ప్రధానంగా చైనా తయారీ రంగం జోరందుకోవడంతో డాలరుతో మారకంలో యువాన్ 6.54ను తాకింది. దేశీ ఎఫెక్ట్ సెప్టెంబర్‌కల్లా కరెంట్ ఖాతా 15.5 బిలియన్ డాలర్ల మిగులుకు చేరినట్లు ఆర్బీఐ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా దేశీ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పెట్టుబడుల వెల్లువెత్తడం వంటి అంశాలు రూపాయికి ప్రోత్సాహాన్నిస్తున్నట్లు నిపుణులు తెలియజేశారు. దేశీ ఈక్విటీ మార్కెట్లో గత 12 ఏళ్లలోలేని విధంగా ఎఫ్‌పీఐలు నవంబర్‌లో 8 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయగా.. డిసెంబర్‌లోనూ 5 బిలియన్ డాలర్లకుపైగా పంప్చేసిన సంగతి తెలిసిందే. ఈ బాటలో 2020లో ఇప్పటివరకూ 22.6 బిలయన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! -
రూపాయి డీలా.. ఎందుకు ఇలా?
ముంబై: ఆర్థిక రికవరీ సంకేతాలు బలంగా కనిపిస్తున్న నేపథ్యంలో దేశీ కరెన్సీ మార్చికల్లా జోరందుకోగలదని రీసెర్చ్ సంస్థ నోమురా హోల్డింగ్స్ అంచనా వేసింది. వెరసి డాలరుతో మారకంలో రూపాయి తిరిగి కోవిడ్-19కు ముందు స్థాయి 72కు చేరుకోగలదని అభిప్రాయపడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రూపాయి 72 స్థాయిలో ట్రేడయ్యింది. ఇందుకు 2004 తదుపరి కరెంట్ ఖాతాలోటు నుంచి బయటపడటంతోపాటు మిగులుదిశగా పయనించడాన్ని ప్రస్తావించింది. ఇటీవల చమురు ధరలు పతనంకావడం, బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ పరిస్థితులు మెరుగుపడటం రూపాయికి బలాన్నివ్వగలవని పేర్కొంది. నేలచూపులో.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహాయ ప్యాకేజీ ప్రకటన, పసిడి, ముడిచమురు ధరల పెరుగుదల నేపథ్యంలో తాజాగా దేశీ కరెన్సీ వెనకడుగు వేస్తోంది. ప్రస్తుతం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 33 పైసలు (0.4 శాతం) కోల్పోయి 74.70ను తాకింది. ఇది రెండు నెలల కనిష్టం కాగా.. తొలుత 7 పైసలు తక్కువగా 74.44 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి మరింత క్షీణించింది. బుధవారం కన్సాలిడేషన్ బాటలో సాగిన రూపాయి 74.37 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఇప్పటివరకూ రూపాయి 4.2 శాతం నష్టపోవడం గమనార్హం! -
కొనసాగుతున్న రూపాయి పతనం
గత వారం సాంకేతికంగా కీలకమైన 74 ఎగువకు క్షీణించిన దేశీ కరెన్సీ మరోసారి డీలాపడింది. ప్రస్తుతం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 37 పైసలు(0.4 శాతం) కోల్పోయి 74.78ను తాకింది. ఇది రెండు నెలల కనిష్టంకాగా.. మంగళవారం రూపాయి కన్సాలిడేషన్ బాటలో ఫ్లాట్‌గా ముగిసింది. దేశీ ఈక్విటీ మార్కెట్ హైజంప్ చేసినప్పటికీ అక్కడక్కడే అన్నట్లుగా 74.41 వద్ద ముగిసింది. యూఎస్ అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 94 దిగువకు బలపడింది. మరోపక్క అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ అంశాల నేపథ్యంలో ఇటీవల రూపాయి బలహీనపడినట్లు ఫారెక్స్ వర్గాలు తెలియజేశాయి. సమీక్షలో భాగంగా ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించే వీలున్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా చర్యలు ప్రకటించవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అభిప్రాయపడింది. రూపాయి సమీప భవిష్యత్‌లో 75.20- 74.20 మధ్య ప్రతికూల ధోరణిలో కదిలే వీలున్నట్లు అంచనా వేసింది. -
రూపాయి బోర్లా- 74 ఎగువకు
సెకండ్ వేవ్‌లో భాగంగా పలు యూరోపియన్ దేశాలతోపాటు.. యూఎస్‌లోనూ కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో దేశీ కరెన్సీకి సైతం ఆ సెగ తగులుతోంది. తాజాగా డాలరుతో మారకంలో సాంకేతికంగా కీలకమైన 74 ఎగువకు చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 17 పైసలు కోల్పోయి 74.05ను తాకింది. ఆగస్ట్ 27 తదుపరి ఇది కనిష్టంకాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో ఇటీవల డాలరు బలపడుతూ వస్తున్న విషయం విదితమే. తాజాగా డాలరు 0.3 శాతం పుంజుకుని 93.41ను తాకింది. ఇది రూపాయిని దెబ్బతీసినట్లు ఫారెక్స్ వర్గాలు తెలియజేశాయి. బుధవారం డాలరుతో మారకంలో రూపాయి 73.88 వద్ద ముగిసింది. ఇతర అంశాలూ.. కోవిడ్-19 భయాలతో స్టాక్ మార్కెట్లు పతనంకావడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు వంటి అంశాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా వైరస్ కట్టడికి వీలుగా బ్రిటన్ బాటలో తాజాగా జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలలోనూ ఆంక్షలు విధిస్తుండటంతో ఆర్థిక వ్యవస్థ రికవరీకి దెబ్బతగిలనున్న అంచనాలు బలపడుతున్నాయి. దీనికితోడు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మరో భారీ ప్యాకేజీని ప్రకటించే అంశంలో యూఎస్ కాంగ్రెస్ విఫలంకావడం ఇన్వెస్టర్లను నిరాశపరచినట్లు తెలియజేశారు. కాగా.. సమీపకాలంలో రూపాయి 73.40- 74.05 మధ్య ప్రతికూలంగా కదలవచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. -
3 నెలల గరిష్టానికి రూపాయి
డాలరుతో మారకంలో ఇటీవల బలహీనపడుతూ వస్తున్న దేశీ కరెన్సీ నేటి ట్రేడింగ్‌లో ఒక్కసారిగా పుంజుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 9 పైసలు బలపడి 75.51 వద్ద ప్రారంభమైంది. తదుపరి ఈక్విటీ మార్కెట్లు జోరందుకోవడం, దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌పీఐల పెట్టుబడులు వంటి అంశాలు రూపాయికి జోష్‌నివ్వడంతో భారీగా లాభపడింది. డాలరుతో మారకంలో 59 పైసలు(0.8 శాతం) జంప్‌చేసి 75.01కు చేరింది. వెరసి ఏప్రిల్ 23 తదుపరి ఒకే రోజు అత్యధికంగా బలపడింది. ఒక దశలో 74.96 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. తద్వారా మార్చి 27నాటి 75 స్థాయికి చేరింది. బుధవారం డాలరుతో మారకంలో రూపాయి 75.60 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 97కు నీరసించడం కూడా రూపాయిపై సానుకూల ప్రభావం చూపినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. గత నెలలో యూరోజోన్, యూకేల తయారీ రంగం అంచనాలను మించిన వార్తలతో డాలరుతో మారకంలో యూరోతోపాటు.. యూకే పౌండ్ పుంజుకున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. -
80 స్థాయికి రూపాయి విలువ!
డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ బలహీనతలు కొనసాగే వీలున్నట్లు ఫారెక్స్ నిపుణులు వెంకట్ త్యాగరాజన్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవలే రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్)లో ఫారెక్స్ హెడ్ బాధ్యతల నుంచి రిటైర్ అయిన వెంకట్ ఇందుకు పలు అంశాలు కారణంకానున్నట్లు చెబుతున్నారు. కోవిడ్-19 ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడనున్న నేపథ్యంలో రూపాయి నీరసించనున్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో సమీప భవిష్యత్‌లో డాలరుతో మారకంలో రూపాయి విలువ 80 స్థాయికి వెనకడుగు వేయవచ్చని అభిప్రాయపడ్డారు. కోవిడ్-19 కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ నాలుగు దశాబ్దాల తదుపరి ఈ ఏడాది క్షీణతను చవిచూడనున్నట్లు అంచనాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఇతర అంశాలు రూపాయి మారకపు విలువపై జీడీపీ మందగమనానికితోడు ఇతర కారణాలు సైతం ప్రభావం చూపవచ్చని వెంకట్ వివరించారు. 26ఏళ్లుగా కరెన్సీ మార్కెట్లో ట్రేడింగ్ నిర్వహించిన వెంకట్ ఆర్ఐఎల్ ఫారెక్స్ హెడ్‌గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. దేశంలోనే అతిపెద్ద కార్పొరేట్ ట్రెజరీను ఆర్ఐఎల్ నిర్వహించే విషయం విదితమే. రూపాయి మారకపు విలువపై ఆర్థిక వృద్ధి, కరెంట్ ఖాతా, బ్యాలన్స్ ఆఫ్ పేమెంట్స్ వంటి అంశాలు ప్రభావం చూపుతుంటాయి. అంతేకాకుండా ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు కదలికలు సైతం రూపాయిని ప్రభావితం చేస్తాయని ఫారెక్స్ వర్గాలు తెలియజేశాయి. ఈ ఏడాది డీలా ఈ ఏడాది ఆసియా కరెన్సీలలోకెల్లా రూపాయి అత్యంత బలహీనపడినప్పటికీ ఇటీవల దేశీ స్టాక్స్‌లో విదేశీ పెట్టుబడులు ప్రవహిస్తుండటంతో కొంతమేర బలాన్ని సంతరించుకుంది. దీనికితోడు రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో విదేశీ దిగ్గజాలు భారీ పెట్టుబడులకు దిగడం అనుకూలిస్తున్నట్లు ఫారెక్స్ నిపుణులు పేర్కొన్నారు. గ్లోబల్ ఫండ్స్ 4.5 బిలియన్ డాలర్లను ఈ క్వార్టర్లో స్టాక్స్ కొనుగోలుకి వినియోగించినట్లు నిపుణులు తెలియజేశారు. ఇటీవల ఆర్ఐఎల్ చేపట్టిన రైట్స్ ఇష్యూ, కొటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్‌లో వాటా కొనుగోలు తదితరాలకు ఈ పెట్టుబడులు ప్రవహించినట్లు పేర్కొన్నారు. మరోపక్క విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐలు) మార్గంలో 15 బిలియన్ డాలర్లకుపైగా నిధులు రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లోకి ప్రవహించినట్లు వివరించారు. 6 శాతం డౌన్ డాలరుతో మారకంలో రూపాయి విలువ 2020లో ఇప్పటివరకూ సుమారు 6 శాతం క్షీణించింది. ఇతర ఆసియా దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయే అత్యధికంగా నీరసించింది. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీలుసహా ఫైనాన్షియల్ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆర్థిక వృద్ధి బలహీనపడుతున్న తరుణంలో కఠిన పరపతి విధానాలకు వీలుండదని వెంకట్ పేర్కొన్నారు. కొన్ని సందర్భాలలో కరెన్సీ విలువ వెనకడుగు వేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరవచ్చని తెలియజేశారు. ఇటీవల ఫిచ్, మూడీస్ ఇన్వెస్టర్స్ తదితర దిగ్గజాలు దేశ సావరిన్ రేటింగ్ ఔట్‌లుక్‌ను డౌన్‌గ్రేడ్ చేశాయి. వ్యవస్థలో రుణాల స్థాయి అధికంగా ఉండటంతోపాటు.. ప్రయివేట్ రంగంలో రుణ చెల్లింపులు భారంగా మారుతున్నాయని.. దీంతో బ్యాంకింగ్ రంగం ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నట్లు వెంకట్ వివరించారు. డాలరుతో మారకంలో రూపాయి ఏప్రిల్‌లో 76.90 వద్ద చరిత్రాత్మక కనిష్టాన్ని తాకగా.. కొద్ది రోజులుగా 75 స్థాయిలో ట్రేడవుతోంది. -
రూపాయి 8 నెలల కనిష్టం
ముంబై: డాలరుతో మారకంలో వరుసగా ఐదో రోజు నష్టపోయిన రూపాయి ఎనిమిదిన్నర నెలల కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 22 పైసలు బలహీనపడి 61.96 వద్ద ముగిసింది. దేశీ స్టాక్ మార్కెట్లు నష్టపోవడం, దిగుమతిదారుల నుంచి డాలరుకి డిమాండ్ పుంజుకోవడం వంటి అంశాలు రూపాయిని దెబ్బకొట్టినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. విదే శీ పెట్టుబడులు మందగించడం కూడా ఇందుకు జతకలిసినట్లు తెలిపారు. వెరసి ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్రితం ముగింపు 61.70తో పోలిస్తే 61.80 వద్ద బలహీనంగా మొదలైంది. ఆపై ఒక దశలో 61.78 వరకూ బలపడింది. చివరికి 0.4% నష్టంతో 61.96 వద్ద ముగిసింది. 2014 మార్చి 3 తరువాత రూపాయికి ఇదే కనిష్టస్థాయి. కాగా, అంతర్జాతీయ మార్కెట్లోనూ ఆరు ప్రధాన కరెన్సీలతో ట్రేడింగ్‌లో డాలరు స్థిరంగా ట్రేడవుతోంది. అక్టోబర్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేపట్టిన పాలసీ సమీక్ష వివరాలు వెల్లడికానున్న నేపథ్యంలో డాలరు బలాన్ని పుంజుకోవడం గమనించదగ్గ అంశమని నిపుణులు వ్యాఖ్యానించారు. -
బాబోయ్.. రూపాయ్!
అగాధానికి దేశీ కరెన్సీ... ఒక్కరోజులో అతిపెద్ద పతనం; 256 పైసలు క్రాష్ కొత్త ఆల్‌టైమ్ కనిష్టం... 68.80కి కుదేల్ క్రూడ్ ధరల సెగ, క్యాడ్ ఆందోళనలు, విదేశీ పెట్టుబడుల రివర్స్‌గేర్‌తో బెంబేలు దిగుమతిదారుల నుంచి భారీ డాలర్ డిమాండ్ బిత్తర చూపులు చూస్తున్న ఆర్బీఐ, ప్రభుత్వం! 1 డాలరు = 69 రూపాయలు 60.. 62.. 64... 66... 68.. ఇవేవో వైకుంఠపాళిలో నిచ్చెనమెట్లు కాదు. పాతాళానికి కాళ్లుచాచిన రూపాయి పాట్లు. దేశ ఆర్థిక దుస్థితికి తగ్గట్టే.. కరెన్సీ విలువ కూడా కకావికలం అవుతోంది. తుక్కుతుక్కుగా మారుతోంది. రూపాయిని పెంచడం, తగ్గించడం మా చేతుల్లోలేదని, చికిత్సకు స్పందించేదాకా ఓపికపట్టాలంటూ స్వయంగా ఆర్థిక మంత్రి చిదంబరమే చేతులెత్తేయడం ఇన్వెస్టర్లలో సెంటిమెంట్‌ను మరింత దిగజార్చింది. ముడిచమురు ధరల మంట ఇతరత్రా కారణాలతో బుధవారం ఒకేరోజు 256 పైసలు కుప్పకూలి.. అతిపెద్ద పతనాన్ని నమోదుచేసింది. 69 దరిదాపుల్లోకి పడిపోయి కొత్త ఆల్‌టైమ్ కనిష్ట స్థాయిని తాకింది. ముంబై: రోజురోజుకీ రూపాయిని చిమ్మచీకట్లు చుట్టుముట్టేస్తున్నాయి. వరుసగా మూడోరోజూ దేశీ కరెన్సీ కుప్పకూలింది. డాలరుతో రూపాయి మారకం విలువ బుధవారం చరిత్రలోనే అతిపెద్ద ఒక్కరోజు పతనంతో విలవిల్లాడింది. సిరియాలో యుద్ధభయాలతో ముడిచమురు ధరలకు అంతర్జాతీయంగా రెక్కలురావడం... కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఆందోళనలు రూపాయికి తూట్లుపొడిచాయి. దీనికితోడు ఆర్బీఐ జోక్యానికి కూడా స్పందించకపోవడం, విదేశీ పెట్టుబడుల తిరోగమనం యథేచ్ఛగా కొనసాగుతుండటం కూడా దేశీ కరెన్సీని చివురుటాకులా వణికించాయి. దీంతో 256 పైసలు(3.86%) కుప్పకూలిన రూపాయి.. చివరకు 68.80 వద్ద స్థిరపడింది.ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో బుధవారం రూపాయి ట్రేడింగ్ అత్యంత బలహీనంగా 66.90 వద్ద(క్రితం ముగింపు 66.24) వద్ద మొదలైంది. ఆ తర్వాత 67, 68 స్థాయిలను కూడా కోల్పోయి 68.75కు జారుకుంది. మధ్యాహ్నం ఒకానొకదశలో ఆర్బీఐ జోక్యం చేసుకున్నట్లు ఫారెక్స్ డీలర్లు చెబుతున్నారు. దీంతో కొంత రికవరీ అయినా.. మళ్లీ పతనబాటలోకి మళ్లింది. క్రూడ్ ధరల పెరుగుదలతో చమురు దిగుమతిదారుల నుంచి, అదేవిధంగా బ్యాంకుల నుంచి డాలర్లకు డిమాండ్ కొనసాగడం రూపాయిపై ఒత్తిడిని తీవ్రతరం చేసింది. ఒకానొక దశలో 68.85ను తాకింది. చివరకు 68.80 వద్ద స్థిరపడింది. ఇక బ్రిటిష్ పౌండ్తో పోలిస్తే రూపాయి విలువ క్రితం ముగింపు 102.80 నుంచి భారీగా క్షీణించి 106.33కు పడిపోయింది. 3 రోజుల్లో 9% ఫట్..: వరుసగా మూడోరోజూ రూపాయి అత్యంత ఘోరంగా పడిపోయింది. సోమవారం 110 పైసలు, మంగళవారం 194 పైసలు, బుధవారం 256 పైసలు మొత్తంమీద మూడు రోజుల్లో 560 పైసలు(8.86%) ఆవిరైంది. ఇక ఆగస్టులో ఇప్పటిదాకా 840 పైసలు (సుమారు 14%) కుప్పకూలడం గమనార్హం. ఇక ఈ ఏడాది ఆరంభం నుంచి చూస్తే 1,381 పైసలు(25%) క్షీణించింది. 70-72 దిశగా...: డాలర్లకు మార్కెట్లో భారీగా కొరత నేపథ్యంలో రూపాయి విలువ 70-72 స్థాయికి పడిపోవచ్చనేది మార్కెట్ వర్గాల అభిప్రాయం. ముడిచమురు దిగుమతుల భారం, విదేశీ పెట్టుబడుల రివర్స్‌గేర్‌తో రూపా యి 70 కిందికి జారిపోవచ్చని అల్పరి ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ ప్రమిత్ బ్రహ్మభట్ చెప్పారు. కొత్త భయాలు.. పౌరులపై రసాయన ఆయుధాలను ప్రయోగిస్తున్నట్లు ఆరోపణ లు ఎదుర్కొంటున్న సిరియాపై పశ్చిమ దేశాలు సైనికదాడి చేయొచ్చనే భయాలతో ముడిచమురు ధరలు మండుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర 117 డాలర్ల పైకి దూసుకెళ్లింది. అసలే బిక్కుబిక్కుమంటున్న రూపాయికి క్రూడ్ సెగ మరింత మంట పెడుతోంది. దేశంలో 80 శాతం ముడిచమురు అవసరాలను దిగుమతులద్వారానే చేసుకోవాల్సిరావడం ఈ దుస్థితికి కారణం. మరోపక్క, ఆహార భద్రత బిల్లుకు లోక్‌సభ ఆమోదంతో సబ్సిడీ భారం ఎగబాకి ద్రవ్యలోటు పెరిగిపోతుందనే భయాలు కొత్తగా వచ్చిచేరాయి. బుధవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు మరో 1,120 కోట్ల విలువైన స్టాక్స్‌ను విక్రయించేశారు. గత 8 రోజుల్లోనే బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6,800 కోట్లు) స్టాక్స్‌ను వారు వదిలించుకోవడం విదేశీ నిధుల తిరోగమనానికి నిదర్శనం. అసంబద్ధ సెంటిమెంటే కారణం: ఆర్థిక శాఖ రూపాయి అడ్డగోలు పతనానికి ఇన్వెస్టర్లలో నెలకొన్న అసంబద్ధ సెంటిమెంటే కారణమని ఆర్థిక శాఖ పేర్కొంది. భయాందోళనలకు గురవ్వొద్దంటూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అరవింద్ మాయారామ్ చెప్పారు. కరెన్సీ మార్కెట్లో డెరివేటివ్స్ ట్రేడింగ్‌ను నిషేధించే ప్రణాళికలేవీ ప్రభుత్వానికి లేవనిస్పష్టం చేశారు. మరోవైపు, రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసే దిశగా ఆర్బీఐ మరిన్ని చర్యలు చేపట్టింది. చమురు కంపెనీల డాలర్ల అవసరాల కోసం స్పెషల్ విండో ప్రారంభించింది. ప్రస్తుతం ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు ప్రతి నెలా 8.5 బిలియన్ డాలర్లు అవసరమవుతున్నాయి. పతనం షాక్ ఇదీ.. డాలరుతో రూపాయి మారకం విలువ ఈ ఏడాది మే నెల నుంచి చూస్తే 28% కుప్పకూలింది. గతేడాది ఆగస్టు 29న 46.15గా ఉన్న రూపాయి.. ఈ నెల 28కి అంటే ఏడాదిలో 68.80కి పడిపోయింది. అంటే దాదాపు 50 శాతం ఢమాల్ మంది. ఈ ఏడాది ఆరంభం(జనవరి) నుంచి చూస్తే దేశీ కరెన్సీ 25 శాతం కుప్పకూలింది. ఈ నెల ఒక్కనెలలోనే 14 శాతం దిగజారింది. అంతక్రితం 1991 జూలైలో ఒక్క నెలలో 22 శాతం దేశీ కరెన్సీ క్రాష్ అయింది. 1992 ఏడాది మార్చి నెలలో 11.5 శాతం క్షీణించింది. -
కరెన్సీ క్రాష్ 65 దాటేసిన దేశీ కరెన్సీ
ముంబై: పాతాళం వైపు పరుగులు తీస్తున్న రూపాయి మారకం విలువ వరుసగా ఆరో సెషన్లో కూడా క్షీణించింది. గురువారం డాలర్‌తో పోలిస్తే ఒకదశలో చారిత్రకమైన 65 స్థాయిని కూడా దాటేసింది. చివరికి మాత్రం కోలుకున్నప్పటికీ 44 పైసల నష్టంతో మరో ఆల్‌టైమ్ కనిష్టమైన 64.55 వద్ద ముగిసింది. దేశీ స్టాక్‌మార్కెట్లు రికవర్ అయినప్పటికీ.. విదేశీ నిధులు తరలిపోవడం కొనసాగడంతో రూపాయి పతనం తప్పలేదు. దీంతో కేవలం ఆరు రోజుల వ్యవధిలో రూపాయి విలువ 336 పైసల మేర (5.49 శాతం) పడిపోయినట్లయింది. ఈ నేపథ్యంలో కరెన్సీ మార్కెట్లపై ఆందోళనలను తగ్గించే దిశగా.. తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనుకావాల్సిన అవసరమేమీ లేదని, పరిస్థితులు చక్కబడగలవని ఆర్థిక మంత్రి పి.చిదంబరం భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఫారెక్స్ మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రూపాయి విలువ స్థిరపడ్డాకా .. ఇటీవల తీసుకుంటున్న చర్యలను ఉపసంహరిస్తామని చిదంబరం తెలిపారు.గురువారం ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 64.11తో పోలిస్తే బలహీనంగా 64.85 వ ద్ద రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. అటుపైన చారిత్రకమైన 65 మార్కును దాటేసి ఏకంగా 65.56 స్థాయినీ తాకింది. కానీ చివరికి మాత్రం 0.69 శాతం మేర నష్టంతో 64.55 వద్ద ముగిసింది. ఫలితమివ్వని ఆర్బీఐ, కేంద్రం చర్యలు.. ఆర్బీఐ, కేంద్రం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ రూపాయిని పతనం నుంచి కాపాడలేకపోతున్నాయని ఇండియా ఫారెక్స్ అడ్వైజర్స్ సీఈవో అభిషేక్ గోయెంకా తెలిపారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపన ప్యాకేజీని ఉపసంహరించడానికి కట్టుబడి ఉందన్న సంకేతాలు వెలువడటంతో అంతర్జాతీయంగా డాలరు మరింత బలపడింది. ఇది రూపాయిపై ఒత్తిడి మరింత పెంచింది. ఫెడరల్ రిజర్వ్ చర్యలపై ఆందోళనలతో ఇండొనే సియా, మలేసియా, థాయ్‌లాండ్ వంటి వర్ధమాన దేశాల కరెన్సీలు సైతం కొత్త కనిష్టాలను తాకాయి. ప్రస్తుతం.. రూపాయి ట్రేడింగ్ శ్రేణి 64.10-65.10 మధ్యలో ఉండగలదని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ (ఇండియా) సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు. -
రూపాయి మరింత డౌన్
ముంబై: రెండు రోజుల లాభాల అనంతరం రూపాయి బుధవారం మరో కొత్త కనిష్ట స్థాయిలో ముగిసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 53 పైసలు క్షీణించి 61.30 వద్ద క్లోజయ్యింది. గత శుక్రవారం నాటి 61.10 తర్వాత ఇది కొత్త కనిష్ట స్థాయి ముగింపు. డాలర్లకు దిగుమతిదారుల నుంచి డిమాండ్ పెరగడం, దేశీ స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణం. అమెరికా ఫెడరల్ రిజర్వ్.. బాండ్ల కొనుగోలు ప్రక్రియను ఉపసంహరించే అవకాశాలున్నాయన్న సంకేతాలు, మరిన్ని విదేశీ నిధులు తరలిపోతుండటం సైతం రూపాయి బలహీనతకు దారితీశాయని ఫారెక్స్ డీలర్లు తెలిపారు. రూపాయి ట్రేడింగ్ 60.90-61.90 శ్రేణిలో ఉండగలదని అల్పరీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈవో ప్రమీత్ బ్రహ్మభట్ తెలిపారు.