Dollar Against Rupee
-
అమెరికా కలకు డాలర్ బరువు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల అమెరికా కలను డాలర్ దెబ్బకొడుతోంది. అక్కడి పరిస్థితులతో ఫీజులు పెరగడం ఓ వైపు.. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడం వల్ల ఎక్కువ చెల్లించాల్సి రావడం మరోవైపు ఇబ్బందిగా మారుతోంది. ముందుగా అనుకున్న ఖర్చు కంటే ఎక్కువ అవుతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మరిన్ని అప్పులు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. కొన్ని ఏజెన్సీలు వివిధ మార్గాల్లో బ్యాంకు బ్యాలెన్స్ చూపించి విద్యార్థులను విదేశాలకు పంపుతుంటాయి. ఇప్పుడా ఏజెన్సీలు కూడా ఎక్కువ కమీషన్ తీసుకుంటున్నాయని.. విదేశీ విద్యకు నిధులిచ్చే విషయంలో బ్యాంకులు కూడా మరిన్ని షరతులు పెడుతున్నాయని విద్యార్థులు అంటున్నారు. ఆరు నెలల క్రితం నాటి డాలర్ విలువతో పోల్చి రుణాన్ని లెక్కిస్తున్నాయని, భవిష్యత్‌లో ట్యూషన్ ఫీజు పెరిగితే విద్యార్థులే భరించాలని కొర్రీ పెడుతున్నాయని చెబుతున్నారు. ‘చదువుల’సీజన్ మొదలు అమెరికా సహా వివిధ దేశాల్లోని యూనివర్సిటీల్లో ఆగస్టు, సెప్టెంబర్‌లో మొదటి దశ అడ్మిషన్లు జరుగుతాయి. దీనికోసం విద్యార్థులు జనవరి నుంచే సన్నద్ధమవుతారు. పాస్‌పోర్టు, వీసా కోసం ప్రయత్నించడం, విదేశీ భాషకు సంబంధించి పరీక్షలు రాయడం చేస్తుంటారు. కోవిడ్ కాలంలో విదేశాలకు వెళ్లేవారి సంఖ్య తగ్గినా.. గత ఏడాది నుంచి మళ్లీ పుంజుకుంది. 2017లో దేశవ్యాప్తంగా 4.5 లక్షల మంది విదేశాలకు వెళ్తే.. 2022లో 6.48 లక్షల మంది వెళ్లారు. తెలంగాణ నుంచి అన్నిదేశాలకు కలిపి ఏటా సుమారు 60 వేల మంది వెళ్తుండగా.. అందులో అమెరికాకు చేరుతున్నవారే 30 వేల మంది. చాలా మంది సాఫ్ట్వేర్ కెరీర్‌కు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారు. డిజిటల్ ఎకానమీలో అవకాశాలు పెరగడంతో నైపుణ్య విభాగాలైన బిజినెస్, టెక్నాలజీ, డేటా సైన్స్‌కు భవిష్యత్‌లోనూ మంచి డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ అంచనాలతోనే ఎక్కువ మంది విదేశాల్లో డేటాసైన్స్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు అందిన నివేదికల ప్రకారం.. డేటా అనాలసిస్‌లో 23 శాతం, డేటా విజువలైజేషన్లో 10శాతం, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్ 26 శాతం, మెషీన్ లెర్నింగ్ 41 శాతం భారత విద్యార్థులు విదేశాల్లో చదువుతున్నారు. నిజానికి దేశంలో 2020–21 మధ్య డేటా సైన్స్ ఉద్యోగాలు 47.10 శాతం మేర పెరిగాయని, ఎంఎస్ పూర్తి చేసిన వారికి ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయని గణాంకాలు చెప్తున్నాయి. పెరిగిన ఫీజులతో.. ప్రధానంగా అమెరికా విద్యకు ఖర్చు గణనీయంగా పెరిగింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడమే ఇందుకు కారణం. ఆరు నెలల క్రితం రూ.79 వద్ద ఉన్న ఉన్న డాలర్ విలువ ప్రస్తుతం రూ.82 దాటింది. దీంతో అమెరికాలో ఖర్చు 15 శాతం పెరిగిందని ఓ కన్సల్టెన్సీ సంస్థ అంచనా వేసింది. దానికితోడు ఆర్థిక మాంద్యం పరిస్థితి కారణంగా అమెరికాలో తాత్కాలిక ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది. దీంతో అమెరికాలో ఉన్న భారత విద్యార్థులకు పూర్తిగా తల్లిదండ్రులు పంపే డబ్బులే దిక్కు అవుతున్నాయి. ఇక బ్యాంకులు ముందుగా నిర్ణయించిన మేరకు ట్యూషన్ ఫీజు మాత్రమే చెల్లిస్తున్నాయి. డాలర్ మారకం భారం విద్యార్థులు/తల్లిదండ్రులపైనే పడుతోంది. అమెరికాలోని యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు ట్యూషన్ ఫీజుకు సరిపడా బ్యాంకు బ్యాలెన్స్ చూపించాల్సి ఉంటుంది. కొన్ని కన్సల్టెన్సీ సంస్థలు అవసరమైన బ్యాలెన్స్ బ్యాంకులో వేసి.. విద్యార్థి అమెరికా వెళ్లిన తర్వాత డ్రా చేసుకుంటాయి. ఇందుకోసం కమీషన్లు తీసుకుంటాయి. ఇప్పుడీ కన్సల్టెన్సీలు తీసుకునే మొత్తాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు పెంచేశాయని విద్యార్థులు వాపోతున్నారు. మరింత అప్పు చేయాల్సి వస్తోంది మా అక్క గత ఏడాది అమెరికా వెళ్లింది. సెయింట్ లూయిస్ వర్సిటీలో రూ.10.85 లక్షలు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పతనంతో కట్టాల్సిన సొమ్ము రూ.12.02 లక్షలకు పెరిగింది. ఎనిమిది నెలల్లోనే రూ.1.20 లక్షల వరకు భారం పడింది. నేను కూడా అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నాను. రూ.25 లక్షల్లో ఎంఎస్ పూర్తి చేస్తానని అనుకున్నా.. మరో నాలుగైదు లక్షలపైనే ఖర్చయ్యేలా ఉంది. మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. – ప్రదీప్‌కుమార్, వరంగల్ (అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న విద్యార్థి) ఏం చేయాలన్నది తేలడం లేదు అమెరికాలోని ఫ్లోరిడా వర్సిటీలో చేరాలనుకున్నా. అన్నీ సిద్ధం చేసుకున్నాను. మా ఫ్రెండ్ అక్కడే ఉన్నాడు. నేను సిద్ధమైనప్పుడు ఫీజు ఏడాదికి రూ.19.17 లక్షలు అయితే డాలర్ రేటు మార్పుతో.. రూ.21.25 లక్షలకు చేరింది. యూనివర్సిటీ ఆఫ్ న్యూహెవెన్లో ఫీజు రూ.21.36 లక్షల నుంచి రూ.23.67 లక్షలకు చేరిందని మరో ఫ్రెండ్ చెప్పాడు. ఇప్పటికే అతి కష్టం మీద రూ.25 లక్షలు అప్పు చేశాం. మరో ఆరేడు లక్షలు ఉంటే తప్ప అమెరికా వెళ్లి చదవడం కష్టం. ఏం చేయాలన్నది తేలడం లేదు. – విశాల్ త్రివిక్రమ్, విద్యార్థి, హైదరాబాద్ -
రూపాయికి మరో షాక్
ముంబై: డాలరు మారకంలో వరుసగా మూడో రోజు దేశీ కరెన్సీ నీరసించింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 65 పైసలు పతనమైంది. ఇది గత ఆరు వారాల్లోనే అత్యధిక నష్టంకాగా.. 4 వారాల కనిష్టం 82.50 వద్ద ముగిసింది. ఆర్బీఐ పాలసీ సమీక్ష నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు సైతం మూడో రోజు డీలా పడగా.. విదేశీ ఇన్వెస్టర్లు తిరిగి అమ్మకాల బాట పట్టడం రూపాయిని దెబ్బతీస్తున్నట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీనికితోడు ముడిచమురు ధరలు తిరిగి బలపడుతున్నాయి. తాజాగా లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.65 శాతం ఎగసి 83.22 డాలర్లను తాకింది. మరోవైపు ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 105.24కు పుంజుకుంది. కాగా.. రూపాయి సోమవారం 52 పైసలు కోల్పోయి 81.85 వద్ద స్థిరపడిన సంగతి తెలిసిందే. వెరసి మూడు రోజుల్లో రూపాయి 124 పైసలు పడిపోయింది! నేలచూపులోనే డాలరు, చమురు ధరల ప్రభావంతో రూపాయి వెనకడుగుతో ప్రారంభమైంది. ఒక దశలో 82.63 వరకూ పతనమైంది. 81.94 వద్ద ప్రారంభమైన రూపాయికి ఇదే ఇంట్రాడే గరిష్టంకావడం గమనార్హం! డాలరు మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే 10 శాతం క్షీణించింది. డాలరు ఇండెక్స్ 114 వద్ద రెండు దశాబ్దాల గరిష్టానికి చేరడంతో అక్టోబర్ 19న చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. ప్రస్తుతం ఈ స్థాయికి చేరువలో నిలవడం ప్రస్తావించదగ్గ అంశం!! -
జీవితకాల కనిష్టానికి రూపాయి
ముంబై: ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం ఆగడం లేదు. డాలర్ మారకంలో సోమవారం పది పైసలు క్షీణించి జీవితకాల కనిష్టం 82.40 స్థాయి వద్ద స్థిరపడింది. ఉదయం 82.68 స్థాయి వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ఒక దశలో 82.69 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. అయితే రూపాయి విలువ రక్షించేందుకు ఆర్బీఐ జోక్యం చేసుకోవచ్చనే అంచనాలతో కొంతమేర ఆరంభ నష్టాలు తగ్గాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల బాటన సాగుతున్నందున ఇన్వెస్టర్లలో రిస్క్ తీసుకొనే సామర్థ్యం తగ్గిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ‘‘అమెరికాలో ఉద్యోగ గణాంకాలు నిరాశపరచడంతో ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు వేగవంతంగా ఉండొచ్చనే ఊహాగానాలతో డాలర్ బలపడింది. దీంతో రూపాయి విలువ కొత్త జీవితకాల కనిష్టానికి దిగివచ్చింది. రానున్న రోజుల్లో 81.50 – 83 శ్రేణిలో కదలాడొచ్చు’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ విశ్లేషకుడు దిలీప్ పర్మార్ తెలిపారు. -
రికార్డ్ స్థాయిలో రూపాయి విలువ పతనం!
ముంబై: అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్ బలపడుతున్న నేపథ్యంలో దేశీ రూపాయి పతనం కొనసాగుతోంది. గురువారం డాలర్‌తో పోలిస్తే మరో 18 పైసలు క్షీణించి 79.9975 వద్ద క్లోజయ్యింది. కీలక స్థాయి అయిన 80కి పైసా కన్నా తక్కువ దూరంలో నిల్చింది. టోకు ద్రవ్యోల్బణం వరుసగా 15వ నెలల జూన్‌లోనూ రెండంకెల స్థాయిలోనే కొనసాగడం, కరెంటు అకౌంటు లోటు మరింత దిగజారవచ్చన్న అంచనాలు, విదేశీ మారక నిల్వలు తగ్గనుండటం తదితర అంశాలు రూపాయి పతనానికి కారణమయ్యాయి. గడిచిన కొద్ది రోజుల్లో క్రూడాయిల్ రేట్లు తగ్గడం .. దేశీ కరెన్సీ మరింతగా పడిపోకుండా కొంత ఊతమిచ్చినట్లు విశ్లేషకులు తెలిపారు. గురువారం ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పటిష్టంగా 79.71 వద్ద ప్రారంభమైంది. కానీ యూరప్ మార్కెట్లు ప్రారంభమయ్యాక మిగతా కరెన్సీలతో పోలిస్తే డాలరు ఏకంగా 24 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎగియడంతో రూపాయి పడిపోయింది. క్రితం ముగింపు 79.81తో పోలిస్తే 18 పైసలు పతనమైంది. -
ప్రపంచానికి మాంద్యం గుబులు, పడిపోతున్న రూపాయి విలువ!
ముంబై: ప్రపంచ దేశాలను మళ్లీ మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం ఆందోళనలు, పలు దేశాల రుణ రేట్ల పెంపుతో ప్రపంచ వృద్ధిబాటలోంచి క్షీణతలోకి మారే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషణలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడులకు తక్షణ మార్గంగా డాలర్ కనబడుతోంది. దీనితోపాటు ఫెడ్ కఠిన ద్రవ్య విధానంతో ప్రపంచవ్యాప్తంగా నిధులు డాలర్లలోకి వస్తున్నాయి. ఈ వార్త రాసే 11 గంటల సమయంలో ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 106.50 డాలర్లపైన గరిష్ట స్థాయిలో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక పతనం కొనసాగుతోంది. మంగళవారం 38 పైసలు పతనమై 79.33 వద్ద ముగిసింది. ఒక దశలో రూపాయి 79.38 స్థాయిని కూడా చూసింది. దేశం నుంచి విదేశీ పెట్టుబడులు భారీగా వెనక్కు మళ్లడం రూపాయి భారీ పతనానికి కారణమవుతోంది. ఈ రెండు స్థాయిలు రూపాయికి ముగింపు, ఇంట్రాడే కనిష్ట స్థాయిలు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ లాభాల బాటన పయనిస్తుండగా, నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 35 డాలర్లు పతనమై (2 శాతం) 1,767కు చేరింది. క్రూడ్ 10 శాతం వరకూ పడిపోయి 100 డాలర్ల దిగువకు చేరింది. -
ఆగని రూపాయి ‘రికార్డు’ పతనం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ చరిత్రాత్మక పతనం కొనసాగుతోంది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం 12 పైసలు పతనమై 77.78 తాజా లైఫ్ టైమ్ బలహీనతను చూసింది. దేశీయ ఈక్విటీల బలహీన ధోరణి, అంతర్జాతీయంగా డాలర్ పటిష్టత దీనికి ప్రధాన కారణం. విదేశీ నిధులు వెనక్కుపోవడం, తీవ్ర స్థాయిల్లో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు దేశీయ కరెన్సీపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. సోమవారం రూపాయి ముగింపు 77.66. మంగళవారం ట్రేడింగ్‌లో మరింత బలహీనంగా 77.72 వద్ద ప్రారంభమైంది. 77.69 వరకూ ఇంట్రాడేలో బలపడినా, ఆ స్థాయిలో నిలద్రొక్కుకోలేకపోయింది. ఒక దశలో 77.80కి కూడా పడిపోయింది. చివరకు క్రితం ముగింపుకన్నా 12 పైసలు నష్టంతో 77.78 వద్ద ముగిసింది. దీనితో ఇంట్రాడే, ముగింపు స్థాయిల్లో రూపాయి సరికొత్త ‘బలహీన’ రికార్డులను చూసినట్లయ్యింది. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి 78.05 వరకూ బలహీనపడే అవకాశం ఉందని మోతీలాల్ ఓశ్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో ఫారెక్స్, బులియన్ విశ్లేషకులు గౌరంగ్ సోమయ్య విశ్లేషించారు. మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనంగా 77.80 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదికన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 102.50 వద్ద ట్రేడవుతోంది. చదవండి: భారత జీడీపీ వృద్ధి: వరల్డ్ బ్యాంకు షాకింగ్ అంచనాలు -
కనిష్ట స్థాయి నుంచి కోలుకున్న రూపాయి!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం జీవితకాల కనిష్ట స్థాయిల నుంచి 21 పైసలు కోలుకుంది. 77.50 వద్ద ముగిసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం జీవితకాల కనిష్టం 77.71కి పడిపోయింది. బుధవారం 77.58 వద్ద ప్రారంభమైంది. 77.50–77.62 శ్రేణిలో తిరిగింది. కొన్ని బ్యాంకులు డాలర్ల విక్రయం రూపాయికి కొంత మేర కలిసివచ్చింది. అయితే ఇది తాత్కాలిక ధోరణి అని, రూపాయి బలహీనతే కొనసాగుతుందని నిపుణుల అంచనా. -
ఎంత పనిచేశావ్ పుతిన్.. భారత్‌కు గట్టి షాక్
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచమంతటినీ అతలాకుతలం చేస్తోంది. తిండి గింజల కొరత, నిత్యావసరాలు, చమురు ధరల పెరుగుదల... ఇలా అన్ని దేశాలకూ ఏదో రకంగా సెగ తగులుతోంది. మన దేశంపై కూడా యుద్ధ ప్రభావం గట్టిగానే పడుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచీ గత మూడు నెలల్లో నిత్యావసరాలతో పాటు అన్ని ధరలూ పైకి ఎగబాకుతుండటంతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను భారీగా వెనక్కు తీసుకుంటుండటం వంటి పరిణామాలతో ఆర్థిక రంగం కూడా నానా కుదుపులకు లోనవుతోంది. చమురు భగభగలు.. యుద్ధం పుణ్యమా అని అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇందుకు రూపాయి పతనం కూడా తోడవటంతో మరింతగా మోతెక్కిపోతున్నాయి. ఈ ఏడాది మొదట్లో 80 డాలర్లున్న బ్యారెల్ చమురు ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దాడికి దిగాక ఈ మూడు నెలల్లో 128 డాలర్లకు పెరిగింది. వంటింట్లో మంటలు.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం భారతీయుల వంట గదిలోనూ సెగలు రేపుతోంది. ఏడాది క్రితంతో పోలిస్తే వంట నూనెల ధరలు నాలుగో వంతు దాకా పెరిగిపోయాయి. 2021 మే 31తో పోలిస్తే గోధుమలు 14 శాతం, చక్కెర 4 శాతం, ఉత్తరాదిన విరివిగా వాడే ఆవ నూనె 5 శాతం చొప్పున పెరుగుదల నమోదు చేశాయి. పెట్టుబడులు వాపస్.. ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారత మార్కెట్ల నుంచి గత మూడు నెలల్లో ఏకంగా రూ.లక్ష కోట్లకు పైగా వెనక్కు తీసుకున్నారు. అంతకుముందు 9 నెలల ఉపసంహరణ కంటే కూడా ఇది 50 వేల కోట్ల రూపాయలు ఎక్కువ! యుద్ధం దెబ్బకు ప్రపంచమంతటా ద్రవ్యోల్బణం పెరిగిపోతోంది. దీంతో అంతర్జాతీయంగా తలెత్తిన ఒడిదొడుకులను తట్టుకునే చర్యల్లో భాగంగా భారత్ వంటి వర్ధమాన మార్కెట్ల నుంచి ఎఫ్‌పీఐలు ఇలా పెట్టుబడులను భారీగా వెనక్కు తీసుకుంటున్నారు. రూపాయి నేలచూపులు.. యుద్ధం దెబ్బకు డాలర్‌తో రూపాయి పతనం గత మూడు నెలల్లో వేగం పుంజుకుంది. ఫిబ్రవరి 24న డాలర్‌తో 75.3 వద్ద కదలాడిన రూపాయి మే 31 నాటికి 77.7కు పడిపోయింది. ఇది దిగుమతులపై, ముఖ్యంగా చమురు దిగుమతులపై బాగా ప్రభావం చూపింది. ఎఫ్‌పీఐల ఉపసంహరణ కూడా రూపాయి పతనానికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. దీనికి తోడు భారత్‌లో ద్రవ్యోల్బణం కూడా ఏప్రిల్ నాటికే ఏకంగా 7.8 శాతానికి పెరిగింది! 2014 మే తర్వాత ద్రవ్యోల్బణం ఇంతగా పెరగడం ఇదే తొలిసారి. -నేషనల్ డెస్క్, సాక్షి. -
రూపాయి ఢమాల్..డాలర్‌కి జోష్!
జాతీయ, అంతర్జాతీయ పరిణాలు దేశీయ కరెన్సీపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో డాలరు మారకంలో దేశీయ కరెన్సీ విలువ జీవిత కాల కనిష్ఠానికి పడిపోయింది. పీటీఐ కథనం ప్రకారం..సోమవారం అమెరికా డాలరుతో పోలిస్తే భారత కరెన్సీ విలువ పతనమైంది. 60పైసలు తగ్గి 76.90 నుండి 77.50 వద్ద ట్రేడింగ్‌తో ముగిసింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి గ్రీన్‌బ్యాక్‌తో పోలిస్తే 77.17 వద్ద దిగువన ప్రారంభమైంది. చివరికి దాని మునుపటి ముగింపుతో పోలిస్తే 60 పైసలు తగ్గి 77.50 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సెషన్లో రూపాయి తన జీవితకాల కనిష్ట స్థాయి 77.52కి చేరుకుంది. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం వంటి ఆందోళనల ఫారెక్స్ మార్కెట్‌పై పడిందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నుండి ఆశించిన స్థాయిలో వడ్డీరేట్ల పెంపు కారణంగా డాలర్ రెండు దశాబ్దాలలో అత్యధిక స్థాయికి చేరుకుంది. అదనంగా, చైనాలో కఠినమైన లాక్డౌన్, మూడవ నెలలో ఉక్రెయిన్‌పై యుద్ధానికి ప్రతిస్పందనగా రష్యా చమురును నిషేధించాలనే యూరప్ ప్రణాళిక, వస్తువుల ధరలను పెంచడం వల్ల ఆర్థిక వృద్ధి ప్రమాదాలు మందగించడం డాలర్ రేటు పెరగుదలకు ఊతమిచ్చింది. -
మూడోరోజూ..రూపాయి ‘బాహుబలి’
ముంబై: రూపాయి విలువ వరుసగా మూడోరోజూ బలపడింది. డాలర్ మారకంలో 24 పైసలు ఎగసి 75.29 వద్ద స్థిరపడింది. ఇటీవల దేశీయ మార్కెట్లోకి విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు)పెట్టుబడుల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయంగా డాలర్ విలువ బలహీనపడింది. ఈ అంశాలు మన కరెన్సీకి కలిసొచ్చాయి. ఉదయం ఫారెక్స్ మార్కెట్లో 75.54 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 75.27 స్థాయి వద్ద గరిష్టాన్ని అందుకుంది. క్రూడాయిల్ ధరల్లో ఒడిదుడుకులు, భౌగోళిక అనిశ్చితుల ఆందోళనలతో లాభాలు పరిమితమైనట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. ‘‘రష్యాపై ఆంక్షల విధింపు ప్రభావం, షాంఘైలో లాక్డౌన్ విధింపుతో చైనా వృద్ధి అవుట్‌లుక్ అంచనాలతో పాటు ఆర్బీఐ ద్రవ్యపాలసీ నిర్ణయాలు రానున్న రోజుల్లో రూపాయి ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయి’’ అని రెలిగేర్ బ్రోకింగ్ లిమిటెడ్ కమోడిటీ కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సుగంధ సచ్దేవ్ తెలిపారు. -
రూపాయికి తిప్పలే, 2023 మార్చి నాటికి 77.5కి రూపాయి పతనం!
ముంబై: భారత్ కరెన్సీ రూపాయి విలువ డాలర్ మారకంలో 2023 మార్చి నాటికి 77.5కు బలహీనపడుతుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనావేసింది. అధిక ఇంధన ధరలతో పెరగనున్న కరెంట్ అకౌంట్ లోటు (దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారక నిల్వల మధ్య నికర వ్యత్యాసం), అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు వల్ల క్యాపిటల్ అవుట్‌ఫ్లోస్ (విదేశీ నిధులు దేశం నుంచి వెనక్కు మళ్లడం) వంటి అంశాలు తమ అంచనాలకు కారణమని తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తొలినాళ్లలో జరిగిన ఈక్విటీ మార్కెట్ల పతనం నేపథ్యంలో 2022 మార్చి8వ తేదీన రూపాయి విలువ 77 కనిష్ట స్థాయిలో ముగియగా, ఇంట్రాడేలో 77.05 స్థాయినీ చూసింది. నివేదిక ప్రకారం... రూపాయి విలువ తీవ్ర ఒడిదుడుకులను నిరోధించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫారెక్స్ మార్కెట్లో తన జోక్యాన్ని కొనసాగిస్తుంది. 630 బిలియన్ డాలర్లకుపైగా 12 నెలలకు సరిపడా పటిష్ట విదేశీ మారకద్రవ్య నిల్వలను భారత్ కొనసాగిస్తుండడమే దీనికి కారణం. రూపాయి తీవ్ర ఒడిదుడుకులను ‘ఆర్బీఐ జోక్యం’ కొంత నివారించవచ్చు. ►ఫెడ్ ఫండ్ రేటును బుధవారం 25 పైసలు పెంచిన (0.25–0.50 శాతం) సంగతి తెలిసిందే. ఈ ఏడాది మరో ఆరుసార్లు రేట్లు పెంచవచ్చనీ సంకేతాలు ఇచ్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో క్రూడ్ ఆయిల్ బేరల్‌కు 85 డాలర్ల నుంచి 90 డాలర్ల శ్రేణిలో ఉండే వీలుంది. ఈ ప్రాతిపదికన దేశ కరెంట్ అకౌంట్ లోటు 2022–23 ఆర్థిక సంవత్సరంలో 2.4 శాతానికి (జీడీపీలో) పెరగవచ్చు. 2021–22లో ఈ రేటు 1.6 శాతం. ► ఫిబ్రవరి నాటికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13.1 బిలియన్ డాలర్ల విదేశీ నిధులు వెనక్కు మళ్లాయి. గత దశాబ్ద కాలంలో ఇంత భారీ స్థాయిలో ఉపసంహరణలు ఇదే తొలిసారి. ఇది రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. ► అయితే 2013లో ఫెడ్ ఫండ్ రేటు పెంచినప్పటి పరిస్థితి ప్రస్తుతం రూపాయికి ఎదురుకాకపోవచ్చు. భారత్‌కు భారీ విదేశీ మారక నిధుల దన్ను దీనికి కారణం. ► ఇక లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) మెగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లో ఆశించిన నిధుల ప్రవాహం అలాగే 2023 ఆర్థిక సంవత్సరం చివరి భాగంలో గ్లోబల్ బాండ్ ఇండెక్స్‌లో భారతదేశం డెట్ ఇన్స్టమెంట్ను చేర్చడం వంటి అంశాలు భారత్ కరెన్సీకి సమీప కాలంలో మద్దతునిచ్చే అంశాలు. 75.84 వద్ద రూపాయి... ఇక డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపుతో పోల్చితే 37 పైసలు లభపడి 75.84 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీల పెరుగుదల, విదేశీ కరెన్సీల్లో డాలర్ బలహీనత దీనికి కారణం. వారంవారీగా చూస్తే, అమెరికన్ కరెన్సీలో రూపాయి విలువ 63 పైసలు లాభపడింది. హోలీ పండుగ నేపథ్యంలో సోమవారం ఫారెక్స్ మార్కెట్ పనిచేయదు. -
బలపడుతున్న రూపాయి.. ఈ నెలలో ఇదే అత్యధికం
ముంబై: రూపాయి పరుగు ఆగడం లేదు. వరుసగా తొమ్మిదో రోజూ లాభపడింది. డాలర్ మారకంలో మంగళవారం 35 పైసలు బలపడి 74.66 వద్ద స్థిరపడింది. ఈ ముగింపు రూపాయికి నెల రోజుల గరిష్ట స్థాయి. ఫారెక్స్ మార్కెట్లో ఉదయం 74.95 వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 74.60 వద్ద గరిష్టాన్ని అందుకుంది. ఒమిక్రాన్ ఆందోళనలు, క్రూడాయిల్ ధరల రికవరీతో ఒక దశలో 74.95 కనిష్టాన్నీ నమోదు చేసింది. గడిచిన తొమ్మిది సెషన్లో రూపాయి మొత్తం 162 పైసలు బలపడింది. ‘‘అంతర్జాతీయంగా డాలర్ కరెన్సీ స్తబ్ధుగా ట్రేడ్ అవుతోంది. ఇటీవల ఫారెక్స్ ట్రేడర్లలో రిస్క్ తీసుకొనే సామర్థ్యం పెరిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లోని సానుకూలతలను రూపాయి అందిపుచ్చుకుంది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దిలీప్ పార్మర్ తెలిపారు. చదవండి:100 ట్రిలియన్ డాలర్లకి చేరుకోనున్న ప్రపంచ ఎకానమీ -
విదేశీ నిధుల ప్రవాహంపై రూపాయికి భరోసా!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం రెండు వారాల గరిష్ట స్థాయికి ఎగసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 47 పైసలు లాభపడి 74.88 వద్ద ముగిసింది. రానున్న వారాల్లో జారీ కానున్న క్విప్, ఐపీఓల ద్వారా మార్కెట్లోకి భారీ విదేశీ నిధుల ప్రవాహం జరుగుతుందన్న అంచనాలు రూపాయి సెంటిమెంట్‌ను బలోపేతం చేశాయన్నది నిపుణుల అభిప్రాయం. దీనికితోడు ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా కొంత శాంతించడం, తగ్గిన డాలర్ ఇండెక్స్ దూకుడు వంటి అంశాలు కూడా రూపాయికి కలిసి వచ్చాయి. నిజానికి రూపాయి మరింత బలపడాల్సిందని, అయితే ఈక్విటీల బలహీన ధోరణి రూపాయిని కొంతమేర కట్టడి చేసిందని ఫారెక్స్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. వర్థమాన దేశాల్లో భారత్ కరెన్సీనే బుధవారం ప్రధానంగా బలపడింది. డాలర్‌పై చైనా యువాన్ ర్యాలీ (దాదాపు నాలుగు నెలల గరిష్టానికి అప్) మొత్తంగా ప్రాంతీయ కరెన్సీలకు మద్దతునిస్తోందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిసెర్చ్ అనలిస్ట్ దిలిప్ పార్మార్ పేర్కొన్నారు. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ స్వల్ప లాభాల్లో 74.77 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్వల్ప నష్టాల్లో 93.64పైన ట్రేడవుతోంది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
రూపాయి.. అధరహో
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం 53 పైసలు బలపడి 73.69 స్థాయికి చేరింది. గడచిన 10 వారాల్లో రూపాయి ఇంత స్థాయిలను చూడ్డం (జూన్ 16 తర్వాత) ఇదే తొలిసారి. సరళతర ఆర్థిక విధానాలనే అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ కొనసాగిస్తుందన్న అంచనాలు, ఈక్విటీ మార్కెట్ల బులిష్ వైఖరి వంటి అంశాలు రూపాయి భారీగా బలపడ్డానికి కారణమని నిపుణుల అంచనా. ఫారెన్ బ్యాంకుల డాలర్ అమ్మకాలు, దేశంలోకి విదేశీ నిధులు భారీగా వస్తాయన్న అంచనాలు కూడా రూపాయి బలోపేతానికి కారణం. రూపాయి గురువారం ముగింపు 74.22. దీనితో పోల్చితే శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాలతో 74.17 వద్ద ప్రారంభమైంది. వారంలో రూపాయి 70 పైసలు బలపడింది. ఈ వార్త రాస్తున్న శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 73.78 వద్ద ట్రేడవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ 93పైన ట్రేడవుతోంది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). చదవండి : వడ్డీ రేట్ల పెంపు దిశగా అమెరికా -
ఆరంభలాభాల్ని కోల్పోయిన రూపాయి
డాలర్ మారకంలో రూపాయి విలువ బుధవారం ఆరంభ లాభాన్ని కోల్పోయింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు 3నెలల గరిష్టానికి చేరుకోవడం ఇందుకు కారణమైనట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లో కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో నేడు ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నిన్నటి ముగింపు(75.36)తో పోలిస్తే 33పైసల లాభంతో 75.03 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఉదయం గం.11:30ని.లకు ఉదయం లాభాల్ని కోల్పోయి 14పైసలు బలపడి 75.22 వద్ద ట్రేడ్ అవుతోంది. ‘‘ ప్రపంచ, దేశీయ ఈక్విటీలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండటంతో రూపాయి భారీగా బలపడింది. కరోనా కట్టడిలో భాగంగా దేశీయ ఆర్థిక వ్యవస్థను క్రమంగా అన్‌లాక్ చేయడం కూడా రూపాయికి కలిసొచ్చింది. చైనాతో జనవరిలో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉపసంహరిచుకోలేదు.’’ రిలిగేర్ బ్రోకింగ్ సంస్థ కరెన్సీ రీసెర్చ్‌పర్సన్ సుగంధ్ సచ్వేద్ తెలిపారు. మన మార్కెట్ ఇప్పుడు ప్రపంచమార్కెట్ ర్యాలీకి అనుగుణంగా రాణిస్తుందని ఆయనన్నారు. రూపాయి ప్రస్తుత క్షీణత రానున్న రోజుల్లో మరింత బలపేందుకు సహాయపడుతుందుని సచ్దేవ్ అంటున్నారు. ప్రస్తుతానికి స్వల్పకాలిక దృష్ట్యా రూపాయి బలంగా ఉందని తొందర్లోనే 74.80మార్కుకు చేరుకుంటుందని సచ్దేవ్ అంచనా వేస్తున్నారు. -
ఆరంభ లాభాలు ఆవిరి
ఆరంభ లాభాల జోష్‌ను మన మార్కెట్ చివరి వరకూ కొనసాగించలేకపోయింది. కరోనా వైరస్ కల్లోలం అంతకంతకూ పెరిగిపోతుండటంతో ఆర్థిక స్థితిగతులు మరింత అధ్వానం కాగలవన్న ఆందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో బుధవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) 1.9%కి తగ్గించడం, డాలర్‌తో రూపాయి మారకం జీవిత కాల కనిష్ఠానికి పడిపోవడం, ముడి చమురు ధరలు 4% మేర పతనమవటం, లాక్‌డౌన్‌ను పొడిగించడం.... ప్రతికూల ప్రభావం చూపాయి. రోజంతా 1,346 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ చివరకు 310 పాయింట్ల నష్టంతో 30,380 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 267 పాయింట్లు ఎగసిన నిఫ్టీ 69 పాయింట్ల నష్టంతో 8,925 వద్దకు చేరింది. సమృద్ధిగానేవర్షాలు.. తప్పని నష్టాలు...!! సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ఆరంభమైనా, ఆ తర్వాత తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. ఈ ఏడాది వర్షాలు సాధారణంగానే కురుస్తాయని, ఎలాంటి లోటు ఉండదని వాతావరణ విభాగం వెల్లడించింది. మరోవైపు మార్చిలో టోకు ధరల ద్రవ్యోల్బణం 1 శాతానికి తగ్గింది. ఈ రెండు సానుకూలాంశాలతో ఇంట్రాడేలో సెన్సెక్స్ 878 పాయింట్లు, నిఫ్టీ 267 పాయింట్లు లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు భారీ నష్టాలతో ఆరంభం కావడం, అమెరికా ఫ్యూచర్లు నష్టాల్లో ట్రేడవుతుండటంతో మధ్యాహ్నం తర్వాత మన సూచీలు నష్టాల్లోకి జారిపోయాయి. 1930 నాటి మహా మాంద్యం తర్వాత ఈ ఏడాదే ఆర్థిక పరిస్థితులు అత్యంత అధ్వానంగా మారాయని ఐఎంఎఫ్ వ్యాఖ్యానించడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఒక దశలో సెన్సెక్స్ 468 పాయింట్లు, నిఫ్టీ 120 పాయింట్లు నష్టపోయాయి. ఇంట్రాడే గరిష్టం నుంచి చూస్తే, సెన్సెక్స్ 1,188 పాయింట్ల మేర నష్టపోయింది. ఇక ఆసియా మార్కెట్లు 1–2 శాతం నష్టాల్లో ముగియగా, యూరప్ మార్కెట్లు›కూడా 3–4% నష్టాల్లో ముగిశాయి. ► కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ 6.2 శాతం నష్టంతో రూ.1,173 వద్ద ముగిసింది. ► లాక్డౌన్ నుంచి వ్యవసాయ రంగ కార్యకలాపాలను మినహాయించడంతో సంబంధిత షేర్లు లాభపడ్డాయి. దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రో కెమికల్స్ 11%, రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ 11%, చంబల్ ఫెర్టిలైజర్స్ 8 శాతం ఎగబాకాయి. ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి డాలర్‌తో పోలిస్తే 76.44కి డౌన్ ముంబై: దేశీ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం.. అంతర్జాతీయంగా డాలరు బలపడటం తదితర పరిణామాలతో రూపాయి మారకం విలువ బుధవారం గణనీయంగా పడిపోయింది. డాలర్‌తో పోలిస్తే 17 పైసలు క్షీణించి ఆల్‌టైమ్ కనిష్ట స్థాయి 76.44 వద్ద క్లోజయ్యింది. డాలర్ ఇండెక్స్ పటిష్టంగా ఉండటం .. రూపాయిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. దీంతో పాటు ఇటు దేశీ, అటు ప్రపంచ ఎకానమీలపై కరోనా ఆందోళన కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంటు కూడా బలహీనంగా ఉన్నట్లు వివరించారు. బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సే్చంజీలో రూపాయి ట్రేడింగ్ గత ముగింపుతో పోలిస్తే పటిష్టంగా 76.07 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 75.99 గరిష్ట స్థాయితో పాటు 76.48 డాలర్ల కనిష్టాన్ని తాకింది. చివరికి 76.44 వద్ద ముగిసింది. మే 3 దాకా లాక్డౌన్ కొనసాగించడంతో మరిన్ని సమస్యలు తప్పవనే భయాలు నెలకొనడంతో రూపాయిపై ప్రతికూల ప్రభావం పడిందని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ అనలిస్టు (కమోడిటీ, కరెన్సీ) జతిన్ త్రివేది తెలిపారు. -
పడేసిన పారిశ్రామిక గణాంకాలు
పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. చైనా దిగుమతి, ఎగుమతి గణాంకాలు కూడా బలహీనంగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లు పతనమవడం, డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. అయితే చివరి గంటలో కొనుగోళ్లు జరగడంతో నష్టాలు ఒకింత తగ్గాయి. బీఎస్ఈ సెన్సెక్స్ కీలకమైన 36,000 పాయింట్ల దిగువకు, నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 10,750 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. స్టాక్ సూచీలు వరుసగా మూడవ ట్రేడింగ్ సెషన్లోనూ నష్టపోయాయి. సెన్సెక్స్ 156 పాయింట్లు నష్టపోయి 35,854 పాయింట్ల వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు పతనమై 10,738 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, లోహ, మౌలిక రంగ షేర్లు నష్టపోగా, ఫార్మా షేర్లు పెరిగాయి. ప్రపంచ మార్కెట్ల పతనం.... చైనా దిగుమతులు డిసెంబర్లో 7.6 శాతం, ఎగుమతులు 4.4 శాతం మేర తగ్గాయి. దీంతో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో మందగమనం చోటు చేసుకుందని, ఇది ప్రపంచ ఆర్థిక మందగమనానికి దారితీస్తుందన్న ఆందోళన నెలకొన్నది. దీనికి తోడు 21 వ రోజూ అమెరికా షట్‌డౌన్ కొనసాగడం, బ్రెగ్జిట్‌పై యూకేలో నేడు (మంగళవారం) ఓటింగ్ జరగనుండడం నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. జపాన్ మినహా ఇతర ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మన దగ్గర పారిశ్రామికోత్పత్తి 17 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం, ఇప్పటివరకూ వెల్లడైన క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 43 పైసలు క్షీణించి నెల కనిష్టానికి చేరడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. 433 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనా, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. ఒక దశలో 115 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 318 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 433 పాయింట్ల రేంజ్లో కదలాడింది. చివర్లో కొనుగోళ్ల దన్నుతో నష్టాలు రికవరీ అయ్యాయి. ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 180 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల మేర రికవరీ అయ్యాయి. ► ఎమ్డీ, సీఈఓ పదవుల నుంచి ఈ నెల 31న వైదొలగనున్న రాణా కపూర్ వారసుడిగా రెండు పేర్లను యస్‌బ్యాంక్ షార్ట్ లిస్ట్ చేసింది. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బ్రహ్మదత్ పేరు ఖరారు కావడం కూడా సానుకూల ప్రభావం చూపడంతో ఈ షేర్ 6.2 శాతం లాభంతో రూ.195 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా లాభపడిన షేర్ ఇదే. ► ఇతర ఐటీ షేర్లు తగ్గినా... ఇన్ఫోసిస్ 2.5% లాభంతో రూ.701 వద్ద ముగిసింది. ఈ కంపెనీ క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నా, ఈ ఆర్థిక సంవత్సర ఆదాయ అంచనాలు బాగా ఉండటం, రూ.800 ధరకు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించడం, ఒక్కో షేర్‌కు రూ.4 ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించడం సానుకూల ప్రభావం చూపించాయి. -
163 పైసలు (రూ)పాయే!
ముంబై: రూపాయి కష్టాలు తొలగిపోలేదు. వరుసగా రెండు రోజులు లాభపడ్డాక సోమవారం స్వల్పంగా క్షీణించిన రూపాయి విలువ మంగళవారం ఒకేసారి 163 పైసలు(2.47%) పతనమైంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో మళ్లీ 67.63 కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఒక దశలో ఏకంగా 68.27 వరకూ దిగజారడం గమనార్హం. సిరియాపై సైనిక చర్యల అంచనాలతో ముడిచమురు ధరలు పుంజుకోవడం ప్రధానంగా ప్రభావాన్ని చూపిందని విశ్లేషకులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా పలు ఇతర కరెన్సీలతో డాలరు బలపడటం కూడా దేశీయంగా సెంటిమెంట్‌ను బలహీనపరచిందని తెలిపారు. కాగా, జేపీ మోర్గాన్, హెచ్ఎస్బీసీ, నోమురా వంటి సంస్థలు ఇండియా ఆర్థిక వృద్ధి అంచనాలలో కోత విధించిన సంగతి తెలిసిందే. వెరసి డాలరుతో మారకంలో 66.29 వద్ద బలహీనంగా మొదలైన రూపాయి చివరికి 163 పైసలు పతనమై 67.63 వద్ద నిలిచింది.