ముంబై: డాలరు మారకంలో వరుసగా మూడో రోజు దేశీ కరెన్సీ నీరసించింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 65 పైసలు పతనమైంది. ఇది గత ఆరు వారాల్లోనే అత్యధిక నష్టంకాగా.. 4 వారాల కనిష్టం 82.50 వద్ద ముగిసింది. ఆర్‌బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం మూడో రోజు డీలా పడగా.. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి అమ్మకాల బాట పట్టడం రూపాయిని దెబ్బతీస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ముడిచమురు ధరలు తిరిగి బలపడుతున్నాయి.
తాజాగా లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.65 శాతం ఎగసి 83.22 డాలర్లను తాకింది. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 105.24కు పుంజుకుంది. కాగా.. రూపాయి సోమవారం 52 పైసలు కోల్పోయి 81.85 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. వెరసి మూడు రోజుల్లో రూపాయి 124 పైసలు పడిపోయింది!
నేలచూపులోనే
డాలరు, చమురు ధరల ప్రభావంతో రూపాయి వెనకడుగుతో ప్రారంభమైంది. ఒక దశలో 82.63 వరకూ పతనమైంది. 81.94 వద్ద ప్రారంభమైన రూపాయికి ఇదే ఇంట్రాడే గరిష్టంకావడం గమనార్హం! డాలరు మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే 10 శాతం క్షీణించింది. డాలరు ఇండెక్స్ 114 వద్ద రెండు దశాబ్దాల గరిష్టానికి చేరడంతో అక్టోబర్ 19న చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. ప్రస్తుతం ఈ స్థాయికి చేరువలో నిలవడం ప్రస్తావించదగ్గ అంశం!!
Comments
Please login to add a commentAdd a comment