సెకండ్ వేవ్‌లో భాగంగా పలు యూరోపియన్ దేశాలతోపాటు.. యూఎస్‌లోనూ కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో దేశీ కరెన్సీకి సైతం ఆ సెగ తగులుతోంది. తాజాగా డాలరుతో మారకంలో సాంకేతికంగా కీలకమైన 74 ఎగువకు చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 17 పైసలు కోల్పోయి 74.05ను తాకింది. ఆగస్ట్ 27 తదుపరి ఇది కనిష్టంకాగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో ఇటీవల డాలరు బలపడుతూ వస్తున్న విషయం విదితమే. తాజాగా డాలరు 0.3 శాతం పుంజుకుని 93.41ను తాకింది. ఇది రూపాయిని దెబ్బతీసినట్లు ఫారెక్స్ వర్గాలు తెలియజేశాయి. బుధవారం డాలరుతో మారకంలో రూపాయి 73.88 వద్ద ముగిసింది.
ఇతర అంశాలూ..
కోవిడ్-19 భయాలతో స్టాక్ మార్కెట్లు పతనంకావడం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు వంటి అంశాలు సెంటిమెంటును బలహీనపరచినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా వైరస్ కట్టడికి వీలుగా బ్రిటన్ బాటలో తాజాగా జర్మనీ, ఫ్రాన్స్ తదితర దేశాలలోనూ ఆంక్షలు విధిస్తుండటంతో ఆర్థిక వ్యవస్థ రికవరీకి దెబ్బతగిలనున్న అంచనాలు బలపడుతున్నాయి. దీనికితోడు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మరో భారీ ప్యాకేజీని ప్రకటించే అంశంలో యూఎస్ కాంగ్రెస్ విఫలంకావడం ఇన్వెస్టర్లను నిరాశపరచినట్లు తెలియజేశారు. కాగా.. సమీపకాలంలో రూపాయి 73.40- 74.05 మధ్య ప్రతికూలంగా కదలవచ్చని మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment