
పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. చైనా దిగుమతి, ఎగుమతి గణాంకాలు కూడా బలహీనంగా ఉండటంతో ప్రపంచ మార్కెట్లు పతనమవడం, డాలర్‌తో రూపాయి మారకం క్షీణించడం కూడా ప్రతికూల ప్రభావం చూపించాయి. అయితే చివరి గంటలో కొనుగోళ్లు జరగడంతో నష్టాలు ఒకింత తగ్గాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ కీలకమైన 36,000 పాయింట్ల దిగువకు, నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 10,750 పాయింట్ల దిగువకు పతనమయ్యాయి. స్టాక్ సూచీలు వరుసగా మూడవ ట్రేడింగ్ సెషన్‌లోనూ నష్టపోయాయి. సెన్సెక్స్ 156 పాయింట్లు నష్టపోయి 35,854 పాయింట్ల వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు పతనమై 10,738 పాయింట్ల వద్ద ముగిశాయి. బ్యాంక్, లోహ, మౌలిక రంగ షేర్లు నష్టపోగా, ఫార్మా షేర్లు పెరిగాయి.
ప్రపంచ మార్కెట్ల పతనం....
చైనా దిగుమతులు డిసెంబర్‌లో 7.6 శాతం, ఎగుమతులు 4.4 శాతం మేర తగ్గాయి. దీంతో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో మందగమనం చోటు చేసుకుందని, ఇది ప్రపంచ ఆర్థిక మందగమనానికి దారితీస్తుందన్న ఆందోళన నెలకొన్నది. దీనికి తోడు 21 వ రోజూ అమెరికా షట్‌డౌన్ కొనసాగడం, బ్రెగ్జిట్‌పై యూకేలో నేడు (మంగళవారం) ఓటింగ్ జరగనుండడం నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. జపాన్ మినహా ఇతర ఆసియా మార్కెట్లు, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మన దగ్గర పారిశ్రామికోత్పత్తి 17 నెలల కనిష్ట స్థాయికి పడిపోవడం, ఇప్పటివరకూ వెల్లడైన క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 43 పైసలు క్షీణించి నెల కనిష్టానికి చేరడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
433 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్...
సెన్సెక్స్ లాభాల్లో ఆరంభమైనా, వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. ఒక దశలో 115 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 318 పాయింట్లు నష్టపోయింది. మొత్తం మీద రోజంతా 433 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. చివర్లో కొనుగోళ్ల దన్నుతో నష్టాలు రికవరీ అయ్యాయి. ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 180 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్ల మేర రికవరీ అయ్యాయి.
► ఎమ్‌డీ, సీఈఓ పదవుల నుంచి ఈ నెల 31న వైదొలగనున్న రాణా కపూర్ వారసుడిగా రెండు పేర్లను యస్‌బ్యాంక్ షార్ట్ లిస్ట్ చేసింది. నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా బ్రహ్మదత్ పేరు ఖరారు కావడం కూడా సానుకూల ప్రభావం చూపడంతో ఈ షేర్ 6.2 శాతం లాభంతో రూ.195 వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీల్లో బాగా లాభపడిన షేర్ ఇదే.
► ఇతర ఐటీ షేర్లు తగ్గినా... ఇన్ఫోసిస్ 2.5% లాభంతో రూ.701 వద్ద ముగిసింది. ఈ కంపెనీ క్యూ3 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉన్నా, ఈ ఆర్థిక సంవత్సర ఆదాయ అంచనాలు బాగా ఉండటం, రూ.800 ధరకు షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించడం, ఒక్కో షేర్‌కు రూ.4 ప్రత్యేక డివిడెండ్‌ను ప్రకటించడం సానుకూల ప్రభావం చూపించాయి.
Comments
Please login to add a commentAdd a comment