ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపినా, బలహీన అంతర్జాతీయ సంకేతాలు గురువారం స్టాక్ మార్కెట్‌ను పడగొట్టాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయమై ప్రతిష్టంభన కొనసాగుతుండటం, రెండు రోజుల లాభాల నేపథ్యంలో ట్రేడర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో 93 పాయింట్ల లాభపడినప్పటికీ సెన్సెక్స్ చివరకు 76 పాయింట్ల నష్టంతో 40,575 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 31 పాయింట్లు పతనమై 11,968 పాయింట్ల వద్దకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ స్పల్పంగా పుంజుకున్నా, మార్కెట్‌కు నష్టాలు తప్పలేదు.
అమెరికా–చైనా ఒప్పందం హుళక్కి !
ఐదు ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటా విక్రయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతే కాకుండా రెండేళ్ల వరకూ స్పెక్ట్రమ్ చార్జీలు వసూలు చేయబోమంటూ టెలికం కంపెనీలకు ఊరటనిచ్చింది. ఈ అంశాలు ఆరంభంలో ఒకింత సానుకూల ప్రభావం చూపించాయి. అయితే హాంగ్‌కాంగ్ నిరసనకారులకు మద్దతుగా రెండు బిల్లులను అమెరికా ఆమోదించింది. అంతేకాకుండా మానవ హక్కుల విషయమై చైనాకు హెచ్చరిక జారీ చేసింది. దీంతో అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో మరింత అనిశ్చితి నెలకొన్నది. ఈ ఏడాది ఒప్పందం కుదిరే అవకాశాల్లేవంటూ వార్తలు వచ్చాయి. ప్రపంచ మార్కెట్లు పతనమయ్యాయి. ఈ ప్రభావంతో మన మార్కెట్ కూడా నష్టపోయింది.
211 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్....
లాభాల్లోనే మొదలైన సెన్సెక్స్ వెంటనే నష్టాల్లోకి జారిపోయింది. ఎన్‌ఎస్‌ఈ వీక్లీ డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు రోజు కావడంతో స్టాక్ సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. ఒక దశలో 93 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ మరో దశలో 118 పాయింట్లు పతనమైంది. మొత్తం మీద రోజంతా 211 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక మార్కెట్ దృష్టి వచ్చే వారం వెలువడే క్యూ2 జీడీపీ గణాంకాలపై ఉంటుందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.
► టాటా స్టీల్ షేర్ 3.5 శాతం నష్టంతో రూ.385 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే.
► రుణ భారం తగ్గించుకునే నిమిత్తం జీ ఎంటర్‌టైన్మెంట్ కంపెనీలో 16.5 శాతం వాటాను విక్రయించనున్నామని ఎస్సెల్ గ్రూప్ బుధవారం వెల్లడించింది. దీంతో గురువారం జీ ఎంటర్‌టైన్మెంట్ షేర్ 12 శాతం లాభంతో రూ.345 వద్ద ముగిసింది.
► స్పెక్ట్రమ్ చార్జీల చెల్లింపులను రెండేళ్లపాటు వాయిదా వేయడంతో టెలికం షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. ఇటీవల వరకూ లాభపడిన ఎయిర్‌టెల్, ఐడియా షేర్లు నష్టపోయాయి. వొడాఫోన్ ఐడియా షేర్ 6 శాతం నష్టంతో రూ.6.64 వద్ద, భారతీ ఎయిర్‌టెల్ 2.5 శాతం నష్టంతో రూ.426 వద్ద ముగిశాయి.
► స్టాక్ మార్కెట్ నష్టపోయినప్పటికీ, పలు షేర్లు ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హైలను తాకాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ ఏఎమ్‌సీ, ఇంద్రప్రస్థ గ్యాస్, ఆవాస్ ఫైనాన్షియర్స్, ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్, పాలీక్యాబ్ ఇండియా, ఆఫిల్ ఇండియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి.
లాభాల స్వీకరణతో మార్కెట్ వెనక్కి..
Published Fri, Nov 22 2019 6:21 AM | Last Updated on Fri, Nov 22 2019 6:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment