ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు తాజాగా కరెన్సీ సెగ తగులుతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా నాలుగవ రోజూ రూపాయి పతనం కొనసాగింది. సాయంత్రం ఐదు గంటలతో ముగిసే ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్ఛంజ్ (ఫారెక్స్) మార్కెట్ ట్రేడింగ్‌లో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 68.79 వద్ద ముగిసింది.
రోజూవారీగా చూస్తే రూపాయి 18 పైసలు బలహీనపడింది. అంటే బుధవారం 68.61 వద్ద ముగిసిన రూపాయి 18 పైసలు బలహీనపడి 68.79 వద్ద ముగిసింది. 2016 నవంబర్ 24న రూపాయి ఆల్‌టైమ్ కనిష్టస్థాయి 68.73 వద్ద ముగిసింది. తర్వాత రూపాయి ఆ స్థాయికి చేరటం ఇదే. ఇప్పుడు అంతకన్నా తక్కువ స్థాయికి చేరటం గమనార్హం. ఇందంతా ఒకవైపయితే, ఇంట్రాడేలో రూపాయి ఏకంగా 69.10కి పడిపోవడం మరో ఆందోళనకరమైన అంశం.
డాలర్లకోసం ఒత్తిడి...
దిగుమతిదారుల నుంచి డాలర్లకోసం గణనీయమైన డిమాండ్ ఏర్పడటం రూపాయి మారకపు విలువపై తీవ్ర ప్రభావం చూపింది. ఒక దశలో ఆర్‌బీఐ మార్కెట్‌లోకి భారీగా డాలర్లను పంపి రూపాయి పతనాన్ని అడ్డుకుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంట్రాబ్యాంక్ ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి 68.10– 68.72 శ్రేణిలో తిరిగింది.
బుధవారం ముగింపుతో పోలిస్తే నష్టంతో 68.89 వద్ద ట్రేడింగ్ మొదలైంది. గతేడాది ఏకంగా 6 శాతం బలపడిన రూపాయి... ఈ ఏప్రిల్ నుంచీ బలహీనపడుతోంది. 2018లో రూపాయి విలువ 7 శాతం పతనమైంది. ఈ వార్త రాస్తున్న సమయం రాత్రి 9 గంటలకు అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో డాలర్ ఇండెక్స్ 95 వద్ద ఉంటే, రూపాయి 68.82 వద్ద ట్రేడవుతోంది. ఇక నైమెక్స్‌లో క్రూడ్ ధర గురువారం 74 డాలర్ల స్థాయిని తాకింది.
బలహీనమంటే...
క్లుప్తంగా చెప్పాలంటే, అంతర్జాతీయ వాణిజ్యం డాలర్ ద్వారానే జరుగుతుంది. ఒక వస్తువు విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ అనుకుంటే... దాన్ని మనం బుధవారం రూ. 68.61 రూపాయిలిచ్చి కొనుగోలు చేయగలిగితే, గురువారం అదే వస్తువుకోసం రూ.68.79 పెట్టాలి. దీంతో దేశంలోనూ ఈ వస్తువు ధరను పెంచి అమ్ముకోవాలి. ఇది దేశీయంగా ధరల పెరుగుదలకు దారి తీస్తుంది.
ద్రవ్యోల్బణం తీవ్రతరమవుతుంటే, దీని కట్టడికి ఆర్‌బీఐ దేశంలో వడ్డీరేట్లను పెంచాల్సి వస్తుంది. ఆర్థిక వ్యవస్థకు దీనిని భరించే శక్తి లేకపోతే, దేశంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. క్రూడ్‌ను ప్రధానంగా చూస్తే... మనం చమురు కోసం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. దీన్ని డాలర్లలో కొనుగోలు చేయాలి కాబట్టి, మన చమురు కంపెనీలు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది.
అవి ఈ భారాన్నీ జనంపై వేస్తే, ద్రవ్యోల్బణం వంటి ప్రతికూల ప్రభావాలు తప్పవు. అంటే స్థూలంగా దిగుమతులకు సంబంధించి మనకు రూపాయి బలహీనత నష్టమయితే, మనం ఏదైనా వస్తువు ఎగుమతిచేస్తే, లాభదాయక పరిస్థితి ఉంటుంది. పై ఉదాహరణ తీసుకుంటే, ఒక ఐటీ పరిశ్రమ తన ‘సేవలకు’ బుధవారం రూ. 68.61 ఆదాయం పొదగలిగితే, గురువారం 68.79 ఆదాయం పొందగలుగుతుంది.
దేశీయ చర్యలు అవసరం
వాణిజ్య యుద్ధ భయాలు, డాలర్ ఇండెక్స్ 11 నెలల గరిష్టానికి చేరడం, చమురు ధరల తీవ్రత, ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్ల నిధుల ఉపసంహరణ... ఇవన్నీ దేశీయంగా రూపాయి సెంటిమెంట్‌ను దెబ్బతీస్తున్నాయి. దేశీయంగా చూస్తే, ద్రవ్యోల్బణం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) భయాలున్నాయి. రూపాయిలో ఒడిదుడుకులను తగ్గించడానికి ఆర్‌బీఐ తీసుకునే చర్యలు, తగిన వర్షపాతం దేశీయ మార్కెట్‌కు సమీప భవిష్యత్‌లో కొంత ఊరటనివ్వవచ్చు. – వినోద్ నాయర్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హెడ్
ఎగుమతిదారులకు ఏమీ ఒరగదు
రూపాయి పతనం ఒక రకంగా ఎగుమతిదారులకు కలిసిరావాలి. అయితే ఇప్పుడు చైనా సహా ఇతర దేశాల కరెన్సీలూ పడిపోతున్నాయి. క్రాస్ కరెన్సీల పతనం వల్ల మన ఎగుమతులకు సంబంధించి అంతర్జాతీయ సమ అవకాశాల స్థితి (లెవెల్ ప్లేయింట్ ఫీల్డ్) ఏర్పడుతుంది తప్ప, పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు. – అజయ్ సాహి, ఎఫ్‌ఐఈఓ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment