ముంబై: స్టాక్ మార్కెట్ మూడురోజుల వరుస ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. ఆర్థిక, ఇంధన, ఐటీ షేర్లలో అమ్మకాలు తలెత్తడంతో సెన్సెక్స్ 599 పాయింట్లను కోల్పోయి 51 వేల దిగువన 50,486 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 165 పాయింట్లను నష్టపోయి 15,081 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు, డాలర్ మారకంలో రూపాయి పతనం దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. మూడురోజుల పాటు సూచీలు భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో కొంత లాభాల స్వీకరణ కూడా చోటుచేసుకుంది. మీడియా, రియల్టీ షేర్లకు మాత్రమే స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. మిగతా అన్ని రంగాలకు చెందిన షేర్లలో విక్రయాలు జరిగాయి. అత్యధికంగా మెటల్ షేర్లు నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లలో 25 షేర్లు నష్టపోవడం గమనార్హం. సంస్థాగత ఇన్వెస్టర్లతో పాటు విదేశీ ఇన్వెస్టర్లూ గురువారం నికర అమ్మకందారులుగా నిలిచారు. ఎఫ్‌ఐఐలు రూ. 223 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. డీఐఐలు రూ.788 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.
‘‘అగ్రరాజ్యం అమెరికా పదేళ్ల బాండ్ ఈల్డ్స్ అనూహ్యంగా ఆరు బేసిస్ పాయింట్లు పుంజుకోవడంతో అక్కడి మార్కెట్లు నష్టాలబాట పట్టాయి. ఫలితంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రతికూల వాతావరణం నెలకొనడంతో మన మార్కెట్ ఇదే తీరు ప్రతిబింబించింది. పెద్ద కంపెనీలకు చెందిన షేర్లలో అధికంగా అమ్మకాలు జరిగాయి. అయితే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో కొనుగోళ్లు జరగడం ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చే అంశంగా ఉంది’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ హెడ్ బినోద్ మోదీ తెలిపారు.
ఇంట్రాడేలో ట్రేడింగ్ సాగిందిలా...
ద్రవ్యోల్బణాన్ని అదుపులో పెట్టేందుకు కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్లను పెంచవచ్చనే అంచనాలతో అమెరికా బాండ్ ఈల్డ్స్ తిరిగి పెరగడం ప్రారంభించింది. ఫలితంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లలో మళ్లీ అమ్మకాలు మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలను అందుకున్న మన మార్కెట్ భారీ నష్టంతో మొదలైంది. సెన్సెక్స్ ఏకంగా 633 పాయింట్ల నష్టంతో 50,812 వద్ద, నిఫ్టీ 220 పాయింట్లను కోల్పోయి 15,027 ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలతో మొగ్గుచూపడంతో ఒక దశలో సెన్సెక్స్ 905 పాయింట్లను కోల్పోయి 50,540 వద్ద, నిఫ్టీ 266 పాయింట్లు నష్టపోయి 14,980 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి.
మరిన్ని విశేషాలు...
► అదానీ పోర్ట్స్ గంగవరం పోర్టులో 31.5 శాతం వాటాను దక్కించుకోవడంతో కంపెనీ షేరు మూడుశాతం లాభంతో రూ.752 వద్ద ముగిసింది.
► మూడో త్రైమాసికంలో ఎఫ్‌ఐఐలతో పాటు డీఐఐలూ ఐఆర్‌సీటీసీ చెందిన షేర్లను అధిక మొత్తంలో కొనుగోలు చేశారు. ఫలితంగా కంపెనీ షేరు నాలుగు శాతం ర్యాలీచేసి రూ.1,957 వద్ద స్థిరపడింది.
► అశోక హైవేస్‌లో సింహభాగం వాటాను దక్కించుకోవడంతో ఆశోకా బిల్డ్‌కాన్ షేరు నాలుగు శాతం పెరిగి రూ.115 వద్ద ముగిసింది.
► జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు మూడు శాతం పతనం కావడంతో నిఫ్టీ మెటల్ ఇండెక్స్ రెండుశాతం నష్టపోయింది.
లాభాల జోరుకు బ్రేక్
Published Fri, Mar 5 2021 5:46 AM | Last Updated on Fri, Mar 5 2021 5:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment