రూపాయి పతనం ఇన్వెస్టర్లను నష్టాల పాలు చేస్తోంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి.ఆ నష్టాలింకా కొనసాగుతున్నాయి కూడా. డాలర్‌తో రూపాయి విలువ పడిపోవడం వల్ల... దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరుగుతాయి. వాటికి డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది కనక, డాలర్ విలువ పెరిగింది కనక దిగుమతులకు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. దీనివల్ల దేశీయంగా ధరలు పెరుగుతాయి. ఓ రకంగా చూస్తే... రూపాయి పతనం కావటమనేది ఎగుమతిదారులకు లాభం.
కానీ చిత్రంగా డాలర్‌తో పోలిస్తే ఇతర దేశాల కరెన్సీలూ బాగా దెబ్బతిన్నాయి. అందుకని అమెరికాకు తప్ప ఇతర దేశాలకు ఎగుమతి చేసే కంపెనీలకు పెద్దగా లాభం ఉండటం లేదు. తమ రాబడులు దెబ్బతింటాయి కనక విదేశీ ఇన్వెస్టర్లు ఇక్కడి పెట్టుబడులను వెనక్కి తీసుకెళ్లిపోవటం కొన్నాళ్లుగా జరుగుతోంది. పిల్లల్ని విదేశాల్లో చదివిస్తున్న తల్లిదండ్రులక్కూడా రూపాయి సెగ ఎక్కువే తగులుతోంది. అయితే, రూపాయి పడిపోతుంటే పోర్ట్‌ఫోలియోలో కొంత భాగంపై డబ్బులు సంపాదించుకునే అవకాశముంది. ఇందు కోసం ప్రత్యామ్నాయ మార్గాలు కొన్ని ఉన్నాయి. వాటిని వివరించేదే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
ఎగుమతి ఆధారిత రంగాలయిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా కంపెనీల ఆదాయాలు రూపాయి పడిపోవడం వల్ల పెరిగే అవకాశాలు ఉంటాయి. రూపాయి పతనం నుంచి లాభపడాలనుకునే ట్రేడర్లు స్వల్ప కాలం కోసం ఈ స్టాక్స్‌పై దృష్టి సారించొచ్చు. కాకపోతే దీర్ఘకాలంలో మాత్రం ఈ స్టాక్స్ హెడ్జ్ కోసం ఉపయోగపడవు. గడిచిన పదేళ్ల కాలంలో మూడు సందర్భాలలో డాలర్‌తో రూపాయి ఎక్కువ నష్టపోవడం జరిగింది. 2008లో 19 శాతం, 2013లో 11 శాతం, ఈ ఏడాది ఇప్పటి వరకు 13 శాతం మేర రూపాయి నష్టపోయింది.
దీంతో 2008లో సెన్సెక్స్ 52 శాతం నష్టపోగా, 2013లో 9 శాతం, ఈ ఏడాది కేవలం 3 శాతం రాబడులనే ఇచ్చింది. కానీ, బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ మాత్రం ఈ ఏడాది సెన్సెక్స్‌ను అధిగమించి ఇప్పటిదాకా 31 శాతం రిటర్నులిచ్చింది. 2013లోనూ బీఎస్‌ఈ ఐటీ ఇండెక్స్ 55 శాతం పెరగడం గమనార్హం. కానీ 2008లో ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో సెన్సెక్స్‌తో సమానంగా నష్టపోయింది. ఫార్మా అన్నది తప్పనిసరి అవసరమైన రంగాల్లో ఒకటి. కానీ, అమెరికా ఎఫ్‌డీఏ నియంత్రణలతో అమెరికాలో ధరల పరంగా ఒత్తిడి నెలకొంది. ఫలితంగా ఈ ఏడాది ఫార్మా రంగం... రూపాయి విలువ క్షీణించినప్పటికీ కేవలం 2 శాతమే లాభపడింది. కానీ, మిగిలిన సందర్భాల్లో మాత్రం పరిస్థితి భిన్నంగానే ఉంటూ వచ్చింది.
గోల్డ్ ఈటీఎఫ్‌లూ చూడొచ్చు...
మన బంగారం అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపై ఆధారపడి ఉన్నాం. అంతర్జాతీయంగా డాలర్ మారకంలోనే బంగారం ధరలు మారుతుంటాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించిన ప్రతీ సందర్భంలోనూ దేశీయంగా బంగారం ధరలు పెరుగుతుంటాయి. పోర్ట్‌ఫోలియోలో బంగారం కలిగి ఉంటే దాని ధరలు 2008లో 26 శాతం (రూపాయిల్లో) పెరగ్గా, ఈ ఏడాది 8 శాతం పెరిగాయి. కానీ, 2013లో మాత్రం డాలర్‌తో రూపాయి మార కం విలువ క్షీణించినప్పటికీ, బంగారం ధరలు పెరగలేదు.
ఆ ఏడాది అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పడిపోవడం ఇందుకు కారణం. దాంతో డాలర్‌తో రూపాయి తగ్గినప్పటికీ, దేశీయంగా ధరల పెరుగుదల చోటు చేసుకోలేదు. అందుకే రూపాయి విలువ క్షీణత ప్రభావాన్ని హెడ్జ్ చేసుకునేందుకు పోర్ట్‌ఫోలియోలో 5–10 శాతాన్ని బంగారం కోసం కేటాయించుకోవచ్చు. పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం కోసమని బంగారం తీసుకోదలిస్తే... భౌతిక బంగారం కంటే, గోల్డ్ ఈటీఎఫ్ లేదా సార్వభౌమ బంగారం బాండ్లను ఎంచుకోవడం మెరుగైన ఆప్షన్.
విదేశీ మ్యూచువల్ ఫండ్స్
విదేశీ స్టాక్స్‌ను పోర్ట్‌ఫోలియోలో కలిగి ఉన్న మ్యూచువల్ ఫండ్స్ పథకాలు కూడా ఈ సమయంలో రాబడులకు మార్గం చూపిస్తాయి. రూపాయి తగ్గుదల ప్రభావానికి విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడి ఉండటమనేది కుషన్‌గా ఉపయోగపడుతుంది. విదేశీ స్టాక్స్‌ను కలిగి ఉండటం వల్ల రెండు రకాల ప్రయోజనాలుంటాయి. విదేశాల్లో లిస్ట్ అయిన కంపెనీల పెరిగే ఆదాయ ప్రయోజనాలకు అదనంగా, రూపాయితో డాలర్ బలోపేతం కావడం వల్ల ప్రయోజనం కూడా లభిస్తుంది. విదేశీ స్టాక్స్‌లో పాక్షికంగా, పూర్తిగా ఇన్వెస్ట్ చేసే సుమారు 40 మ్యూచువల్ ఫండ్ పథకాలు ప్రస్తుతం మన దగ్గర ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉన్నాయి కూడా. భిన్న రకాల పెట్టుబడి ఆప్షన్లతో ఇవి ఉన్నాయి.
కొన్ని ప్రత్యేకంగా అమెరికా లేదా యూరోప్ లేదా ఆసియా ప్రాంతాలకే పరిమితమైనవీ ఉన్నాయి. జపాన్, బ్రెజిల్ లేదా చైనా మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే పథకాలు కూడా ఉన్నాయి. అయితే, ఇతర వర్ధమాన మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసే పథకాలపై రాబడులు మన మార్కెట్‌లకు అనుగుణంగానే ఉంటాయి. వైవిధ్య ప్రయోజనం పొందాలంటే వీటికి బదులు ప్రధానంగా అమెరికా మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే పథకాలు రూపాయి పడిపోతున్న సమయంలో అక్కరకు వస్తాయి. మైనింగ్, కమోడిటీ, రియల్ ఎస్టేట్ ఫండ్స్‌ల్లోనూ ఎక్కువ ఒడిదుడుకులు ఉంటుంటాయి. కనుక అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్ పథకాలే రూపాయి క్షీణతను అధిగమించి రాబడులు పొందేందుకు వీలు కల్పిస్తాయి.
కేవలం యూఎస్ ఎస్‌అండ్‌పీ 500ను కొనుగోలు చేసినా గానీ, 2013లో 46 శాతం, ఈ ఏడాది ఇంత వరకు 21 శాతం రాబడులు వచ్చి ఉండేవి. ఇక 2008 మార్కెట్లు కుప్పకూలిన ఏడాదిలో ఎస్‌అండ్‌పీ 500పై పెట్టుబడి వల్ల నష్టం 24 శాతానికే పరిమితం అయింది. కానీ, మన మార్కెట్లు ఆ ఏడాది నష్టపోయిన మొత్తంలో ఇది సగానికంటే తక్కువే. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఈక్విటీ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ యూఎస్ అపార్చునిటీస్ ఫండ్, మోతీలాల్ ఓస్వాల్ నాస్‌డాక్ 100 ఈటీఎఫ్ అన్నవి రూపాయి క్షీణత కారణంగా రాబడులు ఆశించేవారికి మంచి ఆప్షన్లు.
తమ పోర్ట్‌ఫోలియో మొత్తంలో 10–15 శాతం నిధులను ఈ ఫండ్ పథకాల్లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గతంలో మన ఈక్విటీ ఫండ్స్‌పై దీర్ఘకాల మూలధన లాభాల పన్ను ప్రయోజనం ఉన్న సమయంలో విదేశీ ఫీడర్ ఫండ్స్‌కు మన ఇన్వెస్టర్లు దూరంగా ఉండేవారు. ప్రస్తుతం మన ఈక్విటీ ఫండ్స్ 10 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిధిలోకి రావడంతో... విదేశీ ఫండ్స్, మన ఫండ్స్ విషయంలో పన్నుల పరంగా వ్యత్యాసం తగ్గిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment